– నెట్వర్క్ ఆస్పత్రులతో ప్రభుత్వం చర్చించాలి
– మాజీ మంత్రి విడదల రజని డిమాండ్
తాడేపల్లి: ప్రభుత్వం తక్షణమే ఆరోగ్యశ్రీ నెట్వర్క్ ఆస్పత్రులతో మాట్లాడి పెండింగ్ బకాయిలు తక్షణం చెల్లించాలని మాజీ మంత్రి విడదల రజని డిమాండ్ చేశారు. తాడేపల్లి లోని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆమె మీడియాతో మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఏర్పాటయ్యాక ఆరోగ్యశ్రీని అనారోగ్యశ్రీగా మార్చేశారని, పేదలకు నాణ్యమైన ఉచిత వైద్యం అందని ద్రాక్షగా మారిపోయిందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
పీహెచ్సీ డాక్టర్లు ధర్నాలు చేస్తున్నా, ఆరోగ్యశ్రీ ఆస్పత్రులు వైద్యం నిరాకరిస్తున్నా ఈ ప్రభుత్వానికి చీమకుట్టినట్టు కూడా లేదని, మాయమాటలతో అధికారంలోకి వచ్చిన చంద్రబాబుకి అనుక్షణం దోచుకోవాలన్న ఆలోచన తప్ప ప్రజారోగ్యం మీద చిత్తశుద్ధి లేదని మాజీ మంత్రి విడదల రజని ధ్వజమెత్తారు.
ప్రభుత్వం నుంచి రూ.3 వేల కోట్లు బకాయిలు రాకపోవడంతో ఆరోగ్యశ్రీ నెట్వర్క్ ఆస్పత్రులు వైద్యం చేయలేమంటూ బోర్డులు పెట్టేస్తున్నాయి. పట్టించుకోవాల్సిన ప్రభుత్వం 16 నెలలుగా చోద్యం చూస్తూ పేద ప్రజలను వారి మానాన వదిలేస్తోంది. పెండింగ్ బిల్లులు చెల్లింపు విషయంలో ఆరోగ్యశ్రీ నెట్వర్క్ ఆస్పత్రులు ప్రభుత్వానికి 20 సార్లు లేఖలు రాసినా పట్టించుకున్న పాపానపోవడం లేదు. ఈనెల 10 నుంచి వైద్యసేవలు నిలిపివేస్తున్నామని మరోసారి స్పష్టం చేశాయి.