– ఆలయ నిర్మాణ పనులు పరిశీలించిన మంత్రి సురేఖ, కమిషనర్ శైలజా రామయ్యర్
హైదరాబాద్: సికింద్రాబాద్ శ్రీనివాసనగర్ కాలనీలోని అత్యంత పురాతనమైన శ్రీ ప్రసన్నవేంకటేశ్వరస్వామి ఆలయాన్ని దర్శించిన తెలంగాణ దేవదాయ శాఖ మంత్రి కొండా సురేఖ, కమిషనర్ శైలజా రామయ్యర్కు అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం వారు శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయంలో జరుగుతున్న పనులను పరిశీలించి, ఆలయ మహత్యం తెలుసుకున్నారు. కంచి పీఠాథిపతి మార్గదర్శకత్వంలో జరుగుతున్న జీర్ణోద్ధరణ పనులను అధికారులు మంత్రికి వివరించారు. కంచి పరమాచార్య ఏడు దశాబ్దాల క్రితం స్వయంగా శ్రీశైలం నుంచి పాదయాత్ర చేసి, ఈ ఆలయాన్నికి ప్రతిష్ఠ చేశారని మంత్రికి వివరించారు. ఈ సందర్భంగా మంత్రి సురేఖ మాట్లాడుతూ, దేవాలయ అభివృద్ధికి తన స్థాయిలో సహకరిస్తానని హామీ ఇచ్చారు. ఆలయ నిర్మాణం, విగ్రహాలు రూపొందించిన శిల్పులను ఆమె అభినందించారు. తొలుత మంత్రి కొండా సురేఖకు ఆలయ ధర్మకర్తలు, దేవదాయశాఖ అధికారులు స్వాగతం పలికారు.