* క్రీడా శాఖ మంత్రి వాకిటి శ్రీహరి
* గచ్చిబౌలి స్టేడియంలో హైదరాబాద్ బ్లాక్ హాక్స్ మ్యాచ్‌కు హాజరైన మంత్రి, శాట్జ్ చైర్మన్ శివసేనా రెడ్డి
హైదరాబాద్: ప్రైమ్ వాలీబాల్ లీగ్‌తో దేశంలో వాలీబాల్ క్రీడకు మంచి ఆదరణ పెరిగిందని, మంచి గుర్తింపు లభిస్తోందని క్రీడా శాఖ మంత్రి వాకిటి శ్రీహరి అన్నారు. హైదరాబాద్ నగరంలోని గచ్చిబౌలిలోని జిఎంసి బాలయోగి స్టేడియంలో జరుగుతున్న ప్రైమ్ వాలీబాల్ లీగ్ (పీవీఎల్) పోటీలకు మంత్రి శ్రీహరి, స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణ (శాట్జ్) ఛైర్మన్ శివసేన రెడ్డి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.
శుక్రవారం రాత్రి జరిగిన హైదరాబాద్ బ్లాక్ హక్స్ – ఢిల్లీ తుఫాన్ జట్ల మధ్య మ్యాచ్‌ను వీక్షించారు. మ్యాచ్ ప్రారంభానికి ముందు ఆటగాళ్లతో కరచాలనం చేసి, వారికి ఆల్ ది బెస్ట్ చెప్పారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీహరి మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి క్రీడా రంగానికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నారని తెలిపారు. దేశంలోని పలు నగరాల్లో జరగాల్సిన ఈ సీజన్ పీవీఎల్ పోటీలు సీఎం రేవంత్ రెడ్డి పిలుపు మేరకు మొత్తం హైదరాబాద్‌లోనే నిర్వహించడానికి చొరవ తీసుకున్న హైదరాబాద్ బ్లాక్‌హ్యాక్స్ జట్టు యజమాని కంకణాల అభిషేక్ రెడ్డిని మంత్రి ప్రత్యేకంగా అభినందించారు.
ప్రైమ్ వాలీబాల్ లీగ్‌తో దేశంలో వాలీబాల్ క్రీడకు ఆదరణ, గుర్తింపు మరింతగా పెరుగుతోందని మంత్రి అభిప్రాయపడ్డారు. కాగా, తమ ఆహ్వానం మేరకు మ్యాచ్‌ను వీక్షించడానికి వచ్చిన మంత్రి శ్రీహరి, శివసేన రెడ్డిలకు అభిషేక్ రెడ్డి ధన్యవాదాలు తెలిపారు.
అభిషేక్ రెడ్డి మాట్లాడుతూ సీజన్ సీజన్‌కు పీవీఎల్‌కు ఆదరణ పెరుగుతోందని చెప్పారు. ఈ ఏడాది ప్రైమ్ వాలీబాల్ టీవీ వ్యూయర్షిప్ గత సీజన్ తో పోలిస్తే రెట్టింపు అయిందని ఆయన వెల్లడించారు.