– అవి 20 ఏళ్ల క్రితం నాటి వ్యాఖ్యలట
– సీఎం కేసీఆర్‌తో గ్యాప్ ఉన్నట్టేనా?
– లేదని నేరుగా ఖండించని జీయరు
– మీడియా కోడిగుడ్డుపై ఈకలు పీకుతోందట
– గిరిజనులకు క్షమాపణ చెప్పని చినజీయరు స్వామి
(మార్తి సుబ్రహ్మణ్యం)
హమ్మయ్య.. విశిష్టాద్వైతి చినజీయరు స్వామి వారికి ఆగ్రహం వచ్చి ఎట్టకేలకూ పెదవి విప్పారు. తనపై మీడియాలో వస్తున్న విమర్శలకు సమాధానం కోసం ముచ్చింతల్‌లో కాకుండా, విజయవాడ వెళ్లి మరీ ప్రెస్‌మీట్ పెట్టారు. సమ్మక్క-సారక్క సహా మిగిలిన వన-గ్రామదేవతలపై తాను ఎలాంటి వ్యాఖ్యలు చేయలేద న్న సాములోరు, వ్యాఖ్యలు చేసిన సందర్భం కూడా చూసుకోవాలని సెలవిచ్చారు. ఏతావాతా తాను చేసిన వ్యాఖ్యలకు క్షమాపణ మాత్రం చెప్పలేదు. అదీ సంగతి!ఇది కూడా చదవండి.. జీయరు చెబితే ఇక జీ హుజూరే!
ప్రెస్‌మీట్ పెట్టిన సాములోరిని.. మీకూ-కేసీఆర్‌కు గ్యాప్ ఉందా అని అడిగితే.. తనకు ఎవరితోనూ గ్యాప్ లేదన్నారు. ‘నాకు ఎవరితోనూ గ్యాప్ లేదు. అయితే అవతలివాళ్లు గ్యాప్ పెంచుకుంటే మాత్రం నేనేమీ చేయలేను. రేపు యాదాద్రి కార్యక్రమానికి పిలిస్తే వెళతాం. లేదంటే లేదు. మేం దేంట్లోనూ పూసుకు తిరిగేవాళ్లం కాదు. ఎవరైనా ఏదైనా సలహా అడిగితే చేసి పెట్టండంటే చేసి పెట్టడమే మా బాధ్యత. వెంటపడి పాకులాడే అలవాటు మాకు లేదు. పిలిస్తే వెళతాం. లేదంటే చూసి ఆనందిస్తాం. మంచి లక్ష్యంతో మంచి కార్యక్రమాలు చేస్తున్నాం. అందుకే ధైర్యంగా మాట్లాడుతున్నాం. ’ అని యాదాద్రి ఆహ్వానంపై కుండబద్దలు కొట్టారు. తనకు రాజకీయాల్లోకి వచ్చే ఉద్దేశం లేదని కూడా స్పష్టం చేశారు. తనకు బ్యాంకులో ఇప్పటివరకూ అకౌంట్ కూడా లేదన్నారు.
ఇక తనను విమర్శిస్తున్న వారిపై ఆయన ఘాటుగానే స్పందించారు. ‘మనుషుల్లోంచి వచ్చిన వారే గ్రామదేవతలయ్యారు. పనిగట్టుకుని వివాదం చేసి వాళ్ల వాళ్ల ముఖాలు ప్రదర్శిస్తున్నారు. రష్యా-ఉక్రెయిన్ యుద్ధం హడావిడి తగ్గడంతో ఈ ప్రచారం చేస్తున్నారు. ఎప్పుడో 20 ఏళ్ల క్రితం అన్నమాట గురించి ఇప్పుడు వివాదం చేస్తున్నారు. ఆదివాసీల పేర్లు చెప్పి కొందరు సొంత ప్రయోజనాలకు వాకుకుంటున్నారు. జనాలను ప్రభావితం చేసే దేవతలను చిన్నచూపు చూసే పద్ధతిని, మేం ఎప్పటికీ ప్రోత్సహించం. కానీ ఆ పేరుతో జరిగే అరాచకాలకు మాత్రం అడ్డుకట్ట వేయాల్సిన బాధ్యత ఉంది. దాన్ని అర్ధం చేసుకోకుండా కొందరు దాన్నే ఇష్యూ చేస్తున్నారు. నేను గ్రామ దేవతలను కించపరిచినట్లు విమర్శలొస్తున్నాయి. నేనెప్పుడూ దురద్దేశపూర్వక వ్యాఖ్యలు చేయలేదు. తాత్పర్యం అర్ధం చేసుకోకుండా ఆరోపణలు చేసేవారిని చూస్తే జాలేస్తుంది. అందరినీ గౌరవించాలన్నదే మా విధానం. మా కార్యక్రమాలకు అన్ని మతాలవాళ్లు వస్తారు. మాకు కులం-మతం తేడా లేదు. మహిళలను చిన్నచూసేవారిని ప్రోత్సహించం. సమాజహితం లేనివారే ఇలాంటి దుష్ప్రచారం చేస్తున్నారు’ అన్నారు.
తనపేరు మీద బ్యాంకు అకౌంటు కూడా లేదని, కులాలను పక్కనపెట్టి జ్ఞానసంపన్నులను ఆరాధించాలన్న చినజీయరు స్వామి.. గిరిజనులు మంత్రాలను అద్భుతంగా చదువుతారన్నారు. తాము ఆదివాసీ గిరిజన ప్రాంతాల్లో పాఠశాలలు ఏర్పాటుచేశామని గుర్తు చేశారు. అయితే మీడియా కోడిగుడ్డుపై ఈకలు పీకుతోందని, విషయం తెలియకుండా ప్రశ్నలు వేయవద్దని వ్యాఖ్యానించారు. సమతామూర్తి విగ్రహానికి చూసేందుకే టికెట్ పెట్టాము తప్ప, అక్కడ ఆరాధనలకు ఎలాంటి రుసుము లేదన్నారు. అది కూడా నిర్వహణ కోసమేనన్నారు.
కేసీఆర్‌తో గ్యాప్ ఉన్నట్టే..నా?
ఇదిలాఉండగా, తెలంగాణ సీఎం కేసీఆర్‌తో గ్యాప్‌పై అడిగిన ప్రశ్నకు ఆయన నేరుగా సమాధానం ఇవ్వకుండా.. తనకు ఎవరితో గ్యాప్ లేదని, ఒకవేళ వారు గ్యాప్ పెంచుకుంటే తానేమీ చేయలేనన్న
వ్యాఖ్య.. కేసీఆర్-జీయర్ మధ్య దూరం ఉందన్న అనుమానాలను, మరింత పెంచినట్టయింది. నిజంగా జీయర్‌కు కేసీఆర్‌తో గ్యాప్ లేకపోతే, తనకూ కేసీఆర్ మధ్య ఎలాంటి దూరం లేదని నేరుగా కేసీఆర్ చెప్పే అవకాశం జీయరుకు ఉంది. అయినా ఆయన ఆరకంగా చెప్పలేద ంటే, ఇద్దరి మధ్య గ్యాప్ ఉందన్న కథనాలు నిజమని భావించి తీరాలి.
ఇక అంతా సమానమేనన్న స్వామి వారు.. సమతామూర్తి విగ్రహావిష్కరణ కార్డులను మోదీకి తప్ప, ప్రతిపక్ష నాయకులకు ఎందుకు ఇవ్వలేదంటూ వస్తున్న విమర్శలకు తన ప్రెస్‌మీట్‌లో ఎక్కడా వివరణ ఇవ్వకపోవడం ప్రస్తావనార్హం. అదే సమయంలో సమతామూర్తి విగ్రహ కేంద్రంగా, దాని చుట్టూ జరుగుతున్న రియల్ ఎస్టేట్ వ్యాపారాలపై సీపీఐ నారాయణ వంటి నేతలు చేస్తున్న ఆరోపణలకూ, స్వామి వివరణ ఇవ్వకపోవటం ఆశ్చర్యం.
సమ్మక్క-సారక్క సహా గ్రామదేవతలపై 20 ఏళ్ల క్రితం చేసిన వ్యాఖ్యలకు క్షమాపణ చెప్పాలన్న ఆదివాసీ సంఘాల డిమాండ్‌ను పట్టించుకోని జీయరు స్వామి, తన ప్రెస్‌మీట్‌లో ఆ మేరకు ఎక్కడా అందుకు క్షమాపణ చెప్పకపోవడం విశేషం. పైగా తెలియని విషయాలపై ప్రశ్నలు అడగవద్దని, కోడిగుడ్డుపై ఈకలు పీకవద్దని మీడియాకు హితవు పలికిన జీయరు.. అసలు ముచ్చింతల్ కేంద్రంగా వస్తున్న విమర్శల నేపథ్యంలో అక్కడ ప్రెస్‌మీట్ పెట్టకుండా, విజయవాడలో నిర్వహించడమే ఆశ్చర్యం. తన వ్యాఖ్యలు ఎప్పుడో 20 ఏళ్ల క్రితం నాటివని జీయరు స్వామి.. చెప్పకనే చెప్పడం మరో విశేషం.ఇది కూడా చదవండి.. సాములు..ఆసాములు…ఆహా సాములు