భువనగిరి: బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు, తెలంగాణ ఉద్యమకారుడు జిట్టా బాలకృష్ణారెడ్డి కన్నుమూశారు. బ్రెయిన్ ఇన్ఫెక్షన్తో బాధపడుతున్న ఆయన గత కొంతకాలంగా సికింద్రాబాద్ యశోద దవాఖానలో చికిత్స పొందుతున్నారు. పరిస్థితి విషమించడంతో శుక్రవారం ఉదయం తుదిశ్వాస విడిచారు. దీంతో ఆయన భౌతికకాయాన్ని కుటుంబ సభ్యులు భువనగిరికి తరలించారు.
బీఆర్ఎస్ ఆవిర్భావం తర్వాత జిట్టా బాలకృష్ణారెడ్డి పార్టీ యువజన సంఘానికి రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేశారు. కానీ, 2009 అసెంబ్లీ ఎన్నికల సమయంలో టికెట్ దక్కకపోవడంతో పార్టీ నుంచి బయటకు వచ్చిన ఆయన ఇండిపెండెంటుగా పోటీ చేసి ఓడిపోయారు. 2014, 2018 ఎన్నికల్లో పోటీ చేసిన ఆయన ఓటమి చవిచూశారు.
2009లో నాటి సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. తర్వాత వైసీపీలో చేరారు. తర్వాత సొంతంగా యువ తెలంగాణ పార్టీని నెలకొల్పి కార్యక్రమాలు చేపట్టారు.
నల్గొండ-వరంగల్-ఖమ్మం పట్టభద్రుల నియోజకవర్గానికి జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో తమ పార్టీ తరపున పాల్గొన్నారు. తర్వాత పార్టీని ఢిల్లీలో బీజేపీ పెద్దల సమక్షంలో బీజేపీలో విలీనం చేశారు. రాష్ట్రంలో అధ్యక్షుని మార్పు జరిగాక జిట్టాను బీజేపీ నుంచి సస్పెండ్ చేశారు.తర్వాత భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి సమక్షంలో కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. నెల రోజులు కూడా గడువక ముందే గతేడాది అక్టోబర్ 20న బీఆర్ఎస్లో చేరారు.