Suryaa.co.in

Andhra Pradesh

రానున్న ఐదేళ్లల్లో 20 లక్షలమంది యువతకు ఉద్యోగ అవకాశాలు

– యువతకు బంగారు భవిష్యత్తు అందించేందుకు సీఎం కృషి
– ప్రతీ ఇంటిలోని యువతకు విద్యా, ఉద్యోగ అవకాశాలు కల్పిస్తే సంక్షేమ కార్యక్రమాల గురించి ప్రజలు ఆలోచించరు
-రాష్ట్ర గృహనిర్మాణ, సమాచార పౌర సంబంధాల శాఖా మంత్రి కొలుసు పార్థసారథి

ఏలూరు/నూజివీడు : ప్రపంచస్థాయి సాంకేతికతను రాష్ట్రానికి తీసుకువచ్చి యువతకు బంగారు భవిష్యత్తు అందించే దిశగా రాష్ట్ర ముఖ్యమంత్రి కృష్టి చేస్తున్నారని రాష్ట్ర గృహనిర్మాణ, సమాచార పౌర సంబంధాల శాఖా మంత్రి కొలుసు పార్థసారథి చెప్పారు. నూజివీడు త్రిబుల్ ఐటీ లో శుక్రవారం ‘మెగా జాబ్ మేళా’ ను మంత్రి జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి తో కలిసి ప్రారంభించారు.

ఈ సందర్భంగా మంత్రి పార్థసారథి మాట్లాడుతూ.. రాష్ట్ర ముఖ్యమంత్రి విద్యా, ఉద్యోగ, ఉపాధి కల్పనకు అత్యంత ప్రాధాన్యతను ఇస్తున్నారన్నారు. రానున్న 5 సంవత్సరాలలో రాష్ట్రంలోని 20 లక్షల మంది యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని, అంతేకాక ప్రతీ ఇంటి నుండి ఒక పారిశ్రామికవేత్తను రూపొందించేలా ప్రత్యేక పారిశ్రామిక పాలసీని రూపొందిస్తున్నామన్నారు.

పాపులేషన్ సెన్సస్ లాగా ‘స్కిల్ సెన్సస్’ నిర్వహించి ప్రతీ ఇంటోలో యువత ఏ అంశంలో నైపుణ్యం కలిగి ఉన్నది సెన్సస్ చేపడుతున్నామన్నారు.

అంతేకాక ప్రపంచస్థాయి సంస్థలు మన రాష్ట్రంలో పరిశ్రమలు నెలకొల్పేలా చర్యలు తీసుకుంటున్నామని, వారికి కావలసిన రంగంలో మన యువతకు నైపుణ్యాభివృద్ధిలో శిక్షణ ఇచ్చి ఆయా పరిశ్రమలలో ఉద్యోగ అవకాశాలు కల్పించేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. రాష్ట్రంలోని 175 నియోజకవర్గాలలో స్కిల్ హబ్ లు ఏర్పాటుచేసి, యువతను అన్ని రంగాలలో నైపుణ్యాభివృద్ధి శిక్షణ అందించి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నామన్నారు.
2047 స్వర్ణాంధ్ర కార్యాచరణ ప్రణాళికలో నైపుణ్యాభివృద్ధి, యువతకు ఉద్యోగ కల్పన అంశానికి ప్రాధాన్యత ఇవ్వడం జరిగిందని మంత్రి చెప్పారు. ఎన్టీపీసీ సంస్థ 1. 87 లక్షల కోట్ల రూపాయలతో సంప్రదాయేతర ఇంధన వనరుల అభివృద్ధి యూనిట్ స్థాపించనున్నదని, దీని ద్వారా 1. 06 లక్షల మంది యువత ఉద్యోగ అవకాశాలు లభిస్తాయన్నారు. .విద్యా శాఖామంత్రి నారా లోకేష్ ఇటీవల విదేశీ పర్యటనలో గూగుల్ సంస్థ తో సంప్రతించి గూగుల్ సంస్థ తన యూనిట్ ను రాష్ట్రంలో నెలకొల్పేలా చర్యలు తీసుకున్నారన్నారు.

అదేవిధంగా వేల కోట్ల రూపాయలతో మన రాష్ట్రంలో తన యూనిట్ ను నెలకొల్పేందుకు వచ్చిన మిట్టల్ స్టీల్ సంస్థ గత ప్రభుత్వ హయాం లో పరిస్థితులు అనుకూలించని కారణంగా ఒరిస్సా లో నెలకొల్పేందుకు ఆలోచిస్తుండగా, ముఖ్యమంత్రి చొరవతో తిరిగి మన రాష్ట్రంలో నెలకొల్పేందుకు అగ్రిమెంట్ కుదుర్చుకుందన్నారు. రిలయన్స్ సంస్థ 65 వేల కోట్ల రూపాయలతో 500 కంప్రెస్డ్ బయో గ్యాస్ యూనిట్లు నెలకొల్పేలా మంత్రి లోకేష్ చొరవ తీసుకున్నారన్నారు.

ఈ విధంగా ప్రపంచ స్థాయి దిగ్గజ సంస్థలు, అదే స్థాయి టెక్నాలజీ తో తమ యూనిట్లను మన రాష్ట్రంలో నెలకొల్పి మన యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించేలా రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, మంత్రి నారా లోకేష్ కృషి చేస్తున్నారన్నారు. ఈ విధంగా రాష్ట్రాన్ని అభివృద్ధి బాటలో నిలిపి, ప్రతీ ఇంటికి ఉద్యోగ అవకాశాలు, పారిశ్రామికవేత్తలను రూపొందిస్తే రాష్ట్రం అభివృద్ధి బాటలో నిలబడడంతో పాటు, ప్రజలు సంక్షేమ కార్యక్రమాల గురించి ఆలోచించరని మంత్రి చెప్పారు.

జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి మాట్లాడుతూ జిల్లాలో 8 స్కిల్ హబ్స్ లలో యువతకు నైపుణ్యాభివృద్ధిలో శిక్షణ ఇచ్చి ఉద్యోగావకాశాలు కల్పిస్తున్నామన్నారు. స్వర్ణాంధ్ర కార్యాచరణ ప్రణాళికలో కూడా నైపుణ్యాభివృద్ధి, యువతకు ఉద్యోగ అవకాశాల కల్పనపై ప్రత్యేక స్థానం కల్పించామన్నారు. జిల్లాలో ఏ పరిశ్రమలలో ఏ ఏ ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి , వాటికి ఏ ఏ విభాగంలో నైపుణ్యం అవసరం అని తెలుసుకుని వాటిల్లో యువతకు శిక్షణ అందించి, ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నామన్నారు.

జిల్లా కలెక్టర్ పనితీరును ప్రశంసించిన మంత్రి పార్థసారథి ప్రభుత్వ ఆలోచనలకు అనుగుణంగా జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి పనిచేస్తున్నారని మంత్రి పార్థసారథి కొనియాడారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై పేద ప్రజలకు అవగాహన కల్పించి వాటిని వారు సద్వినియోగం చేసుకునేలా ప్రత్యేక శ్రద్ద తీసుకుంటున్నారన్నారు.

కార్యక్రమంలో నూజివీడు సబ్ కలెక్టర్ స్మరణ రాజ్, త్రిబుల్ ఐటీ విసి అమరేంద్ర కుమార్, డి ఆర్ డి ఏ ప్రాజెక్ట్ డైరెక్టర్ విజయరాజు, స్కిల్ డెవలప్మెంట్ అధికారి జితేంద్ర కుమార్, ప్రభృతులు పాల్గొన్నారు. అనంతరం జాబ్ మేళా కు దరఖాస్తు చేసుకుంటున్న అభ్యర్థులను కలిసి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. వారికి మరిన్ని హెల్ప్ డెస్క్ లు ఏర్పాటుచేయాలని మంత్రి అధికారులను ఆదేశించారు.

LEAVE A RESPONSE