లెస్స పలికిన జస్టిస్ లక్ష్మణ్ !

( మార్తి సుబ్రహ్మణ్యం)

మాజీ ఎంపి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో, కడప ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డికి ముందస్తు బెయిల్ ఇచ్చే సందర్భంలో.. తెలంగాణ హైకోర్టు జడ్జి జస్టిస్ లక్ష్మణ్ చేసిన వ్యాఖ్యలు నిస్సందేహంగా ఆలోచించదగ్గవే. నిజాయితీపరుడు, ఎవరి ఒత్తిళ్లకు లొంగని న్యాయమూర్తిగా పేరున్న జస్టిస్ లక్ష్మణ్.. తనపై కొన్ని మీడియా సంస్థలు చేసిన, వ్యక్తిత్వ హననంపై వెలిబుచ్చిన ఆవేదనలో అర్ధం ఉంది.

ఇదే కేసులో గంగిరెడ్డికి ఇచ్చిన షరతు వెసులుబాటుపై సుప్రీకోర్టు ధర్మాసనం చేసిన, విస్మయ-విభ్రాంతికర వ్యాఖ్యలు పక్కనపెడితే.. అవినాష్‌రెడ్డి ముందస్తు బెయిల్‌కు సంబంధించి, కొన్ని మీడియా సంస్థలు ప్రసారం చేసిన వ్యాఖ్యలు, చర్చలపై జస్టిస్ లక్ష్మణ్ ఆవేదనాభరిత వ్యాఖ్యలు పరిగణనలోకి తీసుకోవలసిందే.

‘‘నిరాధార ప్రసారాలు మంచిదికాదు. చర్చల పేరుతో ఇతరుల వ్యక్తిత్వ హననం పాల్పడం సరైంది కాదు. రెండు మీడియా సంస్థలు నాపై దాడి చేశాయి. అది నాపై వ్యక్తిగత దాడి మాత్రమే కాదు. మొత్తం న్యాయవ్యవస్థపై జరిగిన దాడి. ఆ చర్చల్లో జరిగిన మాటలతో కలత చెందా. ఒక దశలో విచార ణ నుంచి తప్పుకోవాలనుకున్నా. తీర్పు వెల్లడించాల్సిన న్యాయమూరిపై నేరుగా వ్యాఖ్యలు చేయడం క్షమించరానిది’’ అంటూ జస్టిస్ లక్ష్మణ్ చేసిన వ్యాఖ్యల్లో అర్ధం ఉంది. ఒక న్యాయమూర్తి ఆ స్థాయిలో కలత చెందారంటే, ఆయనపై ఏ స్థాయిలో వ్యక్తిత్వ హననం జరిగిందో అర్ధం చేసుకోవచ్చు. ప్రజాస్వామ్యపిపాసులు, న్యాయవ్యవస్థపై గౌరవం ఉన్న వారంతా దానిని ఖచ్చితంగా ఖండించాల్సిందే.

కొన్నేళ్ల క్రితం ఏపీ హైకోర్టు న్యాయమూర్తులపై, వైసీపీ సోషల్‌మీడియా దళం ‘అంతకుమించిన’ వ్యక్తిత్వ హననానికి పాల్పడింది. హైకోర్టును టీడీపీ కార్యాలయం అని విమర్శించింది. జడ్జిలకు కులాలను ఆపాదించింది. కమ్మ వ ర్గానికి చెందని వారిపైనా కులముద్ర వేసింది. జస్టిస్ లక్ష్మణ్ గారు ఇప్పుడు అవినాష్‌రెడ్డి కేసులో అనుభవించిన మానసికక్షోభకు, నాలుగింతల ఆవేదన అనుభవించిన రోజులవి. చివరాఖరకు కేసును సీఐడీకి అప్పగించినా, తమ వల్ల కాదని నిస్సహాయత వ్యక్తం చేస్తే, సీబీఐకి అప్పగించాల్సిన దుస్థితి. ఇప్పటికీ న్యాయమూర్తులపై పోస్టింగులు పెట్టిన నిందితులపై, పూర్తి స్థాయి శిక్ష సంగతి సంగతి దేవుడెరుగు. పూర్తి స్థాయి విచారణ కూడా పూర్తికాని దౌర్భాగ్యం. ఆసలు ఆ కేసంటూ ఒకటుందని సీబీఐకి గుర్తుందో లేదో కూడా తెలియదు. విదేశాల్లో ఉన్న వైసీపీ సోషల్‌మీడియా ప్రముఖుడిని, ఇప్పటికీ దేశానికి రప్పించలేని దుస్థితి మన వ్యవస్థది.

వరస వెంట వరస దేశ , విదేశాల్లోని వైసీపీ సొషల్‌మీడియా దళాలు.. అప్పటి చీఫ్ జస్టిస్ ఎన్వీ ర మణ సహా, ఏపీ హైకోర్టు న్యాయమూర్తుపై వ్యక్తిత్వ హననానికి పాల్పడ్డారు. వారికి టీడీపీతో సంబంధాలు అంటకట్టారు. అందులో 16 మందిని గుర్తించిన సీబీఐ, ఆరుగురిని అరెస్టు చేసింది.అయితే ఆ తర్వాత అదే జస్టిస్ రమణతో, సీఎం జగన్ ఏకాంతంగా రెండుగంటలు భేటీ వేయడం వేరే విషయం.

సుప్రీంకోర్టు సీజే సహా, జగన్ సర్కారు నిర్ణయాలకు వ్యతిరేకంగా తీర్పులిచ్చిన న్యాయమూర్తులపై జరిగిన వ్యక్తిగత దాడితో, అప్పుడు వారు ఇంకెంత ఖిన్నులయ్యారో, మరెంత కలత చెందారో.. ఇప్పుడు జస్టిస్ లక్ష్మణ్ గారి ఆవేదన బట్టి అర్ధమవుతుంది. చివరాఖరకు.. ఏపీ సర్కారు నిర్ణయాలకు వ్యతిరేకమైన తీర్పులిచ్చి, కోర్టు ధిక్కరణకు పాల్పడిన ఐఏఎస్‌లకు శిక్షలు విధించిన జస్టిస్ భట్టు దేవానంద్, విచిత్రంగా పక్క రాష్ట్రాలకు బదిలీ అయిన వైచిత్రిని, ఎవరికి తోచినట్లు వారు అన్వయించుకోవడంలో తప్పు లేదు. ఎందుకంటే ఇది ప్రజాస్వామ్య దేశం కాబట్టి.

ఎర్ర గంగిరెడ్డి కేసులో ఫలానా తేదీలోగా బెయిల్ ఇవ్వాలన్న ఇదే తెలంగాణ హైకోర్టు ఆదేశాలపై, సుప్రీంకోర్టు చేసిన విభ్రాంతికర వ్యాఖ్యలు, న్యాయవర్గాల్లో చర్చనీయాంశమవడం సహజం. అవినాష్‌రెడ్డిని కూడా కావాలంటే అరెస్టు చేసుకుని, 5 లక్షల రూపాయల పూచీకత్తు తీసుకుని బెయిల్ ఇచ్చేయాలన్న తెలంగాణ హైకోర్టు చారిత్రాత్మక నిర్ణయంపై, న్యాయశాఖ స్టాండింగ్ కమిటీ సభ్యుడు కూడా అయిన, ఎంపి రఘురామకృష్ణంరాజు చేసిన వ్యాఖ్యలను కొట్టివేయలేం.

న్యాయమూర్తుల తీర్పును విమర్శించకూడదన్న ధర్మసూత్రాన్ని అందరూ పాటిస్తున్నందుకే, న్యాయవ్యవస్థ ఇంకా గౌరవం పొందుతుందన్నది విజ్ఞుల ఉవాచ.

జస్టిస్ జాస్టి చలమేశ్వర్ హయాంలో రోడ్డెక్కిన న్యాయం.. గాలి జనార్దన్‌రెడ్డి బెయిల్ కేసులో, లంచం తీసుకుంటూ దొరికిపోయిన జడ్జి ఉదంతాల వరకూ చూపుడువేలుకు గురవుతోంది.

అయినా న్యాయమూర్తుల తీర్పును విమర్శించకూడదు. చర్చించకూడదు. ప్రభుత్వ వ్యవస్థలో జరిగే అవినీతి, అక్రమాలను ధైర్యంగా వెలికితీసే మీడియా.. న్యాయవ్యవస్థ విషయంలో మాత్రం, మౌనంగా-భయంగా ఉండటానికి ఇదే కారణం! అంటే భయంతో కూడిన గౌరవం.. గౌరవంతో కూడిన భయమన్నమాట!!

ఇక తనపై జరిగిన వ్యక్తిత్వ హననంపై ఆవేదన వ్యక్తం చేసిన జస్టిస్ లక్ష్మణ్ గారి కంటే ఎక్కువగా.. విచారణ సంస్థ అయిన సీబీఐ విమర్శలు-ఆరోపణలకు గురవుతోంది. జస్టిస్ లక్ష్మణ్ గారంటే జడ్జి కాబట్టి, ఎవరూ ఆయనపై నేరుగా విమర్శించడానికి, మీడియాలో కథనాలు రాయడానికి సాహసించరు. కోర్టు ధిక్కరణ కింద జైలుకు పంపిస్తారన్న భయం ఉంటుంది కాబట్టి!

కానీ సీబీఐ అలాకాదు. విచారణ జరుగుతున్నంతసేపూ సీబీఐ అధికారులు వ్యక్తిత్వ హననానికి గురవుతున్నారంటే.. వారు ఇంకెంత ఆవేదన-మానసిక క్షోభకు జమిలిగా గురయి ఉంటారో, ప్రత్యేకించి చెప్పాల్సిన పనిలేదు. టీడీపీ వారి సూచనల ప్రకారం కేసు దర్యాప్తు చేస్తోందని, పచ్చ మీడియాలో కథనాలు వచ్చిన తర్వాత ఆ మేరకు విచారిస్తోందని, సీబీఐ అధికారులు టీడీపీ నేతలతో కుమ్మక్కయారంటూ బహిరంగంగా మీడియాలో ఆరోపిస్తుంటే, మరి ఆ అధికారుల ఆవేదనకు విలువలేదా అన్నది బుద్ధిజీవుల ప్రశ్న.

గతంలో కాంగ్రెస్ పంజరంలో చిలక అని నిందలు ఎదుర్కొంటున్న సీబీఐ.. ఇప్పుడు బీజేపీ పంజరంలో చిలకగా ఆరోపణలు ఎదుర్కొంటోంది. మరి ఆ ప్రకారంగా సీబీఐ మానసిక్ష క్షోభను గుర్తించే విశాల హృదయాలెక్కడ అన్నది ప్రశ్న. అయినా సీబీఐపై అన్నేసి ఆరోపణలు చేస్తున్న రాజకీయ పార్టీలపై, న్యాయస్థానాలు ఎందుకు చర్యలు తీసుకోవన్నది అమాయకుల సందేహం.

వివేకా హత్య కేసులో దస్తగిరిని ఎలా అప్రూవర్ చేస్తారు? ఆతనిచ్చిన స్టేట్‌మెంట్ ఆధారంగా వైఎస్ భాస్కరరెడ్డి, ఎంపి అవినాష్‌రెడ్డిలను ఎలా అరెస్టు చేస్తారన్నది.. ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడి,్డ మీడియా వేదికగా సంధించిన ప్రశ్న. తానే చంపానని చెప్పిన వ్యక్తిని అరెస్టు చేయకుండా, సీబీఐ స్వేచ్ఛగా ఎలా వదిలేస్తుందన్నది సజ్జల సంధించిన మరో ప్రశ్న. పచ్చ మీడియాకు సీబీఐ చర్యల సంగతి ముందే తెలుస్తున్నాయన్నది ఆయన వెలిబుచ్చిన ఇంకో అనుమానం.

సజ్జల వాదన నిజమనుకుంటే.. వైసీపీలో నెంబర్‌టూగా ఉన్న ఎంపి విజయసాయిరెడ్డి అల్లుడి సోదరుడైన.. ఢిల్లీ లిక్కర్ కేసు ముద్దాయి శరత్‌చంద్రారెడ్డిని, న్యాయస్థానం అప్రూవర్‌గాఅంగీకరించడం కూడా అ న్యాయమే కదా? ఆ లెక్కన కేసీఆర్ కూతురు కవిత కూడా.. శరత్‌చంద్రారెడ్డిని అరెస్టు చేయకుండా, అప్రూవర్‌గా ఎలా మారుస్తారని సుప్రీంకోర్టులో కేసు వేయవచ్చా? అన్నది బుద్ధిజీవుల ధర్మసందేహం. రెండు కేసులు వేరయినప్పటికీ.. అంశం అప్రూవర్‌గా మారడమే కాబట్టి, బుద్ధిజీవులకు అలాంటి ధర్మసందేహం రావడంలో తప్పులేదు. ఆల్రెడీ ఎంపీ రఘురామకృష్ణంరాజు అలాంటి డౌటనుమానం వ్యక్తం చేశారు కూడా! మరి ఇది లాజిక్కే కదా?

Leave a Reply