‘విమ్స్‌’లో మరో కలికితురాయి

Spread the love

-బ్రెయిన్‌ డెడ్‌ అయిన వ్యక్తి నుంచి అవయవాలు సేకరించిన తొలి ప్రభుత్వ ఆస్పత్రిగా రికార్డ్‌
-అనుమతులు పొందిన నెల రోజుల్లోనే అవయవాల సేకరణ
-నలుగురి జీవితాల్లో కొత్త వెలుగులు

విశాఖపట్నం: కార్పొరేట్‌ ఆస్పత్రులకు ధీటుగా విశాఖ ఇన్సిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్స్‌ (విమ్స్‌) మరో ఘనత సాధించింది. బ్రెయిన్‌ డెడ్‌ అయిన వ్యక్తి నుంచి అవయవాలు సేకరించి ఏపీ రాష్ట్రంలోనే తొలి ప్రభుత్వాస్పత్రిగా రికార్డు నమోదు చేసుకుంది. బ్రెయిన్‌ డెడ్‌ కేసుల్లో సాధారణంగా కార్పొరేట్‌ ఆస్పత్రులు మాత్రమే అవయవాల్ని సేకరిస్తుంటాయి. విమ్స్‌లో మాత్రం శుక్రవారం బ్రెయిన్‌ డెడ్‌ అయిన ఒక మహిళ నుంచి అవయవాల్ని సేకరించి మరో నలుగురికి ప్రాణం పోశారు అక్కడి వైద్యులు. ఇది ఏపీ చరిత్రలోనే తొలిసారి అని ఆ ఆస్పత్రి డైరెక్టర్‌ డాక్టర్‌ కె.రాంబాబు మీడియాకు తెలిపారు.

మహిళ నుంచి నాలుగు అవయవాల సేకరణ
శ్రీకాకుళం జిల్లాకు చెందిన పి.చంద్రకళ (32) గత నెల 31న తీవ్ర తలనొప్పితో బాధపడుతూ అపస్మారక స్థితిలోకి చేరుకున్నారు. చికిత్స నిమిత్తం ఆమెను విమ్స్‌కు తరలించారు. న్యూరోసర్జరీ వైద్యుల ఆధ్వర్యంలో వైద్య పరీక్షలు నిర్వహించగా తలలో తీవ్ర రక్తస్రావం జరిగినట్టు తేలింది. దాన్ని తగ్గించేందుకు తీవ్రంగా శ్రమించినప్పటికీ నియంత్రణలోకి రాలేదు సరికదా శరీరంలోని ఒక్కో అవయవం పనిచేయటం మానేశాయి. దీంతో ఆమెను బ్రెయిన్‌ డెడ్‌ కేసుగా వైద్య బృందం ప్రకటించింది.

ఈ విషయం తెలుసుకున్న విమ్స్‌ డైరెక్టర్‌, జీవన్‌ధాన్‌ ఏపీ కో`ఆర్డినేటర్‌ డాక్టర్‌ కె. రాంబాబు ఆ మహిళ కుటుంబ సభ్యులతో మాట్లాడి అవయవదానానికి ప్రోత్సహించారు. ఈ క్రమంలో ఆమె నుంచి రెండు కిడ్నీలు, రెండు కళ్ళను సేకరించారు. ఇలా సేకరించిన అవయవాలతో జీవితాల్లో వెలుగులు నింపినట్టయింది. రెండు కిడ్నీలను రెండు వేర్వేరు ఆస్పత్రులకు కేటాయించగా, ఆ రెండు కళ్లనూ ఎల్వీ ప్రసాద్‌ ఐ ఆస్పత్రికి కేటాయించారు. జీవన్‌ధాన్‌ ప్రోటోకాల్‌ ప్రకారం ఆ అవయవాల్ని అవసరమైన రోగులకు అందజేయనున్నట్టు ఈ సందర్భంగా రాంబాబు తెలిపారు.

ఘన వీడ్కోలు
మరణించిన తరువాత కూడా నలుగురి జీవితాల్లో వెలుగులు నింపిన చంద్రకళ మృత దేహానికి విమ్స్‌ సిబ్బంది ఘనంగా వీడ్కోలు పలికారు. సెక్యూరిటీ సిబ్బంది గౌరవ వందనం చేశారు. అనంతరం డైరెక్టర్‌ డాక్టర్‌ కె.రాంబాబు పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఆస్పత్రి సిబ్బంది పూలుజల్లుతూ ఘన వీడ్కోలు పలికారు. ఇదిలా ఉంటే బ్రెయిన్‌ డెడ్‌ అయిన వ్యక్తుల నుంచి అవయవాలు సేకరించేందుకు విమ్స్‌ ఆస్పత్రికి ఏప్రిల్‌ 26న అధికారిక అనుమతులొచ్చాయి.

అయితే కేవలం నెల రోజుల వ్యవధిలోనే తొలి సర్జరీ చేసి విమ్స్‌ ఆస్పత్రి రికార్డు నమోదు చేసింది. అతి తక్కువ సమయంలోనే అవయవాలు సేకరించిన తొలి ఆస్పత్రిగా కూడా రికార్డులకెక్కింది. ఈ సందర్భంగా డాక్టర్‌ కె.రాంబాబు శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా 2900మంది రోగులు అవయవాల కోసం ఎదురు చూస్తున్నారన్నారు. అవయవ దానానికి ముందుకు వచ్చిన చంద్రకళ కుటుంబ సభ్యుల్ని కూడా ఆయన అభినందించారు.

చంద్రకళ కుటుంబ సభ్యుల్లాగే బ్రెయిన్‌ డెడ్‌ అయిన వారి కుటుంబ సభ్యులెవరైనా అవయవ దానానికి ముందుకు రావాలని పిలుపునిచ్చారు. మరణించిన తర్వాత మరొకరికి పునర్జన్మనివ్వటం ఎంతో అదృష్టమని, మూఢనమ్మకాలు వీడనాడాలన్నారు. అతి తక్కువ సమయంలోనే చంద్రకళ శరీరం నుంచి అవయవాల్ని సేకరించిన వైద్య బృందాన్నీ ఆయన అభినందించారు.

Leave a Reply