మరువకూడని నాయకుడు కాకాని వెంకటరత్నం

రాజకీయాన్ని రాజ కీయంగా కాకుండా , దాని లక్ష్యం ప్రజా శ్రేయస్సే అని మనసా, వాచా, కర్మణా నమ్మిన ప్రజా నాయకుడు , ప్రజాబందు , కాకాని వెంకట రత్నం . వీర కాకాని అశు వులు బాసి 50 సం.లు పూర్తి అయ్యింది . ఎవరైనా వ్యాసం రాస్తారేమోనని ఇంత కాలం చూసా. ఒక పత్రికలో మాత్రం చిన్న వ్యాసం రాసి మమా అని పించారు . వందల పధకాలకు ఒకే నాయకుడి పేర్లు పెట్టుకుంటున్న నేటి రాజకీ యాల్లో కాకాని పేరును ఏ ఒక్క పధకానికి కూడా పెట్ట లేని దౌర్భగ్య రాజకీయ చరిత్ర మనది .

కులానికి అన్యాయం జరిగిపోతోంది అని నానా గొడవలు చేస్తున్న కుల సంఘాలు , ఆయన మా ఓడు అని చెప్పుకునే కుల సంఘాలు కూడా ఆయన పేరున కార్యక్రమాలు చేయలేక పోయాయి. ఎందుకు కాకానిని తలచుకోవాలి అంటున్నాను అంటే 1972 లో కాకాని ప్రత్యేక ఆంధ్రా గురించి ఉద్యమం చేస్తూ కన్నుమూసి నేటి తరానికి ఆరాద్యుడుగా నిలిచాడు . తెలుగునేల విభజింపబడిన ఈ వేళ , స్నేహంగా విడిపోయి ఎవరి బతుకులు వారు బతుకుదాం , రెండుగా విడివడినా రెండూ అభివృద్ధి చెందే సత్తా తెలుగు రాష్ట్రాలకు ఉంది అని రాబోయే కాలాన్ని ముందుగానే ఊహించి చెప్పిన రాజకీయ దురంధరుడు కాకాని.

1972 లో ప్రత్యేక ఆంధ్రాను ఏర్పాటు చేసి ఉంటే నేడు భారత్ లోనే సంపన్న రాష్ట్రంగా ఎ.పి వెలుగొందుతూ ఉండేది . 1972 నుండే అనేక పరిశ్రమలు తెలంగాణాలో ఏర్పడ్డాయి. అప్పటికి ఆంధ్రా ఏర్పడి ఉంటే సగం పరిశ్రమలు ఆంధ్రాలో ఏర్పాటు చేసి ఉండేవారు . శ్రీ కాకాని గారు ఐదవ తరగతి మాత్రమే చదివినా శాసన సభ్యునిగా మూడు సార్లు గెల్చి , మంత్రిగా ఎప్పుడూ ప్రజల మద్యే జీవితాన్ని గడిపిన ధన్యజీవి. తనకు చదువు లేకపోయినా వందల పాఠశాలలు స్థాపించాడు. నేటి రాజకీయ పరిస్థితుల్లో కాకాని లాంటి వ్యక్తిత్వం , దృఢ సంకల్పం ఉన్న నాయకుల అవసరం ఎంతైనా ఉంది.

ఇప్పటి తరం ఆయన లోని పోరాట పటిమను , కార్యదీక్షతను , పట్టుదలను స్పూర్తిగా తీసుకోవాలి . ఆయన ఏనాడు వ్యక్తిగతంగా ప్రచారం చేసుకో లేదు , పేరుకోసం పాకులాడ లేదు . కుట్ర , గ్రూపు రాజకీయాలు చేయలేదు . భూస్వాములను ఎదిరించి పేదల పక్ష పాతిగా నిలబడ్డాడు. వేల మందికి విద్యాగంధాన్ని అందించాడు. తన పార్టీని కూడా ఎదిరించిన సందర్భా లున్నాయి . పదవుల కోసం దేవురించలేదు . ఇస్తే తీసుకున్నాడు , తీసుకున్నాక పదవికి న్యాయం చేసాడు . పార్టీ తప్పుగా వ్యవహరిస్తే నిక్కచ్చిగా వ్యతిరేకించాడు . పదవి లేకపోయినా సహాయం చేయవచ్చు అని నిరూపించిన ఏకైక నాయకుడు కాకాని . కృష్ణాజిల్లా బోర్డ్ అధ్యక్షునిగా ఉన్న సమయంలో వందకు పైగా పాఠశాలలు స్థాపించి వేల మందికి విద్యను అందించాడు.

ఆయన రాకముందు , ఆయన తరువాత కూడా అన్ని పాఠశాలలు ఎవ్వరూ స్థాపించలేదు . అలా 1960 – 70 దశకంలో చదువుకున్న కృష్ణా , గుంటూర్ జిల్లాల నుండీ డాక్టర్లు , ఇంజనీర్లుగా విదేశాలకు వెళ్ళి స్థిరపడిన వారు అనేకులు ఉన్నారు . వారు నేటికీ కాకాని గురించి చెబుతూ ఉంటారు. అంతెందుకు కృష్ణా , గుంటూర్ జిల్లాల వారు బాగా చదువరులు అనే పేరు రావడానికి కారణం కాకాని వెంకటరత్నం. ఆయన నిర్మించిన పాఠశాలకే తరువాతి తరాలకు మార్గదర్శకాలై , తల్లిదండ్రులు చదువు విలువను గుర్తించి పిల్లలను చదివించడం జరిగింది. కులాలకు అతీతంగా , పార్టీలకు అతీతంగా ఆ రోజున విద్యాశాఖ పని చేసింది . కాకాని తత్వం , వ్యక్తిత్వం నేటి నాయకులు ఆదర్శంగా తీసుకోవాలి . పలానా పని అని చెప్పగానే వెంటనే దానిమీద పరిశీలన చేయించి పని పూర్తి చేసే వాడు . నాకే మిస్తావు అని ఏనాడూ చేయి చాచ లేదు . అలాగే జీవితాంతం గడిపాడు కూడా . కులానికి ప్రాముఖ్యత ఇచ్చేవాడు కాదు . ఎవరి ఇంటికి వెళ్ళినా భేషజానికి పోకుండా వసారాలో మంచం ఆయనే వాల్చుకుని ప్రేమతో పలకరించే వాడు .

25 సం.రాలకు పైగా రాజకీయంలో ఉన్నా గెలుపో టములతో పని లేకుండా ప్రజలకు సేవ చేసాడు . ఆర్ టి సి బస్సు లోనే హైద్రాబాద్ వెళ్ళే వాడు. రాజకీయాన్ని ఆదాయ వనరుగా చూడకుండా తనదైన కోణంలో పరిశీలన చేశారు . రాజకీయం అంటే ప్రజా సమస్యలను పరిష్కరించే ఒక సంస్థగా భావించి , చివరి వరకూ అలాగే పాటు బడ్డాడు. వ్యక్తి గతంగా ఎవర్నీ ధూషించే వాడు కాదు . అందరినీ కలుపుకు పోయేవాడు , విధి నిర్వహణలో తెలియక పోతే అధికారులను అడిగి తెల్సుకునేవాడు. ఎన్నికల దృష్ఠితో రాజకీయాలను ఏ రోజూ నడప లేదు.

విలువలు లేని రాజకీయాలు అనర్ధాలకు మూలాలని భావించే వాడు . వ్యక్తి ఆరాధన కన్నా వ్యక్తిత్వం ముఖ్యమని భావించే వాడు . తన ఆలోచనలను పది మందికీ చెప్పి సలహాలు తీసుకుని ముందుకు నడిచే వాడు . ఏవైనా తప్పులుంటే సరిదిద్దుకునే భేషజాలు లేని నికార్సయిన ప్రజా నాయకుడు కాకాని . అధికార వికేంద్రీకరణ వల్లే గ్రామాలు అభివృద్ధి చెందుతాయని ప్రగాఢంగా నమ్మేవాడు . వ్యాపారాలను రాజకీయాలకు ముడిపెట్ట రాదని , ప్రజా సేవలో ఉండే వారు ఖచ్చితంగా కొన్ని నియమాలు , విలువలు పాటించాలని , వాటికి కట్టుబడి ఉండాలని తరచూ చెబుతూ , తాను ఆచరించి చూపిన ఆదర్శ మూర్తి కాకాని .

1900 సం.రం ఆగస్ట్ 3 న కృష్ణాజిల్లా వుయ్యూరు దగ్గర లోని ఆకునూరు గ్రామంలో రైతు కుటుంబంలో చిన తాతయ్య , సీతమ్మ దంపతులకు నలుగురు కుమారులలో రెండవ వానిగా జన్మించాడు. సీతమ్మ మరణంతో తండ్రి శేషమ్మను ద్వితీయ వివాహం చేసుకున్నాడు . మరలా వారికి ఐదుగురు మగ పిల్లలు , ఒక కుమార్తె జన్మించారు. మొత్తం పది మందికి ఏ లోటూ లేకుండా పెంచింది శేషమ్మ . కాకాని దుక్కి దున్ని వ్యవసాయం చేసి మంచి దిగుబడి సాధిస్తూ అందరికీ ఆదర్శంగా నిలిచేవాడు . 1920 లో వెంకట సుబ్బమ్మతో వివాహం జరగగా వారికి రామ్మోహన రావు అనే కుమారుడు జన్మించాడు .

గ్రామంలో గ్రంధాలయం స్థాపించి ఉత్తర భారతం నుండీ హిందీ పండితులను రప్పించి హిందీ నేర్పిస్తూ తానూ నేర్చుకున్నాడు. 1921 అఖిల భారత కాంగ్రెస్ సభలు విజయవాడలో జరిగితే మొదటగా వంట వారిని తీసుకుని వెళ్ళాడు . అప్పుడే పింగళి వెంకయ్య మొదటగా త్రివర్ణ పతాకాన్ని ప్రదర్శించారు. ఖద్దరు ప్రచార నిమిత్తం తిలక్ స్వరాజ్య నిధి కోసం గాంధీ కృష్ణాజిల్లా పర్యటనకు వస్తే కాకాని గాంధీని తమ స్వగ్రామానికి ఆహ్వానించి విరాళాలు అందించి ఉయ్యూరు , కొమ్ము మూరులో సభలు ఏర్పాటు చేసాడు.

1923 కాకినాడ సభలో కొండా వెంకటప్పయ్య అనుమతితో నేరుగా రాజకీయ సభలో పాల్గొన్నాడు. టంగుటూరి ప్రకాశం పట్ల విధేయత అక్కడే ఏర్పడింది . 1930 లో గ్రామంలో ఉప్పు పంచుతున్నాడని రెండు సం. లు కఠిన కారాగార శిక్ష విధించారు. 1932 లో శాసనోల్లంఘన ఉద్యమంలో 16 జూన్ న మరలా అరెస్ట్ చేసి ఆరు నెలలు జైలు శిక్ష వేసి తంజావూరు జైలుకు తరలించారు . గాంధీ అస్పృశ్యతా యాత్ర కృష్ణాజిల్లా వస్తే గాంధీని గ్రామానికి తీసుకు వచ్చి గాంధీ సమక్షంలోనే దళితులకు దేవాలయ ప్రవేశాలు , సహపంక్తి భోజనాలు కల్పించాడు.

1934-37 మద్య ఆకునూరు పంచాయితీ అధ్యక్షుడైనాడు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో భోగరాజు , Ng రంగా గ్రూపులు తలపడితే Ng రంగా వైపు నిలబడి ఓటమి చెందారు . సభ్యత్వ గొడవల్లో భోగరాజు కాకానిని రెండు సం. లు పార్టీ నుంచి సస్పెండ్ చేసారు. అప్పుడు పుచ్చలపల్లి , చండ్ర రాజేశ్వర రావు , కాట్రగడ్డ రాజ గోపాల రావు , కడియాల గోపాల రావు , లాంటి వారు కమ్యూనిస్ట్ పార్టీలో చేరి పోయారు . కాకాని మాత్రం చేరలేదు. 1938 జిల్లా బోర్డ్ ఎన్నికలు వస్తే పోటీగా అభ్యర్ధులను నిల్పితే టంగుటూరి రాజీ చేసి 10 స్థానాలు కాకానికి ఇవ్వడం జరిగింది . సుబాస్ చంద్ర బోస్ ఏలూరు వస్తే ఆ సభలో కాకాని పాల్గొన్నాడు . ఇక స్వాతంత్ర్య వచ్చినాక నిజాం ప్రభుత్వం రజాకార్ల తాకిడికి ఎ.పి సరిహద్దు గ్రామాలైన నందిగామ , తిరువూరు గ్రామాలకు నాయకులు , ప్రజలు వేలాదిగా తరలి రావడంతో వారికి విడిది ఏర్పాటు చేసి , అన్ని వసతులు కల్పించాడు . అందులో చెన్నారెడ్డి లాంటి నాయకులు ఎందరో ఉన్నారు .

శిబిరాలు ఏర్పాటు చేసి మద్రాస్ ప్రభుత్వంచే రక్షణ ఏర్పాటు చేయించి , ఉద్యమ కారులకు ఆయుధాలు కూడా అందించాడు . పోలీస్ చర్యతో నిజాం వైదొలగితే పటేల్ మద్రాస్ వచ్చినప్పుడు Ng రంగా వీరే ఉక్కు కాకాని అని పటేల్ కు పరిచయం చేసాడు. 1949-53 కృష్ణాజిల్లా పరిషత్ అధ్యక్షునిగా పనిచేశారు. 1952 ,1967 ల్లో రెండు సార్లు పిసిసి అధ్యక్షునిగా పనిచేసారు. 1955 , 62 , 72 ల్లో ఉయ్యూరు శాసనసభకు ఎన్నికైనాడు . 1964 లో పిన్నమనేని కోటేశ్వర రావు గారిని Zp చైర్మన్ గా నిలిపి గెలిపించాడు.

1 డెసెంబర్ 1972 న జై ఆంధ్రా ఉద్యమం ప్రకటించగా రాజీనామా చేసిన 96 మంది శాసనసభ్యులు 10 మంది మంతృల్లో కాకాని ఒకరు. డిసెంబర్ 21 న ఉద్యమంలోకి ఉరకగా, 24 న సమైఖ్యవాదులు విజయవాడ లో సభ అని ప్రకటించారు . ఆపి తీరుతాం అని ప్రకటిం చాడు కాకాని . డిసెంబర్ 24 న గన్నవరం విమానాశ్రయాన్ని రెండు లక్షల మంది చుట్టు ముట్టారు . విమానం నుంచి నాయకులు దిగకుండా చక్కర్లు కొట్టి వెళ్ళి పోయారు .

ఈ లోపు విజయవాడలో విద్యార్ధులపై కాల్పులు జరిపారు అనే కబురు అందడంతో పిల్లల్ని కాల్చి చంపుతారా అంటూ ఆవేశంగా కేకలు వేస్తూ, వెళ్ళే దారిలేక నడుచుకుంటూనే బైలు దేరాడు. గుండె నొప్పిగా అనిపించడంతో కెనాల్ గెస్ట్ హౌస్ కి చేర్చారు . రాత్రి ఒంటి గంటకు తీవ్ర గుండెపోటు రావడంతో ఆసుపత్రికి చేర్చి , చికిత్స అందించినా ఫలితం దక్కలేదు . 25 వ తేదీ ఐదు లక్షల మంది అంతిమయాత్ర లో పాల్గొనగా, సాయంత్రం కృష్ణానదీ తీరాన కుమారుడు రామ్మోహన రావు వీర కాకాని కి అంత్యక్రియలు నిర్వహించాడు. – వి . యల్ . ప్రసాద్

Leave a Reply