– తారక రాముడు తళుక్కుమంటాడా?
– ఆంధ్రా సెటిలర్లపై ‘తారక అస్త్రం’ ఫలిస్తుందా?
– కమ్మ వర్గంపై కమలం ఆశలు ఫలిస్తాయా?
– ‘త్రిపుల్ ఆర్’లో ఇంకో ఆర్‌ను పిలవలేదేం?
– సెటిలర్ల ‘అమరావతి అసంతృప్తి’ని ఎన్టీఆర్ చల్లారుస్తారా?
– అమిత్‌షా వ్యూహం అమలువుతుందా?
– ఎన్టీఆర్ రాజకీయాల్లోకి వస్తారా?
– ‘బీజేపీ తారకరాముడి’ని కమ్మ వర్గం సమర్థిస్తుందా?
– జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో కారెక్కిన సెటిలర్లు
– అమరావతి ఆగ్రహమే కారుకు చేరవ చేసిందా?
– అమిత్‌షా-ఎన్టీఆర్ భేటీపై వాడి వేడి చర్చ
( మార్తి సుబ్రహ్మణ్యం)
తెలుగు సినీ అగ్ర కథానాయకుడు జూనియర్ ఎన్టీఆర్‌తో, కేంద్రహోంమంత్రి అమిత్‌షా భేటీపై రాజకీయాల్లో ఆసక్తికరమైన చర్చకు తెరలేచింది. ఆర్‌ఆర్‌ఆర్ సినిమాలో బ్రహ్మండంగా నటించిన ఎన్టీఆర్‌ను అభినందించేందుకే అమిత్‌షా, జూనియర్ ఎన్టీఆర్‌ను పిలిపించారన్న బీజేపీ వర్గాల ప్రచారంపై భిన్నాభిప్రాయం వ్యక్తమవుతున్నాయి. ఆ సినిమాలో ఎన్టీఆర్‌తోపాటు, రాంచరణ్‌కూ సమాన పాత్ర ఉన్న విషయాన్ని గుర్తు చేస్తున్నారు. ఒక రకంగా ఆ సినిమాలో రాంచరణ్ పాత్రనే ఎక్కువన్న చర్చ
కూడా అభిమానుల మధ్య జరిగింది. ఏదేమైనా వారిద్దరూ పోటీపడి నటించారన్నది సినిమా చూసిన వారి అభిప్రాయం. అలాంటిది రాంచరణ్‌ను విస్మరించి, ఒక్క జూనియర్ ఎన్టీఆర్‌నే అమిత్‌షా పిలవడంపై, అనుమానాలతో కూడిన ఆశ్చర్యం వ్యక్తమవుతోంది. రాజకీయ ప్రయోజనం లేకపోతే అమిత్‌షా వంటి అగ్రనేత , ఎన్టీఆర్‌ను ఎందుకు కలుస్తారన్న ప్రశ్నలు తెరపైకి వస్తున్నాయి.
నిజానికి వచ్చే ఎన్నికల కోసం సిద్ధమవుతున్న బీజేపీ.. తెలంగాణలో తన పునాదులు పటిష్టం చేసుకునే వ్యూహంలో భాగంగానే.. ఎన్టీఆర్‌తో మంతనాలు ప్రారంభించిందన్న వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్నాయి. తెలంగాణ లో, ప్రధానంగా గ్రేటర్ హైదరాబాద్ పరిథిలో మెజారిటీ సంఖ్యలో నివసించే ఆంధ్రా సెటిలర్లు, ముఖ్యంగా కమ్మ సామాజికవర్గం ఓట్ల కోసమే ఎన్టీఆర్‌ను తెరపైకి తెచ్చారన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.
జనాకర్షణ, సినీ గ్లామర్‌తోపాటు రాజకీయ అవగాహన ఉన్న ఎన్టీఆర్‌ను రంగంలోకి దించితే.. గ్రేటర్ హైదరాబాద్ పరిథిలో పాతబస్తీతోపాటు నగరంలో రెండు, మూడు నియోజకవర్గాలు మినహా అన్ని నియోజకవర్గాల్లోనూ రాజకీయంగా లబ్ధిచేకూరుతుందన్నది బీజేపీ నాయకత్వ వ్యూహంలా కనిపిస్తోంది. ఇక ఖమ్మం,రంగారెడ్డి, నిజామాబాద్, నల్గొండ జిల్లాలో కొన్ని నియోజకవర్గాల్లో సెటిలర్లు, కమ్మ వర్గాన్ని ఆకర్షించవచ్చన్నది బీజేపీ మరో ఎత్తుగడ అన్నది స్పష్టమవుతుంది.
అయితే.. బీజేపీ వ్యూహం, ముందుచూపు బాగానే ఉన్నప్పటికీ, అది ఫలిస్తుందా అన్నదానిపైనే భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. నిజానికి ఎన్టీఆర్ తెలుగుదేశంలో చురుకుగా ఉన్నంతకాలం, ఆయనను కమ్మవర్గం ఆదరించి అభిమానించింది. ఎప్పుడయితే ఆయన ఆ పార్టీకి మానసికంగా దూరంగా
జరిగి, స్తబ్దతగా ఉన్నారో అప్పటినుంచి ఎన్టీఆర్‌ను ఓన్ చేసుకోవడం మానేసింది. ఆయన మామ నార్నె శ్రీనివాసరావు స్వయంగా జగన్ సమక్షంలో వైసీపీలో చేరిపోగా, రోజూ టీడీపీని-చంద్రబాబు కుటుంబాన్ని వ్యక్తిగతంగా దూషించే మాజీ మంత్రి కొడాలి నాని, ఎమ్మెల్యే వల్లభనేని వంశీ వంటి వైసీపీ నేతలతో ఎన్టీఆర్ ఇంకా సత్సంబంధాలు నిర్వహిస్తున్నారు. ఇది కూడా తెలంగాణ- ప్రధానంగా హైదరాబాద్ ప్రాంతంలో నివసించే కమ్మ వర్గానికి ఎన్టీఆర్‌పై ఉన్న ఆగ్రహానికి ప్రధాన కారణం.
ముఖ్యంగా ఇటీవల అసెంబ్లీలో వైసీపీ ఎమ్మెల్యేలు తన మేనత్త అయిన భువనేశ్వరిని, వైసీపీలోని తన అనుచరుడే దారుణంగా అవమానించినా ఎన్టీఆర్ స్పందించకపోవడాన్ని, తెలంగాణలోని కమ్మ వర్గం జీర్ణించుకోలేకపోయింది. ఆ అంశంపై కమ్మ వర్గానికి చెందిన సోషల్‌మీడియా గ్రూపులు, ఎన్టీఆర్ మౌనాన్ని తూర్పారపట్టడం ప్రస్తావనార్హం. సొంత అక్క సుహాసినీ కూకట్‌పల్లిలో పోటీ చేసినప్పుడు, ఎన్టీఆర్ ప్రచారానికి రాకపోగా, కనీసం మద్దతుగా ప్రకటన కూడా ఇవ్వకపోవడాన్ని కూడా కమ్మ వర్గం సహించలే కపోయింది. ప్రధానంగా టీడీపీ సోషల్‌మీడియా ఎన్టీఆర్‌కు.. చాలాకాలం నుంచి అసలు ప్రాధాన్యం ఇవ్వడం మానేయగా, దేశ విదేశాల్లోని టీడీపీ అభిమానులు.. ఎన్టీఆర్‌పై ట్రోలింగ్ చేసిన సందర్భాలు కూడా లేకపోలేదు.
ఇక ఏపీ రాజధాని అమరావతిని విశాఖకు తరలించే సీఎం జగన్ చేస్తున్న ప్రయత్నాలకు, కేంద్రంలోని బీజేపీ లోపాయికారీ మద్దతునిస్తోందన్న ఆగ్రహం-అసంతృప్తి ఆంధ్రా సెటిలర్లు, కమ్మవర్గంలో బలంగా నాటుకుపోయింది. బీజేపీ తలచుకుంటే, జగన్ మూడు రాజధానుల ప్రతిపాదనను ఆపలేరా? కేంద్రం మద్దతు లే కుండానే జగన్ అంత సాహసం చేస్తారా? అన్న ప్రశ్నలు హైదరాబాద్‌లో నివసించే సెటిలర్లలో చాలాకాలం నుంచే వినిస్తున్నాయి. అసలు బీజేపీ ఆశీస్సులతోనే జగన్ ఇప్పటివరకూ కోర్టుకు హాజరుకాకుండా మినహాయింపు తీసుకుంటున్నారని, ఏపీ వెనుకబాటుతనానికి జగన్ ఎంత కారణమో.. ఆయన పార్టీకి పరోక్ష సహకారం అందిస్తున్న బీజేపీ కూడా అంతే కారణమన్న అభిప్రాయం కమ్మ వర్గంలో లేకపోలేదు.
అమరావతి అంశంలో సెటిలర్లు-కమ్మ వర్గం అభిప్రాయం మారాలంటే, అది తమ పార్టీ చేతుల్లోనే ఉందని బీజేపీ నేతలు స్పష్టం చేస్తున్నారు. ‘మేం అమరావతికి మద్దతుగా ఉన్నామని సత్యకుమార్, కన్నా లక్ష్మీనారాయణ, సుజనా చౌదరి వంటి నేతలు బలంగా చెబుతున్నా ప్రజలు నమ్మడం లేదు. ఇటీవల మా పార్టీ జిల్లా నేతలు అమరావతికి మద్దతుగా పాదయాత్ర కూడా చేశారు. అయినా పెద్ద లాభం కనిపించలేదు. గతంలో సోము వీర్రాజు, విష్ణువర్దన్‌రెడ్డి వంటి నేతలు ఆ స్థాయిలో అమరావతికి వ్యతిరేకంగా చేసిన వ్యాఖ్యలే, ఇప్పుడు మా పార్టీని నమ్మకుండా చేశాయి. మోదీ-అమిత్‌షా స్థాయిలో అమరావతిపై స్పష్టత ఇచ్చేంతవరకూ హైదరాబాద్‌లోని సెటిలర్లు, కమ్మవారు మా పార్టీని నమ్మే పరిస్థితి లేదు. నిజానికి బీజేపీపై కమ్మవారికి గానీ, సెటిలర్లకు గానీ కోపమేమీ లేదు. అమరావతిని చంపేసిన జగన్‌కు బీజేపీ మద్దతునిస్తోందన్న ఆగ్రహమే తప్ప, బీజేపీపై ఎవరికీ వ్యతిరేకత ఉండాల్సిన పనిలేదు. ఎన్టీఆర్ వచ్చినా తెలంగాణలో కమ్మవారు పెద్దగా స్పందించరనుకుంటా. అమరావతిపై ఆ వర్గం వారి హృదయాలు ఆ స్థాయిలో దెబ్బతిన్నాయ’ని ఏపీకి చెందిన ఓ బీజేపీ నేత విశ్లేషించారు.
గత జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో దాదాపు ఇలాంటి అసంతృప్తి-ఆగ్రహంతోనే సెటిలర్లు- కమ్మవర్గం, టీఆర్‌ఎస్‌కు జైకొట్టిన విషయాన్ని రాజకీయ విశ్లేషకులు గుర్తు చేస్తున్నారు. ఆ ఎన్నికల్లో.. గ్రేటర్ పరిథిలో సెటిలర్లు ఉన్న డివిజన్లలో టీఆర్‌ఎస్ అభ్యర్ధులు విజయం సాధించగా, మిగిలిన ప్రాంతాల్లో బీజేపీ గెలిచింది. టీడీపీ పోటీ ఇవ్వకపోవడం కూడా, అప్పుడు టీఆర్‌ఎస్ వైపు కమ్మ వర్గం మళ్లేందుకు కలసివచ్చింది. కూకట్‌పల్లి, సనత్‌నగ ర్, శేరిలింగంపల్లి, ఉప్పల్, ఎల్బీనగర్, రాజేంద్రనగర్, జూబ్లీహిల్స్, ఖైరతాబాద్ వంటి నియోజకవర్గాల్లోని కమ్మ వర్గం.. ‘వైసీపీ-బీజేపీ అనుబంధం’పై ఆగ్రహంతోనే, టీఆర్‌ఎస్‌కు జైకొట్టిందన్నది బహిరంగ రహస్యమేనంటున్నారు. దాదాపు 12 నియోజకవర్గాల్లో కమ్మ-సెటిలర్ల ప్రభావం అధికంగా ఉంటుందన్న విషయం తెలిసిందే.
ఈ నేపథ్యంలో బీజేపీకి మద్దతుదారుగా ఎన్టీఆర్ రంగంలోగి దిగితే.. తెలంగాణలో సెటిలర్లు, ప్రధానంగా కమ్మ వర్గం ఆయనకు రాజకీయంగా దన్నుగా నిలుస్తుందా? అప్పుడు సెటిలర్లు-కమ్మ వర్గం దరికి రాకపోతే.. ఇంత కష్టపడి తీసుకువచ్చిన ఎన్టీఆర్ వల్ల, బీజేపీకి రాజకీయంగా ఉపయోగం ఏమిటన్న చర్చ తెరపైకి వచ్చింది.
ఇక ఎన్టీఆర్ అసలు ఇప్పుడు రాజకీయాల్లోకి వస్తారా? అన్నది మరో ఆసక్తికరమైన చర్చ. సినిమాల్లో బాగా బిజీగా ఉంటూ, ఆర్ధికంగా బలపడుతున్న సమయంలో ఎన్టీఆర్ రాజకీయాల్లోకి వచ్చే సాహసం చేయకపోవచ్చన్నది, సినీ ప్రముఖుల అభిప్రాయం. ఇప్పుడున్న తెలుగు హీరోలలో రాజకీయ పరిజ్ఞానంతోపాటు, చాలా తెలివిగా ఆలోచించేవారిలో ఎన్టీఆర్ ఒకరన్న పేరుంది. పైగా తన కట్టె ఉన్నంతవరకూ టీడీపీలోనే ఉంటానని గతంలో ఎన్టీఆర్ ప్రకటించారు. ఆ తర్వాత కూడా ఆయన మాట ఇచ్చినట్లు, ఎక్కడా టీడీపీ జెండా మోసిన దాఖలాలు లేవు.
అసలు స్వర్గీయ ఎన్టీఆర్ వారసుడిగా.. టీడీపీ సానుభూతిపరుడిగా కమ్మవర్గం మనసులో స్థిరపడిన ఎన్టీఆర్‌ను.. బీజేపీ సానుభూతిపరుడిగా చూసేందుకు ఆ వర్గం ఇష్టపడుతుందా? అన్నది మరో ప్రశ్న. ఒకవేళ జూనియర్ ఎన్టీఆర్ బీజేపీకి ప్రచారం వరకే పరిమితమయినప్పటికీ.. అందులోనయినా విజయం సాధిస్తారా అన్న చర్చ జరుగుతోంది.
ఎన్టీఆర్ చివరిసారి ఎన్నికల ప్రచారం చేసినప్పుడు.. ఆయన ప్రచారం చేసిన నియోజకవర్గాల కంటే, బాలకృష్ణ ప్రచారం చేసిన నియోజకవర్గాల్లోనే టీడీపీ ఎక్కువ స్థానాలు గెలవడం బట్టి.. జూనియర్ ఎన్టీఆర్ ప్రచార ప్రభావం, పెద్దగా ఫలించలేదని స్పష్టమవుతోందని రాజకీయ విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు.