Suryaa.co.in

Family

పొట్ట పూజోత్సవ పండగ ముక్కనుమ

“ఏకం సత్ విప్రా – బహుధా వదంతి” అనే వేదోక్తిని చాటి చెప్పే పొట్ట పూజోత్సవ మహా పండుగ మన “ముక్కనుమ”

ఋగ్వేదం లోని మొదటి అధ్యాయం, నూట అరవై నాలుగో సూక్తం, నలభై ఆరవ శ్లోకము అయిన – “ఏకం సత్ విప్రా – బహుధా వదంతి”… అంటే, ఏంటో…! దీని భావం, అర్థం, ప్రతిపదార్థం, తాత్పర్యార్థం ఏమిటో, మీకు, ఈ రోజు – ఇప్పుడు దీన్ని ఎందుకు చెబుతున్నానో, తెలియాలంటే మీరు ఒక్క ఐదు నిమిషాల సమయం కేటాయించి, చివరిదాకా దీన్ని చదివితే మీకే అర్థమవుతుంది…!

తెలుగు ప్రజలు, ఏటా నాలుగు రోజుల పాటు, నిరవధికంగా జరుపుకొనే సంక్రాంతి మహోత్సవాలకు “ఈ రోజు” అంటే నాల్గవరోజున జరిగే ఈ చివరాఖరి పొట్ట పూజా మహా పండుగ “ముక్కనుమ”తో ముగింపు…! ప్రధాన పండుగలైన భోగి, సంక్రాంతి, కనుమల తర్వాత, తెలుగు ప్రజలందరూ ఈరోజు చిట్ట చివరిదైన “ముక్కనుమ” పండుగతో ఆనవాయితీగా, ప్రతీ సంవత్సరం ఈ సంక్రాంతి ఉత్సవాలను ముగిస్తారు…! అందరికీ, ఇది తెలిసినదే అయినా, మళ్ళీ ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే ఒక చిన్న ‘వెజ్ అండ్ నాన్-వెజ్’ “డౌట్స్” క్లారిఫికేషన్ కోసం…!

ఒకప్పటి రోజుల్లో, సంక్రాంతి పండుగ మొదటి మూడు రోజులూ అంటే భోగి, సంక్రాంతి, కనుమ పండుగరోజుల్లో కేవలం శాఖాహారమే భుజించాలి అని ఒక నియమం ఉండేదట…! ఇది ఒక శాస్త్రీయమైన సాంప్రదాయం, మంచి ఆరోగ్యసూత్రం అని కూడా అంటారు…! ఈ ఉత్తరాయణ మకర సంక్రమణ శీతల కాలంలో, ప్రకృతిలో వచ్చే మార్పుల వలన మన సప్త ధాతువుల మిళితమైన మానవ శరీరంలో కూడా ఎన్నో మార్పులు చోటు చేసుకుంటాయంటారు.

ఇవి, మానవ శరీరానికి హాని చేయకుండా ఉండేందుకే, ఈ రోజుల్లో ప్రకృతి పరంగా లభించే అన్ని పండ్లూ ఇతరత్రా శాఖాహారం, ఎక్కువగా మినుములు, నెయ్యి, నువ్వులతో చేసే పిండి వంటకాలను తినాలని మన పెద్దలు చెబుతారు….!

మన పురాణాల్లో, శాస్త్రాల్లో లిఖితపూర్వకంగా ఎక్కడా రాసినట్లు లేకపోయినా, అసలు ‘ఇన్-రైటింగే’ కాని – ‘అలిఖిత’ వేదాల్లో కూడా ఎంతమాత్రం చెప్పకపోయినా, “ముక్కనుమ” పండుగ రోజున ఖచ్చితంగా ‘ముక్క’ తినాలి అని మన పెద్దలకు వాళ్ళ పెద్దలు, వాళ్ళకు వాళ్ల పెద్దలు చెప్పారట…! అదే, ఇప్పటికీ మన పెద్దలు కూడా, మనకు చెప్తున్నారు…!

అంతేకాకుండా… ముక్క + కనుమ = “ముక్కనుమ = ముక్క + కనుమ” అన్నారు మన పెద్దలు… అంటే, మాథ్స్/గణిత సూత్రాల లెక్కల ప్రకారం చూసినా + మన తెలుగు గ్రామర్/ వ్యాకరణం ప్రకారం చూసినా, ఇది ఒకరకంగా నిజమే అనిపిస్తుంది…! ఇంతవరకూ, లెక్క మొత్తంగా కరెక్టే అనిపిస్తోంది కదా…! కానీ, ‘ఇది’ మన తెలుగు వ్యాకరణ సూత్రాల ప్రకారం సవర్ణదీర్ఘ సంధా లేక అకార సంధా లేక గుణ సంధా లేక గసడదవాదేశ సంధా అనే చర్చను మనం వదిలేస్తే… ఖచ్చితంగా, వెజ్జో/నాన్-వెజ్జో ఏదో ఒక “ముక్క” అనేది అయితే మాత్రం, ఈ రోజున తినాలి అనేటిది ఖాయం…! అంతవరకూ, అందరికీ ఓకే…!

కానీ… దురదృష్టవశాత్తూ, అసలు సమస్య అంతా ఎక్కడొచ్చిందంటే, అది ఏ “ముక్క” అనేదే…! అది ప్యూర్ “నాన్-వెజిటేరియన్” ముక్కే అని పరమ ‘మాంసాహారులు’ మొదటినించీ వాదిస్తూ, చాలా నమ్మకంగా, ఘంటాపథంగా చెబుతున్నారు…! ‘కాదు… కానే కాదు’, అది ప్యూర్ “వెజిటేరియన్” ముక్కే అని ప్యూర్ వెజిటేరియన్ ‘శాఖాహారులు’ కూడా అంతే గట్టిగా, దీర్ఘాలు తీస్తూ, నొక్కి- నొక్కి మరీ, వక్కాణిస్తున్నారు…!

మొదట్లో, ముక్కనుమ ను కేవలం నాన్-వెజ్ పండుగగా భావించి, ఎక్కువగా మాంసాహార ప్రియులు మాత్రమే తాము ఇష్టపడే వివిధ మాంసాహార వంటకాలను వండుకుని కుటుంబ, బంధుమిత్రులతో కలిసి మెలసి తిని ఆనందించే వారట…! కానీ, అన్నిరంగాల్లో ప్యూర్ వెజిటేరియన్స్ విచ్చలవిడిగా, విజృంభిస్తున్న ఈ రోజుల్లో, ముక్కనుమ అందరిదీనూ, ఆ ముక్క మాదేనూ, అనేసి కొత్త కొత్త వాదాలు, సంవాదాలు, డిమాండ్లు పుట్టుకొస్తున్నాయి…!

ఇందుమూలంగా, సర్వజనులకూ అంటే కుల, మత, వర్గ, ప్రాంతీయ, రాజకీయాలకు అతీతంగా అన్ని లెక్కలు, ఎక్కాలు కలిపి, తెలుగు ప్రజలైన – సర్వ పచ్చివెజ్ జనులకూ + ప్యూర్ నాన్-వెజ్ జనులకూ, దయచేసి, అందరికీ కూడా కలిపి, కలగలిపి చేసే నా విన్నపం ఏమిటంటే – “అయ్యా + అమ్మా, తెలుగువారికి ఏ “ముక్క” అయితే ఏమిటండీ…! దయచేసి, ఎవరికి నచ్చిన “ముక్క”లను వాళ్లు కోసుకుని, వండుకొని, కొరుక్కొని కడుపునిండా-ఆనందంగా, తిని ఈ “ముక్కనుమ” అనే పొట్ట పూజా మహోత్సవ మహాపండుగను విజయవంతం చేయవలసిందిగా నా విజ్ఞప్తి…

అంటే, “నాన్-వెజ్” బ్యాచ్ అంతా చికెన్ ముక్కో, మటన్ ముక్కో, చేప ముక్కో, రొయ్య ముక్కో, పీత ముక్కో… ఎక్స్ఎట్రా…, “వెజ్” బ్యాచ్ అంతా బెండకాయ ముక్కో, బీరకాయ ముక్కో, వంకాయ ముక్కో, సొరకాయ ముక్కో, గుమ్మడికాయ ముక్కో… కనీసం గారి ముక్కో, బూరె ముక్కో… ఎక్స్ఎట్రా… ఏదో ఒక ముక్కతో అందరూ కలిసి-మెలిసి విందు భోజనం ఆరగించండి…! ముక్కనుమ పండుగను విజయవంతం చేయండి…!

మన “ముక్కనుమ” పొట్ట పూజా పండుగను ఎంజాయ్ చేయడానికి ఈ ముక్కలే కానక్కర్లేదు…! ఉదయం టిఫిన్లో ఇడ్లీ ముక్కో, మినపట్టు ముక్కో, పెసరట్టు ముక్కో, పూరీ ముక్కో, ఉతప్పం ముక్కో ఏదో ఒకటి, డెసర్ట్ గా ఏ జున్ను ముక్కతో గానీ, స్వీట్ ముక్కతో గానీ, కనీసం మీకు నచ్చిన జాంపండు ముక్కో, అరటిపండు ముక్కో, ఆపిల్ పండు ముక్కో, పైనాపిల్ పండు ముక్కో, ఆఖరికి ఏదైనా డ్రై ఫ్రూట్ ఖర్జూరం పండు ముక్కో, ఏదో ఒక పండ్ల ముక్కలతో లేదంటే, కనీసం ఆవకాయ లాంటి ఏదైనా పచ్చడిముక్కతో అయినా అందరూ కలిపి ఆనందంగా మీ భోజనం ఈ రోజు యధాశక్తిగా, ఏదో ఒక ముక్కతో ఈ ముక్కనుమ అనే పండుగను, మీ పొట్ట పూజతో, దిగ్విజయవంతం చేయాలి…!

మీకు, మొదట్లో చెప్పిన ఋగ్వేదం లోని మొదటి అధ్యాయం, నూట అరవై నాలుగో సూక్తం, నలభై ఆరవ శ్లోకము అయిన “ఏకం సత్ విప్రా – బహుధా వదంతి” అంటే అర్ధం కూడా ఇంచుమించు ఇదే…! “సత్యం అనేది ఒక్కటే, అనేక రీతులుగా పిలువబడుతుంది” అని…! ఈ ముక్క అనేది ఒక్కటే అయినా, అనేక రుచులతో, వేర్వేరుగా పిలువ బడుతుంది అనేది దీని అర్థం.

ఈ సత్యం మనకు బోధపడితేనే అంతా ఒక్కటే అనీ, రుచులు వేరైనా, సారం ఒక్కటే అనీ, సర్వ “ముక్కలూ” సమానమే అనేది మనకు అవగతమవుతుంది…! ఎందుకంటే అందులో, అన్నింటిలో ఉన్నది అంతరార్థం ఒక్కటే….! ఒక్కో ముక్కకూ, మనం ఒక్కో పేరు పెట్టుకున్నాము… కానీ, ఉన్నది కేవలము ఒకటే సత్యము…!

ఇదే, అద్వైతం…! ఇదే, అరుణాచల రమణ మహర్షి తత్వము…! ఇదే, జిడ్డు కృష్ణ మూర్తి సందేశము…! ఇదే, ఎందరో మహర్షులు కనుగొన్న మహోన్నతమైన గొప్ప జీవిత సత్యం…!

చివరిగా, “లిక్కర్” తాగడం విషయంలో మాత్రం, ఒక్క ఆల్కహాల్ విషయంలో వెజ్, నాన్ వెజ్ లకు అతీతంగా సర్వసమైక్య సోదర – జాతీయ సమైక్యత భావం పాటించే మన వీర ‘మందు’ బాబులు ఈ ముక్కల్ని, ఆల్కహాల్ కు మాత్రం మంచింగ్ గా వాడుకోవద్దని, తద్వారా లివర్ ను కాపాడుకోమనీ, మనుషుల్ని మత్తుతో చంపే “లిక్కర్”ను మానేయమని విజ్ఞప్తి చేస్తూ, వీరే కాకుండా, వారి జీవితాలకు వారు ఆక్టివ్ గా పొగ పెట్టుకోవడమే కాకుండా, పక్కవారి- తోటివారి జీవితాలకు కూడా పాసివ్ గా, పొగ పెడుతూ, అందర్నీ మెల్లగా చంపుతున్న మన వీర ‘పొగ’ స్మోకింగ్ బాబులు కూడా సిగరెట్లను దూరంపెట్టాలని కోరుకొంటూ..

అందరికీ “ముక్కనుమ” పండుగ శుభాకాంక్షలతోపాటు, ఈ సంవత్సరం సంక్రాంతి పండుగ ఉత్సవాలకు బై… బైబై… గుడ్ బై… వీడ్కోలు పలుకుతూ..
సర్వేజనా సుఖినోభవంతు…

– పెన్మెత్స రవిప్రకాష్ అశోకవర్మ
శృంగవృక్షం గ్రామం
Near భీమవరం,
పాలకోడేరు మండలం,
పశ్చిమగోదావరి జిల్లా
ఆంధ్రప్రదేశ్ – 534243.

LEAVE A RESPONSE