-
పోర్టు వాటాల వ్యవహారాన్ని డీల్ చేసింది విక్రాంత్ రెడ్డే
-
కేవీ రావు రాజకీయ బ్రోకర్
-
కేవీ రావుకు, వైవీ సుబ్బారెడ్డికి సాన్నిహిత్యం
-
సమయం వచ్చినప్పుడు అన్ని విషయాలు చెబుతా
-
జగన్ కోటరీ వల్లే వెళ్లిపోయా
-
చెప్పుడు మాటలు విని తప్పుడు దారి పట్టవద్దని చెప్పా
-
విరిగిన మనసు అతకదు
-
అందుకే వైసీపీ నుంచి వెళ్లిపోయా
-
ఘర్ వాపసీ నా మనసులో లేదు
-
వైసీపీ మాజీ ఎంపీ వేణుంబాక విజయసాయిరెడ్డి సంచలన వ్యాఖ్యలు
అమరావతి: లిక్కర్ స్కామ్ లో కర్త, కర్మ, క్రియ కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి అలియాస్ రాజ్ కసిరెడ్డి. కాకినాడ పోర్టు వాటాల బదిలీ వ్యవహారంలో కర్త, కర్మ, క్రియ అన్నీ వైసీపీ రాజ్యసభ సభ్యుడు వైవీ సుబ్బారెడ్డి కుమారుడు విక్రాంత్ రెడ్డేనని మాజీ రాజ్యసభ సభ్యుడు వేణుంబాక విజయసాయిరెడ్డి మీడియాకు వెల్లడించారు.
కేవీ రావు ఫిర్యాదు మేరకు విక్రాంత్ రెడ్డి, విజయసాయిరెడ్డి, శరత్ చంద్రారెడ్డి, శ్రీధర్, అరబిందో రియాల్టీ ఇన్ఫ్రాపై కేసు నమోదైన సంగతి తెలిసిందే. విచారణకు హాజరుకావాలంటూ సోమవారం ఆయనకు సీఐడీ నోటీసులు జారీ చేశారు. ఈ మేరకు మాజీ ఎంపీ విచారణకు హాజరయ్యారు.
ఈ సందర్భంగా విజయసాయిరెడ్డి మాట్లాడుతూ, “కేవీ రావు ఫిర్యాదులో పేర్కొన్న అంశాల ఆధారంగా సీఐడీ అధికారులు ప్రశ్నించారు. మెుదటగా కేవీ రావు మీకు తెలుసా అంటూ ప్రశ్నించారు. ముఖ పరిచయం, అలాగే ఏదైనా సోషల్ ఫంక్షన్లలో నమస్కారం అంటే నమస్కారం అని చెప్పడం తప్ప అతనికి, నాకూ ఏ విధమైన సామాజిక, ఆర్థిక, రాజకీయ సంబంధాలు లేవని చెప్పా.
కాకినాడ పోర్టు వ్యవహారంలో సూత్రధారులు, పాత్రధారులు ఉన్నారని, ఈ వ్యవహారంలో కీలక వ్యక్తి విక్రాంత్ రెడ్డి అని చెప్పారు. కేవీ రావుకు, వైవీ సుబ్బారెడ్డికి మంచి సాన్నిహిత్యం ఉందని.. వైవీ సుబ్బారెడ్డి అమెరికాకు ఎప్పుడు వెళ్లినా కాలిఫోర్నియాలో కేవీ రావుకు చెందిన ఒక రాజభవనంలో ఉండేవారని చెప్పారు.
ఆది నుంచి అంతం వరకు పోర్టు వాటాల వ్యవహారాన్ని డీల్ చేసింది విక్రాంత్ రెడ్డే అని, కామన్ ఫ్రెండ్స్ తో కేవీ రావు చెప్పారని.. ఈ వ్యవహారం గురించి తనకు పూర్తి అవగాహన ఉందని, సమయం వచ్చినప్పుడు అన్ని విషయాలు చెబుతానని అన్నారు.
అరబిందో సంస్థ నుంచి కేవీ రావుకు దాదాపు రూ.500 కోట్లు బదిలీ అయిన విషయంపై ప్రశ్నించారు. ఆ విషయం నాకు సంబంధం లేదని, అసలు నిధులు బదిలీ అయిన సంగతి కూడా తెలియదని వివరించా. అరబిందో వ్యాపార విషయాల్లో నేనెప్పుడూ జోక్యం చేసుకోలేదని స్పష్టం చేశా. నా కుమార్తెను వారికివ్వడం తప్ప, అరబిందో సంస్థతో నాకు ఆర్థిక సంబంధాలు లేవు.
విక్రాంత్ రెడ్డి గురించి అడిగితే సుబ్బారెడ్డి కుమారుడిగా తెలుసని చెప్పా. రూ.500 కోట్ల లావాదేవీలకు సంబంధించి విక్రాంత్ రెడ్డే చేశారని, చాలా మంది సాక్షులు చెప్పినట్లు సీఐడీ అధికారులు అడిగారు. జగన్ మోహన్ రెడ్డి కాపాడేందుకే మీరు, విక్రాంత్ రెడ్డి కలిసే నగదు బదిలీ చేశారా? అని ప్రశ్నించారు. ఈ డీల్ విషయం జగన్‍కు తెలియదని చెప్పా. అలాగే నాకూ ఎలాంటి సంబంధం లేదని సీఐడీ అధికారులకు మరోసారి స్పష్టం చేశా.
నన్ను ఉద్దేశపూర్వకంగానే ఒక అధికారి ఈ కేసులో ఇరికించారు. గతంలో ఏ-2గా ఉన్నా కాబట్టి ఈ కేసులోనూ ఏ-2గా చేర్చారు. కేవీ రావు ఆప్త మిత్రులతో మాట్లాడితే నా పేరు ఇరికించినట్లు చెప్పారు.
రాజకీయ బ్రోకర్ కేవీ రావు. అతనంటే నాకు అసహ్యం. జగన్ మోహన్ రెడ్డికి నాకూ మధ్య ద్వితీయశ్రేణి నాయకులు గ్యాప్ తెచ్చారు. దీంతో నా మనసు విరిగిపోయింది. అందుకే వైసీపీ నుంచి బయటకు వచ్చా. విరిగిన మనసు అతకదు. అందుకే వైసీపీ నుంచి వెళ్లిపోయా. ఘర్ వాపసీ నా మనసులో లేదు. తిరిగి వైసీపీలో చేరే ఉద్దేశం లేదని” చెప్పారు.
జగన్ మోహన్ రెడ్డి చుట్టూ కోటరీ ఉందని, ఆ కోటరీ వల్లే తాను వెళ్లిపోయానని అన్నారు. నాయకుడు అనే వాడు చెప్పుడు మాటల్ని నమ్మకూడదన్నారు. అలా నమ్మడం వల్ల పార్టీ నష్టపోతుంది. నాయకుడు నష్టపోతారన్నారు. తనను జగన్ పార్టీలో కొనసాగాలని కోరారనన్నారు.
అయితే అప్పుడే తాను నేరుగా చెప్పానన్నారు. మీ చుట్టూ ఉండేవారి చెప్పుడు మాటలు విని తప్పుడు దారి పట్టవద్దని చెప్పా. ఎవరు నిజాలు చెబుతున్నారో ,ఎవరు అబద్దాలు చెబుతున్నారో తెలుసుకోవాలన్నారు. మీ చుట్టూ ఉన్న వారి ఉన్న మాటలు వినవద్దు అని ఫోన్‌లో స్పష్టంగా చెప్పానన్నారు.
తాను వ్యవసాయం చేసుకుంటున్నానని చెప్పారు. గతంలో నాయకుడిపై భక్తి ఉండేది. ఇప్పుడు దేవుడిపై భక్తి ఉందని అన్నారు. తాను ప్రలోభాలకు లొంగిపోయానని జగన్ అన్నారు. తాను ప్రలోభాలకు లొంగలేదని, భవిష్యత్తులో తనపై విమర్శలు, ఆరోపణలు చేసినా తాను పట్టించుకోనని విజయసాయిరెడ్డి అన్నారు.