బారికేడ్ల అవతల కార్యకర్తలు బందీ
( మార్తి సుబ్రహ్మణ్యం)
జగన్ భాషలో చెప్పాలంటే.. వైసీపీ స్థాపించి ‘పదహైదేళ్లు’ పూర్తయిన సందర్భంగా.. ఈ ‘సంవచ్చరం’ అధినేత జగనన్న తాడేపల్లిలో పార్టీ పతకాన్ని ఎగురవేశారు. కానీ అక్కడ గత వైభవం భూతద్దం వేసినా కనిపించలేదు. గతేడాది చక్రం తిప్పిన పెద్దతలకాయలెవరూ లేరు. ఒక విజయసాయిరెడ్డి.. ఇంకో మోపిదేవి రమణ.. మరో మస్తాన్‌రావు.. ఇంకో కృష్ణయ్య.. మరో ఆళ్ల నాని.. ఒక వాసిరెడ్డి పద్మ లాంటి వాళ్లెవరూ లేరు. వారి స్థానంలో ఒక పార్వతి. ఇంకో కల్యాణి. అంతే! ఉన్న పెద్ద లీడర్లు కూడా పెద్దగా వచ్చినట్లు కనిపించలేదు. దానికి కారణం జిల్లాల్లో జరిగిన యువతపోరు కార్యక్రమం కావచ్చు. సరే.. అధికారంలో ఉంటే వచ్చి వాలిపోవడం, కూలిపోతే పక్క పార్టీల్లోకి రాలిపోవడం రాజకీయాల్లో సహజమే.
కానీ .. పార్టీ కార్యకర్తలు సగర్వంగా ఎగరవేసే పార్టీ జెండా కూడా అడ్డం తిరగడమే విచిత్రం. తలకిందులైన పార్టీ జెండాను కూడా సరిచేసుకోకుండా, జగన్ కోటరీ జగనన్నతో జెండాను ఎగురవేయించడమే వింత. పాపం ఇవేమీ తెలియని జగనన్న.. అమాయకంగా వచ్చి జెండా ఎగరవేసి, జాతినుద్దేశించి ప్రసంగించి వెళ్లిపోయారు. ఈ వింత అక్కడితో ఆగిపోతే సరిపోయేది. కానీ జెండాకు కొద్దిదూరంలోనే మరో పాత వింత కొత్తగా దర్శనమిచ్చింది.
జగనన్న సీఎంగా ఉండగా, ఆయన ఎక్కడికి వెళ్లినా పరదాలు కట్టేవాళ్లు. చెట్లు నరికేవాళ్లు. ఇప్పుడు పార్టీ ఆవిర్భావ సందర్భంగా కూడా జగనన్న వద్దకు కార్తకర్తలను రానీయకుండా, అడ్డంగా బారికేడ్లు పెట్టిన ఫొటోలు సోషల్‌మీడియాలో దర్శనమిచ్చాయి. ‘‘పార్టీ జెండా మాదిరిగానే వైసీపీ తలరాత అడ్డం తిరుగుతోంది. జగనన్న ప్రవేశపెట్టిన రివర్స్ టెండరింగ్ మాదిరిగానే, ఈ రివర్స్ జెండా కట్టి జగనన్న కళ్లలో ఆనందం చూడాలని బహుశా జగనన్న కోటరీ ముచ్చటపడి ఈ ఏర్పాటుచేసినట్లుంది’ అని, సోషల్‌మీడియాలో తమ్ముళ్లు తెగ ట్రోల్ చేస్తున్నారు. అయినా.. ఇయ్యన్నీ చూసుకోబళ్లా అబ్బాయా?!