Suryaa.co.in

Editorial

వీళ్లంతా పోరగాళ్లంట..హ్హి హ్హి హ్హి!

వైసీపీ యువతపోరుపై సోషల్‌మీడియాలో పేలుతున్న సెటైర్లు

( మార్తి సుబ్రహ్మణ్యం)

కూటమి సర్కారుపై వైసీపీ సమరశంఖం పూరించింది. బాగుంది. అసలు వైసీపీ ఇప్పుడే కాదు. కొత్త సర్కారు వచ్చిన మూడు నెలల నుంచి రోడ్డెక్కింది. జగనన్న అయితే ‘‘మళ్లీ నేనే సీఎం. మీ సంగతి తేలుస్తా. అందరి లెక్కలూ రాస్తున్నాం. రిటైరయి సప్త సముద్రాల అవతల దాక్కున్నా వెంటాడి తీసుకువచ్చి శిక్షిస్తా’’నని, అప్పట్లో తిరుపతి ఎస్పీ సుబ్బారాయుడికి వార్నింగ్ ఇచ్చారు. తర్వాత కూటమి సర్కారు కూడా.. జగన్ వచ్చేదాకా సుబ్బారాయుడి సంగతి తేల్చే అవకాశం వైసీపీకి ఎందుకివ్వాలి? ఆ పనేదో మేమే చేస్తామని.. తిరుపతి ఘటనలో జగన్ బెదిరించిన అదే సుబ్బారాయుడిపై బదిలీ వేటు వేసిందనుకోండి. అది వేరే విషయం. ఇక పులివెందుల డిఎస్పీపైనా జగనన్న అగ్గిరాముడయ్యారు.

అటు వైకాపేయులు కూడా జల్లాల్లో అధికారులను బెదిరించి బతికేస్తున్నారు. సీన్ కట్ చేస్తే.. జగనన్న జమానాలో మూడేళ్ల వరకూ టీడీపీ నేతలు రోడ్డెక్కేందుకే ఫ్యాంట్లు తడిపేసుకున్నారు. ఎక్కడ కేసులు పెడతారోనని ఇళ్లలోనో, పక్క రాష్ట్రంలోనో తొంగున్నారు. అప్పటివరకూ జగన్ సర్కారుపై నిర్భయంగా యుద్ధం చేసింది సోషల్‌మీడియా సైనికులు.. రఘురామకృష్ణంరాజు, అయ్యన్నపాత్రుడు, సోమిరెడ్డి, దేవినేని ఉమ, కొల్లు రవీంద్ర, అచ్చెన్నాయుడు, యరపతినేని శ్రీనివాసరావు, ధూళిపాళ్ల నరేంద్ర, పట్టాభి, బుద్దా వెంకన్న, మహాసేన రాజేష్ వంటి కొద్దిమంది మాత్రమే జగన్ సర్కారుకు ఎదురొడ్డి పోరాడారు.చంద్రయ్య లాంటి కరుడుగట్టిన కార్యకర్తలు, వైసీపీ బెదిరింపులకు లొంగకుండా గొంతుకోసుకుని తనువు చాలించారు.

వీరిలో రఘురామకృష్ణంరాజు చావు అంచులదాకా వెళ్లి రాగా, మరికొందరు జైలుపాలయ్యారు. పార్టీ ఆఫీసుపై వైకాపేయులు దాడి చేసిన తర్వాతనే టీడీపీ నేతల్లో చలనం, చైతన్యం వచ్చింది. అప్పటివరకూ చాలామంది పెద్ద నేతలంతా కలుగుల్లో దాక్కున్నవాళ్లే. కానీ జగన్ పార్టీ నేతలు మాత్రం మూడు నెలలకే రోడ్డెక్కి, పోలీసులను బెదిరించే ధైర్యం వచ్చేయడమే ఆశ్చర్యం. మీరు మా వెంట్రుక కూడా పీకలేరని తొడకొట్టడం మరో వింత. ఇది పాలకుల బలహీనతా? లేక జగన్ బలమా అన్నది మరో చర్చ.

ఇప్పుడు మళ్లీ వైసీపీ నిర్వహించిన యువత పోరులోకి వెళితే.. జగనన్న పిలుపు మేరకు రాష్ట్రవ్యాప్తంగా యువత పోరు జరిగింది. దీనికి భారీ సంఖ్యలోనే జన సమీకరణ జరిగింది. పోలీసులను కూడా లెక్కచేయకుండా, వారిని బె దిరించి మరీ బారికేడ్లు తోసుకుని ముందుకు వెళ్లారు. ఆ రకంగా కార్యక్రమం సక్సెస్ అయింది. విద్యార్ధులకు చెల్లించాల్సిన ఫీజు రీ ఇంబర్స్‌మెంట్ విడుదల చేయాలని, కూటమి హామీ ప్రకారం నిరుద్యోగులకు ఉద్యోగాలు, నిరుద్యోగ భృతి చెల్లించాలన్న యువతరానికి సంబంధించిన డిమాండ్లతో వైసీపీ రాష్ట్రవ్యాప్త ఆందోళన నిర్వహించింది. అంతవరకూ బాగానే ఉంది.

మరి ఆ ప్రకారం యువత కోసం.. నిరుద్యోగుల కోసం నిర్వహించిన ఆందోళనకు సహజంగా యువకులు, విద్యార్ధులు, నిరుద్యోగులే హాజరవాలి. ఎస్‌ఎఫ్‌ఐ, ఏఎస్‌ఎఫ్, పిడిఎస్‌యు, ఏబీవీపీ, టీఎన్‌ఎస్‌ఎఫ్, ఎన్‌ఎస్‌యుఐ వంటి విద్యార్ధి సంఘాలు నిర్వహించే ర్యాలీలు, ఆందోళనకు అచ్చం విద్యార్ధులు, యువతే హాజరవుతారు. కానీ వైసీపీ నిర్వహించిన యువత పోరులో మాత్రం తండ్రులు, తాతయ్యలు, బాబాయిల వయసున్న వాళ్లు కూడా పాల్గొనడంతో అసలు లక్ష్యం దెబ్బతిని, వైసీపీ పరువుపోయేందుకు కారణమయింది.

వృద్ధులు కూడా పాల్గొన్న ఈ యువతపోరు దృశ్యాలు, సొషల్‌మీడియాలో తెగ హల్‌చల్ చేస్తున్నాయి. ‘‘వీళ్లు యూత్తేంట్రా బాబూ.. అసలు ఒకవైపు పరీక్షలు జరుగుతుంటే ఈ విన్యాసాలేంటి? పోనీ జనాలను తెచ్చారు. ఆ తెచ్చేదోదే ఇంకో వంద రూపాయలు ఎక్స్‌ట్రా ఇచ్చి కుర్రాళ్లనే తీసుకురావచ్చు కదా?..కొంచెం కిడ్నీలు వాడండ్రా బాబూ.. కొద్దిగా మీ జగనన్నకు చెప్పండ్రా.. అతన్నలా వదిలేయకండ్రా.. ఎక్కడన్నా చూపించండి. ఇకనయినా మారమని చెప్పండ్రా’’.. అంటూ జగనన్న బొమ్మేసి తెగ ఆటపట్టిస్తున్నారు. నిజమే కదా? అబద్ధం కూడా అతికినట్లుండాలి కదా మరి?

LEAVE A RESPONSE