Suryaa.co.in

Telangana

కేంద్రంపై యుద్ధానికి శ్రీకారం..

– అంతం కాదిది ఆరంభం మాత్ర‌మే..
– సీఎం కేసీఆర్
తెలంగాణ రైతుల ప్ర‌యోజ‌నాల‌ను ప‌రిర‌క్షించేందుకు టీఆర్ఎస్ పార్టీ చేప‌ట్టిన రైతుల మ‌హాధ‌ర్నాకు సంఘీభావంగా విచ్చేసిన పార్టీ ప్ర‌జాప్ర‌తినిధులంద‌రికీ సీఎం కేసీఆర్ స్వాగ‌తం తెలిపారు. ఇందిరా పార్కు వ‌ద్ద చేప‌ట్టిన రైతు మ‌హాధ‌ర్నాలో సీఎం కేసీఆర్ పాల్గొని ప్ర‌సంగించారు.
ధ‌ర్మంగా, న్యాయంగా వ్య‌వ‌సాయం చేసి దేశానికి అన్నం పెట్టే స్థాయికి తెలంగాణ ఎదిగింది. కేంద్రం విధానాల వ‌ల్ల మ‌న రైతాంగం దెబ్బ‌తినే అవ‌కాశం ఉంది. నేటి కేంద్ర ప్ర‌భుత్వం రైతాంగం, వ్య‌వ‌సాయం ప‌ట్ల‌ విముఖ‌త‌ను క‌లిగి ఉన్న‌ది. కేంద్ర వైఖ‌రి మార్చుకోవాల‌ని, రైతు నిరంకుశ చ‌ట్టాల‌ను విర‌మించుకోవాల‌ని, క‌రెంటు బ‌కాయిల మీట‌ర్లు పెట్టే విధానాన్ని మార్చుకోవాల‌ని అనేక‌సార్లు చెప్పాం.

కానీ కేంద్రం నుంచి స్పంద‌న లేదు. ఈ నేప‌థ్యంలోనే కేంద్రంపై యుద్ధానికి శ్రీకారం చుట్టాం. ఈ యుద్ధం ఈరోజుతో ఆగిపోదు. ఇది ఆరంభం మాత్ర‌మే.అంతం కాదు. మ‌న హ‌క్కులు సాధించే వ‌ర‌కు, రైతుల ప్ర‌యోజ‌నాలు ప‌రిర‌క్షించ‌బ‌డే వ‌ర‌కు, ఉత్త‌ర భార‌త‌దేశంలోని రైతుల పోరాట‌ల‌ను క‌లుపుకొని భ‌విష్య‌త్‌లో ఉధృతం చేయాల్సి ఉంటుంది.

వ్య‌వ‌సాయ రంగాన్ని బ‌లోపేతం చేస్తున్నాం. కేంద్రానికి మ‌న రైతుల గోస‌ల‌ను, బాధ‌లను విన్న‌వించాం. పంజాబ్‌లో ధాన్యం కొనుగోలు చేసిన‌ట్టే తెలంగాణ‌లో ధాన్యం కొనుగోలు చేయాల‌ని కేంద్రానికి చేతులెత్తి దండం పెట్టాం. కానీ కేంద్రం నుంచి స్పంద‌న లేదు. నిన్న స్వ‌యంగా ప్ర‌ధాని మోదీకి లేఖ రాశాను. కానీ ఉలుకు ప‌లుకు లేదు. మ‌న బాధ ప్ర‌పంచానికి, దేశానికి తెలియాల‌ని చెప్పి ఈ ధ‌ర్నాకు శ్రీకారం చుట్టామ‌న్నారు. తెలంగాణ గ్రామాల్లో కూడా వివిధ రూపాల్లో పోరాటాల‌ను ఎంచుకుంటాం. ముందుకు కొన‌సాగుతూనే ఉంటాం. కేంద్రం దిగివ‌చ్చి మ‌న రైతాంగానికి న్యాయం చేసే వ‌ర‌కు పోరాటం కొన‌సాగుతూనే ఉంది. ఈ ఉద్య‌మాన్ని ఉప్పెనలా కొన‌సాగిస్తామ‌ని సీఎం కేసీఆర్ అన్నారు.

LEAVE A RESPONSE