Suryaa.co.in

Telangana

ఘనంగా తెలంగాణ భవన్ లో కేసీఆర్ జన్మదిన వేడుక

– మాజీమంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్

బీఆర్‌ఎస్ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు, తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదిన వేడుకను ఈనెల 17 వ తేదీన బీఆర్‌ఎస్ పార్టీ రాష్ట్ర కార్యాలయం తెలంగాణ భవన్ లో అత్యంత ఘనంగా నిర్వహించనున్నట్లు మాజీమంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు.

గురువారం ఆయన తెలంగాణ భవన్ లో సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ బీఆర్‌ఎస్ పార్టీ ఇంచార్జి తలసాని సాయి కిరణ్ యాదవ్, మాజీ MLC శ్రీనివాస్ రెడ్డి, సీనియర్ నాయకులు రావుల చంద్రశేఖర్ రెడ్డి, BRSV అద్యక్షులు గెల్లు శ్రీనివాస్ యాదవ్, మాజీ వికలాంగుల కార్పొరేషన్ చైర్మన్ వాసుదేవ రెడ్డి, మాజీ ఫైనాన్స్ కమిషన్ సభ్యులు శ్రీనివాస్ యాదవ్ లతో కలిసి ప్రెస్ మీట్ లో మాట్లాడారు.

ప్రతి సంవత్సరం కేసీఆర్ జన్మదిన వేడుకలను ఎంతో ఘనంగా నిర్వహిస్తూ వస్తున్న విషయాన్ని ఈ సందర్బంగా గుర్తు చేశారు. ఈ నెల 17 వ తేదీన బీఆర్‌ఎస్ పార్టీ కార్యాలయంలో నిర్వహించే 70 వ జన్మదిన వేడుకలు ఉదయం 10 గంటలకు ప్రారంభం అవుతాయని, రాజ్యసభ సభ్యులు కేశవరావు, మాజీ మంత్రులు కేటీఆర్, హరీష్ రావు, పోచారం శ్రీనివాస్ రెడ్డి, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, ఎంపీ, పార్టీ కి చెందిన ఇతర ప్రజాప్రతినిధులు, మాజీ ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొంటారని తెలిపారు.

ప్రతి సంవత్సరం కేసీఆర్ , కేటీఆర్ జన్మదిన వేడుకలను పండుగ వాతావరణంలో నిర్వహించుకుంటున్న విషయాన్ని సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ ఇంచార్జి తలసాని సాయి కిరణ్ యాదవ్ తెలిపారు. ఈ నెల 17 వ తేదీన కేసీఆర్ జన్మదినం సందర్బంగా పలు ఆలయాలు, మసీదులు, చర్చిలలో ప్రత్యేక పూజలు, ప్రార్ధనలు జరిపేలా ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. అదేవిధంగా వెయ్యి మంది ఆటో డ్రైవర్లకు లక్ష రూపాయల కవరేజీ వచ్చే విధంగా మొత్తం 10 కోట్ల రూపాయల విలువైన ప్రమాద, ఆరోగ్య భీమా పత్రాల పంపిణీ, వికలాంగులకు వీల్ ఛైర్స్ పంపిణీ, హాస్పిటల్స్ లలో పేషేంట్స్ కు పండ్ల పంపిణీ వంటి సామాజిక సేవా కార్యక్రమాలను కూడా నిర్వహిస్తున్నట్లు తెలిపారు.

తెలంగాణ ప్రత్యేక సాధన ఉద్యమానికి సారధిగా ఉండి పోరాడి సాధించుకున్న తెలంగాణ ను బంగారు తెలంగాణ గా తీర్చి దిద్దిన కేసీఆర్ రాజకీయ ప్రస్థానం, ఉద్యమ నేపథ్యంతో ౩౦ నిమిషాల వ్యవధితో కూడిన తానే ఒక చరిత్ర పేరుతో రూపొందించిన ప్రత్యేక డాక్యుమెంటరీ ని ఈ వేడుకల సందర్బంగా ప్రదర్శించడం జరుగుతుందని అన్నారు. 69 సంవత్సరాలు పూర్తి చేసుకొని 70 సంవత్సరంలోకి అడుగు పెడుతున్న సందర్బంగా ప్రత్యేకంగా తయారు చేయించిన 70 కిలోల భారీ కేక్ ను వేడుకలలో పాల్గొన్న ప్రముఖుల సమక్షంలో కట్ చేయడం జరుగుతుందని చెప్పారు. వేడుకల అనంతరం భోజన కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు.

LEAVE A RESPONSE