Suryaa.co.in

Telangana

కేసీఆర్.. స్థానికతను పరిగణనలోకి తీసుకోరా?

– సీఎంకు కాంగ్రెస్ చీఫ్ రేవంత్ లేఖ

టీచర్ల బదిలీపై తెలంగాణ సర్కారు అనుసరిస్తోన్న అసంబద్ధ వైఖరిని టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి తప్పుపట్టారు. ప్రభుత్వ వైఖరి వల్ల స్థానికత అంశానికి విలువలేకుండా పోతోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఎంపీ రేవంత్ లేఖ పూర్తి పాఠమిది

ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుకు బహిరంగ లేఖ
విషయం : ఉద్యోగులు, ఉపాధ్యాయుల పోస్టింగ్ లలో స్థానికతను పరిగణనలోకి తీసుకోకపోవడం గురించి
తెలంగాణ ఉద్యమానికే స్ఫూర్తినిచ్చిన నినాదం..నీళ్లు, నిధులు, నియమాకాలు. ముఖ్యంగా నియామకాల్లో స్థానికత ఆధారంగా జరుగుతున్న అన్యాయానికి ముగింపు పలకాలంటే ప్రత్యేక రాష్ట్రమే శరణ్యం అనే ఉద్దేశంతో ఉద్యోగులు, ఉపాధ్యాయులు తెలంగాణ ఉద్యమంలో క్రీయాశీలక పాత్ర పోషించారు. కేసులకు వెరవకుండా తెలంగాణ కోసం ఉద్యమించారు.

ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన బదిలీలు ఉద్యోగులు, ఉపాధ్యాయులను మనో వేదనకు గురి చేస్తున్నాయి. ఇందుకోసం ప్రభుత్వం అనుసరిస్తున్న విధానంతో వారి సొంత జిల్లాలోనే ఉద్యోగులు, ఉపాధ్యాయులు స్థానికేతరులుగా మారే ప్రమాదం ఏర్పడింది. ఏ అన్యాయం జరుగుతుందని రాష్ట్రం కోసం ఉద్యమించారే..ఆవే పరిస్థితులు తెలంగాణలో పునరావృత్తం కావడం దారుణం. సాధించుకున్న తెలంగాణకు అర్ధం లేకుండా చేస్తున్న ఈ విధానాన్ని ఉపసంహరించుకొని ఉపాధ్యాయులు, ఉద్యోగుల బదిలీలలో స్థానికతను పరిగణనలోకి తీసుకోవాలి.

రాష్ట్రంలో కొత్త జోనల్ విధానానికి అనుగుణంగా ఉద్యోగుల విభజన, బదిలీల కోసం ప్రభుత్వం డిసెంబర్ 6న జీవో నెంబర్ 317ను జారీ చేసింది. ప్రభుత్వంలోని 63 శాఖల్లో సుమారు నాలుగున్నర లక్షలమంది ఉద్యోగులు ఉన్నారు. వీరిలో రెండున్నర లక్షలమంది ఉద్యోగుల విభజన, బదిలీలు చేపట్టింది ప్రభుత్వం.
తెలంగాణలో కొత్త జోనల్ విధానం ప్రకారం పోస్టుల విభజన కొందరికీ వరంగా, మరికొందరికి శాపంగా మారింది. ఉద్యోగుల విభజన, బదిలీల్లో కొత్తజిల్లాల వారీగా స్థానికతను పరిగణనలోకి తీసుకోవడం లేదు. ఉమ్మడి జిల్లా యూనిట్ గా సీనియార్టీనే ప్రతిపాదికగా తీసుకొని సీనియర్లకు వారి అప్షన్ మేరకు పోస్టింగ్ లు ఇస్తున్నారు.

జూనియర్లకు మాత్రం వారి స్థానికతకు భిన్నంగా ఇతర జిల్లాలకు అందునా మారుమూల ప్రాంతాలకు బదిలీ చేస్తున్నారు. దీంతో దాదాపు 20-30 ఏళ్లు స్థానికేతరులుగా జీవించాల్సిన పరిస్థితి. అంతేకాకుండా సీనియర్లు రిటైర్ అయితే ఆ స్థానాల్లో స్థానికేతర జిల్లాలకు బదిలీ అయిన ఉద్యోగులకు తిరిగి అవకాశం కల్పిస్తామనే మాట కూడా ప్రభుత్వం ఇవ్వడం లేదు.

ప్రస్తుత విధానంలో అత్యంత ప్రభావితమవుతున్న వారు భావి పౌరులను తీర్చిదిద్దాల్సిన ఉపాధ్యాయులు. ఇతర ఉద్యోగులతో పోల్చితే ఉపాధ్యాయుల కేటగిరి భిన్నమైంది. ఉపాధ్యాయులది జిల్లా కేడర్. కాబట్టి తాము ఉద్యోగం చేస్తున్న ప్రాంతంలో లేదా సమీపంలో ఇళ్లు నిర్మించుకొని స్థిర నివాసం ఏర్పాటు చేసుకొని ఉంటారు. బదిలీల కారణంగా సొంత జిల్లాను ఉన్న పళంగా వదిలి వెళ్లాల్సిన పరిస్థితి.

దీంతో రిటైర్మెంట్ వరకు ఆ జిల్లాలోనే బాధ్యతలు నిర్వర్తించాల్సిన పరిస్థితి. తిరిగి సొంత జిల్లాకు వచ్చే మార్గమే లేదు. అంతేకాకుండా విద్యా వాలంటీర్ల అవసరం లేకుండా మారుమూల ప్రాంతాలకు జూనియర్ ఉపాధ్యాయులను బదిలీ చేస్తున్నారు. మరో వైపు ఖాళీ పోస్టులు ఉన్న పాఠశాలలను మూసివేయడానికి హేతుబద్దీకరణ విధానాన్ని ప్రభుత్వం బదిలీలో రూపంలో దొడ్డిదారిన తీసుకొస్తుందనే అనుమానం కూడా కలుగుతుంది.

సాధారణంగా కౌన్సెలింగ్ టైమ్‌‌లో జిల్లాలో మొత్తం ఆ కేటగిరీలో ఎన్ని పోస్టులు ఖాళీగా ఉన్నాయో చూపించి, తర్వాత ఆప్షన్లు తీసుకుంటారు. ప్రస్తుతం జిల్లా నుంచి ఎంత మంది వెళ్లిపోయారో ఆ పోస్టులనూ ఖాళీలుగా చూపించడం లేదు. కొత్తగా జిల్లాకు ఎంత మంది అలాట్ అయ్యారో, ఆ సంఖ్య మాత్రమే ఖాళీలుగా చూపిస్తున్నారు. ఉదాహరణకు ఒక జిల్లాలో స్కూల్ అసిస్టెంట్ (తెలుగు) పోస్టులు 41 ఖాళీగా ఉన్నాయి. ఈ జిల్లాకు కొత్తగా 18 మంది అలాటయ్యారు. దీంతో అధికారులు కేవలం 1:1 నిష్పత్తిలో ఎంపిక చేసిన స్కూళ్లలోని 18 ఖాళీ పోస్టుల వివరాలను కౌన్సెలింగ్‌‌లో చూపిస్తూ ఆ ఖాళీల్లోనే వారిని భర్తీ చేస్తున్నారు.

ఆ జిల్లాలోని మిగిలిన స్కూళ్లలోని ఖాళీలను బ్లాక్ చేయడం జరుగుతుంది. అంతేకాకుండా సీనియారిటీ లిస్టు మొదలుకొని, అలాట్‌‌మెంట్ దాకా అనేక తప్పిదాలను టీచర్లు ఎత్తిచూపుతున్నా.. వాటిని పట్టించుకోవడం లేదు. జిల్లా కేంద్రాలు, వాటికి దగ్గర్లోని స్కూళ్లలో ఖాళీలను బ్లాక్ చేసి.. కేవలం జిల్లా హెడ్‌‌క్వార్టర్స్‌‌ కు దూరంగా ఉన్న స్కూళ్లలో మాత్రమే పోస్టులను చూపిస్తున్నారు. మరోవైపు సాధారణంగా ఉండే కౌన్సెలింగ్‌ విధానాన్ని కూడా రద్దు చేశారు. ఫలితంగా టీచర్లు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. సీనియారిటీ ఆధారంగా శాశ్వత ప్రాతిపదికన ఉద్యోగులను, ఉపాధ్యాయులను సర్దుబాటు చేసే విధంగా విడుదల చేసిన జీవో 317ని ప్రభుత్వం ఉప సంహరించుకోవాలి.

సీనియర్ ఎంప్లాయీస్ అర్బన్ జిల్లాలను ఎంచుకుంటుండగా, జూనియర్ ఉద్యోగులు రూరల్ జిల్లాలకు అలాట్ అవుతున్నారు. మూడేండ్లలో రిటైర్మెంట్ జరిగి ఖాళీలు ఏర్పడితే.. జూనియర్ ఉద్యోగులు అలాట్ అయిన జిల్లాల్లో ఇంకో 30 ఏండ్ల వరకు ఖాళీలు ఏర్పడే చాన్స్ ఉండదు. దీంతో ఆయా జిల్లాల నిరుద్యోగులకు నష్టం జరిగే ప్రమాదముంది. జిల్లా కేడర్ మొత్తం ఉద్యోగుల్లో రాష్ట్ర వ్యాప్తంగా 50 ఏండ్ల పైబడిన వారు 60 వేల పైచిలుకు ఉంటారని అంచనా. ఫలితంగా దాదాపు 60 వేల ఉద్యోగాలను గ్రామీణ నిరుద్యోగులు కోల్పోయే ప్రమాదం ఉంది.

అంతేకాకుండా ప్రస్తుతం జోనల్‌ విధానంలో ఉద్యోగుల బదిలీలను అటు నుంచి ఇటు సర్దుబాటు చేస్తున్నారే తప్ప, కొత్త పోస్టుల మంజూరును ప్రస్తావించకుండా పాత వారితోనే పాలన సాగించే ప్రయత్నం ప్రభుత్వం చేస్తుంది. ఇది కూడా ఒక రకంగా నిరుద్యోగులను నష్ట పరిచే చర్యే.

డిమాండ్లు…
• ప్రస్తుతం అనుసరిస్తున్న మార్గదర్శకాలను రద్దు చేయాలి. ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘ నేతలతో చర్చించిన తర్వాత రూపొందించే నూతన గైడ్ లైన్స్ ఆధారంగా బదిలీలు చేపట్టాలి.
• ఏజెన్సీ ప్రాంతాల్లో ఉద్యోగుల కేటాయింపు, బదిలీలు ఇప్పటి వరకు జీవో నెంబర్ 3 ప్రకారమే జరిగాయి. కాబట్టి ప్రస్తుతం కూడా జీవో నెంబర్ 3 ఆధారంగానే బదిలీలు చేపట్టాలి.
• ఉద్యోగుల కేటాయింపులో స్థానికతను ప్రామాణికంగా తీసుకోవాలి.
• భవిష్యత్లో ఏర్పడే ఖాళీలలో ఇతర జిల్లాలకు బదిలీ అయిన ఉద్యోగులకు అవకాశం ఇవ్వాలి.
• అవసరమైతే జూనియర్ల కోసం సూపర్ న్యూమరీ పోస్టులను సృష్టించాలి.
• ఉపాధ్యాయుల కేటాయింపునకు కౌన్సిలింగ్ విధానాన్ని అనుసరించాలి.
• బదీలల సమయంలో ప్రతి జిల్లాలో ఉన్న ఖాళీలను చూపించాలి.

– ఎ. రేవంత్ రెడ్డి,
టీపీసీసీ అధ్యక్షుడు,
ఎంపీ – మల్కాజ్ గిరి లోక్ సభ.

LEAVE A RESPONSE