Suryaa.co.in

Telangana

సింగరేణిని బొందలగడ్డగా మార్చిన ఘనత కేసీఆర్ దే

– బీఆర్ఎస్ నేతల సింగరేణి సమ్మె అట్టర్ ఫ్లాప్
-కేసీఆర్ పాలనలోనే సింగరేణి విభాగాలన్నీ ప్రైవేటీకరించిన మాట వాస్తవం కాదా?
-తాడిచర్ల బొగ్గు గనులను ప్రైవేట్ సంస్థలకు అప్పగించింది నిజం కాదా?
-68 వేల ఉద్యోగాలను 42 వేలకు కుదించి సింగరేణి ప్రజల కొట్ట కొడుతోంది మీరు కాదా?
-బొగ్గు గనుల వేలంపై పార్లమెంట్ లో చేసిన చట్టానికి మద్దతుగా ఓటేసింది మీ ఎంపీలే కాదా?
-ఉద్యోగాల కుదింపు, ప్రైవేట్ సంస్థలకు బొగ్గు గనుల అప్పగింతపై ఏనాడైనా కేంద్రాన్న సంప్రదించారా?
-సిగ్గు లేకుండా సింగరేణి ప్రైవేటీకరణపై కేంద్రాన్ని బదనాం చేస్తారా?
-కేసీఆర్ ప్రభుత్వంపై నిప్పులు చెరిగిన బీజేపీ ఎస్సీ మోర్చా జాతీయ కార్యదర్శి ఎస్.కుమార్

బీఆర్ఎస్ నేతల సింగరేణి సమ్మె అట్టర్ ఫ్లాప్ అయ్యిందని బీజేపీ ఎస్సీ మోర్చా కార్యదర్శి ఎస్.కుమార్ వ్యాఖ్యానించారు. సింగరేణిని బొందలగడ్డగా మార్చిన ఘనత కేసీఆర్ దేనన్నారు. ‘‘కేసీఆర్ పాలనలోనే సింగరేణి విభాగాలన్నింటినీ ప్రైవేటీకరించిన మాట వాస్తవం కాదా? తాడిచర్ల బొగ్గు గనులను ప్రైవేట్ సంస్థలకు అప్పగించింది నిజం కాదా? 68 వేల ఉద్యోగాలను 42 వేలకు కుదించి సింగరేణి ప్రజల కొట్ట కొడుతోంది మీరు కాదా? బొగ్గు గనుల వేలంపై పార్లమెంట్ లో చేసిన చట్టానికి మద్దతుగా ఓటేసింది మీ ఎంపీలే కాదా? ఉద్యోగాల కుదింపు, ప్రైవేట్ సంస్థలకు బొగ్గు గనుల అప్పగింతపై ఏనాడైనా కేంద్రాన్న సంప్రదించారా?’’అని ప్రశ్నించారు. అయినా సిగ్గు లేకుండా సింగరేణి ప్రైవేటీకరణపై కేంద్రాన్ని బదనాం చేస్తారా? అంటూ మండిపడ్డారు. ఈరోజు పార్టీ రాష్ట్ర కార్యాలయంలో కోశాధికారి భండారి శాంతికుమార్, రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ ప్రకాశ్ రెడ్డిలతో కలిసి కుమార్ మీడియాతో మాట్లాడారు.

సింగరేణి విషయంలో ఇచ్చిన హామీలను బీఆర్ఎస్ నేతలు పూర్తిగా విస్మరించారు. 2014లో అధికారంలోకి రాగానే కేసీఆర్ మొట్టమొదట ముంచి సింగరేణి ప్రజలనే. 6 జిల్లాల్లో విస్తరించిన సింగరేణిని అధికారంలోకి వచ్చాక సింగరేణిని బొందలగడ్డగా మార్చిన ఘనత బీఆర్ఎస్ దే. 2006లో ఓపెన్ కాస్టులకు వ్యతిరేకంగా నాటి బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు దత్తాత్రేయ ఓ అధ్యయన కమిటీ వేశారు. నేను ఛైర్మన్ గా ఉన్నాను. ఖమ్మం, వరంగల్ జిల్లాల్లో పర్యటించినప్పడు భూ నిర్వాసితుల బాధలను, అక్కడి ప్రజల సమస్యలపై వివరిస్తూ నివేదిక ఇచ్చాం. ఆ నివేదిక ఆధారంగానే కేసీఆర్ తెలంగాణ ఉద్యమ సమయంలో మాట్లాడుతూ… ఇకపై ఓపెన్ కాస్టులు తవ్వుతానని వస్తే నేనే అడ్డుకుంటా. కుర్చీ వేసుకుని కూర్చుంటానన్నారు.

అధికారంలోకి వచ్చాక 10 అండర్ గ్రౌండ్ గనులను ప్రారంభిస్తా… 30 వేల మందికి ఉద్యోగాలిస్తానని హామీ ఇచ్చారు. ఇవన్నీ మర్చిపోయి బీఆర్ఎస్ నేతలు సింగరేణిపై సమ్మె చేయడం సిగ్గు చేటు. నిన్న బీఆర్ఎస్ నేతలు చేసిన సింగరేణి సమ్మె అట్టర్ ఫ్లాప్. సింగరేణి కార్మికులెవరూ వాళ్లకు మద్దతివ్వలేదు. కారణమేమిటంటే 9 ఏళ్లలో కేసీఆర్ చేసిన నిర్వాకం అక్కడి కార్మికులందరికీ తెలుసు. 2014కు ముందు సింగరేణిలో 68 వేల మంది కార్మికులుంటే…. ఇప్పుడు 42 వేల మందికే కుదించారు. 2023 నాటికి 30 వేల మందికే ఆ సంఖ్య తగ్గే ప్రమాదముంది. దీనిపై తెలంగాణ ప్రజలకు సమాధానం చెప్పాలి. ఓపెన్ కాస్టుల పేరుతో భూములను స్వాధీనం చేసుకుంటూ చిన్న, సన్న కారు రైతుల పొట్టకొడుతున్నారు.

భూసేకరణ చట్టం ప్రకారం భూ నిర్వాసితులకు ఉద్యోగాలివ్వకపోవడం దారుణం. ఇంత జరుగుతున్నా ఎమ్మెల్యేలకు కన్పించడం లేదా? లక్ష ఉద్యోగాలిస్తామని మీ మేనిఫెస్టోలో పెట్టిన హామీలేమయ్యాయి?
సింగరేణి వేలానికి కారకులెవరు? మీకు తెలియదా? దీనికి కారణం కాంగ్రెస్సే. ఆనాడు యూపీఏ హాయంలో అనుమతి లేని సంస్థలకు బొగ్గును కట్టబెడితే… మోదీగారు అధికారంలోకి వచ్చాక దీనిని రద్దు చేసి చట్టం చేసి పారదర్శకంగా బొగ్గు వేలం వేసేలా చేశారు. ఆ చట్టం చేసే సమయంలో బీఆర్ఎస్ ఎంపీలంతా ఓటేసిన సంగతి మర్చిపోయి సిగ్గు లేకుండా తప్పుదోవ పట్టిస్తారా? మీరు అధికారంలోకి రాగానే సింగరేణిని ప్రైవేటీకరణ మొదలుపెట్టిందే కేసీఆర్. తాడిచర్లను ఏపీ జెన్ కో కు అప్పగిస్తే… కేసీఆర్ దానిని ప్రైవేట్ కు అప్పగించిన మాట వాస్తవం కాదా? మరో 30 ఏళ్లకు సరిపడ బొగ్గు నిక్షేపాలను వాళ్లకు అప్పగించింది నిజం కాదా?

సింగరేణిలో ఏ విభాగం ప్రైవేటీకరణ కాలేదో బీఆర్ఎస్ నేతలు చెప్పాలి. చివరకు బొగ్గును కూడా ప్రైవేట్ సంస్థలతోనే తీయిస్తూ ఇక్కడి ప్రజలను మోసం చేస్తున్నారు. పర్మినెంట్ కార్మికులను తీసేశారు. సింగరేణలో కాంట్రాక్ట్ కార్మికులే ఉండబోరని అసెంబ్లీ సాక్షిగా చెప్పిన కేసీఆర్ ఏకంగా 25 వేల మందిని నియమించడం సిగ్గు చేటు. సింగరేణిలో 51 శాతం రాష్ట్ర వాటా ఉంటే కేంద్ర వాటా 49 శాతం మాత్రమే. సింగరేణిలో 30 వేల ఉద్యోగాలను తగ్గించినప్పుడు. 25 వేల మంది కాంట్రాక్టు కార్మికులను నియమించినప్పుడు కేంద్రం అనుమతి తీసుకున్నావా? బొగ్గు తవ్వకాలను ప్రైవేట్ కు ఇచ్చినప్పడు అనుమతి తీసుకున్నావా? సమాధానం చెప్పాలి.

బొగ్గు గనులపై 2015లో చేసిన చట్టం ప్రకారం ఏ రాష్ట్రంలోనైతే గనులు బ్లాక్ లిస్టులో ఉన్నాయో… ఆ రాష్ట్రాలు దరఖాస్తు చేసుకుంటే ఆయా రాష్ట్రాలకే ఇస్తామని ఆ చట్టంలో పేర్కొన్నారు. అప్పటి నుండి నిద్రావస్థలో ఉన్న కేసీఆర్ ప్రభుత్వం… గడువు దాటిన తరువాత వేలం పాట వేస్తే … కేంద్రాన్ని బదనాం చేసేందుకు కుట్ర చేయడం సిగ్గు చేటు. ఇప్పటికైనా దరఖాస్తు చేసుకుంటే రాష్ట్రానికే అప్పగిస్తామని చెప్పినా పట్టించుకోకుండా కేంద్రంపై దుష్ప్రచారం చేసి బీజేపీ నేతలపై బురద చల్లుతుండటం సిగ్గు చేటు.

సింగరేణి ప్రైవేటీకరణ అని మొత్తుకున్న కేసీఆర్ ప్రభుత్వం ఒరిస్సాలోని బొగ్గు గనులను ఎట్లా దక్కించుకున్నావ్. దేశంలోని 119 బొగ్గు బ్లాక్ లున్నాయి. వాటిలో సింగరేణి సంస్థ వేలంలో పాల్గొని దక్కించుకునే అవకాశం ఉన్నా ఎందుకు పట్టించుకోవడం లేదు. 27 వేల కోట్ల రుపాయలు సింగరేణిని బకాయి ఉంది. ఆర్దికంగా సింగరేణి దివాళా తీసి జీతాలు కూడా దక్కించలేని స్థితిలో ఉంది. 1650 కోట్ల ఫిక్స్ డ్ డిపాజిట్లను విత్ డ్రా చేసి జీతాలకు సర్దుబాటు చేసుకోవాల్సిన దుస్థితి ఏర్పడింది. దీనికంతటికీ కేసీఆర్ వైఫల్యమే కారణం.

సాక్షాత్తు ప్రధానమంత్రి మోదీ సింగరేణిని ప్రైవేటీకరించే ప్రసక్తే లేదని చెప్పిన తరువాత కేంద్రంపై విష ప్రచారం చేయడం సిగ్గు చేటు. సింగరేణి చెల్లించే మినరల్ డెవలెప్ మెంట్ ఫండ్ ను సైతం కేటీఆర్ నియోజకవర్గానికి ఖర్చు పెట్టడం సిగ్గు చేటు. ఇప్పటికైనా బీఆర్ఎస్ నేతలు బీజేపీపై దుష్ప్రచారం చేయడం మానుకోవాలి. తక్షణమే సింగరేణిలో ఖాళీగా ఉన్న ఉద్యోగాలను భర్తీ చేయాలి. సింగరేణిపై చర్చకు బీజేపీ సిద్ధంగా ఉంది. చేతనైతే చర్చకు పిలవాలని బీఆర్ఎస్ నేతలను కోరుతున్నాం.

LEAVE A RESPONSE