Suryaa.co.in

Telangana

కేసీఆర్….యాదాద్రి వద్ద తేల్చుకుందాం రా!

-దళిత బంధు ఆపడానికి బీజేపీ కారణమని నిరూపిస్తే దేనికైనా సిద్ధం
-లేనిపక్షంలో సీఎం పదవికి రాజీనామా చేస్తావా?
-టీఆర్ఎస్ వల్లే దళిత బంధు ఆగిందని నిరూపించేందుకు నేను సిద్ధమని సవాల్
-టీఆర్ఎస్ ఓడిపోతుందని తెలిసి కేసీఆర్ దొంగ నాటకాలకు తెరలేపిండు
-టీఆర్ఎస్ పతనం ఖాయమైంది
-బీజేపీని గెలిపిస్తేనే కేసీఆర్ మెడలు వంచి దళిత బంధుసహా అన్నీ ఇప్పిస్తాం
హుజూరాబాద్ ఉప ఎన్నికల ప్రచారంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్
‘‘బీజేపీ పార్టీ లేఖ రాయడంవల్లే ‘దళిత బంధు’ పథకం ఆగిపోయిందని చెబుతున్న ముఖ్యమంత్రి కేసీఆర్ కు సవాల్ చేస్తున్నా. మా ఇలవేల్పు యాదాద్రి లక్ష్మీ నర్సింహస్వామి ఆలయం వద్దకు రా….నేనూ వస్తా… టీఆర్ఎస్ వల్లే ‘దళిత బంధు’ పథకం ఆగిపోయిందని నేను నిరూపిస్తా. నువ్వు రాజీనామా చేస్తావా? ఒకవేళ బీజేపీ వల్లే పథకం ఆగిపోయిందని నువ్వు నిరూపించు. నేను దేనికైనా సిద్దం’’అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ ముఖ్యమంత్రి కేసీఆర్ కు సవాల్ విసిరారు. రాష్ట్రంలో టీఆర్ఎస్ పతనం ఖాయమైందని, హుజూరాబాద్ లో టీఆర్ఎస్ ఓడిపోతుందని తెలిసే కేసీఆర్ కొత్త డ్రామాలకు తెరదీశారని దుయ్యబట్టారు.
ఎన్నికల తరువాత కేసీఆరే తన మనుషులతో కోర్టులో కేసు వేయించి దళిత బంధు డబ్బులు దళితులకు అందకుండా చేస్తాడని అన్నారు. బీజేపీని గెలిపిస్తే కేసీఆర్ మెడలు వంచి దళితులందరికీ రూ.10 లక్షల సాయం అందేలా పోరాడుతుందని హామీ ఇచ్చారు. హుజూరాబాద్ ఎన్నికల ప్రచారంలో భాగంగా బండి సంజయ్ కుమార్ ఈరోజు (20.10.2021) జమ్మికుంట రూరల్ గ్రామాల్లో ప్రచారం నిర్వహించారు. తొలుత అంకుషాపూర్, మడిపెల్లి గ్రామాల్లో ప్రజలను ఉద్దేశించి బండి సంజయ్ మాట్లాడారు. ఈ సందర్భంగా బండి సంజయ్ చేసిన ప్రసంగంలోని ముఖ్యాంశాలు…
ఈ రోజు అంకుషాపూర్ గడ్డ నుండి ఒక మహానుభావుడికి యావత్ భారత్ తోపాటు నేను ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను. ఎందుకంటే నేడు మహత్తరమైన రోజు. ప్రపంచ చరిత్రలోనే గ్రేట్ డే. ప్రపంచంలోనే ఎక్కడా లేనివిధంగా 100 కోట్ల వ్యాక్సిన్ డోసులు ఉచితంగా అందించి ప్రధానమంత్రి నరేంద్ర మోడీగారు దేశాన్ని కాపాడిన రోజిది. ప్రపంచమంతా ఆశ్చర్యపోతోంది. ప్రధాని మోడీజీ రోజుకు 18 గంటలు పనిచేస్తూ దేశాన్ని కాపాడారు. కరోనా విషయంలో ప్రపంచదేశాలకే ఆదర్శంగా నిలిచారు. గత రెండేళ్లుగా దేశ ఆర్ధిక వ్యవస్థ మొత్తం చిన్నాభిన్నమైనప్పటికీ… ఎన్ని ఆర్దిక ఇబ్బందులున్నా లెక్క చేయకుండా వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఉచితంగా కరోనా వ్యాక్సిన్ అందించిన మహానేత నరేంద్ర మోడీ గారు. ఈరోజు మనమంతా ఆయనకు మనస్పూర్తిగా ధన్యవాదాలు చెబుదాం.
•కరోనాతో రాష్ట్రం అల్లాడుతుంటే మన ముఖ్యమంత్రి మాత్రం ఫాంహౌజ్ లో పండుకుని పారాసిట్మాల్ వేసుకుంటే సరిపోతుందన్నడు. ఆయనకు కరోనా వస్తే కార్పొరేట్ ఆసుపత్రికి పోయి చికిత్స చేయించుకుండు. ఆరోగ్య శ్రీకి డబ్బులివ్వలేదు. కేంద్ర పథకం ఆయుష్మాన్ భారత్ ను అమలు చేయలేదు. జనం చస్తున్నా పట్టించుకోలే. చివరకు మరణాలను కూడా దాచిర్రు. శవాలను మాయం చేసిర్రు. హుజూరాబాద్ ఎలక్షన్ రాంగనే మెల్లగా బయటకొచ్చి దళితవాడ తిరుగుడు స్టార్ట్ చేసిండు.
హుజూరాబాద్ లో బీజేపీ గెలుపు ఖాయమని సీఎం కేసీఆర్ కూడా అర్ధమై పోయింది. అందుకే సోయి తప్పి ఏం చేస్తుండో ఆయనకే అర్ధమైతలేదు. ఓడిపోతామనే భయంతో ‘దళిత బంధు’ ప్రకటించిండు. మేం ఆహ్వానించినం. రాష్ట్రమంతా ఇవ్వాలన్నం. హైదరాబాద్ లో భూములమ్మి వచ్చిన సొమ్ముతో హుజూరాబాద్ లో దళిత బంధు ఇస్తమని ఆశ చూపిండు. అన్ని సర్వేల్లో టీఆర్ఎస్ ఓడిపోతుందని తేలిపోవడంతో దళితులకు డబ్బులెందుకు ఇయ్యాలని చెప్పి అకౌంట్లు ఫ్రీజ్ చేయించిండు. మొన్న చేయించుకున్న ప్రజలను కాపాడేందుకు సర్వేలో ఎట్లాగూ ఓడిపోతున్నామని తెలిసి మొత్తానికే ఇయ్యొద్దని డిసైడ్ అయ్యిండు. అందుకే దళిత లబ్ది దారుల్లో ఒక్కరి చేతికి కూడా పైసలందకుండా చేసిండు.
మోసాలు చేయడంలో కేసీఆర్ ఆరితేరినోడు కదా… పాస్ పోర్ట్ బ్రోకర్ కదా…. ఎన్నికల కమిషన్ దళిత బంధును తాత్కాలికంగా ఆపేయమని చెప్పంగనే… బీజేపీ వల్లే దళిత బంధు ఆగిందని మామీద నెపం నెడుతుండు. హైదరాబాద్ ఎన్నికల్లో ఇట్లనే అబద్దాలు చెప్పిండు. నా పేరు మీద దొంగ లేఖ స్రుష్టించి బండి సంజయ్ వరద సాయం ఆపమని లేఖ రాయడంవల్లే పేదోళ్లకు అందాల్సిన వరద సాయం ఆగిపోయిందని ప్రచారం చేసిండు. నేనప్పుడు కేసీఆర్ ను సవాల్ చేసిన. నేను అమ్మవారి భక్తుడిని. భాగ్యలక్ష్మీ అమ్మవారి ఆలయం వద్దకు రా…నేను దొంగ లేఖ రాసినట్లు నిరూపిస్తే ముక్కు నేలకు రాస్తా. రాజీనామా చేస్తా…అని సవాల్ విసిరిన. కానీ రాకుండా తోక ముడిచిండు.
ఇప్పుడు మళ్లీ కొత్త డ్రామా మొదలు పెట్టిండు. బీజేపీ లేఖ రాసినందువల్లే ఎలక్షన్ కమిషన్ దళిత బంధును ఆపేసిందని చెబుతుండు. అంతా అబద్దం. దళిత బంధు డబ్బులు పేదలకు ఇవ్వాల్సిందేనని మొదటి నుండి చెబుతోంది మేమే. నేను ప్రతిరోజు నా పాదయాత్రలో దళితులకు డబ్బులు రిలీజ్ చేయ్. ఫ్రీజ్ ఎందుకు చేసినవని నిలదీసిన. ఎలక్షన్ కమిషన్ కు కూడా డబ్బులు ఇవ్వాల్సిందేనని లేఖ రాసినం. రాజేందరన్న కూడా ప్రతిరోజు అకౌంట్లో డబ్బులెందుకు ఫ్రీజ్ చేసినవ్. వెంటనే ఇచ్చేయాలని డిమాండ్ చేస్తనే ఉన్నడు. కానీ కేసీఆర్ ధోకా భాజ్.
కేసీఆర్ పాస్ పోర్ట్ బ్రోకర్… నా సంతకం ఫోర్జరీ చేసి వరద సాయం ఆపిండు. బండి సంజయ్ పేదోళ్ల పైసలు ఆపుతుండని ప్రచారం చేసిండు…నేను సవాల్ చేసిన. నేను అమ్మవారి భక్తుడిని. భాగ్యలక్ష్మీ అమ్మవారి ఆలయం వద్దకు రా… నాదే సంతకమని రుజువు చేస్తే రాజీనామా చేస్తానని సవాల్ చేసిన. కానీ రాకుండా తోక ముడిచిండు. ఇప్పుడు దళిత బంధు మీద డ్రామాలు మొదలు పెట్టిండు. బీజేపీ దళిత బంధును ఆపిందని కథలు చెబుతుండు. మేం దళిత బంధు ఆపొద్దు…డబ్బులు ఇవ్వాల్సిందేనని ఎన్నికల కమిషన్ కు లేఖ రాసినం. ప్రభుత్వం నుండి సమాధానం ఇవ్వలేదు. దళిత బంధు ఆఫింది కేసీఆరే అయినా బీజేపోళ్లే ఆపించిండని దొంగ మాటలు చెబుతుండు. అబద్దాలు ప్రచారం చేస్తుండు.
నేను మళ్లా కేసీఆర్ కు సవాల్ చేస్తున్నా… మా పార్టీ దళిత బంధు ఆపమని మేం లెటర్ రాసినట్లు అంటున్నవ్ కదా… మా ఇలవేల్పు యాదాద్రి లక్ష్మీ నర్సింహస్వామి. నువ్వు కూడా లక్ష్మీ నరసింహస్వామి భక్తుడిని కదా….యాదాద్రి గుడి వద్దకు పోదాం…..రా….. అక్కడే ప్రమాణం చేద్దాం. బీజేపీ లెటర్ రాయడంవల్లే దళిత బంధు ఆగిందని నువ్వు ప్రమాణం చేయ్. నిరూపిస్తే ముక్కు నేలకు రాస్తా…. నేను రాజీనామా చేస్తా….. అట్లాగే టీఆర్ఎస్ వల్లే దళిత బంధు ఆగిందని నేను నిరూపిస్తా….నువ్వు సీఎం పదవికి రాజీనామా చేస్తవా? దమ్ముంటే…నా సవాల్ ను స్వీకరించి యాదాద్రికి ఎప్పుడొస్తడో చెప్పాలి.
దళిత బంధు పథకాన్ని ప్రకటించి 70 రోజులు దాటింది. ఎన్నికల కమిషన్ నిన్నగాక మొన్న దళిత బంధు ఆపమని చెప్పింది. కేసీఆర్ కు నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఇన్ని రోజులుగా దళితులకు ఎందుకు డబ్బులు ఇవ్వలేదు. ప్రజలు ఒక్కసారి ఈ విషయంపై ఆలోచించాలి.
ఎన్నికలప్పుడు ఒకమాట…ఎన్నికల తరువాత మరో మాట కేసీఆర్ నైజం. ఈ ఎన్నికల తరువాత ఎవరితోనో కోర్టులో పిటిషన్ వేయించి దళిత బంధు డబ్బులు రాకుండా చేస్తడు. దళితులందరికీ రూ.10 లక్షలు రావాలంటే….బీజేపీ అభ్యర్ధి ఈటల రాజేందర్ ను గెలిపించాలి. గెలిస్తే దళితులకు రూ.10 లక్షలు ఇచ్చేదాకా బీజేపీ పోరాటం చేస్తది. కేసీఆర్ ను నిద్ర పోనీయ్యం.
ఈటల రాజేందర్ సహా ఎందరో తెలంగాణ కోసం ఉద్యమాలు చేసిండ్రు. ఎన్నో త్యాగాలు చేసిండు. కేసీఆర్, ఆయన కుటుంబం చేసిన త్యాగాలేందో చెప్పాలి. పేదోళ్లు త్యాగం చేస్తే కేసీఆర్ రాజ్యమేలుతుండు. కులాలు, మతాలు, వర్గాలు, సంఘాల పేరుతో పేదోళ్లను చీలుస్తుండు. కొట్లాడ పెట్టిస్తుండు. అందుకే పేదోళ్లంతా ఒక్కటి కావాలి. కేసీఆర్ కు బుద్ది చెప్పాలి.
మీ కోసం నిరంతరం సేవ చేసే బీజేపీ పువ్వు గుర్తుకు ఓటేసి ఈటల రాజేందర్ ను గెలిపించాలి. టీఆర్ఎస్ బాక్సులు బద్దలు కావాలి. రాష్ట్ర ప్రజలంతా రెండ్రోజుల ముందే దీపావళి పండుగ జరుపుకోబోతున్నరు.
కేసీఆర్….డబ్బులిచ్చి ఓట్లు కొనుక్కొనేందుకు కుట్ర చేస్తుండు. ఓటుకు రూ.20 వేలు ఇస్తడట. తీసుకోండి. మీ కోసం నిరంతరం పనిచేసే బీజేపీ అభ్యర్ధి ఈటల రాజేందర్ కు ఓటేసి గెలిపించండి. ఎందుకంటే ఈ రాష్ట్రంలో గ్రామాల అభివ్రుద్ధికి నిధులు ఇస్తోంది కేంద్రమే తప్ప కేసీఆర్ నయా పైసా ఇవ్వడం లేదు. ఈటల రాజేందర్ ను గెలిపిస్తే… కేంద్రం నుండి ఇంకా ఎక్కువ నిధులొస్తయి. కేసీఆర్ అహంకారం అణిగిపోతోంది. వొళ్లు వంచి పని చేస్తడు.

LEAVE A RESPONSE