Suryaa.co.in

Telangana

కేసీఆర్..ప్రమాణం చేద్దాం రా…

చుక్క మందు పోయకుండా, డబ్బులు పంచకుండా ఓట్లు అడగాలి.
17 న మధ్యాహ్నం 12 గంటలకు అమరవీరుల స్థూపం వద్దకు నేను వస్తా…
కేసీఆర్ నువ్వు అక్కడికి రా… ప్రమాణం చేద్దాం
ఫోరెన్సిక్ నివేదిక రాకుండా ఫోన్ చాట్ ఉందని ఎలా చెబుతారు?
18, 19, 20 తేదీల్లో జరిగే తొలి విడత బస్సు యాత్రలో రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ
18న రామప్ప దేవాలయంలో శివుడికి పూజ చేసి బస్సు యాత్ర
టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి

ఇవాళ ఏఐసీసీ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే గారి నేతృత్వంలో కాంగ్రెస్ అభ్యర్థుల తొలి జాబితా విడుదలైంది. తొలి జాబితాలో ఉన్నవారికి అభినందనలు. మా అభ్యర్థులను ప్రకటించగానే.. కేసీఆర్ వారి అభ్యర్థులకు బీ-ఫామ్ లు పంచారు. అభ్యర్థుల విషయంలో కాంగ్రెస్ బీఆరెస్ కంటే ముందు ఉంది.

మేం 55 మంది అభ్యర్థులను ప్రకటిస్తే.. కేసీఆర్ కేవలం 51 మందికే బీ ఫామ్ లు ఇచిన్రు. కాంగ్రెస్ ఆరు గ్యారంటీలను కాపీ కొట్టి బీఆరెస్ మేనిఫెస్టో ప్రకటించారు. మా గ్యారంటీలను కాపీ కొట్టి కేసీఆర్ పెద్ద అగాథంలో పడిపోయారు. బీఆరెస్ తన ఉనికిని కోల్పోయింది…. కేసీఆర్ ఆలోచన శక్తి కోల్పోయారు. బీఆరెస్ కు ఆలోచన, ఆచరణ, సంక్షేమం-అభివృద్ధిపై చిత్తశుద్ధి లేదు.

మేం ఆరు గ్యారంటీలు ఇస్తామంటే బీఆరెస్ నేతలు అదెలా సాధ్యమన్నారు. కానీ ఇప్పుడు బీఆరెస్ నేతలు కాంగ్రెస్ ను ప్రశ్నించే అర్హత కోల్పోయారు. కేసీఆర్ లా మేం ఉత్తుత్తి హామీలు ఇవ్వలేదు. మేం ప్రకటించిన ఆరు గ్యారంటీలను అమలు చేయగలం. వీటి అమలు సాధ్యమని కేసీఆర్ రాజముద్ర వేసి మరీ అంగీకరించారు. కాంగ్రెస్ హామీలు ఆచరణ సాధ్యమని కేసీఆర్ ప్రెస్ మీట్ తో ప్రజలకు అర్ధమైంది.

అర్థంపర్ధం లేని ఆరోపణలతో బిల్లా రంగాలు కాంగ్రెస్ పై బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారు. అందుకే ఎక్కడో డబ్బులు దొరికితే మాపై ఆరోపణలు చేస్తున్నారు. దోపిడీ సొమ్ముతో జాతీయ రాజకీయాలు చేయాలని కేసీఆర్ వైఫల్యం చెందారు.అందుకే చలిజ్వరంతో ఇంట్లో కూర్చున్నారు. కేసీఆర్ కు సూటిగా సవాల్ విసురుతున్నా..ఈ ఎన్నికల్లో చుక్క మందు పోయకుండా, డబ్బులు పంచకుండా ఓట్లు అడగాలి. 17 న మధ్యాహ్నం 12 గంటలకు అమరవీరుల స్థూపం వద్దకు నేను వస్తా…కేసీఆర్ నువ్వు అక్కడికి రా… ప్రమాణం చేద్దాం. నిజంగా రాష్ట్రం ఆర్థికంగా దివాళా తీయకపోతే…ప్రతీ నెల ఉద్యోగులకు , ఆసరా పెన్షనర్లకు ప్రతీ నెలా మొదటి తారీఖు వాళ్ళ ఖాతాలో వేయాలని కేసీఆర్ కు మరో సవాల్ విసురుతున్నా. అలా అయితేనే మీరు ప్రకటించిన మేనిఫెస్టోలోని హామీలు అమలు చేస్తారని నమ్ముతాం.

ఇవాళ ప్రెస్ మీట్ లో రాబోయే ఎన్నికల్లో ఓటమిని అంగీకరించిన కేసీఆర్ కనిపించారు. కాడి కిందపడేసిన కేసీఆర్ కనిపించారు. కేసీఆర్.. మీ పాలనకు ఎక్స్ పైరీ డేట్ అయిపోయింది.. ఇక మీరు విశ్రాంతి తీసుకోండి.కేసీఆర్ మేనిఫెస్టోను కాంగ్రెస్ ఒక చిత్తు కాగితంగా చూస్తోంది. దానిపై చర్చ అనవసరం.

ఆత్మహత్య చేసుకున్న నిరుద్యోగ యువతిపై పోలీసు అధికారి ఏ ఆధారాలతో వివరాలు బయటపెట్టారు.. ఫోరెన్సిక్ నివేదిక రాకుండా ఫోన్ చాట్ ఉందని ఎలా చెబుతారు?వ్యక్తిగత వివరాలు బయటపెట్టి ఆ అధికారి నిర్భయ చట్టాన్ని ఉల్లంఘించారు.చనిపోయిన యువతిపై ఇలాంటి వ్యాఖ్యలు చేస్తే వారి కుటుంబం పరువుకు నష్టం కలిగించడం కాదా నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించిన ఆ అధికారిని సస్పెండ్ చేయాలి.

రాష్ట్రంలో మూడు విడతలుగా బస్సుయాత్ర. మొదటి విడుతలో మూడు రోజులు బస్సు యాత్ర. దసరా తర్వాత రెండవ దశ బస్సు యాత్ర ఉంటుంది.నామినేషన్ల ప్రక్రియ ముగిసిన తర్వాత మూడవ దశ బస్సు యాత్ర ఉంటుంది.

18, 19, 20 తేదీల్లో జరిగే తొలి విడత బస్సు యాత్రలో రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ పాల్గొంటారు.18న రామప్ప దేవాలయంలో శివుడికి పూజ చేసి బస్సు యాత్ర ప్రారంభిస్తారు. అదే రోజు భూపాలపల్లి లో మహిళలతో సమావేశం.19న రామగుండంలో సింగరేణి కార్మికులతో సమావేశం. పెద్దపల్లి లో పాదయాత్ర, సభ. కరీంనగర్ లో పాదయాత్ర , సభ. 20 న జగిత్యాల, బోధన్, నిజామాబాద్ లో పాదయాత్ర, సభ ఉంటుంది

LEAVE A RESPONSE