Suryaa.co.in

Telangana

తెలంగాణ ప్రజలు కలలు కన్నది దొరల తెలంగాణ కాదు.. ప్రజల తెలంగాణ

– రాహుల్ గాంధీ

మహబూబ్ నగర్ జిల్లా:తెలంగాణలో అధికారమే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ దూకుడు పెంచింది. రెండో విడత ప్రచారంలో భాగంగా రెండు రోజుల నుంచి కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్, కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే తెలంగాణలో పర్యటించారు.

ఇవాళ..ప్రియాంక గాంధీ పర్యటించాల్సి ఉండగా.. అనారోగ్య కారణాలతో చివరి నిమిషంలో కొల్లాపూర్ పర్యటనను రద్దు చేసుకున్నారు. దీంతో ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలోని కొల్లాపూర్ లో ఏర్పాటుచేసిన బహిరంగ సభకు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌ గాంధీ పాల్గొన్నారు.

కొల్లాపూర్ సభ అనంతరం మేడ్చల్‌, మల్కాజ్‌ గిరి, కుత్బుల్లాపూర్‌ సభల్లో రాహుల్ పాల్గొని ప్రసంగిస్తారు. ప్రియాంక గాంధీ పర్యటన రద్దవ్వడంతో ఒక్కరోజు ముందుగానే తెలంగాణకు వచ్చిన రాహుల్‌ గాంధీ.. కొల్లాపూర్ సభలో ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు.

ఈ సందర్భంగా రాహుల్ గాంధీ మాట్లాడుతూ.. వాస్తవానికి ఇక్కడకు ప్రియాంక గాంధీ రావాలని.. కానీ, తాను ఇక్కడకు వచ్చానని.. ఇది రాజకీయ అనుబంధం కాదని.. కుటుంబ అనుబంధమంటూ తెలిపారు. ఈ రోజు కాంగ్రెస్ సెంట్రల్ ఎన్నికల కమిటీ సమావేశం ఉన్నా.. తెలంగాణ ప్రజల దగ్గరికి రావాలన్న ఉద్దేశంతో వచ్చానంటూ తెలిపారు. తెలంగాణ జరుగుతున్న ఎన్నికల్లో దొరల తెలంగాణకు,ప్రజల తెలంగాణ మధ్య పోరు జరగబోతుందని రాహుల్ పేర్కొన్నారు.

ఒకవైపు కేసీఆర్ కుటుంబం.. మరోవైపు యావత్ తెలంగాణ సమాజం.. మహిళలు, నిరుద్యోగులు ఉన్నారంటూ రాహుల్ పేర్కొన్నారు. దొరల తెలంగాణలో ఏం జరుగుతోందో అందరికీ తెలిసిందేనంటూ తెలిపారు. ఈ ప్రభుత్వం అందరినీ మోసం చేసిందని.. అవినీతికి పాల్పడిందంటూ పేర్కొన్నారు. బీఆర్ఎస్.. బీజేపీ లక్షల కోట్ల అవినీతికి పాల్పడ్డాయంటూ తెలిపారు.

తమది దొరల పాలన కాదని.. కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో ఎన్నో చారిత్రాత్మక నిర్ణయాలు తీసుకున్నామని.. పేదలకు భూములు పంచామని రాహుల్ గాంధీ తెలిపారు. తెలంగాణలో ఎన్నో ప్రాజెక్టులు నిర్మించామని తెలిపారు. నాగార్జున సాగర్, శ్రీరాంసాగర్, సింగూర్ ప్రాజెక్టులు నిర్మించామని తెలిపారు.

తెలంగాణలో 20 లక్షల మంది రైతులకు ధరణి ఫోర్టల్ వల్ల నష్టం జరిగిందని తెలిపారు. కేవలం కేసీఆర్ కుటుంబానికి, వాళ్ల ఎమ్మెల్యేలకే లాభం చేకూరిందని తెలిపారు.

తెలంగాణ ప్రజలు కలలు కన్నది దొరల తెలంగాణ కోసం కాదని.. ప్రజల తెలంగాణ కోసమని రాహుల్ గాంధీ పేర్కొన్నారు. ప్రభుత్వం సంస్థలన్నీ నిర్విర్యం అయ్యాయని.. అందరినీ అన్యాయం జరుగుతుందని తెలిపారు.

ఈ ఎన్నికలు బీఆర్‌ఎస్ .. కాంగ్రెస్ మధ్యనే జరుగుతున్నాయని తెలిపారు. బీఆర్ఎస్, బీజేపీ, ఎంఐఎం పార్టీలు ఒకటేనని రాహుల్ గాంధీ పేర్కొన్నారు. కావాలని సీబీఐ, ఈడీ లాంటి సంస్థలతో దాడులు చేపిస్తున్నారని.. వారికి సంబంధించిన వారిపై మాత్రం దాడులు లేవని తెలిపారు.

ఎంఐఎం బీజేపీ కోసమే అంతటా ఎన్నికల్లో పోటీ చేస్తుందని రాహుల్ పేర్కొన్నారు. బీజేపీకి అవసరమైనప్పుడల్లా ఎంఐఎం పోటీ చేస్తుందని.. తెలిపారు. ఇక్కడ బీఆర్ఎస్ ను కేంద్రంలో బీజేపీని ఓడిస్తామని రాహుల్ తెలిపారు.

తెలంగాణ ప్రజలు ఇప్పటికే నిర్ణయం తీసుకున్నారని.. కాంగ్రెస్ పార్టీకి ప్రజాబలం ఉందని రాహుల్ పేర్కొన్నారు. తెలంగాణలో ప్రజలు కోరుకున్నట్లు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడుతుందని ఎవ్వరూ భయపడాల్సిన అవసరం లేదని.. తెలంగాణ కాంగ్రెస్ నేతృత్వంలోని ప్రజాపాలన వస్తుందని,రాహుల్ గాంధీ తెలిపారు.

LEAVE A RESPONSE