– కేసీఆర్‌ను టచ్ చేసి చూడండి..
– సిల్లీ బీజేపీ సొల్లు బీజేపీ మాటలు రైతులు నమ్మొద్దు
– పెట్రో ధరలపై కేంద్రానివన్నీ అబద్ధాలే
– ముందు సెస్ ధరలు విత్‌డ్రా చేసుకోండి
– బీజేపీపై కేసీఆర్ నిప్పులు
కేంద్రంలోని బీజేపీ సర్కారుపై తెలంగాణ సీఎం కేసీఆర్ నిప్పులు చెరిగారు. తనను తరచూ జైల్లో వేస్తామంటున్న బీజేపీ దళపతి బండి సంజయ్‌పై హెచ్చరికలు జారీ చేశారు. దమ్ముంటే కేసీఆర్‌ను టచ్ చేసి చూడు. నన్ను జైలుకు పంపించి బతికి కట్టడతవా? అని అగ్గిరాముడయ్యారు. పెట్రోల్ ధరలపై కేంద్రం చెప్పేవన్నీ అబద్ధాలేనన్నారు. తాము ఒక్క రూపాయి కూడా వ్యాట్ పెంచలేదని స్పష్టం చేశారు. బీజేపీ ఎంపీలు రాష్ట్రానికి ఏం చేశారని నిలదీశారు. చాలారోజుల తర్వాత… హుజూరాబాద్ ఉప ఎన్నిక ఓటమి తర్వాత మీడియా ముందుకొచ్చిన కేసీఆర్ బీజేపీపై ఒంటికాలితో లేచి, ఆ పార్టీకి చెందిన తెలంగాణ చీఫ్ సంజయ్‌ను కడిగిపారేశారు. ప్రగతిభవన్‌లో మీడియాతో మాట్లాడిన కేసీఆర్ చేసిన వ్యాఖ్యలివీ…
ఏనుగులు వెళ్తుంటే కుక్కలు అరుస్తున్నాయని ఊరుకున్నానని కేసీఆర్ అన్నారు. ‘‘చాలా రోజులుగా బండి సంజయ్ అతిగా మాట్లాడుతున్నారు. నాపై వ్యక్తిగత విమర్శలు కూడా చేశారు. బండి సంజయ్ నా స్థాయి కాదు కాబట్టే నేను పట్టించుకోలేదు. ఏనుగులు వెళ్తుంటే కుక్కలు అరుస్తున్నాయని ఊరుకున్నా’’ అన్నారు.
బండి సంజయ్ చిల్లర మాటలు మానుకోవాలని హెచ్చరించారు. ‘‘నన్ను జైలుకి పంపుతావా?.. నన్ను జైలుకి పంపి నువ్వు బతికి బట్టకడతావా?.. కేసీఆర్‌ను టచ్ చేసి చూడు తెలుస్తుంది. బండి సంజయ్ కళ్లు నెత్తికెక్కి మాట్లాడుతున్నారు. రైతులను గందరగోళానికి గురిచేస్తే బండి సంజయ్ ఆట కట్టిస్తాం. సిల్లీ బీజేపీ, సొల్లు బీజేపీ మాటలు రైతులు నమ్మొద్దు. పెట్రోల్, డీజిల్‌పై సెస్‌ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాం. నీటి వాటాల విషయంలో ఇప్పటివరకు కేంద్రం నోరు మెదపలేదు. 157 మెడికల్ కాలేజీలను కేంద్రం మంజూరు చేస్తే తెలంగాణకు ఒక్కటీ ఇవ్వలేదు. రైతు వ్యతిరేక చట్టాలను కేంద్రం వెనక్కి తీసుకోవాలి’’ అని డిమాండ్ చేశారు.
బండి సంజయ్‌కి బాధ్యత లేదని, రాష్ట్ర ప్రభుత్వంపై ఆయన చేస్తున్న విమర్శలు పూర్తిగా అర్థరహితమనిఅన్నారు. ‘‘వరి కొనుగోళ్లపై కేంద్రం బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తోంది. ధాన్యాన్ని నిల్వ చేసే సామర్థ్యం రాష్ట్రాల దగ్గర లేదు. కేంద్ర ప్రభుత్వం కావాలనే మెలికలు పెడుతోంది. బండి సంజయ్ కేంద్రం మెడలు వంచుతారా? ధాన్యం కొంటామని కేంద్రం ఆదేశాలు ఇస్తుందా? గత యాసంగిదే 5 లక్షల టన్నుల ధాన్యం నిల్వ ఉంది. ఈ ఏడాది ఎంత ధాన్యం తీసుకుంటామనే క్లారిటీ ఇవ్వలేదు. ఈ ఏడాది ఎంత ధాన్యం తీసుకుంటామనే క్లారిటీ ఇవ్వలేదు. కోటీ 70 లక్షల టన్నుల ధాన్యం రాబోతోంది’’ అని అన్నారు.
ధాన్యం కొనుగోళ్ల విషయంలో కేంద్ర ప్రభుత్వం బాధ్యతా రాహిత్యంగా వ్యవహరిస్తుందని అన్నారు. యాసంగిలో వరి వద్దని వ్యవసాయ శాఖ మంత్రి చెప్పారన్నారు. రైతులు నష్టపోతారనే ఉద్దేశంతో మంత్రి వరి వద్దన్నారన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన నాడు రైతుల ఆత్మహత్యలు, చాలా కకావికలమైన వ్యవసాయం, వలసలు, పాలమూరు, నల్లగొండ, మెదక్ జిల్లాల నుంచి రైతులు కూడా కూలి పనుల కోసం హైదరాబాద్‌కు రావడం.. దారుణ పరిస్థితులుండేవన్నారు.
రాష్ట్ర సాధన జరిగిన తర్వాత ప్రజలు రాష్ట్రాన్ని తీర్చిదిద్దే అవకాశాన్ని అధికార రూపంలో కట్టబెట్టారన్నారు. స్థిరమైన లక్ష్యంతో, నిర్ణయాత్మకమైన పద్ధతిలో ఈ రాష్ట్రంలో గ్రామీణ ఆర్థిక వ్యవస్థను పరిపుష్టం చేయాలని, వ్యవసాయాన్ని స్థిరీకరించాలి.. పల్లెలు చల్లగా ఉండేటట్లు చేయాలి.. వృత్తి పనులందరికీ పనులు దొరకాలని అనే స్పష్టమైన పాలసీని తీసుకున్నామన్నారు. ఆ దిశలో బలమైన అడుగులు రాష్ట్ర ప్రభుత్వం వేసిందన్నారు. అందులో మొట్టమొదట మొదలు పెట్టింది.. అడుగంటి పోయిన భూగర్భ జలాలను పెంచేందుకు.. మిషన్ కాకతీయ పేరిట చెరువులను అద్భుతంగా తీర్చిదిద్దామన్నారు.
ఈ విషయం రాష్ట్ర ప్రజలందరికీ తెలుసునన్నారు. ఆ తర్వాత చాలా అస్తవ్యస్తంగా.. లోపభూయిష్టంగా ఉన్న కరెంటును పూర్తిగా సంస్కరించి.. అనేక పెట్టుబడులు పెట్టి.. 24 గంటలు అన్ని రంగాలకు భారతదేశంలో మరో రాష్ట్రంలో లేని విధంగా వ్యవసాయానికి 24 గంటల నాణ్యమైన కరెంటును ఇచ్చామన్నారు. అది సరిపోదని పెట్టుబడుల కోసం 93శాతం సన్న, చిన్నకారు రైతులకు కోసం ప్రపంచంలోనే ఎక్కడా లేని విధంగా రైతుబంధు పథకం అమలు చేసినట్లు చెప్పారు.
మొదట పంటకు రూ.4వేలతో ప్రారంభించి.. దాన్ని రూ.5వేలకు పెంచి.. ఎకరానికి సంవత్సరానికి రూ.10వేలు పెట్టుబడి కోసం ఇచ్చే ప్రభుత్వం ప్రపంచంలోనే ఒకేఒకటి తెలంగాణ ప్రభుత్వం.. చితికిపోయిన రైతులు మరణిస్తే కుటుంబాలు రోడ్డున పడకుండా ఆదుకునేందుకు దాదాపు రూ.1300-రూ.1400 కోట్లు యావత్ రైతాంగానికి సంబంధించిన ప్రీమియం ప్రభుత్వమే చెల్లించింది.. రైతులపై పైసా భారం లేకుండా రైతుబీమా పథకం అమలు చేశామన్నారు.
పథకం ప్రారంభించిన రోజు ఎల్ఐసీ చైర్మనే తెలంగాణ రాష్ట్రం ఎల్ఐసీకి పెద్ద కస్టమర్ అని చెప్పారని గుర్తు చేశారు. గతంలో విత్తనాలు సరిగా దొరికేవి కావని.. కల్తీ విత్తనాలు ఉండేవన్నారు. కేంద్రంతో కొట్లాడి, ఒప్పించి కల్తీ విత్తనాలు అమ్మేవారిపై పీడీ యాక్ట్ తీసుకువచ్చామన్నారు. పీడీ యాక్ట్ దేశంలో తెలంగాణలో తప్ప మరెక్కడా అమలులో లేదన్నారు. ఈ విషయంలో కేంద్రం సతాయించిందని, రైతుల శ్రేయస్సు కోసమే యాక్ట్ తీసుకువచ్చామన్నారు. గతంలో ఎరువులు దొరికేవి కావని.. రోజుల తరబడి రోజుల తరబడి లైన్లలో నిల్చోవడం.. గలాటాలు కావడం.. చివరకు పోలీస్స్టేషన్ల ఎరువు బస్తాలు పెట్టిన రోజులు చూశామన్నారు.
ఆ రోజు మొత్తం వాడిన ఎరువుల్లో.. ఇప్పుడు మూడు రెట్లు పెరిగింది. రెండు పంటలకు కలిపి 50-55లక్షల టన్నుల ఎరువులు వాడకం జరుగుతుందన్నారు. గతంలో 13-14లక్షలుంటేనే పోలీస్స్టేషన్లలో పెట్టి విక్రయించారన్నారు. కేంద్రాన్ని ఒప్పించి ఎండాకాలంలో ఏ రాష్ట్రం తీసుకోని సమయంలో తీసుకున్నామని.. ఆగమేఘాలపై గోడౌన్లు నిర్మించామన్నారు. మంచి విత్తనాలు, ఎరువులు, మిషన్ కాకతీయ ద్వారా చెరువులను అభివృద్ధి, 24 గంటల నాణ్యమైన కరెంటు సరఫరా, పెట్టుబడికి రైతుబంధు, దురదృష్టవశాత్తు రైతు మరణస్తే రైతుబీమా తదితర చర్యలతో రాష్ట్రంలో అద్భుతంగా వ్యవసాయ స్థిరీకరణ జరిగింది.
కరోనా విపత్కర పరిస్థితుల్లోనూ గ్రామాల్లోనే 6వేలకుపైగా ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు. రైతులు మార్కెట్‌కు రాకుండా, రైతులు గుమిగూడకుండా నెలల తరబడి వందశాతం ధాన్యం కొనుగోలు చేసిన రాష్ట్రం దేశంలో తెలంగాణ ఒక్కటేనన్నారు. గత ఏడేళ్ల కింద పరిస్థితి ఎలా ఉందో.. ఇప్పుడు ఎలా ఉందో ప్రతి రైతును అడిగినా చెబుతారన్నారు. భారత రాజ్యాంగ నిర్మాతలు.. దేశంలో ఆహార కొరత సంభవించినప్పుడు.. ప్రజలకు ఆహార కొరత రాకుండా చూసేందుకు బాధ్యతను కేంద్రంపై పెట్టారు. అందులో నుంచి పుట్టుకు వచ్చిందే ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా. ఎఫ్‌సీఐ దేశవ్యాప్తంగా ఎన్ని తాలూక సెంటర్లు ఉన్నాయా.. అక్కడ సైంటిఫిక్ గోడౌన్లు ఉంటాయన్నారు.
ఇలాంటి అవకాశాలు రాష్ట్రాల వద్ద ఉండవన్నారు. అంతర్జాతీయ ప్రమాణాల ప్రకారం.. సైంటిఫిక్ గోడౌన్లు ఉన్న ఏకైక సంస్థ ఎఫ్‌సీఐ అన్నారు. ధాన్యం ఎగుమతి చేయాలన్నా.. విత్తనాలకు వినియోగించాలన్న కేంద్రానిదే అధికారం అన్నారు. ఈ అధికారి ఏ రాష్ట్రానికి లేవని.. తెలంగాణకు కూడా లేవని విషయం స్పష్టమన్నారు. రాష్ట్రాలు, దేశంలో కరువు కాటకాలు వచ్చిన సమయంలో ఫుడ్ సప్లయ్‌కి ఢోకా లేకుండా చేసే బాధ్యత కేంద్రంపైనే ఉందన్నారు. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం తన బాధ్యతను విస్మరించి.. బాధ్యతా రాహిత్యంగా ధాన్యం తీసుకోమని.. మెడకు పెడితే.. కాళ్లకు.. కాళ్లకు పెడితే మెడకు పెడుతూ మెలికలు తిప్పుతుందన్నారు. దీనిపై అధికారులు, సివిల్ సప్లయ్ మంత్రి, పరిశ్రమల మంత్రి, వ్యవసాయశాఖ మంత్రులు ఢిల్లీకి వెళ్లారన్నారు.
ఎఫ్ఐసీ ఎంఓయూ చేస్తుందని.. కేంద్రం నిరాకరిస్తుందన్నారు. ధాన్యం సేకరించిన విషయంలో రాష్ట్రాలు ఏమి చేయని పరిస్థితి ఉందని.. నిల్వ చేసే పరిస్థితి లేదని.. ఎగుమతి చేసే అధికారం లేదన్నారు. మళ్లీ కేంద్రం వద్దకు వెళ్లాలని.. నిల్వ చేసేందుకు గోడౌన్లు లేవన్నారు. రాష్ట్రం ఏమీ పరిస్థితి లేదన్నారు. గతంలో లెవీ సేకరణ ఉండేదని.. ఇప్పుడు ఆ బాధ్యత కేంద్రంపై ఉందన్నారు. నెల రోజుల కిందట స్వయంగా ఢిల్లీకి వెళ్లిన సమయంలో వ్యవసాయశాఖ మంత్రిని కలిసి మాట్లాడనని, ఎఫ్‌సీఐ ఎంఓయూ చేయడం.. మీరు నిరాకరించడంపై సరైంది కాదనన్నారు. సంవత్సరం టార్గెట్ ఎంత రాష్ట్రం నుంచి ధాన్యం తీసుకుంటారో చెప్పాలని కోరానన్నారు. ఈ విషయమై రైతులకు అవగాహన కల్పించి ప్రత్యామ్నాయ పంటలపై అవగాహన కల్పించుకుంటామని చెప్పినట్లు పేర్కొన్నారు.
2014లో బీజేపీ అధికారంలోకి వచ్చినప్పుడు క్రూడ్ ఆయిల్ ధర ఇంటర్నేషనల్ మార్కెట్లో 105.52 డాలర్లుగా ఉంది. ఇప్పుడు క్రూడ్ ఆయిల్ ధర 83 డాలర్లుగా ఉంది. బీజేపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు క్రూడ్ ఆయిల్ ధర 105 డాలర్లను దాటలేదు. ఆయిల్ ధర క్రాష్ అయి చాలా సార్లు తగ్గాయి కానీ.. ఏనాడూ పెరగలేదు. అయితే.. అంతర్జాతీయ మార్కెట్లో క్రూడ్ ఆయిల్ ధరలు పెరిగాయి అని కేంద్రం అబద్ధం చెప్పి ధరలు పెంచుతూ పోయింది. పెంచే పద్ధతి కూడా అడ్డదిడ్డంగా ఉంది. దాంట్లో సుంకం పెంచకుండా సెస్ రూపంలోకి మార్చి ధరలు పెంచారు. రాష్ట్రాల వాట ఎగ్గొడుతూ.. రాష్ట్రాల నోరుకొడుతున్నారు. రాష్ట్రాలకు వాటా ఇవ్వాలని సెస్ కింద మార్చి లక్షల కోట్లు ఎగ్గొడుతున్నారు. 2014 లో 77 రూపాయలు పెట్రోల్ ధర ఉంటే ఇప్పుడు రూ.114 చేశారు. డీజిల్ ధర 68 రూపాయలు ఉంటే రూ. 107.40 పైసలు చేశారు.. అని లెక్కలతో సహా సీఎం కేసీఆర్ ప్రజలకు తెలిపారు.
మొన్న జరిగిన ఉపఎన్నికల్లో ప్రజలు తీవ్రంగా వ్యతిరేకించడంతో.. కొండంత పెంచి.. పిసరంత ధరలను తగ్గించి ఏదో గొప్ప పని చేసినట్లు చెప్పుకుంటోంది కేంద్రం. అంతే కాదు.. రాష్ట్రాలు కూడా తగ్గించండి అని మాట్లాడుతున్నారు. కేంద్రాన్ని, రాష్ట్ర బీజేపీని డిమాండ్ చేస్తున్నా. ముందు సెస్ విత్‌డ్రా చేసుకోండి. 2014 రేట్‌కే ఇప్పుడు పెట్రోల్ ఇవ్వొచ్చు.. అని కేసీఆర్ డిమాండ్ చేశారు.
కేంద్ర ప్రభుత్వం పెట్రోల్, డీజిల్ ధరలు పెంచుకుంటూ పోయింది తప్పితే.. రాష్ట్ర ప్రభుత్వం ఒక్క రూపాయి కూడా వ్యాట్ పెంచలేదు. ఇప్పటి వరకు పైసా కూడా తీసుకోలేదు. కేంద్రం పెంచింది కానీ.. రాష్ట్రం ఏనాడూ పెంచలేదు. ఏ నైతికతతో మీరు మాట్లాడుతున్నారు. మితిమీరి.. అడ్డదిడ్డంగా మాట్లాడుతున్నారు.. అంటూ సీఎం కేసీఆర్ కేంద్రాన్ని ప్రశ్నించారు.
ఈ 7 ఏండ్లలో రాష్ట్రానికి కేంద్రం నుంచి వచ్చిన సొమ్ము 42 వేల కోట్లు మాత్రమే. అన్ని రాష్ట్రాలకు వచ్చినట్టు మనకు కూడా వచ్చింది. అందులో ఒకటి నరేగా, ఎన్ఆర్హెచ్ఎం, సర్వశిక్షా అభియాన్. వీటి మీద వచ్చిందే. స్టేట్ రీఆర్గనైజేషన్ చట్టం ప్రకారం 450 కోట్లు బీఆర్జీఎఫ్ ఫండ్స్ రావాలి. అవి ఎగ్గొట్టారు. వాటిని రాష్ట్ర బీజేపీ నేతలు ఎందుకు కేంద్రం మెడలు వంచి తీసుకురారు. మంత్రుల మీద.. ముఖ్యమంత్రుల మీద మాత్రం ఆరోపణలు చేస్తరు. కేంద్రం సహకరించకున్నా కూడా సొంతంగా రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకున్నం. 5 ఏళ్ల వరకు హైకోర్టునే విభజించలేదు. రాష్ట్రానికి రావాల్సిన నీళ్ల వాటా గురించి ఇప్పటి వరకు తేల్చలేదు. మీ అసమర్థతనా.. మీ చేతగాని తనమా.. మీ అవివేకమా? వాటి గురించి ఎందుకు మాట్లాడరు. నవోదయ పాఠశాలల చట్టం ఉంది. దానిపై ప్రధాని మోదీకి ఇప్పటి వరకు 50 సార్లు దరఖాస్తు ఇచ్చా. కానీ.. కొత్త జిల్లాలకు ఒక్క నవోదయ పాఠశాల ఇవ్వలేదు. 157 మెడికల్ కళాశాలలు మంజూరు చేసి తెలంగాణకు ఒక్కటి ఇవ్వలేదు. ఎక్కడ పోయిర్రు మరి రాష్ట్ర బీజేపీ నేతలు. ఇక్కడి కేంద్ర మంత్రి ఎక్కడికి పోయిండు. ఎందుకు వీటిపై కేంద్రంతో మాట్లాడరు. ఎందుకు రాష్ట్ర బీజేపీ నేతలు ఒక్క నవోదయ పాఠశాలను తీసుకురాలేకపోయారు. ఎందుకు ఒక్క మెడికల్ కాలేజీని కూడా రాష్ట్రానికి తీసుకురాలేకపోయారు.. అంటూ రాష్ట్ర బీజేపీ నేతలను కేసీఆర్ ప్రశ్నించారు.
కేసీఆర్ ను టచ్ చేసి చూడు..నన్ను జైలుకు పంపించి తెలంగాణలో తిరగగులుగుతావా..?
బండి సంజయ్ చిల్లర మాటలను సహించం. కేంద్రం వరిపంటను వద్దంటోంది. చిల్లర రాజకీయాలను సహించం. రైతులు అల్లా టప్పా మాటాలు మాట్లాడొద్దు. ఏనుగులు నడుస్తుంటే కుక్కలు ఎన్నో
మొరుగుతయ్. అధికారులు చెప్పిన పంటలూ వేయండి. తప్పుడు మాటలు మార్చేస్తే నాలుక చీలుస్తాం. నా మెడలు వంచడం కాదు.. నీ మెడలు వంచుతాం. కేంద్రం తలుచుకుంటే రూ.77కే లీటర్ పెట్రోల్ ఇవ్వొచ్చు. దళితబందు మా అజెండా.. కచ్చితంగా అమలు చేస్తాం.కేసీఆర్ బతికున్నంతకాలం దళితబందు అమలు చేస్తం.
ఎన్నికలు అన్నాక గెలుస్తం.. ఓడతం.. ఇతర రాష్ట్రాల్లో ఉప ఎన్నికల్లో బీజేపీ అట్రాఫ్లాఫ్ అయ్యింది.కంపు నోరుతో నీ మెడ నాలుగు ముక్కలు చేస్తా.. ఖబర్ధర్.చేతగాని తనం వల్ల దేశాన్ని నాశనం చేస్తున్నరు.ఏ వస్తువును పట్టుకున్న భగ్గుమంటోంది.జనం కొంపలు ఆర్చిన పార్టీ బీజేపీ.జాగ్రత్తగా మాట్లాడండి.. లేకపోతే ఇక సహించుడే లేదు.
రైతులను కేంద్రం ముంచేస్తున్నరు.రైతుల బతుకులు తీసబోయి కార్పోరేట్ చేతిలో బెడతవా..?పార్లమెంట్ లో దద్దరిల్లేటట్లు చేస్తం.. తెలంగాణ కేబినేట్.. శాసనసభ..శాసన మండలి మొత్తం ఢిల్లి బోయి గొడవ చేస్తం.
సకల అరిష్టాలకూ మోడీ పాలనే కారణం, ఇక ఊరుకునేది లేదు, వెంటపడతా, మీ కథ చెబుతా, ఇన్ని రోజులు ఏదో క్షమించేసినం, మీ మెడలు విరుస్తా, కుక్కలు మొరిగినట్టు మాట్లాడితే సహించను, నలిసి పారేస్తా, బీకేర్‌ఫుల్…, బండీ, కరీంనగర్ నుంచి ఎంపీగా గెలిచినవ్- నీకు ఇంగ్లిషో, హిందో వస్తదా, నీకేమైనా అర్థమైతదా, ఈ రాష్ట్రానికి నయాపైసా లాభం చేసినవా..? 2018లో 107 సీట్లలో డిపాజిట్లు కోల్పోయిన పార్టీ కూడా మాట్లాడితే ఎట్లా..?
దమ్ముందా, కమాన్, అరెస్టు చెయ్, ఇష్టమొచ్చినట్టు కూస్తే నాలుకలు కోస్తా, ఇక స్పేర్ చేసేది లేదు, అటు చైనా వాడు దంచుతున్నాడు అరుణాచల్‌లో, ఊళ్లకు ఊళ్లు కడుతున్నడు, ఏం పీకిన్రు..? రేపట్నుంచి దేశంలో అగ్గిపెడతా, పార్లమెంటు దద్దరిల్లిపోవాలె, సీఎం సహా మొత్తం ఎమ్మెల్యేలు, ఎంపీలు, జెడ్పీ ఛైర్మన్లు కలిసి ఢిల్లీల ధర్నా చేస్తాం.తెలంగాణ రైతులు బాగుంటే కళ్లు మండుతున్నయా..?