– కేసీఆర్ అనే మొక్కను మళ్లీ మొలకెత్తనివ్వం.. రాసి పెట్టుకోండి
– కేసీఆర్… మీరు ఫామ్ హౌసులోనే ఉండండి.. కావలసినవి అక్కడికే పంపిస్తా
– నీ దుఃఖం ఏందో.. నీ బాధ ఏందో అసెంబ్లీకి రా.. చర్చ పెడదాం
– ఇద్దరు చిల్లర గాళ్లను రోడ్డుపైకి వదిలిండు
– నాలుగు కోట్ల తెలంగాణ బిడ్డలకు సోనియా అమ్మ
– తెలంగాణను అపహాస్యం చేసిన తెలంగాణ ద్రోహి మోదీ
– ఆయనకు గులాంగా మారిన నీకు తెలంగాణలో ఉండే అర్హత లేదు
– ఇది ఆడబిడ్డల ప్రభుత్వం
– హైదరాబాద్ కు ధీటుగా వరంగల్
– అందుకే వరంగల్ అభివృద్ధికి ఆరువేల కోట్లు
– పనిచేసే వారి కాళ్లల్లో కట్టెలు పెట్టొద్దు
– వరంగల్ సభలో కేసీఆర్, కిషన్‌రెడ్డిపై విరుచుకుపడిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి
వరంగల్: ఇవాళ ఉక్కు మహిళ ఇందిరమ్మ 107వ జయంతి సందర్భంగా వారికి నివాళులు. ఇందిరమ్మ రాజ్యంలో ఆడబిడ్డలను కోటీశ్వరులను చేయాలని ఈ ప్రభుత్వం కంకణం కట్టుకుంది. ఈ కార్యక్రమం మా ఆడబిడ్డలకు అంకితం. ఈ ఆడబిడ్డలు మనసు నిండుగా నన్ను ఆశీర్వదించడం వల్లే ఇవాళ ఈ స్థానంలో ఉన్నా.
ఓరుగల్లు ఆడబిడ్డలకు మంత్రివర్గంలో ప్రముఖ స్థానం కల్పించాం. పాలకుర్తిలో ఒక రాక్షసుడిని ఓడించి పాలకుర్తి గడ్డపై కాంగ్రెస్ జెండాను ఎగరేసింది మన ఆడబిడ్డనే. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా మహిళా అధికారి ఉన్నారు. ఇది ఆడబిడ్డల ప్రభుత్వం అని గర్వంగా చెప్పుకునే అవకాశం ప్రభుత్వం కల్పించింది. టాటా బిర్లాలను తలదన్నేలా రాష్ట్రంలో ఆడబిడ్డలను వ్యాపారస్తులుగా ప్రభుత్వం తీర్చిదిద్దబోతోంది.
మేం నిర్మిస్తే మీరు వచ్చి కొబ్బరికాయ కొడుతున్నారని ఒకాయన మాట్లాడుతుండు. కాళోజీ కళాక్షేత్రం పదేళ్లుగా పూర్తి చేయనప్పుడే మీ బుద్ధి బయటపడింది. మీరు పూర్తిచేయలేదు కాబట్టే.. మేం కాళోజీ కళాక్షేత్రం పూర్తి చేశాం. వరంగల్ గడ్డపై రైతు డిక్లరేషన్ తో తెలంగాణలో కాంగ్రెస్ రూపురేఖలు మారిపోయాయి. ఓరుగల్లు పోరాటంతో రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేసుకున్నాం. పనిచేసే వారి కాళ్లల్లో కట్టెలు పెట్టొద్దు. వచ్చేసారి డిపాజిట్లు కూడా దక్కవు.
వరంగల్ ను హైదరాబాద్ కు ధీటుగా తీర్చిదిద్దాలని నిర్ణయించాం. చారిత్రాత్మక వరంగల్ నగరాన్ని హైదరాబాద్ కు ధీటుగా అభివృద్ధి చేసేందుకు చర్యలు చేపట్టాం. అందుకే వరంగల్ అభివృద్ధికి దాదాపు ఆరువేల కోట్లు కేటాయించించాం. వరంగల్ అభివృద్ధి జరిగితే సగం తెలంగాణ అభివృద్ధి జరిగినట్లే. వరగంల్ ను అభివృద్ధి చేసే వరకు నిద్రపోయేది లేదు.
మీరు కుట్రలు, కుతంత్రాలు చేయొచ్చు. మీ కుట్రలను గుర్తించి ఊచలు లెక్కబెట్టిస్తాం. పది నెలల్లో తెలంగాణ ప్రజలు ఏం కోల్పోయారో తెలుసుకున్నారని ఒకాయన మాట్లాడుతుండు. పది నెలల్లో తెలంగాణలో మహిళలు స్వేచ్ఛను పొందారు. అదానీ, అంబానీ లకే పరిమితమైన సోలార్ పవర్ ప్లాంట్ల ఏర్పాటు చేసే స్థాయికి మహిళలు ఎదుగుతున్నారు. పది నెలల్లో ఆడబిడ్డలను ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం పొందారు. రూ.500లకే ఆడబిడ్డలు గ్యాస్ సిలిండర్ పొందారు.
దేశంలో ఎక్కడైనా రూ.500.లకే గ్యాస్ సిలిండర్ అందిస్తున్నారా? దేశంలో ఎక్కడా లేని విధంగా అర్హులైన ప్రతీ పేద కుటుంబం 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ పొందుతోంది. రాష్ట్రాన్ని కేసీఆర్ తాగుబోతుల రాష్ట్రంగా మార్చాలనుకున్నారు. కేసీఆర్… మీరు ఫామ్ హౌసులోనే ఉండండి. కావలసినవి అక్కడికే పంపిస్తా. పది నెలల్లో మీ ఇంట్లో నలుగురు ఉద్యోగం కోల్పోయారు తప్ప ఇంకేమీ కాలేదు.
ఇందిరమ్మ ప్రభుత్వంలో 10 నెలల్లో 50వేల ఉద్యోగాలు భర్తీ చేశాం. 22 లక్షల రైతు కుటుంబాలకు రూ.18వేల కోట్లు రుణమాఫీ చేసిన ఘనత మా ప్రభుత్వానిది. ఆనాడు భద్రకాళీ, సమ్మక్క సారక్క అమ్మవార్ల సాక్షిగా చెప్పా. పంద్రాగస్టులోగా రుణమాఫీ చేసి తీరుతామని. మాట ఇచ్చాం.. నిలబెట్టుకున్నాం.
ఈ వేదికగా మాట ఇస్తున్నా… మిగిలిన అందరికీ రుణమాఫీ చేసే బాధ్యత మాది. మాట ఇస్తే తల తెగిపడినా మడమ తిప్పని నైజం కాంగ్రెస్ ది. కనీసం మీకు మమ్మల్ని అభినందించే మనసు లేదు కానీ శాపనార్ధాలు పెడుతుండ్రు. వరి వేసుకుంటే ఉరే అని చెప్పిన వ్యక్తి కేసీఆర్. రాష్ట్రంలో 66 లక్షల 1కోటి 53 లక్షల మెట్రిక్ టన్నుల వరి ధాన్యం రైతులు పండించారు.
దేశంలో ఎక్కడా ఇంత వరకు ఏ రాష్ట్రంలో ఈ స్థాయిలో వరి ధాన్యం పండిచలేదు. నీ దుఃఖం ఏందో.. నీ బాధ ఏందో అసెంబ్లీకి రా.. చర్చ పెడదాం. రా ప్రజల్లోకి… వచ్చి మాట్లాడు… నువ్ లేవనెత్తిన అంశాలు సహేతుకమైతే సరిచేసుకుంటాం. ఆయన రాడట కానీ ఇద్దరు చిల్లర గాళ్లను రోడ్డుపైకి వదిలిండు.
కేసీఆర్ అనే మొక్కను మళ్లీ మొలకెత్తనివ్వం.. రాసి పెట్టుకోండి.. కేసీఆర్ కాస్కో చూద్దాం.. ఫామ్ హౌస్ లో పడుకుంటే నీ గురించి తేవడనుకోకు.. నాకు ముందు తెలుసు.. వెనక తెలుసు. మళ్లీ చెబుతున్నా… రా బయటకు.
కేటీఆర్ మాట్లాడగానే రెండోరోజు కిషన్ రెడ్డి మాట్లాడుతడు. సోనియమ్మకు గులాం అని కిషన్ రెడ్డి మాట్లాడుతుండు. అరవై ఏళ్ల తెలంగాణ ప్రజల ఆకాంక్షలను నెరవేర్చిన తల్లి సోనియమ్మ. సోనియమ్మ మా అమ్మ. నాలుగుకోట్ల తెలంగాణ బిడ్డలకు ఆమె అమ్మ. అలాంటి ఆ తల్లి కాళ్లు కడిగి నీళ్లు నెత్తిన చల్లుకోవడానికి కూడా మేం సిద్ధం. ఇది మాకు అవమానం కాదు.. ఆత్మ గౌరవం.. ఆ తల్లి లేకుంటే తెలంగాణ ఉండేది కాదు..
కిషన్ రెడ్డి సోనియమ్మ కాళ్లు కడిగి నెత్తిమీద చల్లుకుంటే.. మోదీకి ఊడిగం చేసిన పాపం కొంతైనా తగ్గుతుంది. తెలంగాణను అపహాస్యం చేసిన తెలంగాణ ద్రోహి మోదీ. ఆయనకు గులాంగా మారిన నీకు తెలంగాణలో ఉండే అర్హత లేదు. నీకు ఉద్యోగం ఇచ్చింది సికింద్రాబాద్ ప్రజలు. ఆ ప్రజలకు కృతజ్ఞతగా ఉండు.మోదీకి కాదు.