Suryaa.co.in

Editorial

రాజంపేట నుంచి కిరణ్‌ కుమార్‌ రెడ్డి పోటీ

– సొంత నియోజవర్గం పీలేరు కూడా అక్కడే
– పెద్దిరెడ్డిని ఓడించాలన్న కల నెరవేరని నల్లారి
– నాలుగు నియోజకవర్గాల్లో పెద్దిరెడ్డి ప్రభావం
– బీజేపీకి కనిపించని సొంత బలం
-పీలేరు, పుంగనూరు,మదనపల్లి నియోజకవర్గాలపైనే ఆశ
– పెద్దిరెడ్డి మిథున్‌ను ఓడించాలన్నదే లక్ష్యం
– గెలిస్తే కేంద్రమంత్రి అవుతానన్న ధీమా
– రాజంపేటలో బలిజలు కిరణ్‌ను కరుణిస్తారా?
— బలిజ వర్గమే అక్కడ బాహుబలి
– టీడీపీ-జనసేన ఓట్లు చీలతాయన్న ఆశ
– అందుకే రాజంపేట లోక్‌సభ పరిథిలో పర్యటనలు
– టీడీపీ-జనసేన సైనికులు ఎటు వైపు?
– కమల కిరణానికి మైనారిటీలు సహకరిస్తారా?
– కిరణ్ సిక్సర్ కొడతారా? రనౌట్ అవుతారా?
( మార్తి సుబ్రహ్మణ్యం)

ఒకప్పటి క్రికెటర్.. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చివరి సీఎం నల్లారి కిరణ్‌ కుమార్‌ రెడ్డి, ఇప్పుడు లోక్‌సభ నుంచి తన సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించేందుకు సిద్ధమవుతున్నారు. జై సమైక్యాంధ్ర పార్టీ స్ధాపించి, ఎన్నికల్లో చేతులు కాల్చుకున్న కిరణ్‌ కుమార్‌ రెడ్డి తిరిగి కాంగ్రెస్ గూటికి చేరిపోయారు. అక్కడ తాను అనుకున్న కోరిక నెరవేరకపోవడంతో, హటాత్తుగా కమలతీర్ధం తీసుకున్నారు. ఇప్పుడు కేంద్రమంత్రి కావాలన్న లక్ష్యంతో, లోక్‌సభ బరిలోకి దిగి, తన పొలిటికల్ సెకండ్ ఇన్నింగ్స్ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. అయితే అక్కడ కనీసబలం కూడా లేని బీజేపీ అభ్యర్ధిగా కిరణ్ విజయం సాధిస్తారా? లేదా? ఇదీ ఇప్పడు అన్నమయ్య జిల్లాలో హాట్‌టాపిక్.

మాజీ సీఎం నల్లారి కిరణ్‌ కుమార్‌ రెడ్డి, రాజంపేట లోక్‌సభ బీజేపీ ఎంపీగా బరిలోకి దిగేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు. ఉమ్మడి కడప జిల్లాలోని రాజంపేట నియోజకవర్గ పరిథి, ఉమ్మడి చిత్తూరుకూ విస్తరించడం గమనార్హం. అందులోనే తన సొంత పీలేరు అసెంబ్లీ నియోజకవర్గం కూడా ఉండటం, కలసివచ్చే అంశమని ఆయన భావిస్తున్నారు. దానికితోడు పుంగనూరు-పీలేరు-మదనపల్లె నియోజకవర్గాల్లో ఉన్న వ్యక్తిగత సంబంధాలు కూడా, తన విజయానికి దోహదపడతాయని కిరణ్ భావిస్తున్నట్లు కనిపిస్తోంది.

ప్రధానంగా తన కుటుంబానికి రాజకీయ ప్రత్యర్ధి అయిన, పెద్దిరెడ్డిని ఓడించాలన్నది నల్లారి కోరిక. అది ఇప్పటివరకూ నెరవేరింది లేదు. అటు టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు కూడా, పెద్దిరెడ్డిని ఓడించాలని ఎన్ని ప్రయత్నాలు చేసినా ఇప్పటివరకూ అది సాధ్యం కాలేదు. పైగా నల్లారి కుటుంబసభ్యులు ఎప్పుడు పోటీ చేసినా, వారిని ఓడించేందుకు పెద్దిరెడ్డి కూడా కృషి చేశారు. కిరణ్ సీఎంగా ఉండగా, పెద్దిరెడ్డి ఢిల్లీకి వెళ్లి కిరణ్‌పై, సోనియాకు ఫిర్యాదు చేయడం వంటి పరిణామాలు తెలిసినవే.

అయితే కిరణ్‌ కుమార్‌ రెడ్డి పేరుకు పీలేరు ఎమ్మెల్యే, సీఎంగా ఉన్నపటికీ.. ఆయన ఎప్పుడూ, అక్కడి ప్రత్యక్ష రాజకీయాల్లో పాల్గొన్న దాఖలాలు లేవు. హైదరాబాద్‌లో ఉండే కిరణ్ రాజకీయ వ్యవహారాలన్నీ, ఆయన సోదరుడు కిశోర్‌ కుమార్‌ రెడ్డి చక్కదిద్దేవారు. ఇప్పుడాయన పీలేరు టీడీపీ అభ్యర్ధిగా పోటీ చేయనున్నారు. దానితో సోదరుడి సహకారం కూడా, కిరణ్‌కు ఉండే అవకాశాలు లేనట్లే లెక్క.

ఆవిధంగా ఉప్పు-నిప్పుగా ఉన్న నల్లారి-పెద్దిరెడ్డి కుటుంబాలు, ఇప్పుడు రాజంపేట వేదికగా మరోసారి తలపడేందుకు సిద్ధమవుతుండటం ఆసక్తికలిగిస్తోంది. ప్రస్తుతం రాజంపేట ఎంపీగా పెద్దిరెడ్డి తనయుడు మిథున్‌రెడ్డి, వైసీపీ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఆయనను ఓడించి, తన జీవిత లక్ష్యం నెరవేర్చుకోవాలన్నది కిరణ్ కోరిక. అందుకే ఆయన రాజంపేట లోక్‌సభ పరిథిలో విస్తృతంగా పర్యటిస్తున్నారు.

రాజంపేట లోక్‌సభ పరిథిలో రాజంపేట, పీలేరు, పుంగనూరు, తంబళ్లపల్లి, రైల్వే కోడూరు, మదనపల్లి, రాయచోటి అసెంబ్లీ నియోజకవర్గాలున్నాయి. కిరణ్ కాంగ్రెస్‌లో ఉన్నప్పుడు పీలేరు, పుంగనూరు, మదనపల్లి నియోజకవర్గాల్లో సంబంధాలు ఉండేవి. ప్రధానంగా ముస్లింలతో సత్సంబంధాలు నిర్వహించేవారు. ఆయన సీఎంగా ఉన్నప్పుడు మైనారిటీనేతలకు, పలు కార్పొరేషన్ పదవులు కూడా ఇచ్చారు. కిరణ్ తన సొంత నియోజకవర్గానికి వెళ్లినప్పుడు కూడా, ముస్లిం వర్గాలే ఎక్కువగా ఆయనతో భేటీ అవుతుంటారు.

అయితే కిరణ్ ఇప్పుడు బీజేపీలోకి వెళ్లడంతో, సీన్ రివర్స్ అయ్యే ప్రమాదం లేకపోలేదు. కాంగ్రెస్ నేత కిరణ్‌ను ఆదరించిన మైనారిటీలు.. బీజేపీ అభ్యర్ధిగా మారిన అదే కిరణ్‌కు సహకరించడం కష్టమేనంటున్నారు. ప్రధానంగా రాజంపేట లోక్‌సభ పరిథిలో ముస్లిం ఓటర్ల ప్రాబల్యం ఎక్కువ. మదనపల్లి, రాయచోటి, పీలేరు, పుంగనూరు నియోజకవర్గాల్లో ముస్లిం ఓటర్ల సంఖ్య అధికం.

ఇక రాజంపేటలో కూడా 30 శాతం వరకూ ముస్లిం ఓటర్లు ఉండవచ్చన్నది ఒక అంచనా. రైల్వేకోడూరు-తంబళ్లపల్లి మినహా, మిగిలిన ఐదు నియోజకవర్గాల్లోనూ ముస్లిం ఓటర్ల సంఖ్యనే ఎక్కువ. ఈ నేపథ్యంలో బీజేపీ అభ్యర్ధిగా బరిలోకి దిగనున్న కిరణ్‌కుమార్‌రెడ్డికి, మైనారిటీ ఓటర్లు ఎంతవరకూ సహకరిస్తారన్నది ప్రశ్న.

అయితే.. రాజంపేట నియోజకవర్గ పరిథిలో బలిజ ఓటర్లే విజయాన్ని శాసిస్తుంటారు. బలిజ వర్గానికి చెందిన సాయిప్రతాప్, సుదీర్ఘకాలం రాజంపేట ఎంపీగా ఎన్నికవడం ప్రస్తావనార్హం. నిజానికి గత 50 ఏళ్లలో రెండు దఫాలు మినిహా, మిగిలిన అన్నిసార్లూ బలిజలే ఎంపీలుగా ఎన్నికయ్యారు. రత్నసభాపతి, పార్ధసారథి, గుడిపాటి రామయ్య, సాయిప్రతాప్‌లు.. రెండు-మూడుసార్లు ఎంపీలుగా ఎన్నికయిన వారే. పార్ధసారథి ఐదుసార్లు ఎంపీగా గెలిచిన రికార్డు ఉంది.

రాజంపేట, మదనపల్లి, రైల్వేకోడూరు, రాయచోటి అసెంబ్లీ నియోజకవర్గాల్లో బలిజలే విజయాన్ని శాసిస్తుంటారు. అయితే గత రెండు ఎన్నికల్లోనూ పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి ఎంపీగా కొనసాగుతూ, బలిజల అధిపత్యానికి తెరదించగలిగారు. దానికి కారణం.. నాలుగు అసెంబ్లీ నియోజకవర్గాల్లో, సీనియర్ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ప్రభావం ఎక్కువగా ఉండటమే.

ఈ క్రమంలో టీడీపీ-జనసేన అభ్యర్ధి బరిలోకి దిగే అవకాశం ఉన్నందున, బలిజ వర్గం ఆ కూటమి వైపే మొగ్గు చూపటం సహజం. పైగా బలిజలు వైసీపీపై ఆగ్రహంతో రగిలిపోతున్నారు. రాయలసీమలో సంప్రదాయకంగా బలిజలు, రెడ్లని తొలినుంచి వ్యతిరేకిస్తారన్నది బహిరంగమే. గత ఎన్నికల్లో బీజేపీ అభ్యర్ధిగా పురందేశ్వరి రాజంపేట నుంచి ఓడిపోయిన విషయం తెలిసిందే.

ఈ నేపథ్యంలో వైసీపీ వ్యతిరేక కోణంలో.. టీడీపీ-జనసేన ఓట్లు తనవైపు మళ్లుతాయన్న కిరణ్ ఆశ, ఎంతవరకూ నెరవేరుతుందో చూడాలి. పైగా ఈసారి పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డిని, ఎలాగైనా ఓడించాలన్న కసితో టీడీపీ అడుగులు వేస్తోంది. ఆ కోణంలో చూస్తే టీడీపీ-జనసేన శ్రేణులు, సహజంగా తమ ఉమ్మడి అభ్యర్థి వైపే మొగ్గు చూపుతారు. ఈ నేపథ్యంలో రాజంపేట పొలిటికల్ గ్రౌండ్‌లో, మాజీ క్రికెటర్ కిరణ్ సిక్సర్ కొడతారా? లేక రనౌట్ అవుతారా? అన్నది చూడాలి.

LEAVE A RESPONSE