మద్యపాన ప్రియుల చావులన్నీ జగన్మోహన్ రెడ్డి వాయిస్తున్న మరణ మృదంగమే
ఈ పనికిమాలిన ప్రభుత్వాన్ని మహిళలు కోరుకున్నది వైధవ్యమేనా ?!…
రాజ్యాంగాన్ని తుంగలో తొక్కుతున్న రాష్ట్ర పోలీసులు… ఎన్నో చట్టాలు ఉన్నా అమలుకు మాత్రం నోచుకోవడం లేదు
రాజ్యాంగంలోని ఆర్టికల్ 22 లో ప్రజలకు కొన్ని ప్రాథమిక హక్కులు కల్పించింది… అవే లేకపోతే రాష్ట్ర పోలీసులు ఇంకా ఎంత దారుణంగా ప్రవర్తించేవారో?!
నరసాపురం ఎంపీ రఘురామకృష్ణం రాజు
నాణ్యత లేని మద్యాన్ని సేవించి ఎంతోమంది మద్యపాన ప్రియులు ప్రాణాలను కోల్పోతున్నారు. ఈమద్యం చావులన్నీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వాయిస్తున్న మరణం మృదంగమే. మగవారి దగ్గర సొమ్ములు కొట్టేసి, మహిళలను విధవలు చేస్తున్న దుర్మార్గమైన పాలకులను క్షమిద్దామా? అని నరసాపురం ఎంపీ, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు రఘురామకృష్ణం రాజు ప్రశ్నించారు. ఒక్క ఛాన్స్ అంటూ బ్రతిమాలితే అవకాశం ఇచ్చిన మనము కోరుకున్నది మహిళల వైధవ్యమేనా? అంటూ అంటూ నిలదీశారు.
రచ్చబండ కార్యక్రమంలో భాగంగా రఘురామకృష్ణం రాజు తన నివాసంలో మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ… రాష్ట్రంలోని నాణ్యత లేని మద్యంపై ఉద్యమించేందుకు మహిళలు ఇప్పటికైనా మేల్కొనడం హర్షించదగ్గ పరిణామని పేర్కొన్నారు. మద్యం తాగడం ఆరోగ్యానికి హానికరమే. అయినా మీ భర్తలు మీ మాట వినకుండా, మద్యం తాగాలనుకుంటే మరో ఆరు నెలలు ఆగమని చెప్పండి.
చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చిన తర్వాత నాణ్యమైన మద్యాన్ని అందుబాటులోకి తీసుకువస్తారు. నాణ్యమైన మద్యం సేవించిన వారు 30 ఏళ్ల తర్వాత శరీరంలోని అవయవాలు చెడిపోయి చనిపోతే, జగన్మోహన్ రెడ్డి నాసిరకమైన మద్యాన్ని తాగితే ఏడాదికే అవయవాలన్నీ చెడిపోయి టపా కట్టేస్తారని అన్నారు . తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు జైల్లో ఉండగానే, జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ సినిమా షూటింగ్లలో బిజీ ఉండగానే ముందస్తు ఎన్నికలకు వెళ్లాలని జగన్మోహన్ రెడ్డి ప్లాన్ చేస్తున్నారు.
చంద్రబాబు నాయుడుకి ఎల్లుండి సుప్రీంకోర్టులో బెయిల్ లభించడం ఖాయం. ఒక్క ఛాన్స్ అని అడిగి అధికారంలోకి వచ్చిన తర్వాత అన్ని వర్గాల వారిని మోసం చేసిన జగన్మోహన్ రెడ్డి రానున్న ఎన్నికల్లో తాను అక్రమంగా సంపాదించిన డబ్బులతో ఓట్లు కొనుగోలు చేయాలని చూస్తున్నారు. మళ్లీ ప్రజలు మోసపోవద్దు. మహిళలు ఇప్పటికే మేల్కొన్నారు. మగవారు మాడాలుగా మారిన మహిళలు రోడ్డెక్కి, చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టును నిరసిస్తూ… తెదేపా అధినేత సతీమణి నారా భువనేశ్వర్ కి, నందమూరి ఆడపడుచు నారా బ్రాహ్మణి కి అండగా నిలుస్తున్నారని కొనియాడారు.
రాజ్యాంగం ప్రజలకు కొన్ని హక్కులు కల్పించింది… అవే లేకపోతే రాష్ట్రంలో పోలీసులు ఇంకెంత దారుణంగా ప్రవర్తించేవారో?!
రాజ్యాంగం ఆర్టికల్ 22 ద్వారా ప్రజలకు కొన్ని హక్కులను కల్పించింది. ప్రజలకు రాజ్యాంగం కల్పించిన హక్కులు ఉండగానే రాష్ట్రంలో పోలీసులు ఎంతో దారుణంగా ప్రవర్తిస్తున్నారు. ఒకవేళ ఆ హక్కులే రాజ్యాంగం ప్రజలకు కల్పించి ఉండకపోతే, ఇంకెంత దారుణంగా ప్రవర్తించేవారోనని రఘురామకృష్ణంరాజు ఆందోళన వ్యక్తం చేశారు. ఒక వ్యక్తిని అరెస్టు చేసిన వెంటనే అతని న్యాయవాదిని అనుమతించాలి. స్థానికంగా ఉన్న న్యాయమూర్తి ముందు వెంటనే ప్రవేశపెట్టాలి.
అనంతరం వైద్య పరీక్షలు నిర్వహించాలి. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అరెస్టు అనంతరం ఆయనకు వైద్య పరీక్షలు నిర్వహించినప్పటికీ, నన్ను అరెస్టు చేసినప్పుడు సిఐడి పోలీసులు నిర్వహించలేదు. పోలీసులు ఎవరినైనా అరెస్టు చేసేటప్పుడు విధిగా యూనిఫాం ధరించాలి. అలాగే ఐడి కార్డు ప్రదర్శించాలి. స్థానిక పోలీస్ స్టేషన్లో ముందుగా సమాచారం ఇవ్వాలి. నన్ను అక్రమంగా అరెస్టు చేసే సమయంలో స్థానిక పోలీస్ స్టేషన్ కు ఎటువంటి సమాచారం ఇవ్వకపోగా, స్థానికంగా అందుబాటులో ఉండే మెజిస్ట్రేట్ ముందు హాజరు పరచలేదు.
అందుబాటులో ఉన్న మెజిస్ట్రేట్ ముందు హాజరు పరిచి , ట్రాన్జిట్ వారెంట్ తీసుకొని, ఏ వాహనంలో, ఎక్కడికి తరలిస్తున్నారో సమాచారం ఇవ్వాలి. కానీ అటువంటి నిబంధన లేవీ సిఐడి పోలీసులు పాటించలేదు . ఒక పనికిమాలిన వ్యక్తి యొక్క వ్యక్తిగత కక్షను తీర్చడానికి మాత్రమే సిఐడి పోలీసులు పని చేస్తున్నట్లుగా ఉంది. నన్ను అరెస్టు చేసిన విషయం తెలుసుకొని, అప్పటికే కోర్టులో సీనియర్ న్యాయవాది ఆదినారాయణ రావు, నన్ను ఏమైనా చేస్తారేమోనని ఆందోళన వ్యక్తం చేయగా, ప్రభుత్వం తరఫున వాదనలు వినిపించిన త్రాష్టుడు… ఆయన మా ఎంపి చక్కగా చూసుకుంటామని చెప్పారట. అప్పటికే నన్ను హింసించడం ప్రారంభించారు.
మరుసటి రోజు ఉదయం వైద్య పరీక్షల కోసం వచ్చిన డాక్టర్ కూడా అంతా సవ్యంగానే ఉందని నివేదికను అందజేశారు. బిపి ఎక్కువగా ఉందని నాతో చెప్పిన సదరు వైద్యున్ని, ఎందుకలా నివేదిక ఇచ్చారని ప్రశ్నించగా… వారు అలాగే నివేదికను సమర్పించాలని ఆదేశించారని నాతో చెప్పారు. తన సామాజిక వర్గానికి చెందిన సాంబశివారెడ్డి, చంద్రశేఖర్ రెడ్డిలకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కీలక పదవులను కట్టబెట్టారు. ఆనాటి సిఐడి చీఫ్ సునీల్ కుమార్ తో కలిసి సాంబశివారెడ్డి, చంద్రశేఖర్ రెడ్డిలు గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రి సూపరిండెంట్ ప్రభావతమ్మ పై ఒత్తిడి తీసుకువచ్చి దొంగ నివేదికలను రాయించారు.
చట్టంలో ఎన్నో నిబంధనలు ఉన్నప్పటికీ, ఏ ఒక్క నిబంధనను కూడా అమలు చేయకుండా చట్టం చేసే ఒక పార్లమెంట్ సభ్యుడిని అరెస్టు చేసి చిత్రహింసలకు గురి చేసిన నికృష్టులు సిఐడి పోలీసులని రఘురామ కృష్ణంరాజు మండిపడ్డాడు. ట్రాన్జిట్ వారెంట్ పై తీసుకువెళ్లే వ్యక్తితో అతని కుటుంబ సభ్యున్ని , న్యాయవాదిని కూడా అనుమతించాలని నిబంధనలు చెబుతున్నప్పటికీ, ఏ దశలోనూ నన్ను నా న్యాయవాదితో దుర్మార్గులైన సిఐడి పోలీసులు, పనికిమాలిన ముఖ్యమంత్రి మాట్లాడనివ్వలేదు. చట్టంలోని ఏ నిబంధనను పాటించలేదు. రాష్ట్రంలో సీఐడీ పోలీసులు రాజ్యాంగాన్ని తుంగలో తొక్కారు. ఈ విషయాన్ని నా స్వానుభవంతో చెబుతున్నాను.
నన్ను అక్రమంగా అరెస్టు చేసి లాకప్ లో చిత్రహింసలకు గురి చేశారని 50 సార్లు లేఖ రాసినప్పటికీ పార్లమెంటులో మాట్లాడే అవకాశాన్ని కల్పించలేదు. చట్టం చేసే ఒక ప్రజా ప్రతినిధికే ఈ దుస్థితి ఎదురైతే… సామాన్యుని పరిస్థితి ఏమిటి?. రాష్ట్రంలో రాజ్యాంగం అనేది అవసరం ఉందా?. పాటించని రాజ్యాంగం మనకు అవసరమా?? అంటూ విజ్ఞులైన ప్రజలు ఆలోచించాలి. ఈ వ్యధ ను కోర్టులకు చెప్పాలి. ప్రజలు, ప్రతిపక్ష పార్టీలు ధైర్యంగా ముందుకు రావాలి. మూడు రోజుల్లో చంద్రబాబు నాయుడుకి చట్ట ప్రకారం బెయిల్ లభించే అవకాశం ఉంది. చట్టాలను పోలీసుల అతిక్రమించకుండా, చట్టాలలో పెను మార్పులు రావలసిన అవసరం అవసరం ఉంది. ఎన్నో చట్టాలు ఉన్నప్పటికీ, అవి అమలవుతున్నాయా? లేదా? అన్నది మనం పిటీషన్ వేస్తే కానీ న్యాయస్థానాలు పరిశీలించవు.
ఈ విషయాన్ని వివిధ కేసుల ద్వారా న్యాయస్థానాలకు తెలియజేయాలి. నేను కోర్టులలో కేసులు వేస్తే… జగన్మోహన్ రెడ్డితో వ్యక్తిగత వైరం వల్లే కేసులు వేస్తున్నానని పనికిమాలిన వారు తప్పుడు ప్రచారాన్ని చేస్తున్నారు. ప్రధాన ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడుతో పాటు, జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్, సిపిఐ పార్టీకి చెందిన నారాయణ, వివిధ రాజకీయ పక్షాలకు చెందినవారు ఈ రాష్ట్ర ప్రభుత్వ అక్రమాలపై కోర్టులో పిటిషన్ దాఖలు చేస్తే నాలుగు రోజులు ఆలస్యమైనా న్యాయం జరుగుతుంది.
అలాగే పోలీసు వ్యవస్థలో ఏ పోలీస్ తప్పు చేసినా ఆ తప్పును న్యాయస్థానం దృష్టికి తీసుకువచ్చేందుకు పిటిషన్ దాఖలు చేయండి. కింది కోర్టులు పరిగణలోకి తీసుకోకపోతే హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయాలి. తప్పు చేసిన పోలీస్ పై న్యాయస్థానాలలో పిటిషన్ దాఖలు చేసి ఉండడం అన్నది చాలా ముఖ్యం. ఎవరినైనా నేరుగా అరెస్టు చేయడానికి వీలు లేదు. ఈ విషయాన్ని నేను చెప్పడం లేదు చట్టమే చెబుతోంది.
చంద్రబాబు నాయుడు ని కూడా చుట్టుముట్టి నిబంధనలకు, చట్టానికి విరుద్ధంగా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు ఇప్పటికైనా మనకున్న చట్టాలను అర్థం చేసుకోవాలి. లేకపోతే తగిన మూల్యాన్ని చెల్లించవలసి వస్తుందని రఘురామ కృష్ణం రాజు హెచ్చరించారు.
న్యాయవాదులకే కాదు న్యాయమూర్తులకు పరీక్షలు నిర్వహించాలి
చట్టాలపై అవగాహన కోసం న్యాయవాదులకు తరచూ పరీక్షలు నిర్వహిస్తున్నట్లుగానే న్యాయమూర్తులకు కూడా పరీక్షలు నిర్వహించాలని రఘురామకృష్ణం రాజు కోరారు. వైద్యులకు మందులపై అవగాహన కోసం ప్రతీ ఐదేళ్లకోసారి పరీక్ష నిర్వహిస్తున్నారని, అలాగే మెజిస్ట్రేట్లకు, జిల్లా జడ్జీలకు, హైకోర్టు న్యాయమూర్తులకు పరీక్షలు నిర్వహించాలి. ఏడేళ్ల కంటే తక్కువ శిక్ష పడే కేసులలో 41 A నోటీసు సర్వ్ చేయాలని ఆర్నేష్ కుమార్ ఆర్డర్లో స్పష్టంగా పేర్కొనడం జరిగింది. అయినా పోలీసులు నిబంధనలను పాటించడం లేదు.
పోలీసులను మనమే కంట్రోల్లో ఉంచాలి. ప్రభుత్వం కంట్రోల్లో ఉంచడం లేదు. పోలీసులను వాడుకుంటుంది. గత రెండున్నర ఏళ్లుగా నా రోదన అరణ్య వేదనే అయ్యింది. అయినా నన్ను లాకప్లో చిత్రహింసలకు గురి చేసిన వారిని వదిలిపెట్టే ప్రసక్తి లేదు. పదేళ్లపాటు జైలు శిక్ష వేయించి తీరుతాను. తప్పు చేసిన పోలీసు వాడికి భయమన్నది లేకపోతే ఇటువంటి దిక్కుమాలిన పరిపాలకులు వచ్చినప్పుడు వాళ్లు ఇలాగే అరాచకాలను కొనసాగిస్తారని రఘు రామ కృష్ణంరాజు అన్నారు.
విజయసాయి రెడ్డి చేసిన ట్వీట్ పై రఘురామకృష్ణంరాజు స్పందిస్తూ గుండెపోటుతోపాటు గొడ్డలి పోటు అని కూడా రాసి ఉంటే బాగుండేది. క్రిమి కీటకాలంటూ పరోక్షంగా జగన్మోహన్ రెడ్డిని విజయసాయి విమర్శించినట్లుగా ఉంది. వైఎస్ వివేకానంద రెడ్డిని హత్య చేసి రక్తాన్ని కడగగలిగారు కానీ నిజాన్ని కడగలేరు. అక్టోబర్ 11 వ తేదీన సుప్రీంకోర్టులో జరిగే కేసు విచారణలో గొడ్డలి పోటు వెనుక ఎవరు ఉన్నారో, అన్నీ వెలుగులోకి వస్తాయి.
విజయసాయి ట్వీట్ న్యాయస్థానాలను అవమానించినట్లుగా ఉందని… అలాగే పిటిషన్ దాఖలు చేసిన అజయ్ కల్లం రెడ్డి, వైఎస్ అవినాష్ రెడ్డి, వైయస్ భాస్కర్ రెడ్డి, కృష్ణారెడ్డిలు రెండు వారాలపాటు వాయిదా కోరడం విడ్డూరంగా ఉందని రఘురామ కృష్ణంరాజు అన్నారు.
బుధవారం ఏసీబీ కోర్టు, హైకోర్టు, సుప్రీం కోర్టులలోని చంద్రబాబు కేసుల విచారణపై అందరి దృష్టి
తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టుపై బుధవారం నాడు ఏసీబీ న్యాయస్థానంలో, రాష్ట్ర హైకోర్టులో, సుప్రీంకోర్టులో కేసులు విచారణకు రానున్న నేపథ్యంలో అందరిలోనూ ఉత్కంఠ నెలకొన్నదని రఘు రామకృష్ణంరాజు తెలిపారు. సుప్రీంకోర్టులో అత్యవసరంగా శనివారం నాడు చంద్రబాబు నాయుడు రిమాండ్ రిపోర్టు క్వాష్ పిటీషన్ దాఖలు చేయగా, సోమవారం నాడు మెన్షన్ చేయాలని సీనియర్ న్యాయవాది సిద్ధార్థ సూత్ర కోరారు.
కేసు పూర్వపరాలను తెలుసుకున్న న్యాయమూర్తి, చంద్రబాబు నాయుడు ఎన్ని రోజులుగా జ్యుడీషియల్ కస్టడీలో ఉన్నారో అడిగి తెలుసుకున్నారు..మంగళవారం మధ్యాహ్నం తర్వాత ఈ కేసు లిస్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా చంద్ర చూడు బాధ్యతలు స్వీకరించిన తర్వాత కేసు లిస్టు చేయడానికి కనీసం రెండు, మూడు రోజుల వ్యవధిని తీసుకుంటున్నారు. సాధారణంగా మూడవ రోజు అయితే కేసు లిస్ట్ అయి ఏ బెంచ్ లో విచారించనున్నారో వివరాలను వెల్లడిస్తారు.
ఒకవేళ చంద్రబాబు నాయుడు రిమాండ్ రిపోర్ట్ క్వాష్ పిటిషన్ విచారణకు రాకపోతే బుధవారం నాడు మాత్రం కచ్చితంగా లిస్ట్ అయి విచారణకు వచ్చే అవకాశాలు ఉన్నాయి. చంద్రబాబు నాయుడు ని ఉద్దేశించి ఏసీబీ కోర్టు న్యాయమూర్తి హిమబిందు మీరు జ్యూడిషియల్ కస్టడీలోనే ఉన్నారు… అంతమాత్రాన నేరం చేసినట్లు కాదని చెబుతున్నారు. ఒక నిర్దోషి కస్టడీలో ఉండడం కరెక్ట్ కాదు కాబట్టి కచ్చితంగా రేపు లేకపోతే ఎల్లుండి కేసు విచారణకు వచ్చే అవకాశాలు ఉన్నాయి.
ఫలానా తీర్పు కరెక్టు… ఫలానా తీర్పు తప్పు అని చెప్పడానికి మనకు అవకాశం లేదు. అయితే ఫలానా కేసులో తీర్పు ఏమని చెప్పారో విశ్లేషించుకునే అవకాశం మనకు ఉంది. సుప్రీం కోర్టు, హైకోర్టు గత తీర్పులను ఈ సందర్భంగా విశ్లేషించుకుని, రేపు న్యాయస్థానం లో ఎటువంటి తీర్పు రానుందో ఒక అంచనాకు రావచ్చు. గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన కొన్ని తీర్పులను ఈ సందర్భంగా సామాన్యుడికి కూడా అర్థమయ్యే రీతిలో వివరిస్తానని రఘురామకృష్ణం రాజు తెలిపారు.
చట్టంలో ఏముందో… కొన్ని తీర్పులు ఎలా ఉన్నాయో… ఏపీ పోలీసులకు చట్టంపై అవగాహన లేదని, ఆ పైనున్న వారు కూడా చట్టం లేదు… తొక్క లేదు అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. రాష్ట్రంలో నిర్లక్ష్యమైన పరిపాలన కొనసాగుతోంది. కింది కోర్టులు ఇచ్చిన తీర్పులను నేను స్వాగతిస్తే… రియలైజేషన్ అంటూ కొంతమంది పనికిమాలిన వారు గాడిదలు కుక్కలు మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక రివ్యూ కేసులో సుప్రీం కోర్టు న్యాయమూర్తి జోసెఫ్ చేసిన వ్యాఖ్యలను ఈ సందర్భంగా రఘురామకృష్ణం రాజు ప్రధానంగా ప్రస్తావించారు.
దేశ రక్షణ కోసం కొనుగోలు చేసిన రఫెల్ యుద్ధ విమానాలలో అవినీతి జరిగిందంటూ ప్రశాంత్ భూషణ్, మనోహర్ లాల్ శర్మ అనే ఇద్దరు వ్యక్తులు సిబిఐకి ఫిర్యాదు చేశారు. సిబిఐ ఎటువంటి కేసు నమోదు చేయలేదు. దీనితో వారిద్దరూ న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. సుప్రీం కోర్టు ఈ కేసును కొట్టివేసింది. అయినా, వారిద్దరూ రివ్యూ పిటిషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా సుప్రీంకోర్టు ధర్మాసనం తమ నిర్ణయం సరైనదేనని పేర్కొంటూనే… 2018లో అవినీతి నిరోధక చట్టానికి తీసుకువచ్చిన సవరణలను ప్రస్తావిచ్చింది.
2018 జూన్ 26న అవినీతి నిరోధక చట్టానికి సవరణ చేస్తూ..17A నిబంధనను తీసుకువచ్చారు. రఫెల్ యుద్ధ విమానాలకు కొనుగోలు కోసం 2016లో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నేతృత్వంలో భారత ప్రభుత్వం ఒప్పందాన్ని కుదుర్చుకుంది. 2015లో ఆనాటి తెలుగుదేశం ప్రభుత్వం స్కిల్ డెవలప్మెంట్ స్కీమ్ అమలుకు ఒప్పందాన్ని కుదుర్చుకుంది. 2016లో రఫెల్ యుద్ధ విమానాల కొనుగోలు ఒప్పందం కుదిరిందని, 2018లో అవినీతి నిరోధక చట్టానికి సవరణలు చేశారని కేసు నమోదు చేయమని సిబిఐ ని సుప్రీంకోర్టు ధర్మాసనం ఆదేశించవచ్చు.
కానీ సుప్రీం కోర్టు ధర్మాసనం అలా తీర్పును ఇవ్వలేదు. ఇతర కారణాలతో పాటు అవినీతి నిరోధక చట్టంలోని 17A నిబంధనను గురించి ప్రత్యేకంగా ప్రస్తావించింది. పేరా నెంబర్ 116, 117, 118లో అవినీతి నిరోధక చట్టంలోని 17A నిబంధన అప్లికబుల్ అవుతుందని స్పష్టంగా పేర్కొనడం జరిగింది. గతంలో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పనిచేసిన జే కే మహేశ్వరి, 2022లో సుప్రీం కోర్టు న్యాయమూర్తిగా ఇచ్చిన ఒక తీర్పులో 17A అన్నది విత్ ప్రాస్పెక్టివ్ ఎఫెక్ట్ అని స్పష్టంగా దిశా నిర్దేశం చేశారు.
అవినీతి నిరోధక చట్టంలోని 17 A నిబంధన ఎవరికోసం ఉద్దేశించిందన్న విషయాన్ని పోలీసు అధికారులకు స్పష్టమైన మార్గ నిర్దేశకాలను జారీ చేయడం జరిగింది. అయినా ముఖ్యమంత్రి తీసుకున్న నిర్ణయాన్ని కాదని, అవినీతి జరిగినప్పుడు కేసు పెట్టవచ్చునని తనకు తానే రాజ్యాంగబద్ధ పదవిలో ఉన్నానని చెప్పుకుంటున్న సుధాకర్ రెడ్డి పేర్కొనడం విస్మయాన్ని కలిగిస్తోంది. 17 A నిబంధన అన్నది అవినీతి నిరోధక చట్టానికి సవరణ అయినప్పుడు, మేము అవినీతి గురించి మాత్రమే మాట్లాడుతున్నామని… ముఖ్యమంత్రి తీసుకున్న నిర్ణయం గురించి కాదని పేర్కొనడం విడ్డూరంగా ఉంది. ఈ విషయాన్ని విజ్ఞులైన ప్రజలు ఆలోచించాలి.
ఒక ముఖ్యమంత్రి తీసుకున్న నిర్ణయం అయితే, ఆ ముఖ్యమంత్రిని నియమించే అధికారం ఉన్న గవర్నర్ అనుమతిని తీసుకొని విచారించాలని 17A నిబంధనలో స్పష్టంగా పేర్కొనడం జరిగింది. అలాగే ఒక ప్రధానమంత్రి నిర్ణయాన్ని తీసుకున్నారంటే, ఆయన్ని విచారించడానికి రాష్ట్రపతి అనుమతి తీసుకోవాలని చెప్పడం జరిగింది. ఇదే విషయాన్ని సిబిఐ మాజీ డైరెక్టర్ నాగేశ్వరరావు తో పాటు, సుప్రీం కోర్టు తీర్పులు కూడా స్పష్టం చేస్తున్నాయి. సుప్రీంకోర్టు త్రిసభ్య ధర్మాసనం ఇచ్చిన తీర్పును కాదనాలంటే, అంతకంటే ఎక్కువ మంది సభ్యులు కూర్చున్న ధర్మాసనం మాత్రమే తీర్పును ఇవ్వాల్సి ఉంటుంది.
సుప్రీంకోర్టులో చంద్రబాబు నాయుడు రిమాండ్ రిపోర్ట్ క్వాష్ పిటీషన్ ద్విసభ్య ధర్మాసనం బెంచ్ విచారించనుందని రఘురామ కృష్ణంరాజు తెలిపారు. బుధవారం నాడు ఏసీబీ కోర్టులో చంద్రబాబు నాయుడు బెయిల్ పిటిషన్ విచారణకు రానుండగా, హైకోర్టులో చంద్రబాబు నాయుడు పై దాఖలు జారీ చేసిన పిటి వారెంట్లపై ముందస్తు బెయిల్ పిటిషన్ విచారణకు రానుంది. ఈ కేసుల్లో ఇప్పటికే ముద్దాయిలుగా పేర్కొన్నవారు న్యాయస్థానం నుంచి బెయిల్ పొందారని రఘు రామకృష్ణంరాజు తెలిపారు.
15 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ తరువాత పోలీసు కస్టడీకి ఇవ్వడానికి వీలు లేదు… జ్యుడీషియల్ రిమాండ్ పొడిగించవచ్చు
చంద్రబాబు నాయుడు సహకరించడం లేదని, పోలీస్ కస్టడీకి ఇవ్వాలని ఏసీబీ కోర్టును అడిగామని పీపీ వివేకానంద అనే అధికారి పేర్కొన్నట్లుగా టీవీలలో చూడడం జరిగింది. అయితే, చట్టంలోనే కొన్ని రూలింగ్ క్లారిఫికేషన్ ఉన్నాయని గతంలో సుప్రీం కోర్టు స్పష్టం చేసినట్లు రఘురామకృష్ణం రాజు తెలిపారు. ఒకసారి 15 రోజులపాటు జ్యూడిషియల్ రిమాండ్ కు ఇచ్చిన తరువాత పోలీసు కస్టడీకి ఇవ్వడానికి వీలు లేదని నిబంధనలు స్పష్టం చేస్తున్నాయి. మొదట అయితే మొత్తం పోలీసు కస్టడీకి ఇవ్వవచ్చు. చంద్రబాబు నాయుడు కేసులో రెండు రోజులకు మించి పోలీసు కస్టడీ ఇవ్వడానికి లేదని నేను రచ్చబండలో చెప్పాను. అదే జరిగింది.
అయినా వివేకానంద అనే అధికారి పోలీస్ కస్టడీ కోసం కోరామని, మళ్లీ చంద్రబాబును విచారిస్తామని చెప్పినట్లుగా టీవీలో చూశాను. జ్యుడీషియల్ రిమాండ్ ను పొడిగించవచ్చు. కానీ పోలీసు కస్టడీ ఇవ్వడానికి నిబంధనలు అంగీకరించవు. చార్జి షీట్ వేయకపోతే 90 రోజుల పాటు జైలులోనే ఉండాల్సి వస్తుంది. అయినా ఈ కేసులో చంద్రబాబు నాయుడు కి బుధవారము నాడు కచ్చితంగా బెయిల్ లభిస్తుంది. చంద్రబాబు నాయుడుని పోలీసు కస్టడీకి ఇవ్వడం జరగదని నేను చదివిన న్యాయ పరిజ్ఞానం చెబుతోంది.
15 రోజుల జ్యుడీషియల్ క స్టడీ ముగిసిన తర్వాత మళ్లీ పోలీసు కస్టడికి ఇవ్వరని నాకు తెలుసు. అయినా చట్టంలో ఏమైనా సవరణలు జరిగాయేమో అంటూ రఘురామకృష్ణంరాజు పేర్కొన్నారు. ఇక్కడ అప్లికబుల్ కాదా అన్నది చెప్పలేను. సిఐడి వాళ్లు తప్పుడు నివేదికను అందజేయడంతో, తప్పులను సరి చేసుకోవాలని న్యాయమూర్తి ఆదేశించినట్లు తెలిసింది. వారు ఆ తప్పులను ఎప్పుడు సరి చేస్తారో మరి. న్యాయమూర్తి ఎప్పుడు వింటారో..!. ఇక రెండు కేసుల్లో చంద్రబాబు నాయుడు పై సిఐడి పోలీసులు పిటి వారెంట్లు జారీ చేయగా, హైకోర్టులో ముందస్తు బెయిల్ కు పిటిషన్ దాఖలు చేయడం జరిగిందని రఘురామకృష్ణం రాజు తెలిపారు.