-
కమిషనర్ మల్లికార్జున బదిలీ
-
మంత్రి సొంత నియోజకవర్గానికి బదిలీ చేస్తూ ఉత్తర్వు
-
పరిటాల పంతమే నెరవేరింది
-
మల్లికార్జునను మార్చాలంటూ ధర్మవరం టీడీపీ నేతల పట్టు
-
మంత్రి సత్యకుమార్‌కు షాక్
( మార్తి సుబ్రహ్మణ్యం)
ఉమ్మడి అనంతపురం జిల్లా ధర్మవరం నియోజవర్గంలో కొద్దిరోజుల నుంచి మంత్రి సత్యకుమార్-టీడీపీ యువనేత పరిటాల శ్రీరాం మధ్య ..మున్సిపల్ కమిషనర్ బదిలీ కేంద్రంగా జరుగుతున్న పోరాటంలో, చివరకు టీడీపీ నేత పరిటాల శ్రీరాం పంతమే నెగ్గింది. ధర్మవరం మున్సిపల్ కమిషనర్ వి.మల్లికార్జునను, ప్రొద్దుటూరు బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
వైసీపీ జమానాలో టీడీపీ నేతలను ఇబ్బంది పెట్టిన మున్సిపల్ కమిషనర్ మల్లికార్జునను, మంత్రి సత్యకుమార్ ధర్మవరం మున్సిపాలిటీకి తీసుకురావడంతో వివాదం మొదలయింది. నాటి వైసీపీ ప్రభుత్వం చెప్పినట్లు ఆడిన మల్లికార్జునను, కమిషనర్‌గా ఎలా తీసుకువస్తారని ధర్మవరం టీడీపీ నేతలు, పరిటాల శ్రీరామ్‌పై ఒత్తిడి తీసుకువచ్చారు.
దానితో ఆయన మంత్రి సత్యకుమార్‌తో భేటీ అయి, టీడీపీ కార్యకర్తల మనోభావాలు ఆయన దృష్టికి తీసుకువెళ్లారు. ఎట్టి పరిస్థితిలో మల్లికార్జున రావడానికి వీల్లేదని స్పష్టం చేశారు. అటు పట్టణ టీడీపీ నేతలు సైతం మల్లికార్జున రావడానికి వీల్లేదని, వచ్చినా తాము పనిచేయనీయని హెచ్చరించారు.
అయినా మల్లికార్జున కమిషనర్‌గా రావడం, టీడీపీ శ్రేణుల అహం దెబ్బతినడానికి కారణమయింది. మంత్రి సత్యకుమార్ నిర్వహించిన సమీక్షకు హాజరైన మల్లికార్జునను చూసి, టీడీపీ శ్రేణులు ఆగ్రహంతో ఊగిపోయారు. ఆయనను ఎలా తీసుకువచ్చారని నిలదీశారు. దీనిపై తాము అధిష్ఠానంతో తేల్చుకుంటామని హెచ్చరించారు. ఈ వ్యవహారాన్ని వారు ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నారు. ఇవన్నీ మీడియాకెక్కడం ఆసక్తికరంగా మారింది.
‘‘ఎన్నికలప్పుడు వచ్చిన సత్యకుమార్‌కు మల్లికార్జున సంగతి ఏం తెలుసు? మమ్మల్ని వేధించిన అధికారిని సత్యకుమార్ ఎలా తీసుకువస్తారు? పార్టీ జెండా మోసిన వాళ్లకు తెలుస్తాయి కార్యకర్తల కష్టాల’’ంటూ సత్యకుమార్‌పై విరుచుకుపడ్డారు.
దీనితో దిద్దుబాటుకు దిగిన టీడీపీ నాయకత్వం.. మల్లికార్జునను ధర్మవరం నుంచి, సత్యకుమార్ సొంత నియోజకవర్గమైన ప్రొద్దుటూరుకు బదిలీ చేస్తూ తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. తాజా పరిణామాలతో మంత్రి సత్యకుమార్‌కు షాక్ తగిలినట్టయింది. దీనిపై మంత్రితో మాట్లాడేందుకు ప్రయత్నించగా, ఆయన ఫోన్‌కు స్పందించలేదు.