Suryaa.co.in

Editorial

కర్ణాటక ఎన్నికల్లో కిరణ్‌కుమార్‌రెడ్డికి కీలక బాధ్యతలు?

– బీఎల్ సంతోష్, అమిత్‌షా, యడ్యూరప్ప, కిషన్‌రెడ్డితో కిరణ్ భేటీ
– సామాజికవర్గ కోణంలో కిరణ్‌కు దన్నుగా కిషన్‌రెడ్డి?
తెలుగువారున్న ప్రాంతాల్లో కిరణ్ ప్రచారం
(మార్తి సుబ్రహ్మణ్యం)

బీజేపీలో చేరిన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చివరి సీఎం నల్లారి కిరణ్‌కుమార్ రెడ్డిని.. ఆ పార్టీ నాయకత్వం, కర్నాటక ఎన్నికల ప్రచార బరిలో దింపాలని నిర్ణయించినట్లు సమాచారం. ఆ మేరకు ఆ రాష్ట్రానికి చెందిన బీజేపీ జాతీయ సంఘటనా మంత్రి బీఎల్ సంతోష్‌జీ, హోం శాఖ మంత్రి అమిత్‌షా, బీజేపీ కర్నాటక నేత యడ్యూరప్ప స్పష్టమైన సంకేతాలిచ్చినట్లు తెలుస్తోంది. ఢిల్లీలో ఉన్న కిరణ్ వారితో భేటీ అయ్యారు. కర్నాటకలో తెలుగు వారున్న ప్రాంతాల్లో, కిరణ్‌ను ప్రచారానికి పంపించాలని బీజేపీ నాయకత్వం నిర్ణయించింది. కిరణ్ కుటుంబానికి బెంగ ళూరు నగరంలో వ్యాపారాలున్న విషయం తెలిసిందే.

నిజానికి కిరణ్‌కుమార్‌రెడ్డి మరికొద్దిరోజుల తర్వాత బీజేపీలో చేరాలని భావించారు. ఈలోగా అమెరికా వెళ్లాలని, ఆ మేరకు షెడ్యూల్ రూపొందించుకున్నారు. కానీ బీజేపీ నాయకత్వం హటాత్తుగా ఆయనను పిలిపించి, వెంటనే పార్టీలో చేరి.. కర్నాటక ప్రచార బరిలో దిగాలని సూచించినట్లు సమాచారం. కిరణ్ బీజేపీలో చేరేందుకు కీలక పాత్ర పోషించిన కేంద్రమంత్రి ప్రహ్లాద్, బీఎల్ సంతోష్‌జీ, కిషన్‌రెడ్డి కూడా ఆయనను కర్నాటక ఎన్నికల ప్రచార బరిలో దిగాలని సూచించగా, అందుకు కిరణ్ అంగీకరించినట్లు పార్టీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.

ఇదిలాఉండగా.. కిరణ్‌కు కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి దన్నుగా నిలిచారు. శనివారం కిషన్‌రెడ్డితో కిరణ్, ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు, ప్రధాన కార్యదర్శి విష్ణువర్దన్‌రెడ్డి భేటీ అయ్యారు. సామాజికవర్గ కోణంలో కిషన్‌రెడ్డి.. మాజీ సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డిని ప్రోత్సహిస్తున్న నేపథ్యంలో, ఏపీకి సంబంధించి పార్టీ అవసరాలు-వైసీపీతో బీజేపీ సంబంధాలను, కి రణ్‌కు వివరించినట్లు పార్టీ వర్గాల సమాచారం.

ఉమ్మడి ఏపీ మాజీ సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి శనివారం కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్‌షాను కలిశారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా నివాసంలో కలిసి తాజా రాజకీయాలపై చర్చించారు. బీజేపీలో చేరిన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్‌ రెడ్డి కేంద్ర హోం మంత్రి అమిత్‌ షాను మర్యాదపూర్వకంగా కలిశారు.

బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా నివాసంలో అమిత్‌ షాను కలిసిన ఆయన తాజా రాజకీయాలపై కొద్దిసేపు చర్చించారు. నడ్డా నివాసంలోనే పార్టీ సంస్థాగత వ్యవహారాల జాతీయ ప్రధాన కార్యదర్శి బీఎల్‌ సంతోష్‌, కర్ణాటక మాజీ సీఎం యడ్యూరప్పను కూడా కలిశారు. ఇదే సమయంలో నడ్డా, అమిత్‌ షా, బీఎల్‌ సంతోష్‌, యడ్యూరప్ప, కర్ణాటక సీఎం బొమ్మై సమావేశమై కర్ణాటక ఎన్నికలపై చర్చించారు.

వీరితో పాటు కిరణ్‌కుమార్‌రెడ్డి కూడా సమావేశంలో పాల్గొన్నారు. కర్ణాటక ఎన్నికల్లో అనుసరించాల్సిన వైఖరి, అభ్యర్థుల ఖరారు, ఇతర అంశాలపై చర్చించినట్టు సమాచారం. కర్ణాటక ఎన్నికలకు సంబంధించి కిరణ్ కుమార్‌రెడ్డికి పలు బాధ్యతలు అప్పగించే అవకాశం ఉన్నట్టు సమాచారం.

ప్రధానంగా తెలుగు ఓటర్లను ఆకర్షించేందుకు బెంగళూరు కేంద్రంగా కిరణ్‌ కుమార్‌ రెడ్డి సేవలు వినియోగించుకోవాలని భాజపా అధిష్ఠానం భావిస్తున్నట్టు తెలుస్తోంది. ప్రధాన మంత్రి తమిళనాడు, కర్ణాటక రాష్ట్రల్లో పర్యటన ముగించుకుని ఆదివారం మధ్యాహ్నం ఢిల్లీ చేరుకున్న తర్వాత , బీజేపీ పార్లమెంటరీ బోర్డు భేటీ కానుంది.

కర్ణాటక ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల జాబితాను పార్లమెంటరీ బోర్డు ఖరారు చేయనుంది. బోర్డు సమావేశానికి ముందే పలు అంశాలపై కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశముంది. శనివారం భేటీలో చర్చించిన అంశాలను తిరిగి బోర్డులో కూడా చర్చించిన తర్వాత బీజేపీ పెద్దలు ఆమోద ముద్ర వేయనున్నారు.

LEAVE A RESPONSE