– కోమటిరెడ్డి బ్రదర్స్ కథే వేరు
– అన్న కాంగ్రెస్, తమ్ముడు కమలం
– ప్రచారానికి దూరంగా వెంకటరెడ్డి
– రేవంత్‌రెడ్డిపై నిష్ఠూరాలతో సరి
– రేవంత్ సాకుతో ఎన్నిక ప్రచారానికి ఎగనామం
– తమ్ముడి గెలుపు కోసం తెగ ఆరాటం
– ప్రచారానికి పనికిరాని కాంగ్రెస్, ఓట్ల కోసం కావాలట
– వెంకటరెడ్డి ఎంతకాలం ముసుగేసుకుంటారు?
– వెంకటరెడ్డి కాషాయం కప్పేసుకోవడం అనివార్యమేనా?
– పార్టీలు వేరయినా అన్నదమ్ముల అనుబంధం అద్భుతం
( మార్తి సుబ్రహ్మణ్యం)
ఇదో రకమైన పొలిటికల్ మ్యాచ్ ఫిక్సింగ్. తమ్ముడు ఓ పార్టీలో ఉంటారు. అన్నయ్య అవతల పార్టీలో ఉంటారు. రెండు పార్టీలూ తెల్లారిలేస్తే ఒకరిపై మరొకటి దుమ్మెత్తిపోసుకుంటాయి. తమ్ముడి పార్టీనేమో టీఆర్‌ఎస్-కాంగ్రెస్ మ్యాచ్‌ఫిక్సింగ్ చేసుకున్నాయని ఆరోపిస్తుంది. అన్నయ్య పార్టీయేమో టీఆర్‌ఎస్-బీజేపీ కుమ్మక్కయ్యాయని ఆరోపిస్తుంది. కానీ అక్కడ మాత్రం ఏ పార్టీలో ఉన్నా అన్నదమ్ములు మాత్రం ఒకరికొకరు సహకరించుకుంటారు. తమ్ముడి పార్టీ వేరయినా, ఆయనను గెలిపించాలని అన్నయ్య తానున్న పార్టీ నేతలకు ఫోన్లు చేస్తుంటారు. మళ్లీ అన్నదమ్ములిద్దరూ తెల్లారిలేస్తే నైతిక విలువల పుస్తకాలు చదువుతుంటారు. ఇదీ మునుగోడులో కోమటిరెడ్డి బ్రదర్స్ పొలిటికల్ మ్యాచ్ ఫిక్సింగ్ కథ.
మునుగోడు ఉప ఎన్నికలో అపూర్వ సహోదరులు రక్తసంబంధం బాగా వర్కవుటవుతోంది. బీజేపీ అభ్యర్ధిగా ఉన్న తన తమ్ముడు రాజగోపాల్‌రెడ్డిని గెలిపించాలని,కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకరెడ్డి కాంగ్రెస్ నేతలకు ఫోన్లు చేయటం మునుగోడు ప్రజలను నివ్వెరపరుస్తోంది. ఇప్పుడు ఆ వీడియో వైరల్ అవుతోంది. ఒకవైపు తాము బీజేపీ అభ్యర్ధిపై అలుపెరుగని పోరాటం చేస్తుంటే, మరోవైపు కాంగ్రెస్‌లో ఉంటూ, కాంగ్రెస్ అభ్యర్ధికి వ్యతిరేకంగా పనిచేయటం క్రమశిక్షణా రాహిత్యమేనని కాంగ్రెస్ నేతలు విరుచుకుపడుతున్నారు.
పార్టీకి వ్యతిరేకంగా పనిచేసే చిన్న స్థాయి నేతలపై సస్పెన్షన్ వేటు వేస్తున్న నాయకత్వం… ప్రత్యర్థి పార్టీకి చెందిన తమ్ముడికి, ఓటేయమని చెప్పిన కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డిని గెలిపించాలని ఫోన్ చేసిన కోటమటిరెడ్డి వెంకటరెడ్డిని మాత్రం, మినహాయించడంపై కాంగ్రెస్ శ్రేణుల్లో ఆగ్రహం వ్యక్తమవుతోంది.
రేవంత్‌రెడ్డి తీరు-వ్యాఖ్యలపై అసంతృప్తితో, ఎన్నిక ప్రచారానికి రానని చెప్పిన కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఈవిధంగా దొడ్డిదారిన తమ్ముడికి ప్రచారం చేయడం ఏమిటని కాంగ్రెస్ శ్రేణులు ప్రశ్నిస్తున్నాయి. వెంకటరెడ్డి-ఉత్తమ్‌కుమార్‌రెడ్డి సూచనతోనే, స్రవంతికి కాంగ్రెస్ టికెట్ ఇచ్చిన విషయాన్ని కాంగ్రెస్ నేతలు గుర్తు చేస్తున్నారు. అయితే, తీరా ప్రచారంలోకి రాకుండా విదేశాలకు వెళ్లిపోయిన వెంకటరెడ్డి మౌనంగా ఉంటే సరిపోయేదంటున్నారు. అలాకాకుండా కాంగ్రెస్ లోని తన అనుచరులకు ఫోన్లు చేసి, తమ్ముడిని గెలిపించాలని అడగటం ఏం ధర్మమని కాంగ్రెస్ నేతలు ప్రశ్నిస్తున్నారు.
నైతిక విలువల గురించి ఎక్కువగా మాట్లాడే వెంకటరెడ్డి..ఇలా మరొక పార్టీ అభ్యర్థిని గెలిపించాలని చెప్పడం నైతికమా? అని మునుగోడు మండల స్థాయి కాంగ్రెస్ నేతలు ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. మునుగోడులో స్వతహాగా బీజేపీకి బలం లేకపోవడం, కాంగ్రెస్‌తో ఉన్న తన మద్దతుదారులు తనతో పాటు బీజేపీలోకి రాకపోవడం వంటి సమస్యలు ఎదర్కొంటున్న కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డికి.. చివరకు కాంగ్రెస్‌లో ఉన్న తన అన్న వెంకటరెడ్డి సాయమే దిక్కయినట్లు కనిపిస్తోంది.
తాజా పరిణామాలు పరిశీలిస్తే.. ప్రస్తుతం కాంగ్రెస్ ఎంపీగా ఉన్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా, త్వరలోనే కాషాయం కప్పేసుకోవడం ఖాయంగానే ఉందన్న చర్చకు తెరలేచింది. రేవంత్‌రెడ్డి పీసీసీ చీఫ్‌గా ఉన్నంతకాలం, వెంకటరెడ్డి ఆ పార్టీలో క్రియాశీలక పాత్ర పోషించలేరు. ఆయన మౌనంగా ఉంటే అనుచరులు కూడా, ఎక్కువ కాలం వెంకటరెడ్డి వెంట ఉండటం కష్టం. అలాగని ఎక్కువ కాలం తమ్ముడు రాజగోపాల్‌రెడ్డి బీజేపీలో, వెంకటరెడ్డి కాంగ్రెస్‌లో వేర్వేరుగా ఉండటం కూడా కష్టం. దానివల్ల వారిద్దరి ఇమేజీకి డామేజీ తప్పదు.
ఒకే కుటుంబంలో ఇద్దరు నేతలు, వేర్వేరు పార్టీలో ఉన్నా ప్రజలు నమ్మే పరిస్థితి ఉండదు. ఒకవేళ రేపు బీజేపీ అభ్యర్థిగా తమ్ముడు రాజగోపాల్‌రెడ్డి గెలిస్తే, తర్వాత ఏ సందర్భంలోనయినా ఆయనను అన్నయ్య వెంకటరెడ్డి విమర్శించక తప్పదు. ఈవిధంగా కుటుంబ-రాజకీయ ఇరకాట పరిస్థితిని అధిగమించాలంటే కోమటిరెడ్డి వెంకటరెడ్డికి కాపాయం కప్పేసుకోక తప్పదన్నది విశ్లేషకుల వ్యాఖ్య.