Suryaa.co.in

Andhra Pradesh

కేంద్ర ఆర్థికశాఖ రాసిన లేఖ జగన్ రెడ్డి సర్కార్ కి చెంపపెట్టు

• రాష్ట్రంలో ఆర్థిక అరాచకత్వం నడుస్తోంది. ఆర్థిక క్రమశిక్షణ లోపించడంవల్ల రాష్ట్ర ఖజానా పూర్తిగా దివాళా తీసింది
• రాష్ట్ర ప్రభుత్వ లూటీ వల్ల నేడు వరల్డ్ బ్యాంక్, ఏఐఐబి, ఎన్‌డిబి వంటి ప్రపంచ ఆర్థిక సంస్థలు ఒక్క పైసా నిధులిచ్చే పరిస్థితుల్లో లేవు
• జనవరి 17, 2022న కేంద్ర ఆర్థిక శాఖ డిప్యూటీ సెక్రటరి డాక్టర్ ప్రసన్న రాష్ట్ర ప్రభుత్వానికి వివిధ ప్రపంచ బ్యాంకుల ద్వారా విడుదలైన రుణాలకు సంబంధించి ఘాటైన లేఖ రాయడం జరిగింది
• భవిష్యత్తులో ప్రపంచ బ్యాంకుల నుండి ఏ విధమైన నిధులు విడుదల కావాలన్నా తాము విధించిన షరతులను తక్షణమే అమలుపరచాలని ఖరాఖండిగా చెప్పారు
• రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి తన అజ్ఞాతవాసాన్ని వీడి మీడియా ముందుకు వచ్చి రాష్ట్ర ప్రజలకు ఈ లేఖపై వివరణ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాం
• రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేని విధంగా నేడు కేంద్ర ఆర్థిక శాఖ రాష్ట్రంలో జరుగుతున్న ఆర్థిక అరాచకత్వంపై ఇంత తీవ్రంగా స్పందించిన తీరుకు రాష్ట్ర ముఖ్యమంత్రి సిగ్గుతో తలదించుకోవాలి
• రాష్ట్రంలో నెలకొనియున్న ఆర్థిక ఉగ్రవాదంవల్ల అనేక మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల పురోగతి కుంటుపడి ప్రజలు తీవ్ర ఇక్కట్లు పడుతున్నారు
– టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్ 

రాష్ట్రప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా సాగిస్తున్న పరిపాలనలో రాష్ర్ట్రం ఏ విధంగా దివాలా తీసిందో ప్రజలందరికీ తెలుసు. మూడు సంవత్సరాలుగా ఆర్థిక క్రమశిక్షణ లేకపోవడంవల్ల ఖజానా పూర్తిగా ఖాళీ అయింది. రాష్ట్రంలో ఆర్థిక అరాచక పాలన నడుస్తోంది. వైసీపీ నాయకులు విచ్చలవిడిగా దోపిడీకి పాల్పడుతున్నారు. ఖజానాని ఎవరికివారు ఇష్టమొచ్చినట్లు దోచుకుంటున్నారు. ముఖ్యమంత్రి మొదలుకొని కేబినెట్ మంత్రులు, వైసీపీ ప్రజాప్రతినిధుల వరకు పూర్తిగా నిధుల్ని కొల్లగొట్టుకున్నారు. అంతేకాక నిధుల దుబారాకు పాల్పడుతున్నారు. ఆర్థిక క్రమశిక్షణ లోపం స్పష్టంగా కనబడుతోంది. రాష్ట్రంలో ఆర్థిక అరాచకత్వం, ఆర్థిక ఉగ్రవాదం తాండవిస్తున్నాయి. ఈ దుస్థితివల్ల భవిష్యత్తులో ఏ ఆర్థిక సంస్థ కూడా నిధులు ఇవ్వని పరిస్థితి నెలకొంది. వరల్డ్ బ్యాంక్, ఏసియన్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్ మెంట్ బ్యాంక్, న్యూ డెవలప్ మెంట్ బ్యాంక్ మరియు విదేశీ ఫైనాన్షియల్ ఇన్సిటిట్యూషన్స్, ఆర్థిక సంస్థలు, బ్యాంకులు పైసా కూడా రాష్ర్ట్రానికి నిధులు విడుదల చేయని పరిస్థితులు ఉన్నాయి. ఇందుకు పూర్తి బాధ్యత ముఖ్యమంత్రి జగన్ రెడ్డిదే.

నాలుగు రోజుల క్రితం జనవరి 17,2022న కేంద్ర ఆర్థిక శాఖ డిప్యూటీ సెక్రటరి డాక్టర్ ప్రసన్న మినిష్టరీ ఆఫ్ ఫైనాన్స్, డిపార్టుమెంట్ ఆఫ్ ఎకనామిక్ ఎఫైర్స్ తరపున రాష్ట్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరి రావత్ గారికి వివిధ ప్రపంచ బ్యాంకుల నిధుల దుర్వినియోగం, దారిమళ్లింపుకు సంబంధించి ఘాటైన లేఖ రాశారు. ఇటువంటి లేఖలు కేంద్ర ఆర్థిక శాఖ నుండి రావడం రాష్ట్ర ప్రభుత్వానికి సిగ్గుచేటు. చంద్రబాబునాయుడు గారి హయాంలో ఇటువంటి పరిస్థితులు ఏనాడు లేవు. జగన్ నిర్వాకం వల్ల రాష్ట్ర ప్రభుత్వం ఆర్థికపరంగా చాలా గడ్డు పరిస్థితుల్లోకి వెళ్లిపోయింది. రాష్ట్రంలో ఒకరకమైన ఆర్థిక ఎమర్జెన్సీ నెలకొనివుంది.

రాష్ట్రంలో రోడ్లు మరియు వివిధ రకాల అభివృద్ధి ప్రాజెక్టులకు సంబంధించి పలు అంతర్జాతీయ బ్యాంకుల నుండి మంజూరైన రుణాలకు సంబంధించి అడ్వాన్సులు పొందడం కోసం అనుమతి ఇవ్వాలని రాష్ట్ర ఆర్థిక శాఖ ప్రిన్సిపుల్ సెక్రటరి రావత్ గారు డిసెంబర్ 16, 2021న ఒకసారి, మరలా డిసెంబర్ 21, 2021న మరోసారి కేంద్ర ఆర్థిక శాఖకు లేఖలు రాయడం జరిగింది. గతంలో నారా చంద్రబాబునాయుడు గారు రాష్ట్రంలో వివిధ రోడ్లు మరియు మౌలిక సదుపాయాల ప్రాజెక్టులు చేపట్టుటకొరకై ఏసియన్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెన్ట్‌మెంట్ బ్యాంకు (ఏఐఐబి) నుండి 455 మిలియన్ యుఎస్ డాలర్లు అనగా సుమారు 3,300 కోట్ల రూపాయలు మరియు న్యూ డెవలప్‌మెంట్ బ్యాంకు నుంచి దాదాపు 6,400 కోట్ల పైచిలుకు నిధులు మంజూరు చేయించారు.

(70 : 30) దామాషాలో ప్రాజెక్టు వ్యయంలో అంతర్జాతీయ బ్యాంకులు మరియు రాష్ట్ర ప్రభుత్వం భరించేలా రూపకల్పన చేసి తద్వారా పొందే నిధులను రాష్ట్రంలో కీలకమైన ఆంధ్రప్రదేశ్ రూరల్ రోడ్స్ ప్రాజెక్ట్ (ఏపీఆర్ఆర్‌పి), ఆంధ్రప్రదేశ్ రోడ్స్ అండ్ బ్రిడ్జస్ రీకన్‌స్ట్రక్షన్ ప్రాజెక్ట్ (ఏపీఆర్ బిఆర్‌పి), ఆంధ్రప్రదేశ్ మండల్ కనెక్టివిటీ అండ్ రూరల్ కనెక్టివిటీ ఇంప్రూమెంట్ ప్రాజెక్ట్ (ఏపీఎంసీఆర్‌సీఐపీ) వంటి అనేక ప్రాజెక్టులను ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం ఆనాడు చంద్రబాబునాయుడు చేశారు.

నేడు వీటికి మరియు ఇతర రుణాలకు సంబంధించి అడ్వాన్సులు పొందడం కోసం రాష్ట్రం కేంద్ర ఆర్థిక శాఖని తన లేఖల ద్వారా అనుమతి కోరగా జనవరి 17, 2022న కేంద్ర ఆర్థిక శాఖ ఇచ్చిన జవాబులో రాష్ట్ర ప్రభుత్వ విన్నపాన్ని నిర్ద్వందంగా తోసిపుచ్చడం జరిగింది. అంతేకాకుండా ఆయా రుణాలకు సంబంధించి నిధులు రాష్ట్రం పొందాలంటే తాను విధిస్తున్న అనేక షరతులుకు లోబడి పనిచేయాల్సివుంటుందని రాష్ట్ర ఆర్థిక శాఖపై కొరడా ఝుళిపించింది.

కేంద్రం తన లేఖ ద్వారా విధించినటువంటి అనేక షరతులలో ముఖ్యమైనది విదేశీ బ్యాంకుల నుండి రుణాలు మంజూరైన వివిధ ప్రాజెక్టులకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం తన వాటాగా చెల్లించాల్సిన 30 శాతం నిధులను తక్షణమే చెల్లించాలని, ఆ తదుపరి మాత్రమే బ్యాంకు రుణాల నిధులు పొందే ఆస్కారం ఉంటుందని తేల్చి చెప్పింది.

ఇంతవరకు ఈ రుణాలకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వ వాటాగా ఒక్క రూపాయి కూడా జమచేయలేదు. పై బ్యాంకుల నుండి నేటి వరకు అడ్వాన్సుగా వచ్చిన నిధులన్నింటిని రాష్ట్ర ప్రభుత్వం దారిమళ్ళించి దిగమింగుతోంది. ఆ కోవలోనే గ్రామీణ ప్రాంత రోడ్ల అభివృద్ధి ప్రాజెక్టు (ఏపీఆర్‌ఆర్ పి- ఆంధ్రప్రదేశ్ రూరల్ రోడ్స్ ప్రాజెక్టు) కిగాను గతంలో ఏఐఐబి బ్యాంకు నుండి అడ్వాన్సుగా తీసుకున్న 70 మిలియన్ డాలర్లు దారి మళ్లించి దోపిడీ చేశారు. ఇప్పుడు కేంద్రం తన లేఖలో ఆ 70 మిలియన్ డాలర్లకు సంబంధించి లెక్కలు కూడా తక్షణమే అప్పజెప్పాలని షరతు విధించింది. రాష్ట్రంలో రోడ్ల పరిస్థితి ఎంత అధ్వాన్నంగా మారిందో మనందరికి తెలుసు. కనీసం గుంటలు కూడా పూడ్చలేని పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వముంటే వచ్చిన నిధుల్ని దారి మళ్లించి రోడ్లను పూర్తిగా నిర్లక్ష్యం చేశారు.

అదేవిధంగా మరొక షరతుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రపంచ బ్యాంకు ఏఐఐబి మరియు ఇతర బ్యాంకుల నుండి ఏపి24×7 ప్రాజెక్టు మరియు ఇతర ఇఏపీ (ఎక్స్టర్నర్లీ ఎయిడెడ్ ప్రాజెక్టులు) క్రింద అడ్వాన్స్ గా పొందిన ధనాన్ని తక్షణమే ఆయా ప్రాజెక్టుల ప్రాజెక్టు ఇంప్లిమెంటింగ్ అథారిటిలకు బదిలీ చేసి ఆ వివరాలను తమకు పంపాలన్న నిబంధన కూడా విధిస్తున్నట్లు తమ లేఖలో పేర్కొన్నారు. దీని వల్ల జగన్ సర్కార్ వివిధ బ్యాంకుల నుండి ప్రాజెక్టుల పేరుతో తీసుకున్న రుణాలు మొత్తం ఎటు దారి మళ్లించి ఎవరికి దోచిపెట్టారో వారి వద్ద నుండి ఆ సొమ్మును వెనక్కి రప్పించి తిరిగి ఆయా ప్రాజెక్టు ఇంప్లిమెంటింగ్ అథారిటీల ఖాతాలలోకి జమ చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది.

ఈ షరతువల్ల జగన్ సర్కార్ ఎవరెవరికి ఎంతెంత దోచిపెట్టారో, పెద్దిరెడ్డికి చెందిన పీఎల్‌ఆర్ కంపెనీ మరియు ఇతర బినామీలకు ఎంత మళ్ళించారో తేలే పరిస్థితి ఏర్పడింది. దోచిపెట్టిన డబ్బంతా మళ్లీ వెనక్కి తెచ్చి సంబంధిత శాఖలకు మీరు చెల్లింపులు చేస్తేనే భవిష్యత్తులో కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ నుండి ఇంకా ఏసియన్ ఇన్ ఫ్రా స్ట్రక్చర్ బ్యాంక్, ఎన్డీపీ, వరల్డ్ బ్యాంక్ నుంచి డబ్బులు డ్రా చేయడానికి అనుమతి లభిస్తుందని తేల్చి చెప్పింది. అలా చేయకపోతే రాష్ర్ట ప్రభుత్వానికి ఒక్క పైసా కూడా భవిష్యత్‌లో రాదు.

అదేవిధంగా ఇకమీదట వివిధ అంతర్జాతీయ బ్యాంకుల ద్వారా పొందే రుణాలకు సంబంధించిన డబ్బు వారం రోజులలోపు సంబంధిత పీడీ అకౌంట్స్ లలో జమ చేసి తీరాల్సిందేనని నిబంధన విధించారు. దీనకి తోడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఇకమీదట ప్రతినెల రుణాలు పొందిన వివిధ ప్రాజెక్టుల అమలుకు సంబంధించి ఆర్థిక పరమైన మరియు భౌతిక పురోగతికి సంబంధించిన నివేదికలు తప్పక కేంద్ర ఆర్థిక శాఖకు సమర్పించాలని షరతు విధించింది.

ప్రతి నెల ఏ ప్రాజెక్టు పని ఎంత పురోగతి సాధించింది, ఏ కాంట్రాక్టర్లకు ఎంతెంత నిధులు చెల్లించారన్న విషయాలు తప్పనిసరిగా ఇకమీదట ఒక నివేదిక రూపంలో కేంద్ర ఆర్థిక మంత్రిత్వశాఖకి సమర్పించాలి. డిఇఏ (డిపార్టుమెంట్ ఆఫ్ ఎకనామిక్ ఎఫైర్స్) ఇకపై మన రాష్ట్రంలో వివిధ ప్రపంచ బ్యాంకు రుణాలతో చేపడుతున్న ప్రాజెక్టుల అమలు మరియు నిధుల వినియోగంపై నిత్యం పర్యవేక్షణ చేస్తుందని, ఎటువంటి లోపాలున్నాకూడా ఉపేక్షించబోదని ఈ లేఖ ద్వారా తేల్చి చెప్పింది. తక్షణమే తాము కోరిన విధంగా అన్ని విషయాలపై డాక్యుమెంటరీ ఈవిడెన్స్ తో కేంద్ర ప్రభుత్వానికి వివరాలు తెలియజేయాలని… ఆ విధంగా తెలియపరచిన తరువాతనే బ్యాంకు రుణాల అడ్వాన్సు విడుదల గురించి తాము ఆలోచన చేస్తామని కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది.

జగన్ సర్కార్ నేటి వరకు రాష్ట్రంలో మౌలిక సదుపాయాల అభివృద్ధికి సంబంధించినటువంటి ఇరిగేషన్, రోడ్లు మరియు ఇతర ప్రాజెక్టులకు సంబంధించిన నిధులు పూర్తిగా పక్కదారి పట్టించడంవల్ల అవి పడకేశాయనడంలో ఏమాత్రం అతిశయోక్తిలేదు. నేడు కేంద్ర ఆర్థిక మంత్రిత్వశాఖ విధించినటువంటి కఠినమైన షరతులతో భవిష్యత్తులో జగన్ సర్కార్ యొక్క దోపిడి బట్టబయలు కాక తప్పదు. అదేవిధంగా మరే ఇతర బ్యాంకు కూడా రాష్ట్రానికి ఉదారంగా నిధులు మంజూరు చేసే పరిస్థితి ఉండదు.

ఇటువంటి దౌర్భాగ్య పరిస్థితికి పూర్తిగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ రెడ్డి, ఆర్థికమంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి బాధ్యత వహించాలి. రోడ్ల దుస్థితిపై గతంలో తెలుగుదేశం పార్టీ ఆందోళన చేసిన సందర్భంలో ఒకనెల రోజుల్లో రోడ్ల మరమ్మత్తుల పనులు ప్రారంభిస్తామని ప్రగల్భాలు పలికిన జగన్ సర్కార్ నేడు కేంద్రం రాసిన ఈ లేఖకు ఏం సమాధానం చెబుతుంది? రోడ్ల కోసం నిర్దేశించిన బ్యాంకు రుణాలను పక్కదోవ పట్టించి ఇకమీరు రాష్ట్రంలో రోడ్లు ఏం బాగు చేస్తారు?

రాష్ట్ర ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి తక్షణమే తన అజ్ఞాతవాసాన్ని వీడి ప్రజల ముందుకు వచ్చి సమాధానం చెప్పాలి. కేంద్రం ఈ విధమైన ఘాటు లేఖ రాయడానికి గల కారణాలేమిటో బుగ్గన ప్రజలకు వివరణ ఇవ్వాలి. ఈసారికూడా ముఖం చాటేయకుండా రాష్ట్ర ఆర్థికమంత్రి మీడియా ముందుకు వచ్చి మేం అడిగిన ప్రశ్నలకు జవాబు చెప్పాలి.

మరోపక్కన కాంట్రాక్టర్లు కూడా తాము ఇప్పటి వరకు చేసిన పనులకు ప్రభుత్వం బిల్లులు చెల్లించకపోయేసరికి కోర్టు గుమ్మం ఎక్కి న్యాయ పోరాటం చేస్తున్నారు. తమతో రాష్ట్ర ప్రభుత్వం చేసుకున్న ఒప్పందంలోని క్లాజ్ నెంబర్ 41 ఆధారంగా తమకు బకాయి పడిన సొమ్ముకు రాష్ట్ర ప్రభుత్వం 6 శాతం వడ్డీ జతచేసి చెల్లించాలని డిమాండ్ చేస్తున్నారు. మీయొక్క ఆర్థిక అరాచకత్వం వల్ల ఉత్పన్నమైన ఈ పరిస్థితికి నేడు అకారణంగా ప్రజా ధనం వృధా అయ్యే విధంగా వడ్డీలు చెల్లిస్తారా? వడ్డీ చెల్లింపులకు రాష్ట్ర ఖజానా నుండి ఒక్క పైసా కూడా వినియోగించడాన్ని ఒప్పుకునే పరిస్థితి లేదు. అట్టి చెల్లింపులు ఏమైనా ఉంటే జగన్ రెడ్డి సొంత ఖాతాలో నుంచి చెల్లించాల్సిందే.

పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, మిథున్ రెడ్డి, అవినాష్ రెడ్డి లాంటివారికి, వారి బినామీ కాంట్రాక్టర్లకు దోచిపెట్టిన డబ్బంతా ఇప్పడు బయటికి తీయాలి. ఆ లెక్కలన్నీ చెప్పకపోతే భవిష్యత్తులో బ్యాంకుల నుండి ఒక్క పైసా వచ్చే పరిస్థితిలేదు. ఒక్క ఛాన్స్ అని అధికార పీఠం ఎక్కిన ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి తన అవినీతితో రాష్ట్ర ఖజానాని దివాలా తీయడమే కాకుండా మన రాష్ర్టానికి గతంలో ఉన్నటువంటి విశ్వసనీయతను ఘోరంగా దెబ్బతీశారు. గతంలో చంద్రబాబుగారి హయాంలో రాష్ట్రంలో మౌలిక సదుపాయాల ప్రాజెక్టులు అవి రోడ్లైనా, ఇరిగేషన్ ప్రాజెక్టులైనా వేగంగా ముందుకెళ్లేవి. ఏ బ్యాంకులు ఎప్పుడు ఎటువంటి ప్రశ్నలు అడిగిన సందర్భాలు ఉండేవికాదు. ఎంతో ఆర్థిక క్రమశిక్షణతో రాష్ట్రంలో పరిపాలన సాగేది. ప్రపంచ వ్యాప్తంగా చంద్రబాబుగారి సారధ్యంలో సాగుతున్నటువంటి నాటి ప్రభుత్వానికి ఎంతో విశ్వసనీయత ఉండేది.

పెట్టుబడిదారులు, ప్రపంచస్థాయి బ్యాంకులు ఆర్థిక సహకారాన్ని అందించడం కోసం రాష్ట్రానికి క్యూ కట్టే పరిస్థితి ఉండేది. రాష్ట్రానికి చీవాట్లు పెట్టే విధంగా ఏనాడు కేంద్ర ప్రభుత్వం నుండి ఆనాటి చంద్రబాబునాయుడు ప్రభుత్వం ఎటువంటి లేఖలు అందుకోలేదు. అది చంద్రబాబు నాయుడుకున్న క్రెడిబులిటి. ఇవాళ అటువంటి క్రెడిబులిటి లోపించింది. ఒక క్రెడిబులిటి లేని ముఖ్యమంత్రి ఈ రాష్ట్రాన్ని పరిపాలిస్తే ఏ విధమైన సమస్యలు ఉత్పన్నమవుతాయో నేడు కేంద్ర ప్రభుత్వం రాసిన లేఖలోని అంశాలను పరిశీలిస్తే మనకు అర్థమవుతుంది. కేంద్ర ప్రభుత్వం రాసినటువంటి ఈ ఘాటు లేఖ దృష్ట్యా రాష్ట్ర ప్రభుత్వం వెంటనే రాష్ట్రంలో అమలవుతున్న అన్ని ఇఏపీ ప్రాజెక్టులకు సంబంధించిన రుణాలు మరియు నిధుల వినియోగంపై తక్షణమే ఒక శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నాం.

LEAVE A RESPONSE