Suryaa.co.in

Andhra Pradesh

అన్ని పక్షాల అభిప్రాయం మేరకే జిల్లా పేరు మార్పు

-దీంట్లో ప్రభుత్వ స్వప్రయోజనాలు ఏమీ లేవు
-ఏవో కొన్ని అరాచకశక్తులు కావాలనే ఆందోళన
-పరిస్థితులు చక్కబడతాయి. అంతా సవ్యంగా ఉంటుంది
-చట్టానికి ఎవరూ అతీతులు కాదు. అదే మా పార్టీ విధానం
-అందుకే ఎమ్మెల్సీ అనంతబాబు కేసులో జోక్యం చేసుకోలేదు
-పోలీసులు స్వేచ్ఛగా తమ పని చేశారు. ఆయన్ను అరెస్టు చేశారు
-ఈ విషయంలో సీఎం స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు
-అయినా టీడీపీ నేతలు, ఎల్లో మీడియా అంతులేని విమర్శలు
-మూడు, నాలుగు రోజులుగా అంతులేని నానా యాగీ
-తాము చెప్పించే చేయాలన్న దౌర్జన్య వ్యవహారం
-అదే నిందితుడు తమ వాడై ఉంటే, మరో రకం విమర్శలు
-ప్రభుత్వం దాడి అంటూ దుష్ప్రచారం చేసే వారు
-నిజానికి టీడీపీ హయాంలో అంతా అనైతికతే
-ఎక్కడా చట్టానికి అనుగుణంగా వ్యవహరించలేదు
-అప్పటి విపక్ష నాయకులు, కార్యకర్తలపై అడ్డగోలు కేసులు
-ఎమ్మెల్యేలు, అధికారులనూ ఎక్కడా వదిలి పెట్టలేదు
-చాలా ఘటనల్లో చంద్రబాబు స్వయంగా రాజీ చేశారు
-ఉదాహరణలతో సహా పలు ఘటనలు వివరణ
– వైయస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి వెల్లడి

తాడేపల్లి: ప్రెస్‌మీట్‌లో సజ్జల రామకృష్ణారెడ్డి ఇంకా ఏం మాట్లాడారంటే..:
అందరి అభిప్రాయం మేరకే:
జిల్లాల పునర్‌వ్యవస్థీకరణ సమయంలో కోనసీమ జిల్లాకు అంబేడ్కర్‌ పేరు కూడా పెట్టాలన్న డిమాండ్లు వచ్చాయి. దానికి ప్రధాన పార్టీలు కూడా మద్దతు ఇచ్చాయి. కాబట్టే కోనసీమ అంబేడ్కర్‌ జిల్లా అని పేరు పెట్టాము. ఇది హఠాత్తుగా తీసుకున్న నిర్ణయం కాదు.
అంబేడ్కర్‌ మహానుభావుడు. ఆయనకు ఆ విధంగా గౌరవం ఇచ్చాం. దీన్ని అన్ని పార్టీలు సమర్థించాయి. వద్దు అని ఎవరూ అనలేదు.
అందరూ ఆమోదించే, భరత మాత ముద్దుబిడ్డల్లో అంబేడ్కర్‌ ముందుంటారు. ఏవో కొన్ని శక్తులు ఇవాళ్టి గొడవ వెనక ఉండి ఉండొచ్చు. పరిస్థితిని పోలీసులు కంట్రోల్‌ చేస్తారు. పరిస్థితి చక్కబడుతుంది.

మా ప్రయోజనం కోసం కాదు:
జిల్లాకు పేరు మార్పు రాజకీయ మైలేజీ కోసం చేయలేదు. అందరి అభిప్రాయం మేరకే ఆ నిర్ణయం తీసుకోవడం జరిగింది. అందుకే ఇలాంటి గొడవలు ఉత్పన్నమైనా, వెంటనే సమసిపోతాయని భావిస్తున్నాం. పరిస్థితిని తప్పనిసరిగా అందరూ అర్ధం చేసుకుంటారని నమ్ముతున్నాం.

దౌర్జన్యంగా ఆ వ్యవహారం:
గత మూడు, నాలుగు రోజులుగా టీడీపీ నాయకులు, ఆ పార్టీ అధినేత చంద్రబాబు, ఆయన కుమారుడు లోకేష్‌.. సుబ్రమణ్యం హత్య కేసుపై ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారు. చట్టాన్ని, విచారణను తమ చేతుల్లోకే తీసుకుని, తాము చెప్పిందే జరగాలని పట్టుబడుతూ, ఎల్లో మీడియా ద్వారా నానా యాగీ చేస్తున్నారు. అది ఒక దౌర్జన్యంగా కొనసాగుతోంది.
మా పార్టీ ఎమ్మెల్సీ అనంతబాబు, తన మాజీ డ్రైవర్‌ సుబ్రమణ్యం హత్యలో అనుమానితుడిగా బయటకు వచ్చింది మొదలు, సోమవారం ఎమ్మెల్సీ అరెస్టు, ఎస్పీ ప్రెస్‌మీట్‌ వరకు అంతా పద్ధతిగానే జరిగింది. చాలా త్వరగా పోలీసులు స్పందించారు. ఎక్కడా చట్టానికి అతీతంగా వ్యవహరించలేదు. నిజానికి ఇటీవల మాజీ మంత్రి నారాయణను అరెస్టు చేస్తే, ఆయన బెయిల్‌ అడగకపోయినా బెయిల్‌ ఇచ్చారు.

పోలీసు శాఖకు పూర్తి స్వేచ్ఛ:
అధికార పార్టీలో ఉన్న వారికి ప్రత్యేక ట్రీట్‌మెంట్‌ ఉంటుందని అన్న అభిప్రాయాన్ని సీఎం శ్రీ వైయస్‌ జగన్‌ పూర్తిగా మార్చారు. పోలీసు శాఖకు పూర్తిగా స్వేచ్ఛనిచ్చారు. చట్టం ముందు అందరూ సమానమే అని చెప్పారు. సీఎంగా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి ఆదే స్ఫూర్తితో పని చేస్తున్నారు.
ఒక అధికారి ఫిర్యాదు చేస్తే, పార్టీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డిని అరెస్టు చేశారు. ఇంకా వేర్వేరు ఆరోపణలు వస్తే తన సమీప బంధువులు వైయస్‌ ప్రతాపరెడ్డి, వైయస్‌ కొండారెడ్డిని పోలీసులు అరెస్టు చేసినా, సీఎంగారు ఎక్కడా జోక్యం చేసుకోలేదు. ఆయన ఆ విధంగా పోలీసులకు ఆదేశాలు ఇచ్చారు.
సుబ్రమణ్యం హత్య తన దృష్టికి రాగానే, దావోస్‌ పయనానికి సిద్ధమవుతున్న సీఎంగారు, పోలీసులకు స్పష్టంగా ఆదేశాలు జారీ చేశారు. అందుకే వెంటనే హత్య కేసు నమోదు చేశారు. ఆ తర్వాత అనంతబాబు అరెస్టు వరకు పోలీసులు ఎక్కడా చట్టానికి అతీతంగా వ్యవహరించలేదు.

దుష్ట చతుష్టయం. రాద్దాంతం:
కానీ దుష్ట చతుష్టయం చేసిన రాద్దాంతం, మీడియా ట్రయల్‌ అంతా ఇంతా కాదు. చంద్రబాబు, ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ5 ముందే ఒక వ్యూహం సిద్దం చేసుకుని, ప్రభుత్వంపై అంతులేని విమర్శలు చేస్తున్నారు. ఎందుకుంటే ఈ కేసులో నిందితుడు వైయస్సార్‌సీపీ ఎమ్మెల్సీ కాబట్టి. వారే దర్యాప్తు. శిక్ష వేస్తామని చెప్పడం. అదే ఒకవేళ ఆ నిందితుడు టీడీపీకి చెందిన వ్యక్తి అయితే, అందుకు పూర్తి భిన్నంగా వ్యవహరించేవారు. పోలీసుల దౌర్జన్యం, దాడి అని ప్రచారం చేసే వారు.

ఆనాడు అంతులేని అరాచకాలు:
2014 నుంచి 2019 వరకు చంద్రబాబు పాలన చూస్తే అంతులేని అరాచకాలు. హత్యాయత్నం కేసులు లెక్కలేనన్ని. «అధికారులనూ వదల్లేదు. వైయస్సార్‌సీపీ వారు కదిలితే కేసులు పెట్టారు. చివరకు 80 ఏళ్ల వారిపైనా రేప్‌ చేసినట్లు కేసులు పెట్టారు.
చంద్రబాబు ఏనాడూ చట్టాన్ని తన పని తాను చేసుకుపోనివ్వలేదు. ఒకే ఒక ఉదాహరణ. ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌. ఒక మహిళా తహసీల్దార్‌ వనజాక్షి. ఆమె అక్రమ ఇసుక రవాణాను అడ్డుకుంటే, జుట్టు పట్టుకుని ఈడ్చి కొట్టాడు. ఆమె ఫిర్యాదు చేస్తే, చంద్రబాబు స్వయంగా రాజీ కుదిర్చాడు. పైగా ఆ తహసీలార్దర్‌ తన ఏరియా కాకపోయినా, అక్కడికి పోయి ఇసుక రవాణా అడ్డుకున్నారని చంద్రబాబు స్వయంగా అసెంబ్లీలో చెప్పారు. ఆ విధంగా సమర్ధించుకొచ్చారు.
అలాగే ఐపీఎస్‌ అధికారిపై దాడి చేస్తే కూడా చంద్రబాబు తన పార్టీ నేతలనే సమర్థించారు. సారీ చెప్పించి క్లోజ్‌ చేశారు.
ఎమ్మెల్యే బొండా ఉమ కుమారుడు కారు రేసు చేసి, చిలకలూరిపేట జాతీయ రహదారి మీద గుద్దితే ఒకరు చనిపోయారు. మరొకరు గాయాల పాలయ్యారు. 2014, అక్టోబరు 26న ఇది జరిగితే, 5 రోజుల తర్వాత అరెస్టు చూపారు. ఏడాది తర్వాత కేసు కొట్టేయించుకున్నారు.

ఏడీఆర్‌ నివేదికా చెప్పింది:
అసోసియేషన్‌ ఫర్‌ డెమొక్రటిక్‌ రిఫార్మ్స్‌ – ఏడీఆర్‌ ఇచ్చిన నివేదిక ప్రకారం మహిళలపై అఘాయిత్యాలలో దేశంలో 5గురు టాప్‌లో ఉన్నారని చెప్పారు. వారు ఎవరంటే చింతమనేని ప్రభాకర్, దేవినేని ఉమామహేశ్వరరావు, అచ్చెన్నాయుడు, బండారు సత్యనారాయణమూర్తి, వరదాపురం సూరి (ధర్మవరం ఎమ్మెల్యే). ఇది ఒక స్వచ్ఛంద సంస్థ ఇచ్చిన నివేదిక.

టీడీపీ మరిన్ని దౌర్జన్యాలు:
ఇక మండల ఎన్నికల సమయంలో కోడెల శివప్రసాదరావు చేసిన దౌర్జన్యం. బస్సుపై దాడి చేసి, అభ్యర్థులను ఎత్తుకుపోతే, కనీసం కేసు కూడా పెట్టలేదు. రోజా మహిళా సదస్సుకు వెళ్తుంటే అరెస్టు చేశారు. చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి మీద ఏకంగా 80 కేసులు. జగన్‌గారిని ఏకంగా విశాఖ ఎయిర్‌పోర్టులోనే అడ్డుకున్నారు.

జగన్‌ హయాంలో ఎంతో మార్పు:
అంత దారుణంగా చంద్రబాబు వ్యవహరిస్తే, జగన్‌ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఏనాడూ చట్టాన్ని అతిక్రమించేలా పని చేయలేదు. మహిళల రక్షణ కోసం దిశ చట్టానికి రూపకల్పన. దిశ పోలీస్‌ స్టేషన్లు. ఇన్ని చేస్తుంటే, టీడీపీ వారు అత్యాచారాల ఆంధ్రప్రదేశ్‌ అని రాస్తున్నారు. దీనికి ప్రజలే సమాధానం చెప్పాలి.

ఆనాడు ఒక విధంగా.. ఇప్పుడు!:
నాడు టీడీపీ హయాంలో అత్యాచారాలు జరిగితే, ఇదే ఈనాడు, ఆంధ్రజ్యోతి పూర్తిగా టోన్‌డౌన్‌ చేసి, జోనల్‌ పేజీల్లో వేశాయి. అదే ఇప్పుడు పేజ్‌ వన్‌లో బ్యానర్‌గా వేసి, విపరీతంగా ప్రచారం చేస్తున్నారు. మళ్లీ అత్యాచారాల ఆంధ్రప్రదేశ్‌ అని రాస్తున్నారు.
చంద్రబాబు తన పాలనలో అన్ని ఘోరాలు చేశాడు కాబట్టే, 2019లో ప్రజలు ఆ తీర్పు ఇచ్చారు. అయినా చంద్రబాబులో మార్పు రాలేదు. రోజూ ప్రభుత్వాన్ని నిందిస్తున్నారు. అంతులేని ఆరోపణలు చేస్తున్నారు.

ఈ కేసులో జోక్యం లేదు:
జగన్‌గారు ఏనాడూ శాంతిభద్రతల విషయంలో, మహిళల రక్షణ విషయంలో ఎక్కడా రాజీ పడలేదు. ఇప్పుడు కూడా అనంతబాబు కేసులో ఎక్కడా చట్టాన్ని అతిక్రమించేలా చూడలేదు. పోలీసులకు పూర్తి స్వేచ్ఛ ఇచ్చారు. అందుకే పోలీసులు ఎమ్మెల్సీని అరెస్టు చేశారు. దాంతో ఇప్పుడు విపక్షం స్వరం మార్చింది. అనంతబాబును పార్టీ నుంచి సస్పెండ్‌ చేయలేదని విమర్శిస్తున్నారు.

చంద్రబాబు–వ్యవస్థల మేనేజ్‌మెంట్‌:
నిజానికి వ్యవస్థలను మేనేజ్‌ చేస్తున్న చంద్రబాబు అన్ని కేసుల నుంచి, పార్టీ వారిని బయట పడేస్తున్నారు. ఆనాడు ఎన్టీ రామారావుకు వెన్నుపోటు పొడిచి సీఎం అయిన చంద్రబాబు, ఆ తర్వాత 5 నెలల్లోనే తెలుగుదేశం పార్టీ ఆస్తులను కూడా స్వాధీనం చేసుకున్నారు. దాంతో ఎన్టీ రామారావు కన్నుమూశారు.
అప్పటి నుంచి పార్టీని చెరబట్టిన చంద్రబాబు, ఆనాటి నుంచి అరాచకాలు చేస్తూనే ఉన్నారు. ఏటా ఎన్టీ రామారావుకు నివాళులర్పిస్తూనే ఉంటాడు. రాజకీయాల్లో ఏ మాత్రం విలువలు లేకుండా వ్యవహరిస్తున్నారు. చంద్రబాబు చీకటి పాలన నుంచి జగన్‌గారు 2019లో రాష్ట్రానికి విముక్తి కలిగించారు.

జగన్‌ నిబద్ధత:
2009లో వైయస్సార్‌ హఠాత్తుగా మరణించినప్పుడు, మొత్తం ఎమ్మెల్మేలు జగన్‌ని సీఎం చేయాలని సంతకాలు చేస్తే, ఆ పార్టీ ఆ పని చేయలేదు. కాంగ్రెస్‌ అధిష్టానం నిర్ణయానికి కట్టుబడి ఉన్నాడు. ఆ నిబద్ధత చూపాడు. ఆ తర్వాత పార్టీ పెట్టి 10 ఏళ్లు పోరాడారు. 151 మంది ఎమ్మెల్యేలను గెలిపించుకుని సీఎం అయ్యారు.
లోకేష్‌కు ఒకటే గుర్తించాలి. జగన్‌ స్వయంగా ఎదిగారు. పోరాడారు. సాధించారు. ఆయనకు అధికారం ఊర్కే దక్కలేదు. మీకు మాదిరిగా. ఈ విషయం నీకు తెలుసు. మీ నాన్నకూ తెలుసు. ప్రజలు విశ్వసించారు. అందుకే సీఎంను చేశారు.

ఇద్దరి మధ్య ఇదీ తేడా:
మోసం, దోపిడి, అన్యాయానికి చంద్రబాబు రూపం అయితే, నిబద్దత, విశ్వసనీయతకు మారు పేరు జగన్‌ అనుకున్నారు కాబట్టే, ఆయనను ప్రజలు సీఎంను చేశారు.

మహానాడులో ఈ పని చేయండి:
నా సలహా. రేపు మహానాడు జరుగుతోంది. ఎన్టీఆర్‌ శత జయంతి చేస్తారట. నిజానికి ఆయనను తల్చుకోవడం నేరం. వారికి ఏ మాత్రమైనా విలువలు ఉంటే, ప్రాయశ్చిత్తం, పశ్చాత్తాపం చేసుకోవాలి. లక్ష్మీపార్వతి పసుపు కుంకుమ పోగొట్టినందుకు ఆమె కాళ్లకు దండం పెడితే, ప్రాయశ్చిత్తం చేసుకున్న వారవుతారు.
చంద్రబాబు శకం ముగిసింది. ఆయన ట్వీట్లకు పరిమితం అవుతున్నారు. కాబట్టి కొడుక్కు బాధ్యతలు అప్పగించి, పక్కకు తప్పుకుపోవాలి. ఇది మహానాడులో జరగాలి.
చాలా కాలం అధికారంలో ఉన్న చంద్రబాబు, ఇప్పుడు ఏ మాత్రం స్పృహ లేకుండా మాట్లాడుతున్నాడు. ఇకనైనా ఆయన నోరు అదుపులో పెట్టుకోవాలని సజ్జల రామకృష్ణారెడ్డి స్పష్టం చేశారు.

LEAVE A RESPONSE