– సొంత ఖర్చులతో మలేషియాలో న్యాయ పోరాటం చేసి తెలంగాణ బిడ్డలను విడిపించిన బి ఆర్ ఎస్ నేత జాన్సన్ నాయక్
– కోర్టులో జరిమానా కట్టి విమాన టికెట్లు ఇప్పించి స్వదేశానికి తీసుకువచ్చారు
– నందినగర్ లో కేటీఆర్ ను కలిసి కృతజ్ఞతలు తెలిపిన బాధితులు
– మలేషియా జైల్లో ఉన్న తెలంగాణ వాసులను విడిపించడానికి భారత రాయబార కార్యాలయం, తెలంగాణ ప్రభుత్వం ముందుకురాకపోవడం విచారకరం-కేటీఆర్
– జాన్సన్ నాయక్ ను ప్రశంసించిన కేటీఆర్
హైదరాబాద్: ఉపాధి కోసం గత సంవత్సరం నిజామాబాద్ జిల్లా కడెం మండలం లింగాపూర్, దస్తురాబాద్ మండలం మూన్యాల్ గ్రామాలకు చెందిన ఆరుగురు వ్యక్తులు మలేషియాకు వెళ్లారు. అయితే అకారణంగా అరెస్ట్ అయి జైలుపాలయ్యారు. ఈ ఈ విషయం తన దృష్టికి రావడంతో భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, పార్టీ నేత ఖానాపూర్ ఇంచార్జ్ భూక్య జాన్సన్ నాయక్ కి మాట్లాడి వారి విడుదలకు ప్రయత్నించాలని కోరారు.
ఈ విషయం బాధిత కుటుంబాలను కలిసిన బీఆర్ఎస్ ఖానాపూర్ నియోజకవర్గ ఇంచార్జ్ భూక్యా జాన్సన్ నాయక్ వారి పరిస్థితిని తెలుసుకున్నారు. వారి దీనస్థితిని జాన్సన్ నాయక్ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ దృష్టికి తీసుకెళ్లారు. కేటీఆర్ సూచనతో మార్చ్ నెలలో మలేషియా వెళ్లిన జాన్సన్ నాయక్, జైల్లో ఉన్న లింగాపూర్ గ్రామానికి చెందిన రాచకొండ నరేష్, తలారి భాస్కర్, గురుజాల శంకర్, గురిజాల రాజేశ్వర్, గుండా శ్రీనివాస్, మూన్యాల్ గ్రామానికి చెందిన యమునూరి రవీందర్‌లను ఓదార్చారు. విడుదల చేయిస్తానని భరోసా కల్పించారు.
అక్కడి చట్టాల పట్ల అవగాహన లేకపోవడంతో అక్రమ ఆయుధ కేసులో అరెస్ట్ అయ్యారని తెలుసుకున్న జాన్సన్ నాయక్, వారి విడుదల కోసం సొంత ఖర్చులతో స్థానిక న్యాయవాదులను నియమించి న్యాయపరమైన ప్రక్రియను వేగవంతం చేశారు. ఇటీవల మే 12న మలేషియాకు మళ్లీ వెళ్లి అక్కడి కోర్టు విధించిన జరిమానా మొత్తాన్ని తన సొంత ఖర్చులతో చెల్లించి, విమాన టికెట్లతో సహా అవసరమైన అన్ని ఏర్పాట్లు చేసి వారిని స్వదేశానికి జాన్సన్ నాయక్ తీసుకువచ్చారు.
ఈ రోజు హైదరాబాద్‌కు చేరుకున్న బాధితులు జాన్సన్ నాయక్ తో కలిసి నందినగర్ లో కేటీఆర్ ని కలిసారు. కేటీఆర్ ను చూడగానే భావోద్వేగానికి గురైన బాధితులు… జైల్లో ఉండగా ఈ దేశాన్ని తమ పిల్లలను చూస్తామని అనుకోలేదన్నారు. కేటీఆర్, జాన్సన్ నాయక్ ల కృషితో తాము విడుదలయ్యామని, జీవితాంతం వారిని తమ గుండెల్లో పెట్టుకుంటామని చెప్పారు.చైనా, ఇతర దేశాలు తమవారిని దగ్గరుండి వారం రోజుల్లో విడిపించి తీసుకువెళ్లిపోయాయని బాధితులు కేటీఆర్ తో తెలిపారు.
వారిని ఓదార్చిన తర్వాత వారి బాగోగులను, అక్కడ వారికి ఎదురైన కష్టాలను కేటీఆర్ అడిగి తెలుసుకున్నారు. వారి పరిస్థితి పట్ల ఆవేదన వ్యక్తం చేసిన కేటీఆర్, భారత రాయబార కార్యాలయం కానీ తెలంగాణ ప్రభుత్వం గానీ బాధితులను విడిపించేందుకు ఎలాంటి చర్యలు చేపట్టకపోవడం దారుణమన్నారు. కనీసం న్యాయవాదులను పెట్టి వెంటనే విడిపిస్తే బాగుండేదన్నారు.
మలేషియా వెళ్లి, బాధితులను క్షేమంగా తెలంగాణకు తిరిగి తీసుకువచ్చిన భూక్యా జాన్సన్ నాయక్ ను కేటీఆర్ ప్రత్యేకంగా అభినందించారు.ఖానాపూర్ నియోజకవర్గ ప్రజల కష్ట సుఖాల్లో పాలుపంచుకుంటూ ఎల్లప్పుడూ వారికి సహాయసహకారాలు అందిస్తూ పార్టీకోసం అహర్నిశలు కష్టపడుతున్నాడని జాన్సన్ నాయక్ ను కేటీఆర్ ప్రశంసించారు.