– బి.సి రిజర్వేషన్ల సాధనకై రాష్ట్ర బందును జయప్రదం చేయండి
– తెలంగాణ ఉద్యమ లాగా బి.సి ఉద్యమాన్ని ఉదృతం చేయాలి
– వరంగల్, హనుమకొండ జిల్లాల బార్ అసోసియేషన్ అధ్యక్షుల పిలుపు
వరంగల్: ఎందరో మహానీయుల త్యాగపలితంగా ప్రకటించిన బి.సి రిజర్వేషన్ల సాధనకై ఈ నెల 18 న తలపెట్టిన తెలంగాణ రాష్ట్ర బందును జయప్రదం చేయాలని వరంగల్, హనుమకొండ జిల్లాల బార్ అసోసియేషన్ అధ్యక్షులు వలస సుధీర్, పులి సత్యనారాయణ, ఇండియన్ లీగల్ ప్రొఫెషనల్స్ అసోసియేషన్ రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ సాయిని నరేందర్ పిలుపునిచ్చారు.
బి.సి ఐక్యకార్యాచరణ కమిటి పిలుపు మేరకు శుక్రవారం కోర్టు గేటు ముందు బి.సి జాక్ నాయకులతో కలిసి న్యాయవాదులు చేసిన ప్రదర్శనలో బందు జయప్రదం చేయాలని వారు మాట్లాడారు. బి.సి లకు కామారెడ్డి డిక్లరేషన్ లో ప్రకటించిన స్థానిక సంస్థల్లో 42 శాతం రిజర్వేషన్లను ఆధిపత్య కులాల వారు కుట్ర పూరితంగా అడ్డుకోవడం మానుకోవాలని, సామాజికన్యాయంలో బాగంగా విద్య , ఉద్యోగ, రాజకీయ రంగాల్లో బి.సి లకు దక్కాల్సిన న్యాయమైన వాటాను అడ్డుకోవడం సరికాదని వారన్నారు.
తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో న్యాయవాదులు కీలకపాత్ర పోషించిన తరహాలో బి.సి రిజర్వేషన్ల సాధనలో కూడా ముందుంటామని అన్నారు. రిజర్వేషన్ల సాధనకు మద్దతుగా శనివారం కోర్టు ముందు ఒకరోజు ధర్నా చేస్తామని, బందుకు సంఘీభావంగా అమరవీరుల స్థూపం నుండి అంబేద్కర్ సెంటర్ వరకు ర్యాలీ తీస్తామని తెలిపారు. ధర్నా, ర్యాలీ లో న్యాయవాదులు పెద్ద ఎత్తున పాల్గొని బి.సి రిజర్వేషన్ల సాధనలో బి.సి న్యాయవాదులు కీలకపాత్ర పోషించాలని పిలుపునిచ్చారు.