తపాలా..
తప్పయిపోయింది మన్నించు..
నిన్ను తుప్పు
పట్టించేసాం కదా
ఎన్ని సంవత్సరాల అనుబంధం
పెంచుకున్నాం..
పంచుకున్నాం..
ఇప్పుడు తుంచుకున్నాం..!
ఊహ తెలిసిన కొత్తలో
వీధి చివర పోస్టు డబ్బా
ఇదేంటబ్బా..అదో జిజ్ఞాస
ఇంటికి పోస్ట్ మాన్ వస్తే
చుట్టమొచ్చినంత సంబరం
కవర్ అందుకుని
అమ్మకో నాన్నకో
ఇచ్చాక కొస చింపుతుంటే
అదో ధ్రిల్..
సినిమాల్లో గుమ్మడో,
ఏయెన్నారో ఉత్తరం
చదువుతున్నప్పుడు
సావిత్రి కనిపించినట్టు
అమ్మ చేతి
లేఖలో అమ్మమ్మ..
నాన్న చదివే
లెటర్లో బాబాయ్
కనిపిస్తారేమోనని భ్రమ..
అప్పుడప్పుడు
పోస్ట్ మాన్ డబ్బిస్తే
అదో ప్రశ్న..
ఉత్తరాలు ఇన్ని చిత్తరాలు కూడా చేస్తాయా..అని..!?
ఎన్ని కబుర్లు..
ఎన్నెన్ని విశేషాలు..
సంగతులు..సమాచారాలు..
కుశలాలు..కౌసలాలు..
మంచి కబురు
మోసుకొస్తే ముదం..
చెడ్డ వార్త అయితే విషాదం..
వందల కిలోమీటర్ల
దూరంలో చదువుకుంటున్న
బాబాయ్ డబ్బులు పంపండి
అంటూ జాబు రాస్తే
తాతకు వేదన
అప్పు కోసం యాతన..
మా జీవితాలలో
ప్రతి ఘట్టంలో జాబు..
చాలా ప్రశ్నలకు
నువ్వే జవాబు
అలాంటి ఉత్తరం ఇప్పుడు
ఇంచుమించు అదృశ్యం..
అలా కాకపోయినా
అరుదైన దృశ్యం..
అదే లేఖ..
ఎన్నో తరాలకు
ఉత్తరకాండ..
ప్రస్తుతం దాని బ్రతుకే అరణ్యకాండ..!
సెల్లు వచ్చాక ఎన్నో గొల్లు
ప్రేమలేఖలు..కుశల ప్రశ్నలు..
ఉత్తరాలు..ప్రత్యుత్తరాలు..
అన్నిటికీ ఫోనే గతి..
ఆ క్రమంలో
ఉత్తరానికి హారతి..
ఎర్ర డబ్బా..
ఇప్పుడెక్కడబ్బా..
వచ్చింది చరవాణి
మారింది మనిషి బాణి..,!
(తపాలా దినోత్సవం సందర్భంగా..)
– సురేష్ కుమార్ ఎలిశెట్టి
విజయనగరం
9948546286
7995666286