వేదం అణువణువున నాదం
నా పంచప్రాణాల నాట్యవినోదం..
విశ్వనాధుని సాగరసంగమం లో
విరిసి మురిసిన జలజ..
అందమైన శైలజ..!
నమశ్శివాయ..చంద్రకళాధర
సాంద్రకళాపూర్ణోదయ
లయనిలయా..
పూర్ణోదయ వాకిట
వెల్లివిరిసిన
వయ్యరాల ముగ్గు..
పంచభూతములు ముఖపంచకమై..
ఆరు రుతువులు
ఆహార్యములై..
ప్రకృతీపార్వతి నీతో నడిచిన
ఏడు అడుగులే
స్వరసప్తకమై..
ఆ పాత్రలో మమేకమై..
స్వరమూ..అభినయమూ
ఏకమై..
ఆ ఒక్క
సినిమాతోనే అనేకమై..
అప్పటి నుంచి
పాటే తన లోకమై..!
శ్రీపతి పండితారాధ్యుల
వారింట పూచిన
పాటల కుసుమాలు..
శైలజ..బాలు
ఆ లోగిలిలో వికసించిన
బంగారు పూలు..
జతులు..సంగతులే
చిన్ననాటి సంగతులు..
పాటే ఆటగా
ఆ ఇల్లే రాగాల పూదోటగా.!
మదరాసు నుంచి బయలెల్లిన పిల్ల
నాంపల్లి టేసను కాడ
రాజారింగో..రాజారింగో..
అడేసి చకాచకా..
విశ్వనాథుడు
ఆడమన్నట్టు ఆడి
సాగరసంగమం లో..
కమల్ తో తిట్లు తిన్న
రాగాల కూచి..
అద్భుత గీతాల విపంచి..!
శుభలేఖ సుధాకరునితో
నువ్వంటే నాకెంతో ఇష్టం
అని..అనిపించుకుని..
పెళ్లి శుభలేఖ అందించి
మాఘమాస వేళలో
కళ్యాణం కమనీయం అంటూ
కిన్నెరసాని వచ్చిందమ్మా ఎన్నెల పైటేసి..
అని పాడుతూ
అడుగుపెడితే ఈ అలివేణి..
మురిసిపోలేదా
ఆ బక్కప్రాణి..
వేయి వేల గోపెమ్మల
మువ్వ గోపాలుడై..
ఆ ముద్దు గోవిందుడై..!
శైలజమ్మ తన ఇంట
అడుగుపెట్టి వంట
మొదలెట్టినంతనే
ఆ కపిలవారి దేవుడయ్య
ఒళ్లు చేయగా..
తానేమో
యహ నాకు
మాత్రమేవి తక్కువా..
ఆడె పుస్తె కట్టి పెనిమిటవ్వగా
యాడికో ఉర్కుతాడనే
ఏసినా ముక్కుతాడునే..
తుర్…కుర్..డొయ్..డొయ్
అలా సాగుతోంది
ఆ జంట కాపురం..
కళాగోపురం..!
(విలక్షణ గాయనీమణి ఎస్పీ శైలజకు జన్మదిన శుభాకాంక్షలతో..)
– ఎలిశెట్టి సురేష్ కుమార్
9948546286
7995666286