అంతా కలిసే గంజాయి తోటల ధ్వంసం చేద్దాం

• నవంబర్-డిసెంబర్ మాసాల్లో రూ. 4 వేల కోట్ల గంజాయి పంట బయటకు రాబోతుంది
• ఏపీ పోలీస్ కు పవర్ ఇస్తే 48 గంటల్లో చేసి గంజాయి ముఠాలను కట్టడి చూపుతారు
• వైసీపీ దగ్గర రాష్ట్రాన్ని అప్పుల నుంచి బయటకు తెచ్చే ప్రణాళికలు లేవు
• ఏఓబీలో గంజాయి సాగు మీద మాత్రం పట్టుంది
• రహదారి ఉద్యమం మాదిరి గంజాయి రవాణాపై ఉద్యమిద్దాం
• అప్పుల్లో ఉందని స్టీల్ ప్లాంట్ అమ్మేస్తామంటున్నారు.. అప్పుల్లో ఉన్న రాష్ట్రాన్ని ఏం చేస్తారు
• విశాఖ అర్బన్ నియోజకవర్గాల కార్యకర్తల సమావేశంలో జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్
ఆంధ్రా ఒడిశా బోర్డర్ లో అక్రమంగా సాగవుతున్న గంజాయి తోటలు ధ్వంసం చేసేందుకు వైసీపీ ప్రభుత్వం ముందుకు రావాలనీ, అందుకు అవసరం అయితే అఖిపక్షం సాయం తీసుకోవాలని జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. నవంబర్ – డిసెంబర్ మాసాల్లో రూ. 4 వేల కోట్ల గంజాయి ఎగుమతి అవబోతోంది. వైసీపీ వాళ్లు రండి.. జనసేను పిలవండి.. మీ బెస్టెస్ట్ ఫ్రెండ్ టీడీపీనీ, సీపీఐ, సీపీఎంలను పిలవండి… అంతా కలసికట్టుగా రూ. 4 వేల కోట్ల గంజాయి తోటలు నాశనం చేద్దాం అని పిలుపునిచ్చారు. అఖిలపక్షాన్ని తీసుకువెళ్లము అని పాలక పక్షం అంటే… ఎందుకు తీసుకువెళ్లరో వైసీపీ నాయకులు ప్రజలకు చెప్పాలని అన్నారు.విశాఖ అర్బన్ నియోజకవర్గాల జనసేన నాయకులు, కార్యకర్తలతో సమావేశం అయ్యారు. జీవీఎంసీ పరిధిలో ఉన్న సమస్యలను తెలుసుకున్నారు.అనంతరం కార్యర్తలను ఉద్దేశించి పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ..
“ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అప్పుల నుంచి బయటకు తీసుకువచ్చే ప్రణాళికలు అయితే వైసీపీ ప్రభుత్వం వద్ద లేవు. గంజాయి సాగు మీద మాత్రం పట్టు ఉంది. మాట్లాడితే మొన్న వైసీపీ బాబులంతా నా మీద పడిపోయారు. ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పటి నుంచి గంజాయి అక్రమ రవాణా జరుగుతోంది. అయితే గంజాయిని అరికట్టేందుకు వైసీపీ సర్కారు లా అండ్ ఆర్డర్ ను ఉపయోగించడం లేదు. జనసైనికుల్ని చావగొట్టడానికి ఉపయోగించే లా అండ్ ఆర్డర్ ఏఓబీలో గంజాయి సాగును అరికట్టడం మీద ఉపయోగించడం లేదు. రోడ్డుకు గుంత ఉందని మాట్లాడితే కేసులు పెడతారు. ఆంధ్రా ఒడిశా బోర్డర్ లో గంజాయి ఎవరు సాగు చేస్తున్నారు. రిమోట్ సెన్సింగ్ విధానం వాడండి. శాటిలైట్లు వాడండి. ఫోటోలు తీయండి. సాగు చేసే వారి ముఖాలు కూడా తెలుస్తాయి. ప్రభుత్వంలో ఉన్న వారు చెయ్యలేక కాదు వారికి చెయ్యాలన్న మనసు లేదు. అందుకే ఆ సాగులో మీకు వాటాలున్నాయన్న సందేహాలు కలుగుతున్నాయి.
దేశాన్ని కుదిపేస్తోంది
నవంబర్- డిసెంబర్ మాసాల్లో రూ. 4 వేల కోట్ల గంజాయి రవాణా జరగబోతోంది. దాన్ని ఎలా ధ్వంసం చేయాలో మీకు చేతకాకపోతే మా జనసైనికుల్ని తీసుకువెళ్లండి చేసి చూపుతారు.
గంజాయి అక్రమ రవాణా అంశం దేశం మొత్తాన్ని కుదిపేస్తోంది. రహదారుల ఉద్యమాన్ని ఎలా అయితే జాతీయ స్థాయికి తీసుకువెళ్లామో, గంజాయి వ్యతిరేక ఉద్యమాన్ని కూడా అలాగే ముందుకు తీసుకువెళ్దాం. గంజాయి సాగు ఫోటోలు తీయండి. రవాణా చేస్తున్న వారి ఫోటోలు తీయండి. తెలంగాణ, ఆంధ్ర, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ నుంచి ఢిల్లీ పోలీసులకు వాటిని ఎలా పంపాలో ఆలోచన చేద్దాం. 48 గంటలు ఆంధ్రప్రదేశ్ పోలీసులకు అవకాశం ఇస్తే గంజాయి సాగును కట్టుదిట్టం చేయకపోతే అడగండి. బూతులు తిట్టిన వారి మీద పెట్టే దృష్టి గంజాయి సాగు మీద పెడితే బాగుంటుంది. వైసీపీ నాయకులకు ఒకటే చెబుతున్నాం మీరు మాకు శత్రువులు కాదు ప్రత్యర్ధులు మాత్రమే. సమస్యలపై మాత్రమే మా పోరాటం.
ఎంపీలు కాంట్రాక్టులు అడుక్కుంటున్నారు
విశాఖ స్టీల్ ప్లాంట్ ను రూ. 20 వేల కోట్ల అప్పు ఉంది నడపలేమంటున్నారు.. మరి ఆంధ్రప్రదేశ్ కి రూ. 6 లక్షల కోట్ల అప్పు ఉంది దాన్ని అమ్మేస్తారా? వైసీపీ ప్రభుత్వ ఆర్ధిక విధానం అప్పు చేసి పప్పు కూడులా ఉంది. రాష్ట్రంలో సంక్షేమ పథకాలు ఉండాలి. అభివృద్ధి ఉండాలి. అలాగే ప్రభుత్వ రంగ పరిశ్రమలు నడవాలి. అభివృద్ధిని చంపేసి ప్రజల్ని సోమరుల్ని చేస్తారా? చేతికి నవరత్న ఉంగరాలు తొడిగి అభివృద్ధిని వదిలేశారు. యువతకు ఉద్యోగాలు ఎక్కడి నుంచి వస్తాయి. విశాఖ స్టీల్ ప్లాంట్ వ్యవహారంలో మీరు తప్పించుకోవడం కుదరదు. తప్పించుకోకుండా చూసే బాధ్యత జనసేన పార్టీ తీసుకుంటుంది. రెండేళ్ల సమయం ఉంది మీరెలా తప్పించుకుంటారో చూస్తాం. జీవీఎంసీ పరిధిలోని వైసీపీ కార్పోరేటర్లను జనసేన కార్పోరేటర్లు నిలదీయండి. స్టీల్ ప్లాంట్ ఆపకుండా కార్పోరేషన్లో మాట్లాడే హక్కు లేదని చెప్పండి. అసలు స్టీల్ ప్లాంట్ తీసేయడానికి కారణం మీరు కాదా? పోస్కోను రాష్ట్రానికి పిలిచింది మీరు కాదా? ప్రధాన మంత్రి గారికి మన సమస్యను స్పష్టంగా చెప్పాలి. వివరించాల్సిన ఎంపీలు కూర్చుని కాంట్రాక్టులుl అడుక్కుంటుంటే ఏం చేయాలి. రాష్ట్ర శ్రేయస్సు కోరుకునే ఎంపీలు రావాలి. మీరే ద్వారాలు తెరిచారు. డ్రెడ్జింగ్ కార్పోరేషన్ అంశంలో అంతా కలసికట్టుగా గొంతెత్తితేనే కదా నాటి రాష్ట్ర ప్రభుత్వం కేంద్రం దృష్టికి తీసుకువెళ్లి సమస్య పరిష్కరించగలిగింది. మాట్లాడితే నన్ను తిడితే సరిపోదు. నన్ను బాధ్యత తీసుకోమంటే మీరేం చేస్తారు. పదవులు మీకు బాధ్యతలు మాకా? మీరన్నీ మానేసి ఏఓబీలో గంజాయి సాగు చేసుకుంటారా? ప్రజలకు సుఖవంతమైన జీవితం ఇస్తాం చెత్తను ఊడుస్తాం అని చెత్త మీద పన్నులు వేస్తారా?
పీడితుల పక్షాన మాట్లాడతాం
మన ముందు రెండు సంవత్సరాల మూడు నెలల కాలం ఉంది. మత్యకారులకు అండగా నిలబడాలి. వారి నెత్తిన 217 జీవో తీసుకువచ్చారు. జీవో ఎందుకు పెట్టారో వైసీపీ నాయకులకు తెలియదు. కారణం చెప్పమంటే ఏం మాట్లాడుతున్నావ్ అంటారు. ఇంకా మాట్లాడితే బూతులు తిట్టిపోస్తారు. మనం మాత్రం సమస్య మీదే మాట్లాడుదాం. జీవో 217 గురించి తెలుసుకోండి. మత్స్యకారులు పాడుకునే చేపలు బయటవారిని తీసుకు వచ్చి పాడించి వారి జీవితాలు బద్దలు కొడుతున్నారు. ఆనాడు భవన నిర్మాణ కార్మికుల కోసం విశాఖ రావాల్సి వచ్చింది. ప్రభుత్వం వచ్చాక ఇసుక క్వారీలు దోచేశారు. టీడీపీ హయాంలోనూ తప్పులు జరిగాయి. మీరు వచ్చి పాలసీలు మార్చాలి. మీరు ఇచ్చే వరకు భవన నిర్మాణ కార్మికులు ఎలా బతుకుతారు. ఒక్క పాలసీ ఆలశ్యం చేయడం వల్ల 30 మందికి పైగా చనిపోయారు. అందుకే నాడు భవన నిర్మాణ కార్మికులకు అండగా నిలబడ్డాం.
జనసేన గొంతు ఎప్పుడూ పీడితుల పక్షాన నిలబడుతుంది. ఎల్జీ పాలిమర్స్ గ్యాస్ లీక్ బాధాకరమైన సంఘటన. ఆనాడు విషవాయువులు ఉన్నా జనసేన నాయకులు, ఆడపడుచులు బాధితులకు అండగా నిలబడ్డారు. విశాఖలో విపరీతమైన కాలుష్యం ఉంది. అభివృద్ధి ప్రకృతి నాశనంతోనే ఉంటుంది. కూర్చున్న కూర్చీలు కావాలన్నా పచ్చని చెట్టుని కూల్చేయాలి. దాన్ని ఆపలేకపోయినా కూల్చిన చెట్టు స్థానంలో పది చెట్లు నాటాలి. పరిశ్రమలు ఉండాలి. అలా అని భావితరాలకు డబ్బులు ఆస్తులతో పాటు కాలుష్య రహిత వాతావరణం కూడా ఇవ్వాలిగా? అందుకే జనసేన పార్టీ పర్యావరణాన్ని పరిరక్షించే అభివృద్ధి ప్రస్థానాన్ని సిద్ధాంతంగా చేసుకుంది. దాని కోసమే పోరాటం చేద్దాం. అందులో ఎక్కువ మందిని భాగస్వాముల్ని చేద్దాం.
జనసేన ఎప్పుడు గొంతెత్తినా పీడితుల పక్షాన గొంతెత్తు తుంది. అన్యాయం జరగుతున్న వారి పక్షాన గొంతెత్తుతుంది. ఆడపడుచుల యోగక్షేమాల కోసం గొంతెత్తుతుంది.
జనసేన కంసుడిని ఎదుర్కొంటోంది
ఎమ్మెల్యేలు, ఎంపీలను సాధించుకోకున్నా మనకు ప్రజా బలం ఉంది. ఎన్ని వేల మైళ్ల ప్రయాణం అయినా ఒక్క అడుగుతో ప్రారంభం అవుతుంది. జనసేన పార్టీ మూడడుగులతో మొదలు పెట్టింది. ఏడు సంవత్సరాల క్రితం పార్టీ పెట్టినప్పుడు డబ్బు లేకుండా రాజకీయం ఎలా చేస్తారు? వేల కోట్లు కావాలి. ఇలాంటి సందేహాల మధ్య ఏడేళ్లు నడపగలిగామంటే ఆడపడుచులు, జనసైనికుల కృషే. నేను వేల కోట్లు నమ్ముకుని రాలేదు. మీరున్నారన్న ధైర్యంతోనే వచ్చాను. నేను మీకు ధైర్యం అయితే మీరు నాకు ధైర్యం. జర్మనీ విడిపోయినప్పుడు కొందరు యువకులు గోడబద్దలవ్వాలని కోరుకున్నారు. వారి మాటలకే అది బద్దలయ్యింది. మనకి బలం లేదనుకుంటాం. మనం అనుకున్నది జరుగుతుంది. తిత్లీ తుపాను సమయంలో యువకులు 25 కేజీల బియ్యం కాదు భవిష్యత్తు కావాలి అని అడిగారు. నేను మిమ్మల్ని వాడుకుని ఎదగడానికి రాలేదు.. నన్ను వాడుకుని మీరు ఎదగండి.
వీర మహిళలు లేకపోతే జనసేన లేదు. మంత్రి గారి కూతురు నిలబడిన నియోజకవర్గంలో బలంగా నిలబడినా మా చెల్లే మాకు ఆదర్శం. జనసేన ఏం చేస్తుంది అన్న వారికి 1209 సర్పంచులు, 4456 వార్డు మెంబర్లు, 180 ఎంపీటీసీలు, 2 జెడ్పీటీసీలు, విశాఖలో ముగ్గురు కార్పోరేటర్లు సాధించాం అని చెబుదాం. ఇది చిన్న ప్రయాణమే కానీ చాలా బలమైన ప్రయాణం. దశాబ్దాల చరిత్ర ఉన్న తెలుగుదేశం పార్టీ వైసీపీ దెబ్బకు విలవిల్లాడిపోతోంది. ఏడు సంవత్సరాల వయసున్న జనసేన కంసుడిని ఎదుర్కొంటోంది. దాడులు చేస్తాం.. నలిపేస్తాం అంటే చూస్తూ ఊరుకోం తిప్పి కొడతాం. విశాఖపట్నంలో 98 డివిజన్లు ఉంటే 54 స్థానాల్లో జనసేన పోటీ చేసింది. అందులో 11 స్థానాల్లో రెండో స్థానంలో ఉన్నాం అది మర్చిపోవద్దు. మీరు అధికార యంత్రాంగాన్ని విచ్చలవిడిగా వాడుకున్నా బలంగా నిలబడి ముగ్గురు గెలిచాం. ఆ ముగ్గురు మూడు వందల మందితో సమాసం.ఏదో ఒక రోజు వైసీపీ అవినీతి గోడను జనసేనే బద్దలు కొడుతుంది. అయితే సమస్య వచ్చినప్పుడు ఎవ్వరూ పారిపోవద్దు.
ఉత్తరాంధ్ర జిల్లాలు కీలకం ఒక్క వాట్సప్ మెసేజ్ తో రెండు లక్షల మంది రోడ్ల మీదకు వచ్చేంత అభిమానం ఉంది. విశాఖలో 54 స్థానాల్లో పోటీ చేస్తే 11 స్థానాల్లో రెండో స్థానంలో ఉన్నారు. మీకు ఓటు వేసిన ప్రతి ఒక్కరీకీ మీరు కార్పోరేటరే. గెలిచిన వారితో కలసి పోరాటం చేయండి. గాజువాకలో ఓటు వేసిన ప్రతి ఒక్కరికీ నేను ఎమ్మెల్యేనే మనకు ఓటు వేసిన వారి కోసం మనం నిలబడుదాం. వైసీపీకి 151 సీట్లు వచ్చాయంటే అందులో చివరి ఒకటి తీసేస్తే 15. ఒకప్పుడు రెండు సీట్లు ఉన్న బీజీపీ 318 పైచిలుకు వచ్చినట్టు భవిష్యత్తులో మీ స్థానంలో మేముంటాం. ఆ సమయం ఎంత అనేది కాలమే నిర్ణయిస్తుంది. విశాఖ కార్పోరేటర్లంతా కూర్చుని 98 వార్డులకు బలమైన కమిటీ వేయండి. వారిని ఇక్కడున్న నాయకులతో కలపండి. ఒక గ్రూపు పెట్టి గెలిచిన అభ్యర్ధులను అనుసంధానించండి. మన వాళ్లకు కలుపుకుని సమస్యల మీద పోరాటం చేయండి.ఎన్నికల సమయంలో ఆయారామ్ గయారామ్ లు చాలా మంది వస్తారు.. అయితే కమిట్ మెంట్ ఉన్న నాయకులు అవసరం” అన్నారు.
జనసేన జాతీయ స్థాయి పార్టీగా ఎదిగేలా కృషి చేయాలి: నాదెండ్ల మనోహర్ 
పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ.. “యువరక్తాన్ని భావితరాలకు ఉపయోగపడేలా చేయాలన్న పవన్ కళ్యాణ్ ఆకాంక్షకు రూపం విశాఖలో కార్పోరేటర్ల విజయం. అదే స్ఫూర్తి మీ అందరిలో కనబడాలి. జనసేన పార్టీ ప్రస్థానంలో ఏ ఒక్క జనసైనికుడికీ అన్యాయం జరగదు. రానున్న రోజుల్లో మనం పోరాటం చేయాల్సిన అంశాలు చాలా ఉన్నాయి. పెరిగిన విద్యుత్ చార్జీలు గురించి త్వరలో పోరాడబోతున్నాం. చెత్తపన్ను తదితర సమస్యలపైనా పోరాటం చేద్దాం. ప్రజా సమస్యలపై జనసేన పార్టీ ఏ విధంగా నిలబడుతుంది అనేది అర్ధం ప్రతి ఒక్కరు అర్ధం చేసుకోవాలి. మనం ప్రజల్లో ఉండాలి. ప్రజల దగ్గరకు వెళ్లి సమస్యలపై పోరాడాలి.. ఆర్టీఐ ద్వారా ప్రభుత్వాన్ని నిలదీయండి. డివిజన్ స్థాయిలో ఉద్యమించండి. 151 మంది ఎమ్మెల్యేలు గెలిచారు మంచిగా పాలించమంటే ఆరు నెలలకే రకరకాల ఇబ్బందులు తెచ్చారు. ఇసుక కొరత తెచ్చినప్పుడు మీరంతా పవన్ కళ్యాణ్ తో నడిచారు. నిన్నటి సభతో చరిత్ర సృష్టించాం. సామాజిక మాధ్యమాలను స్థానిక సమస్యల పరిష్కారానికి, పార్టీ కార్యక్రమాలు వివరించడానికే వినియోగించండి. రహదారులపై డిజిటల్ క్యాంపెయిన్ అద్భుతంగా నిర్వహించాం. మీరు ధైర్యంగా నిలబడండి. మీకు ఇవ్వాల్సిన నాయకత్వం పవన్ కళ్యాణ్ ఇస్తారు. రాబోయే రోజుల్లో మనం జాతీయ స్థాయి పార్టీగా ఎదిగేందుకు ప్రతి ఒక్కరు కృషి చేయాల”న్నారు.
పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు అర్హం ఖాన్, ప్రధాన కార్యదర్శులు తమ్మిరెడ్డి శివశంకర్, బొలిశెట్టి సత్యనారాయణ, పాలవలస యశస్విని, పీఏసీ సభ్యులు కోన తాతారావు, రాష్ట్ర కార్యదర్శులు గడసాల అప్పారావు, బోడపాటి శివదత్, అంగా దుర్గాప్రశాంతి, పార్టీ నాయకులు సందీప్ పంచకర్ల, పసుపులేటి ఉషాకిరణ్, దల్లి గోవిందరెడ్డి, పీతల మూర్తి యాదవ్, బీశెట్టి వసంత లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.