‘జగన్‌రెడ్డి విముక్త ఆంధ్రప్రదేశ్’ కోసం కలసిరండి!

Spread the love

-చేయి చేయి కలిపి జగన్‌రెడ్డి పాలనను సాగనంపుదాం
-మౌనంగా ఉంటే కాదు.. ఈ పాలనపై చర్చించాలి

-వీళ్లు అసలు మనుషులా? రాక్షసులా?
-చిన్న పిల్లాడినీ పెట్రోల్ పోసి తగలబెడతారా?
-ఇన్ని అరాచకాలు జరుగుతుంటే పోలీసులేం చేస్తున్నట్లు?
-వైసీపీ పాలనలో ఆంధ్రప్రదేశ్‌ను నేరాంధ్రగా మార్చారు
-ఏపీ ప్రజలకు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు బహిరంగ లేఖ

జగన్‌రెడ్డి విముక్త ఆంధ్రప్రదేశ్ కోసం ప్రతి ఒక్కరూ కలసి రావలసిన అవసరం ఆసన్నమైందని టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబునాయుడు ప్రజలకు పిలుపునిచ్చారు. జగన్‌రెడ్డి అరాచక పాలపై మౌనం వీడి రోడ్లపైకి వచ్చి, చర్చించాల్సిన సమయం వచ్చిందన్నారు. చదువుకునే పిల్లాడిపై పెట్రోల్ పోసి చంపేసిన ఈ రాక్షస రాజ్యంలో, ప్రజలు మౌనంగా ఉంటే ఇంకా ప్రమాదకరమని హెచ్చరించారు. పోలీసుల మౌనం రాక్షసచర్యలకు మరింత ఊతమిస్తోందని మండిపడ్డారు. టీడీపీతో కలసి ‘జగన్‌రెడ్డి విముక్త ఆంధ్రప్రదేశ్’ కోసం కలసిరావాలని బాబు పిలుపునిచ్చారు. ఆ మేరకు ఆయన ప్రజలకు ఓ లేఖ రాశారు. ఆ లేఖ పూర్తి పాఠం ఇదీ..

తేదీ : 18.06.2023
ప్రజలకు బహిరంగ లేఖ
వైసీపీ పాలనలో నేరాంధ్రప్రదేశ్‌గా రాష్ట్రం

అందరికీ నమస్కారం…
బాపట్ల జిల్లాలో అభంశుభం తెలియని ఒక బాలుడిని అత్యంత పాశవికంగా సజీవ దహనం చేసిన ఘటన నన్ను ఎంతగానే కలిచివేసింది. రాష్ట్రంలో మహిళలపై అత్యాచారాలు, బలహీనవర్గాలు, దళితులు, మైనారిటీలపై దాడులు, ప్రభుత్వానికి వ్యతిరేకంగా గళం విప్పేవారిపై దాష్టీకాలు, వైసీపీ నేతల భూకబ్జాలు, నేరగాళ్ల విశృంఖలత్వం, ప్రభుత్వం బిల్లులు చెల్లించకపోవడంతో కాంట్రాక్టర్ల ఆత్మహత్యలు రోజు రోజుకూ పెరిగిపోతున్నాయి. గంజాయి, డ్రగ్స్‌, గన్‌ కల్చర్‌ అడ్డులేకుండా వ్యాపిస్తున్నాయి. గత మూడు రోజుల్లో జరిగిన పలు తీవ్ర నేరాలు రాష్ట్రంలో పరిస్థితులకు అద్దం పడుతున్నాయి. నవ్యాంధ్ర ప్రజలు జగన్‌ రెడ్డి పాలనలో ప్రతిరోజు అనుభవిస్తున్న నరక యాతన చూసి ఎంతో ఆవేదనతో రాష్ట్ర ప్రజలకు ఈ బహిరంగ లేఖ రాస్తున్నాను.

బాపట్లలో బాలుడి సజీవ దహనం:-
రాష్ట్రంలో ఆడబిడ్డలకు రక్షణ లేదు అనడానికి బాలుడి సజీవ దహనం పెద్ద ఉదాహరణ. బాపట్ల జిల్లా రేపల్లె నియోజకవర్గం చెరుకుపల్లి మండలం, రాజోలు గ్రామ పంచాయతీ పరిధిలోని ఉప్పలవారిపాలెంలో నలుగురు యువకులు గంజాయి మత్తులో బలహీనవర్గానికి చెందిన యువతిని వేధించగా, ఆమె సోదరుడు అమర్నాథ్‌ అడ్డుపడ్డాడు. దీంతో ఆ బాలుడిపై పెట్రోల్‌ పోసి సజీవ దహనం చేశారు. అత్యంత కిరాతకంగా జరిగిన ఈ ఘటన రాష్ట్రం మొత్తాన్ని నివ్వెరపాటుకు గురిచేసింది. ఇలాంటి సంఘటన మన రాష్ట్రంలో జరగడం తీవ్ర దిగ్భ్రాంతి కలిగించింది. బంగారు భవిష్యత్‌ ఉన్న బిడ్డ దుర్మార్గుల దాడిలో ఇలా కాలి శవమై ఇంటికి రావడాన్ని ఏ తల్లి అయినా ఎలా భరించగలుగుతుంది? బిడ్డకు చిన్న దెబ్బతగిలితేనే మనం తల్లడిల్లిపోతాం.. అలాంటిది కంటికి రెప్పలా చూసుకునే కొడుకుని పెట్రోల్‌ పోసి చంపేస్తే ఆ తల్లి ఏమవ్వాలి… ఆమె గుండె కోతను ఎవరు తీర్చాలి? తండ్రి లేని ఆ కుటుంబంలో తన సోదరికి అండగా ఉండడమే ఆ బాలుడు చేసిన తప్పా?

ఇంతటి దారుణానికి కారణం ఎవరు? పోలీసుల ఉదాసీనత వల్లనే ఈ ఘటన జరిగింది వాస్తవం కాదా? మహిళలపై వేధింపులు జరుగుతుంటే కఠిన చర్యలు తీసుకోని జగన్‌ రెడ్డి ప్రభుత్వ విధానాలు ఇలాంటి ఘటనలకు ఊతం ఇవ్వడం నిజం కాదా? ఆడబిడ్డ జోలికి వెళ్లాలి అంటే భయపడే పరిస్థితి రాష్ట్రంలో ఉండి ఉంటే… అక్కకు అండగా నిలిచిన ఆ బాలుడి ప్రాణాలు పోయేవి కాదు కదా? బలహీన వర్గాలకు చెందిన ఆ బాలుడిని ఇలా మంటల్లో కాల్చేసింది వైసీపీ ప్రభుత్వ వైఫల్యం కాదా?

వైసీపీ భూ మాఫియాను ఎదుర్కోలేక ప్రింటింగ్‌ ప్రెస్‌ యజమాని ఆత్మహత్య:-
రాష్ట్రంలో ప్రైవేటు ఆస్తుల కబ్జా నిత్యకృత్యం అయ్యింది. దశాబ్దాల పాటు శ్రమించి ప్రజలు సంపాదించుకున్న ఆస్తిని వైసీపీ రాక్షసులు కబ్జా చేస్తున్నారు. తన ఆస్తిని ఆక్రమించుకుంటే ఒక ప్రింటింగ్‌ ప్రెస్‌ యజమాని…వారిని ఎదుర్కొనలేక ప్రాణాలు తీసుకున్నాడు. రాష్ట్రంలో వైసీపీ అక్రమార్కుల సెటిల్మెంట్లు, ప్రజల ఆస్తుల కబ్జాలు, బెదిరింపులు, వేధింపులకు ఈ ఘటన సాక్ష్యంగా నిలుస్తోంది. అనంతపురం కమలానగర్‌లో వంశీ అనే వ్యక్తి ప్రింటింగ్‌ ప్రెస్‌ నిర్వహిస్తున్నాడు. కుటుంబానికి ఆధారమైన అతడి భూమిపై కన్నేసిన వైసీపీ నేతలు దాన్ని మింగేశారు. దీంతో కుటుంబం రోడ్డున పడడంతో… తీవ్ర నిరాశా నిస్పృహలకు లోనై ఆతను ఆత్మహత్య చేసుకున్నాడు. చివరికి అతను రాసిన సూసైడ్‌ నోటును కూడా తారుమారు చేశారు. సూసైడ్‌ లేఖలో ప్రస్తావించిన వైసీపీ నేత పేరును తొలగించిన పోలీసులు.. ఆ కుటుంబానికి మరింత ద్రోహం చేశారు. బాధితులకు అండగా నిలవాల్సిన పోలీసులే నిందితులకు అండగా ఉండడం పరిపాటి అయిపోయింది. పోర్టులు, భూములు, ఇళ్లు, రిసార్టులు, గనులు, వ్యాపార సంస్థలు ఇలా ఒక్కటేమిటి.. తమ కన్ను పడిన ప్రతి ఆస్తిని వైసీపీ రాక్షసులు లాగేసుకుంటున్నారు.

వీధి రౌడీల్లా వైసీపీ ప్రజా ప్రతినిధులు:-
రాష్ట్రంలో కింది స్థాయి వార్డు మెంబర్‌ నుంచి రాష్ట్ర ముఖ్యమంత్రి వరకు వ్యవహరిస్తున్న తీరు ప్రజలకు అసహ్యాన్ని కలిగిస్తోంది. ప్రజా సమస్యలు, అభివృద్ధి కార్యక్రమాలపై చర్చ జరగాల్సిన చట్టసభలను… వైసీపీ కౌరవ సభలుగా మార్చేసింది. వ్యక్తిగత దూషణలు, దాడులు అనేవి చట్ట సభల్లో సర్వసాధారణం అయిపోయింది. అమలాపురంలో మునిసిపల్‌ చైర్మన్‌పై ఏకంగా వైసీపీ కౌన్సిలర్‌ భర్త రాష్ట్ర మంత్రివర్యుని సమక్షంలోనే దాడికి దిగడం ఆ పార్టీ ప్రజా ప్రతినిధులు వ్యవహరిస్తున్న తీరుకు అద్దం పడుతోంది. తన ఛాంబర్‌ను అసాంఘిక కార్యకలాపాలకు వేదికగా చేస్తుండడాన్ని ప్రశ్నించినందుకు ఏకంగా మహిళా చైర్మన్‌పై కౌన్సిలర్‌ భర్త దాడికి దిగడం… చట్ట సభలకు వైసీపీ నుంచి ఎలాంటి వారు వెళుతున్నారు అనేది స్పష్టం చేస్తోంది.

విశాఖలో ఎంపీ కుటుంబం కిడ్నాప్‌:
రాష్ట్రంలో అధ్వాన శాంతి భద్రతలకు నిదర్శనం విశాఖలో జరిగిన కిడ్నాప్‌ వ్యవహారం. ప్రశాంతమైన ఉత్తరాంధ్రలో జరిగిన అధికార పార్టీ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ భార్య, కుమారుడు, అతని ఆడిటర్‌ కిడ్నాప్‌ ప్రజలను భయభ్రాంతులకు గురిచేసింది. ఒక ఎంపి కుటుంబాన్ని కిడ్నాప్‌ చేసి ఎంపి కుమారుడి ఇంట్లోనే రెండు రోజులు పాటు బందీలుగా పెట్టుకోవడం అందరినీ షాక్‌కి గురి చేసింది. వైసీపీ నేతలు పెంచి పోషించిన గూండాలే ఎంపీ కుటుంబాన్ని కిడ్నాప్‌ చేశాయి. అధికార పార్టీ ఎంపీని, అతని కుటుంబాన్ని కాపాడలేని ముఖ్యమంత్రి రాష్ట్రాన్ని ఎలా కాపాడుతాడు? ప్రశాంత విశాఖను అరాచక శక్తులకు, భూ కబ్జాలకు అడ్డాగా మార్చారు. విశాఖ నేడు ఎలాంటి పరిస్థితుల్లో ఉందో స్వయంగా కేంద్ర హోంమంత్రి చెప్పారు. విశాఖ పర్యటనకు వచ్చిన కేంద్ర హోం మంత్రి విశాఖలో పరిస్థితులపై ఆవేదన వ్యక్తం చేసిన 48 గంటల్లోనే పార్లమెంటు సభ్యుడి కుటుంబ సభ్యుల కిడ్నాప్‌ జరిగింది. ఇదీ రాష్ట్రంలో శాంతి భద్రతల పరిస్థితి.

నేను ఇక్కడ ప్రస్తావించిన ఈ నాలుగు ఘటనలు కూడా కేవలం మూడు రోజుల వ్యవధిలో జరిగాయి. అంటే రాష్ట్రంలో పరిస్థితులు ఎలా ఉన్నాయో ప్రతి ఒక్క పౌరుడు ఆలోచించాలి. మహిళలకు భద్రత లేదు…ఆస్తులకు రక్షణ లేదు అని ఆ ఘటనలు చూస్తే తెలుస్తోంది. రాష్ట్రంలో శాంతి భద్రతల పరిస్థితి ఎంత దారుణంగా ఉందో మనకు అవగతం అవుతోంది.

నేరస్తుల కదలికలపై నిఘా పెట్టే వ్యవస్థ దశాబ్దకాలంగా అమలులో ఉంటే దాన్ని కూడా అటకెక్కించి, పౌరుల భద్రతను ప్రశ్నార్ధకం చేశారు. దేశం మొత్తానికి ఏపీ నుండే గంజాయి సరఫరా అవుతోందని అనేక సార్లు బట్టబయలైంది. వైసీపీ నేతలే ఏజెన్సీలో వేలాది ఎకరాల్లో అక్రమంగా గంజాయి సాగుచేస్తున్నట్లు తేలింది. కట్టడి చేయాల్సిన ప్రభుత్వం, పోలీసులు చోద్యం చూస్తున్నారు. సీఎం ఇంటి సమీపంలోనే గంజాయి, డ్రగ్స్‌ విచ్చలవిడిగా అమ్ముతున్నారు. మరోవైపు (జ)గన్‌ కల్చర్‌ ప్రజలను భయకంపితులను చేస్తోంది. గన్‌ తో సెటిల్‌ మెంట్లు అనే విష సంస్కృతి జగన్‌ రెడ్డి పాలనకు ట్రేడ్‌ మార్క్‌ అయ్యింది.

రాష్ట్రంలో ఏమూల ఎలాంటి దాడి జరిగినా, ఏ హత్య జరిగినా వెనకున్నది అధికార పార్టీ నాయకులే. ప్రభుత్వ పెద్దలే. రాష్ట్రంలో నెలకొన్న దారుణమైన పరిస్థితుల్ని అంతర్జాతీయ స్థాయిలో అమెరికా విదేశాంగశాఖ ఆధ్వర్యంలో ప్రకటించే మానవ హక్కుల నివేదిక ప్రస్తావించింది. అక్రమ అరెస్టులు, కేసులు, కస్టోడియల్‌ టార్చర్‌ ద్వారా రాష్ట్రంలో మానవ హక్కుల ఉల్లంఘన తీవ్రంగా జరుగుతోందని పేర్కొనడాన్ని మించిన అవమానం ఇంకేం ఉంటుంది.

రాష్ట్రంలో జరిగిన ఏ ఒక్క దారుణంపై కూడా ముఖ్యమంత్రి ఇప్పటి వరకు స్పందించలేదు. తన ఇంటి సమీపంలో గ్యాంగ్‌ రేప్‌ జరిగినా… తన ఇంటి పక్కనే బాలిక హత్య జరిగినా కూడా ముఖ్యమంత్రి స్పందించపోవడాన్ని ఏమనుకోవాలి? ఏ ఒక్క ఘటనలో కూడా బాధితులను పరామర్శించలేదు. పోలీస్‌ వ్యవస్థ పనితీరు, నేరాల పెరుగుదలపై సమీక్షించ లేదు. తీవ్రమైన నేరాలు జరిగిన సందర్భంలో ప్రభుత్వ పెద్దలు స్పందిస్తే అధికార యంత్రాంగంలో బాధ్యత పెరుగుతుంది, కదలిక వస్తుంది. కానీ ఆ దిశగా సిఎం నాలుగేళ్లలో ఒక్కసారి కూడా పనిచేయలేదు. ఈ తీరు రౌడీలకు, హంతకులకు, వైసీపీ అరాచక శక్తులకు ఊతమిచ్చింది. తాము ఏం చేసినా ఏమీ కాదు అనే ఒక ధైర్యంతో నేరాలకు పాల్పడుతున్నారు. దీనికి నైతిక బాధ్యత ముఖ్యమంత్రిది కాదా?

శాంతిభద్రతల నిర్వహణను తనవద్దే ఉంచుకున్న ముఖ్యమంత్రిదే ఈ వైఫల్యాలకు బాధ్యత. బంగారం లాంటి రాష్ట్రాన్ని విధ్వంసాలకు, అకృత్యాలకు కేంద్రంగా మార్చారు. రాష్ట్రాన్ని నేరగాళ్లు, హంతకులు, కబ్జా దారుల పాల్జేసి నేడు మన రాష్ట్రాన్ని ‘నేరాంధ్రప్రదేశ్‌’గా, హత్యాంధ్ర ప్రదేశ్‌ గా మార్చారు. ప్రతి ఒక్కరూ నేటి ఈ దారుణ పరిస్థితులపై ఆలోచించాలి…చర్చించాలి. సభ్య సమాజానికి, రాజ్యాంగబద్ధపాలనకు, ప్రజా స్వామ్య విలువలకు తలవంపులు తెస్తున్న ఈ జగన్‌ రెడ్డి ప్రభుత్వాన్ని నిలదీయవలసిన సమయం వచ్చింది. ఇటువంటి దుర్మార్గపు పాలన నుండి రాష్ట్రాన్ని విముక్తి చేయటానికి మీరంతా కలిసి రావాలని కోరుకుంటూ నేడు లేఖ రాస్తున్నాను.

ధన్యవాదములతో…
మీ
(నారా చంద్రబాబు నాయుడు)

Leave a Reply