Suryaa.co.in

Andhra Pradesh

సమిష్టి కృషితో ఉత్సవాలు విజయవంతం చేద్దాం

– రెవెన్యూ, పోలీస్, దేవాదాయ శాఖల మధ్య సమన్వయమే కీలకం
– దేవదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి
– సమాచార శాఖ మంత్రి కొలుసు పార్థసారథి

విజయవాడ: సామాన్య భక్తుల సంతృప్తికర దర్శనం కోసం రాష్ట్ర ప్రభుత్వ దేవాదాయశాఖ సమగ్రమైన ఏర్పాట్లు చేసిందని శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి తెలిపారు.

ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వారి దేవస్థానం సన్నిధిలో దేవీ నవరాత్రుల ఉత్సవాలను గురువారం సమాచార శాఖ మంత్రి కొలుసు పార్థసారథితో కలిసి ప్రారంభించారు. అనంతరం మీడియా పాయింట్ లో మాట్లాడుతూ తాను ఇప్పుడే దేవాలయ ప్రాంగణం, పరిసర ప్రాంతాలలో ప్రత్యక్షంగా పర్యటించానన్నారు.

భక్తుల దర్శనం కోసం ఏర్పాటుచేసిన క్యూ లైన్లు, సురక్షిత మంచినీటి పంపిణీ కేంద్రాలు, పారిశుధ్య ఏర్పాట్లు వంటి అంశాలలో చాలా జాగ్రత్తలు తీసుకున్నామన్నారు. అమ్మవారి దర్శనం కోసం వస్తున్న భక్తులు తొక్కిసలాటకు గురికాకుండా అప్పటికప్పుడు అవసరమైన చర్యలు తీసుకోవాలని ఆలయ కార్య నిర్వహణ అధికారిని ఆదేశించారు.

అన్ని శాఖలు సమన్వయంతో బాధ్యతలు నిర్వహిస్తే ఎటువంటి సమస్యలు ఉత్పన్నం కావన్నారు. ప్రధానంగా గత ఏడాది తలెత్తిన సమస్యలను గుర్తించి ఆయా సమస్యలు పునరావృతం కాకుండా దేవాదాయ శాఖ అధికారులు వివిధ విభాగాల అధికారులతో సమీక్ష నిర్వహించా మన్నారు. తొమ్మిది రోజులు నిర్వహించే నవరాత్రి ఉత్సవాలలో లక్షల సంఖ్యలో భక్తులు ఉత్సవాల్లో పాల్గొని అమ్మవారిని దర్శించుకునేందుకు వచ్చే వారికి ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా అన్ని మౌలిక వసతులు కల్పించడం జరిగిందని మంత్రి వివరించారు.

దర్శనం కోసం ఏర్పాటుచేసిన ఐదు క్యూలైన్లలో రెండు క్యూ లైన్లు సామాన్య భక్తుల ఉచిత దర్శనం కోసం, వంద రూపాయల టికెట్ల ద్వారా దర్శించినందుకు టికెట్ల ద్వారా దర్శించుకునేందుకు ఒక వరుస, 300 రూపాయల టికెట్లతో దర్శించుకునే వారికోసం ఒక వరుస, మూడవది 500 రూపాయల క్యూ లైన్లుగా ఏర్పాటు చేశామన్నారు. దర్శనార్థం వచ్చే భక్తులు కొండ కింద ఉన్న అన్నదాన భవనంలో అన్న ప్రసాదాలు స్వీకరించాలన్నారు.

రాష్ట్రం సుఖ సంతోషాలతో పాడిపంటలతో సుభిక్షంగా ఉండాలని రాష్ట్ర ప్రభుత్వం తరఫున మూలా నక్షత్రం రోజు 9వ తేదీ మధ్యాహ్నం రెండు మూడు గంటల మధ్య సమయంలో రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కుటుంబ సమేతంగా విచ్చేసి అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పిస్తారని మంత్రి అన్నారు.

ఉత్సవాలకు రాష్ట్ర గవర్నర్ రాష్ట్ర హైకోర్టు జస్టిస్ వారిని కూడా కుటుంబ సమేతంగా దర్శించుకోవాల్సిందిగా తాము స్వయంగా వెళ్లి ఆహ్వానించినట్లు మంత్రి అన్నారు.

ఈరోజు నుంచి ఉత్సవాలు ముగిసేంతవరకు తొమ్మిది రోజులు దుర్గా ఘాట్ వద్ద కృష్ణమ్మ కు నవ హారతులు కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని మంత్రి తెలిపారు. ముంబాయికి చెందిన ప్రముఖ పారిశ్రామికవేత్త సౌరబ్ గౌర్ వజ్ర కిరీటాన్ని బహుకరించారు.

కడప జిల్లాకు చెందిన సీఎం రమేష్ అనే భక్తుడు అమ్మవారి అలంకార నిమిత్తం వజ్రాభరణం, తూర్పుగోదావరి జిల్లాకు చెందిన హైమావతి సూర్య కుమారి ఆంజనేయ స్వామి విగ్రహానికి వజ్రాల నత్తు, బొట్టు బహుకరించారు. భక్తులు బహుకరించిన వజ్రాభరణాలను ఈరోజు అమ్మవారికి అలంకరించనున్నట్లు తెలియజేశారు.

సమాచార, గృహ నిర్మాణ శాఖా మాత్యులు కొలుసు పార్థసారథి దేవాదాయ శాఖ మంత్రితో కలిసి శ్రీ దుర్గా భవాని నామ సంకీర్తనలు ఆడియో క్యాసెట్లు ఆవిష్కరించారు.

మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు నవరాత్రి ఉత్సవాల తొమ్మిది రోజులు భక్తులకు ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా అధికారులు సూక్ష్మస్థాయిలో పరిశీలించి గుర్తించిన సమస్యల ఆధారంగా ఆలయానికి వచ్చే ప్రతి భక్తుడు సురక్షితంగా, సులభతరమైన దర్శనం చేసుకునేలా ఏర్పాట్లు చేసినట్లు వివరించారు. వివిధ శాఖల ఉన్నతాధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి భక్తుల సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు.

ఆలయ కార్యనిర్వహణాధికారి కె.ఎస్ రామరావు మాట్లాడుతూ వివిధ శాఖల అధికారులు నిరంతరం ప్రతి ఒక్క భక్తుడు సంతృప్తికరమైన దర్శనం చేసుకునేందుకు అవసరమైన చర్యలను తీసుకుంటున్నారని వివరించారు.

LEAVE A RESPONSE