Suryaa.co.in

Telangana

రజతోత్సవ సభలో రాజధాని సత్తా చాటదాం

– మాజీ మంత్రి తలసాని పిలుపు
– గ్రేటర్ హైదరాబాద్ బీఆర్‌ఎస్ నేతల భేటీ

హైదరాబాద్: పండుగ వాతావరణంలో బీఆర్‌ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను నిర్వహించనున్నట్లు మాజీమంత్రి, సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. మంగళవారం తెలంగాణ భవన్ లో గ్రేటర్ హైదరాబాద్ స్థాయి బీఆర్‌ఎస్ పార్టీ ముఖ్య నాయకుల సమావేశం మాజీమంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అధ్యక్షతన జరిగింది.

ఈ సమావేశంలో ఎమ్మెల్సీలు సురభి వాణి దేవి, శంభీపూర్ రాజు, దాసోజు శ్రవణ్, ఎమ్మెల్యే లు కాలేరు వెంకటేష్, ముఠా గోపాల్, మాధవరం కృష్ణారావు, పలు నియోజకవర్గ ఇంచార్జి లు, పార్టీ ముఖ్య నాయకులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా తలసాని మాట్లాడుతూ.. ఈ నెల 27 వ తేదీన పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా అన్ని డివిజన్ లలో పార్టీ పతాకాలను ఆవిష్కరించడం జరుగుతుందని అన్నారు. పార్టీ ఆవిర్భవించి 25 సంవత్సరాలు అవుతున్న సందర్భంగా అదేరోజు వరంగల్ జిల్లా ఎల్కతుర్తి లో జరిగే భారీ బహిరంగ సభకు పెద్ద ఎత్తున తరలి వెళ్లనున్నట్లు చెప్పారు. బహిరంగ సభకు పార్టీ శ్రేణులను సన్నద్ధం చేసేందుకు రేపటి నుండి నియోజకవర్గ స్థాయి సమావేశాలను నిర్వహించడం జరుగుతుందని తెలిపారు.

ఈ నెల 20 వ తేదీన గ్రేటర్ హైదరాబాద్ జనరల్ బాడీ నిర్వహించడం జరుగుతుందని, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ముఖ్య అతిధిగా హాజరవుతారని చెప్పారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి గా కేసీఆర్ నాయకత్వంలో ఆదర్శవంతమైన పాలనతో అభివృద్ధి లో దేశానికే తెలంగాణ ను రోల్ మోడల్ గా నిలిపారని అన్నారు.

కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్ని వర్గాల ప్రజలకు ఇబ్బందులు తప్పడం లేదని పేర్కొన్నారు. వరంగల్ లో జరిగే బీఆర్‌ఎస్ పార్టీ రజతోత్సవ సభకు పెద్ద సంఖ్యలో హాజరై కేసీఆర్ నాయకత్వాన్ని బలపర్చాలని పిలుపునిచ్చారు.

LEAVE A RESPONSE