Suryaa.co.in

Features

గ్రంథాలయాలు – సమాజ ఉన్నతికి దారిదీపాలు

– “ఊరికో గ్రంథాలయం, ఇంటికో స్వచ్ఛాలయం” నినాదం కావాలి
అది అక్షరం…
అదే చిగురిస్తే శబ్ధమౌతుంది..
తీగ సాగితే వాక్యమౌతుంది…
పందిరంత విస్తరిస్తే గ్రంథమౌతుంది…
సమస్త వాజ్ఞ్మయ సృష్టికి బీజరూపం అక్షరమే…
తెలుగు సారస్వతాన్ని రెండోమారు జ్ఞానపీఠంపై కూర్చోబెట్టిన డా. సి.నారాయణరెడ్డి గారు అక్షరం గురించి చెప్పిన పంక్తులివి. విస్తరించిన అక్షరపు శక్తి గ్రంథమైతే… అనేక పుస్తకాల శక్తిని తనలో నింపుకున్న చైతన్య స్రవంతులు గ్రంథాలయాలు. భారతీయ చరిత్రలో, సంస్కృతిలో గ్రంథాలయాలకు ఎంతో ప్రాధాన్యత ఉంది. ప్రజలను మేలుకొలిపే జాతీయ సంపదగా, విజ్ఞాన కేంద్రాలుగా విలసిల్లిన గ్రంథాలయాలు భారత స్వరాజ్య ఉద్యమంతో పాటు వివిధ సామాజిక ఉద్యమాల్లో కీలక పాత్ర పోషించాయి. ప్రజలను చైతన్యవంతం చేయడమే గాక, మెరుగైన భవిష్యత్తుకు మేలి బాటలు వేశాయి.
గ్రంథాలయాలు జాతి ఉన్నతికి పట్టుగొమ్మలు. చరిత్రలో యుద్ధాల కంటే విజ్ఞానమే ఎక్కువ స్వేచ్ఛను రగిలించింది…. వికాసానికి నాంది పలికింది. చరిత్రలో అలాంటి అనేక మార్పులకు నాంది పలికిన విజయవాడలోని రామ్మోహన్ గ్రంథాలయాన్ని సందర్శించడం ఎంతో ఆనందాన్ని అందించింది. దాదాపు 118 ఏళ్ళ చరిత్ర ఉన్న ఈ గ్రంథాలయం స్వరాజ్య ఉద్యమంలో ఎంతో మందిలో పోరాట స్ఫూర్తిని రగల్చడమే గాక, గ్రంథాలయ ఉద్యమానికి, ఆంధ్రప్రదేశ్ గ్రంథాలయ సంఘం ఏర్పాటుకు కేంద్రబిందువుగా నిలిచింది. వందేమాతర ఉద్యమానికి ముందే మొదలైన ఈ గ్రంథాలయం ఎందరో మహనీయుల కృషికి నిదర్శనం, త్యాగాలకు ఫలితం.
ఆంధ్రప్రదేశ్ లో గ్రంథాలయ ఉద్యమం తొలినాళ్ళలో బెజవాడలోని కొందరు సాహిత్యాభిమానుల చొరవతో ఈ సంస్థకు అంకురార్పణ జరిగింది. 1903 ఏప్రిల్ లో బ్రహ్మసమాజం వారి నేతృత్వంలో ఆస్తిక పుస్తక భాండాగారం పేరుతో మొదలైన ఈ సంస్థ… 1908లో విజయవాడలోని బిసెంట్ రోడ్ కు మారింది. 1911లో ప్రస్తుతం గ్రంథాలయం ఉన్న చోటకు మారింది. యువతే స్వయంగా ఏర్పాటు చేసుకున్న ఈ గ్రంథాలయం శ్రీ అయ్యంకి వెంకటరమణయ్య గారు కార్యదర్శిగా ఎన్నిక కావడం ద్వారా అభివృద్ధి పథంలోకి అడుగు పెట్టింది.
శ్రీ అయ్యంకి వెంకట రమణయ్య గారు, శ్రీ సూరి వెంకట నరసింహ శాస్త్రి తదితరులు చందాలు పోగేసి, అప్పు చేసి ఈ గ్రంథాలయ స్థలాన్ని కొన్న సంఘటన స్ఫూర్తిని రేకెత్తిస్తుంది. నేటి యువత ఇలాంటి మహనీయుల నుంచి ప్రేరణ పొందాల్సిన అవసరం ఉంది. యువత తలచుకుంటే చరిత్ర గతి మారుతుందన్న విషయాన్ని ఈ సంఘటన మనకు తెలియజేస్తుంది. నాడు వారు ఈ చొరవ తీసుకోకపోయి ఉంటే, ఈ మార్పు సాధ్యమై ఉండేది కాదేమో. సమాజానికి మేలు చేయాలనే సంకల్పమే ఆ మహానీయులను ముందుకు నడిపింది.
స్వరాజ్య సంగ్రామంలోనూ రామ్మోహన్ గ్రంథాలయం పోషించిన పాత్ర చిరస్మరణీయమైనది. మహాత్మ గాంధీ మూడు మార్లు ఈ గ్రంథాలయాన్ని సందర్శించడం తెలుగు వారు మరచిపోలేని విషయం. 1919 జనవరి 30న, 1921 మార్చి 31న, 1929లో మరోసారి మహాత్ముడు ఈ గ్రంథాలయంలో కాలు మోపారు.
అలాంటి చారిత్రక విశిష్టత ఉన్న గ్రంథాలయాన్ని సందర్శించడం, ఇక్కడ కొలువైన పుస్తకాలను చూడడం ఎంతో ఉత్సాహాన్ని అందించింది. నిజానికి ఈ గ్రంథాలయం వెనుక నిలబడింది, దీన్ని నడిపింది తొలినాళ్ళలో శ్రీ అయ్యంకి వెంకట రమణయ్య గారే. ఆ రోజుల్లో ప్రారంభమైన గ్రంథాలయ ఉద్యమంలో వారు కీలక పాత్ర పోషించారు. ప్రజలను విజ్ఞానవంతులుగా మార్చి, చైతన్యం రగిలించేందుకు గ్రంథాలయ ఉద్యమం తోడ్పడింది. ఈ ఉద్యమం ఇతర ఉద్యమాలకు చేయూత ఇవ్వడమే గాక, పలు రంగాల్లో తెలుగువారి చైతన్యానికి తోడ్పాటును అందించింది. పుస్తకానికి ఉన్న శక్తి అలాంటింది. పుస్తకాలు భాషా సంస్కృతులకు దర్పణాలే గాక, అభివృద్ధి గమనంలో అక్షర పాథేయాలు.
ప్రాచీన కాలం నుంచి మన జీవితంలో విప్లవాత్మక మార్పులకు పుస్తకాలు నాంది పలుకుతున్నాయి.
ఒకతరం నుంచి మరో తరానికి సమాచారాన్ని చేరవేసేందుకే గాక, స్ఫూర్తిని పంచాయి. మనిషి ఆలోచనా పరిధిని విస్తృతం చేయడమే గాక, చుట్టూ ఉన్న ప్రపంచాన్ని అర్ధం చేసుకోవడానికి, మన జీవితాన్ని ఉన్నతంగా తీర్చిదిద్దుకోవడానికి పుస్తకాలు సాయం చేస్తాయి. భాషా నైపుణ్యాన్ని, వాక్పటిమను పెంచుకోవడంలో వీలును కలుగ జేస్తాయి. ఒక్క మాటలో చెప్పాలంటే మన ఆలోచనలను మెరుగైన విధంగా వ్యక్తీకరించడానికి వీలు కల్పించి సమాజంలో మనకంటూ ఓ ప్రత్యేకతను సాధించుకోవడానికి పుస్తకాలు ఎంతగానో తోడ్పడతాయి.
లిపి ప్రపంచంలో అత్యంత ప్రాచీన నాగరికత కలిగిన భారతదేశంలో విజ్ఞాన ఖనులుగా పేరు గాంచిన వేదాలు, వేల సంవత్సరాల పాటు మౌఖిక రూపంలో సంరక్షించబడ్డాయి. లిపిని కనుగొన్న తర్వాత మౌఖిక అంశాలకు కొందరు మహనీయులు అక్షర రూపం కల్పించారు. రాళ్ళపైన ప్రారంభమైన రాతలు, రాగిరేకులు, జంతువుల చర్మం, తాటి ఆకులను దాటి చివరకు కాగితం పైకి చేరాయి. వేల సంవత్సరాల పాటు మానవుని ధారణాశక్తి, మేధా సంపత్తుల ద్వారా కాపాడుకుంటూ వచ్చిన పలు అంశాలు గ్రంథరూపం దాల్చాయి.
మన దేశంలో గ్రంథాల చరిత్ర మీద భిన్నాభిప్రాయాలు ఉన్నప్పటికీ, తాళపత్రాల రూపంలో తొలి గ్రంథాలకు ఆద్యులు భారతీయులే అని నేను భావిస్తాను. వేలాది సంవత్సరాలుగా మానవ చరిత్ర, నాగరికత, సంస్కృతి, సంప్రదాయాల మీద పుస్తకాలు చూపిన ప్రభావాన్ని మరేదీ చూపలేకపోయిందని విశ్వసిస్తాను. దేశాభివృద్ధికి, సాహిత్య జగతికి, విజ్ఞాన శాస్త్ర పురోగతికి, యుద్ధ సమయంలో, శాంతి సమయంలో, దేశ పునర్మిర్మాణ సమయంలో గ్రంథాలు సమస్త మానవాళికి అండగా నిలిచాయి. సమస్యల అంధకారం ముప్పిరిగొన్న ప్రతి సందర్భంలోనూ మానవుణ్ని మహోన్నతునిగా మలచినవి పుస్తకాలే.
పుస్తకాలు ఓ మతానికో, ఓ కులానికో, ఓ వర్గానికో పరిమితం కావు. లక్ష్మీ కటాక్షం సంగతి ఎలా ఉన్నా, పుస్తక సరస్వతి కటాక్షం మాత్రం ఆసక్తి ఉన్న ప్రతి ఒక్కరికీ అందుతుంది. సరస్వతికి పేద, గొప్ప అన్న తేడా లేదు. శరీరానికి వ్యాయామం ఎంత ముఖ్యమో, మెదడును చైతన్యం చేయడానికి పుస్తకాలు అంతే ముఖ్యం. వేయి పడగలు పుస్తకంలో శ్రీ విశ్వనాథ సత్యనారాయణ గారు అన్నట్లు… “ఓజాతి సర్వత ఉన్మీలితమైనా కావచ్చు గానీ, శక్తి చావరాదు.” మనం ఎంత ఎత్తుకు ఎదిగినా, మన అభివృద్ధికి కారణమైన శక్తి మాత్రం దినదిన ప్రవర్థమానమౌతూ ఉండాలి అని ఆయన మాటల్లోని ఆంతర్యం.
అయితే ప్రస్తుతం ఈ పరిస్థితి లేదు. టీవీ, ఇంటర్నెట్ సంస్కృతి కారణంగా సమాజంలో క్రమంగా పఠనాసక్తి తగ్గిపోతూ వచ్చింది. ఈ మధ్యకాలంలో గ్రంథాలయాలకు వెళ్ళే వారి సంఖ్య తగ్గిపోయిందనే చెప్పాలి. ప్రస్తుతం గ్రంథాలయాల పునరుద్ధరణ గానీ, కొత్తవాటి ఏర్పాటు గానీ జరగడం లేదనేది మనమంతా గుర్తించాల్సిన అంశం. ఇలాంటి వాతావరణం సమాజపు ఆలోచనా తీరును, పిల్లల సామర్థ్యాన్ని దెబ్బతీస్తుంది. ముఖ్యంగా యువతలో పఠనాసక్తి తగ్గడమే గాకుండా, వారు సమాచారం కోసం పుస్తకాల కంటే ఇంటర్నెట్ మీదే అధికంగా ఆధారపడుతున్నారు.
టీవీలకు పరిమితం కావడం, కంప్యూటర్ లో, మొబైల్ లో పుస్తకాలు చదివే అలవాటు కారణంగా అనేక శారీరక, మానసిక సమస్యలు మొదలౌతున్నాయి. కళ్ళకు సంబంధించిన సమస్యలు, మెడకు సంబంధించిన సమస్యలు రావడానికి ఇవే కారణమౌతున్నాయి. ఈ పరిస్థితుల్లో మార్పు రావాలంటే పుస్తకాలు చదివే సంస్కృతి పెరగాలి. గ్రంథాలయ సంస్కృతిని పెంపొందించుకోవడం ఈ సమస్యలన్నింటికీ కచ్చితమైన పరిష్కారాన్ని చూపిస్తుందని నా విశ్వాసం.
పాఠకుల్ని తయారు చేసుకోవలసిన అవసరం ప్రచురణ రంగానికే గాక, పత్రికా రంగానికి కూడా ఉంది. అంతే కాదు విజ్ఞానవంతమైన సమాజ సృష్టి జరగాలంటే, ప్రజల్లో పఠనాసక్తి పెంపొందడం అత్యంత ఆవశ్యకం కూడా. ఈ నేపథ్యంలో మరోసారి గ్రంథాలయ ఉద్యమం బలోపేతం కావలసిన అవసరం ఉంది. నాడు ఉత్తుంగతరంగమై విస్తరించిన గ్రంథాలయ ఉద్యమం భారతదేశ సామాజిక-సాంస్కృతిక పునరుజ్జీవనంలో కీలకపాత్ర పోషించడం మాత్రమే గాక, అక్షరాస్యతను వ్యాప్తి చేసింది. ప్రజల్లో సోదర భావాన్ని పెంపొందించింది. ఆంధ్రప్రదేశ్ నుంచి పంజాబ్, మహారాష్ట్ర, కేరళ… ఇలా దేశమంతా చీకట్లను చీల్చుకుంటూ విస్తరించి విజ్ఞాన జ్యోతులను వెలిగించింది. ఈ స్ఫూర్తి మరోసారి భారతీయ సమాజంలో వెల్లివిరియాలని ఆకాంక్షిస్తున్నాను.
“మతములన్నియు మాసిపోవును…
జ్ఞానమొక్కటి నిలిచి వెలుగును…”
అన్న గురజాడ వారి మాటలు నిజం కావాలంటే పుస్తకం పఠనం మరింత పెరగాలి. ముఖ్యంగా పిల్లలకు పుస్తక పఠనం అలవాటు చేయాలి. భారతదేశ సాంస్కృతిక వైభవాన్ని, మహోన్నతమైన వారసత్వాన్ని పిల్లకు పరిచయడం చేయడానికి పుస్తక పఠనం పెంపొందించడం ఎంతగానో తోడ్పడుతుంది. పిల్లలకు పుస్తకాలు చదవడాన్ని ఓ పనిగా కాకుండా ఆటపాటలతో సమానంగా చూసేలా ప్రోత్సహించాలి. ఈ విషయంలో తల్లిదండ్రులే పిల్లల్లో ప్రేరణ కలిగించాలి. పాఠశాలలు పఠనాసక్తిని పెంపొందించేందుకు ప్రత్యేక శిబిరాలను ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది.
సమర్థవంతమైన జనశక్తి భారతదేశం సొంతం. భారతీయ జనాభాలో 60 శాతానికి పైగా యువతరమే ఉంది. యువతను ఉత్తేజితుల్ని చేసి, వారిని నవభారత నిర్మాణసారథులుగా, సమాజాన్ని ముందుకు నడిపే శక్తిచోదకులుగా తీర్చిదిద్దాలంటే… ముందు వారిలో విజ్ఞాన బీజాలు నాటాలి. ప్రపంచాన్ని వారికి సరైన కోణంలో పరిచయం చేయాలి. ఇది జరగాలంటే గ్రంథాలయాల అభివృద్ధి మనకు అందుబాటులో ఉన్న మేలైన మార్గం.
అజ్ఞానం నుంచి విషయ పరిజ్ఞానంతో విజ్ఞానం, మెరుగైన జీవితం తద్వారా మెరుగైన సమాజం, దేశం, ప్రపంచం రూపొందుతాయి. ప్రతి గ్రామంలో ఓ విద్యాలయం, దేవాలయంతో పాటు ఓ గ్రంథాలయం అందుబాటులో ఉండాలి. “ఊరికో గ్రంథాలయం, ఇంటికో స్వచ్ఛాలయం” నినాదం కావాలి. స్వచ్ఛభారత్ కార్యక్రమంలా ఇదో ప్రజా ఉద్యమంగా రూపుదాల్చి స్వచ్ఛత, విజ్ఞానం ఏకకాలంలో దేశాభివృద్ధిలో కీలక పాత్ర పోషించాలి. ముఖ్యంగా రామ్మోహన్ గ్రంథాలయాల వంటి చారిత్రక స్థలాలను యువత సందర్శించాలని సూచిస్తున్నాను. నాటి స్వాతంత్ర్య సమరయోధుల స్ఫూర్తిని మదిలో నింపుకుని, విజ్ఞానవంతులైన యువత దేశాన్ని నవ్యపథంలో ముందుకు నడపాలని ఆకాంక్షిస్తున్నాను.

ముప్పవరపు వెంకయ్య నాయుడు
భారత ఉపరాష్ట్రపతి

LEAVE A RESPONSE