‘ఉత్త చేతులతో వచ్చాం. ఉత్త చేతులతోనే వెళ్తాం’ అనుకోవడంలోని తాత్త్వికతను వివేకంతో అన్వయించుకోవాలి తప్ప, నిష్క్రియా పరత్వాన్ని కప్పిపుచ్చుకొనే ముసుగులాగా వాడుకోవడం విజ్ఞత కాదు. అలాంటి సందర్భాల్లో అవి శుష్కప్రియాలవుతాయి. శూన్యహస్తాలుగా మిగిలిపోతాయి. ఫలానాది సాధించామని చెప్పుకోవడం ఎవరికి మాత్రం ఇష్టం ఉండదు? ఆశల రెక్కలు విప్పి హాయిగా ఎగరాలని, చుక్కల లోకాన్ని చుట్టిరావాలని ఆశించనిదెవరు? ఆసరాగా పందిరి వేసి, వేళకిన్ని నీళ్లు పోస్తే ఎగబాకని తీగ ఉంటుందా, రేకులు విప్పారకుండా ఉంటుందా?
సాఫల్య సాధనలో తొలి అంశం సానుకూల దృక్పథం. ‘సాధిస్తాను’ అని సంకల్పం చెప్పుకోవడం చాలా అవసరం. అలాగని పని మొదలుపెట్టింది లగాయతు ఫలితం గురించి లెక్కలు వెయ్యడమన్నది సాధకుడి లక్షణం కాదు. దాని వల్ల ఆత్రుత, ఒత్తిడి హెచ్చి, ఏకాగ్రత పక్కదారి పడుతుంది. గమ్యం మరింత దూరమవుతుంది. వాకిట్లో కాలుపెట్టింది మొదలు వారణాసి ఎంత దూరమని లెక్కలు వేస్తుంటే- ఇక గంగాతీరం చేరేదెన్నడు? లౌకికం కావచ్చు- పారమార్థికం కావచ్చు… జీవిత సాఫల్యానికి వర్తించే సూత్రాలు, మార్గదర్శకాలు ఒకటే. అన్వయించుకోవడంలోనే ఉంది. ఆధ్యాత్మిక వేత్తలు, వ్యక్తిత్వ వికాస నిపుణులు ఆయా రంగాలకు వర్తించేలా వాటిని చెప్పినా అంతస్సూత్రం ఒకటే!
ఇందులో స్పష్టత, వ్యూహం, సహాయం- ఈ మూడు అంశాలూ ప్రధానమన్నది నిపుణుల మాట! ఎందుకు అని ప్రశ్నించుకోవడంలోనే సాధకుడి లక్ష్యం స్పష్టమవుతుంది. మానసికంగా సంబంధిత లక్ష్యంతో సారూప్యం చెందడం వీలవుతుంది.
ముని బాలుడి శాపం వల్ల ఏడురోజుల్లో చావు తప్పదని తెలుసుకున్న పరీక్షిత్తు ప్రాయోపవేశానికి సిద్ధపడినా…, శుకమహర్షి రాకతో చేరాల్సిన గమ్యం పట్ల స్పష్టత ఏర్పరచుకున్నాడు. వారం తిరగ్గానే మరణం ఎలానూ వస్తుంది. ఇప్పుడే బతుకును బలవంతంగా ముగించడం దేనికని తర్కించుకున్నాడు. విష్ణు సన్నిధికి చేరుకోవాలన్న లక్ష్యాన్ని స్పష్టంగా ఏర్పరచుకుని, దానికి అనుగుణమైన మానసిక వైఖరిని అవలంబించాడు. భాగవత సప్తాహం ద్వారా జీవిత దిశగా పురోగమించాడు. సాఫల్యసాధనలో రెండో అంశం వ్యూహం.
ఏడు రోజుల్లో భాగవతాన్ని వినేందుకు సిద్ధపడ్డ పరీక్షిత్తు ఈసురోమని చెవులొగ్గ లేదు. తరిగిపోతున్న దినాలను, ఆయువును తలచుకుంటూ కంటతడి పెట్టనూలేదు. వినడాన్ని ప్రేమించాడు. విష్ణు సాన్నిధ్యం చేరుకోవడాన్ని ఆరాధించాడు. పరిపూర్ణమైన భక్తితో, అంకిత భావంతో, శ్రీమన్నారాయణుడి చరణయుగళంతో మమేకమై తనను తాను సమర్పించుకున్నాడు. విన్న కథల పట్ల, వినిపించిన శుక మహర్షి పట్ల కృతజ్ఞతను కలిగి ఉన్నాడు. ఈ వ్యూహమే ఆయనను సఫలుణ్ని చేసింది. పరీక్షిత్తు ఏ దశలోనూ నిరాశకు తావివ్వలేదు. నీలినీడలను సోకనివ్వలేదు. శుకమహర్షి చెబుతున్న కొద్దీ, శ్రద్ధాసక్తులు మూటకట్టుకుని, అడుగడుగునా పరిప్రశ్నలు వేస్తూ, అడిగి మరీ చెప్పించుకున్నాడు. సాఫల్యాన్ని పొందడంలో నిపుణులు సూచించిన మూడో అంశం- సహాయం. అది శుకమహర్షి రూపంలో సరైన సమయానికి లభించడం పరీక్షిన్మహారాజు చేసుకున్న అదృష్టం.
రాముడి విషయంలో – రావణుడి చెరనుంచి సీతను విడిపించడాన్ని, పాండవుల విషయంలో – కోల్పోయిన రాజ్యాన్ని తిరిగి సాధించడాన్ని సాఫల్య సాధనలుగా భావిస్తే వ్యక్తిత్వ వికాస నిపుణులు సూచించిన- ‘స్పష్టత, వ్యూహం, సహాయం’ అనే సూత్ర త్రయం వారికి ఎంత చక్కగా వర్తించిందో విశదమవుతుంది. దేశ కాలాదులతో నిమిత్తం లేకుండా జీవితంలోని లౌకిక, ఆధ్యాత్మిక రంగాలు రెండింటిలోనూ సాఫల్య సాధన సుసాధ్యమవుతుంది. చక్కని మార్గం ఉంది… సంకల్ప శుద్ధి పట్ల మనసుండాలి!
సేకరణ : హైందవ పరిషత్ చారిటబుల్ ట్రస్ట్