Suryaa.co.in

Andhra Pradesh

తాడేపల్లి ప్యాలెస్‌ కు మద్యం బ్లాక్‌ మార్కెట్‌ డబ్బు!

-జే గ్యాంగ్‌ ఆధ్వర్యంలో లక్ష కోట్ల లూఠీ
-వైఎస్‌ అనిల్‌ రెడ్డి నియంత్రణలో తయారీ కంపెనీలు
-వాసుదేవరెడ్డి కనుసన్నల్లో మద్యం మాఫియా
-రాష్ట్రాన్ని మద్యాంధ్రప్రదేశ్‌ గా మార్చారు
-అవినీతి సొమ్ము కక్కించి జైలుకు పంపుతాం
-బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి భానుప్రకాష్‌రెడ్డి

గుంటూరు అరండల్‌పేటలోని యోగేష్‌ భవన్‌లో శుక్రవారం ఎన్డీఏ కూటమి ఆధ్వర్యంలో మీడియా సమావేశం జరిగింది. ముఖ్యఅతిథిగా బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి భానుప్రకాష్‌రెడ్డి పాల్గొన్నారు. మద్య నిషేధం అని చెప్పి రాష్ట్రాన్ని మద్యాంధ్రప్రదేశ్‌గా మార్చారని, సంక్షేమం పేరుతో రాష్ట్రాన్ని సంక్షోభంలోకి నెట్టారని విమర్శించారు. 70 నుంచి 80 వేల కోట్లు వడ్డీనే కడుతున్నారని, ఇది జగన్‌ అఖరి బస్సు యాత్ర అని, ప్రజలు ఇంటికి పంపేందుకు సిద్ధమయ్యారని వ్యాఖ్యానించారు. మద్యంలో వేల కోట్ల అవినీతి డబ్బును ఎన్నికల్లో ఖర్చు పెడుతున్నారని, వాటిని కక్కిస్తామని అన్నారు. 2020లో క్రిసిల్‌ చేసిన సర్వే ప్రకారం ఏపీలో దాదాపు 34.5 శాతం మంది మద్యం సేవిస్తున్నారని తేలింది. 2021లో నేషనల్‌ ఫామిలీ హెల్త్‌ సర్వేలో కూడా ఏపీలో దాదాపు 31.4 శాతం మంది మద్యం సేవిస్తున్నారని స్పష్టం అయిందన్నారు. మద్యపాన నిషేధంపై హామీ ఇచ్చి నేటికీ ఒక్క డీ- అడిక్షన్‌ సెంటర్‌ను కూడా ప్రారంభించలేదని విమర్శించారు.

వాసుదేవరెడ్డి కనుసన్నల్లో మద్యం మాఫియా
మద్యం మాఫియాతో జే గ్యాంగ్‌ లక్ష కోట్లు లూఠీ చేసిందని ఆరోపించారు. మద్యం బ్లాక్‌ మార్కెట్‌ అమ్మకాల డబ్బు అంతా తాడేపల్లి ప్యాలెస్‌కు తరలి పోతోందని, జగన్‌రెడ్డి సోదరుడు వైఎస్‌ అనిల్‌రెడ్డి మద్యం వ్యాపారంలో ఆరి తేరి పోయారన్నారు. ఆయన రాష్ట్రంలో మద్యం తయారీ కంపెనీలను నియంత్రిస్తున్నారని, ఏపీ బేవరేజస్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌ వాసుదేవరెడ్డి కనుస న్నలోనే రాష్ట్రంలో మద్యం మాఫీయా అరాచకాలు నడుస్తున్నాయని విమర్శిం చారు. ఎన్నికలకు అక్రమంగా వైసీపీ అభ్యర్థులకు మద్యం సరఫరాకు ఆయన ప్రణాళికలు రచించారని, ఆయనను విధుల నుంచి తొలగించాలని డిమాండ్‌ చేశారు.

నిబంధనలకు విరుద్ధంగా జీవోలు
నిబంధనలకు విరుద్ధంగా 2021న నవంబర్‌ 9న రాత్రికి రాత్రే 312, 313 జీవోలను తీసుకుని వచ్చారు. మద్యం అమ్మకాల మీద వచ్చే ఆదాయాన్ని కూడా జగన్‌ మరో ఇరవై ఏళ్లకు తాకట్టు పెట్టాడు. జాతీయ, ఆర్‌ అండ్‌ బీ రహదారులకు సమీపంలో మద్యం దుకాణాలు ఉండకూడదనే సుప్రీంకోర్డు ఉత్తర్వులను కూడా బేఖాతరు చేసింది. జగన్‌ జే బ్రాండ్‌ కారణంగా జంగారెడ్డిగూడెంలో 25 మంది మరణించారన్నారు. ఈ ప్రభుత్వ అవినీతి విధానాలపై విచారణ జరిపి జగన్‌ను జైలుకు పంపుతామని హెచ్చరించారు. ఈ సమావేశంలో బీజేపీ రాష్ట్ర మీడియా ప్యానలిస్ట్‌ పాటిబండ్ల రామకృష్ణ, బీజేపీ జిల్లా అధ్యక్షుడు వనమా నరేంద్ర కుమార్‌, తెలుగుదేశం తెలుగు మహిళా జిల్లా అధ్యక్షురాలు అన్నాబత్తుని జయలక్ష్మి, టీడీపీ కార్పొరేటర్‌ పోతురాజు సమత, జనసేన జిల్లా ఉపాధ్యక్షురాలు బిట్రగుంట మల్లిక, రాష్ట్ర మీడియా కో కన్వీనర్‌ వెలగలేటి గంగాధర్‌, జిల్లా ప్రధాన కార్యదర్సులు చరక కుమార్‌ గౌడ్‌, చెరుకూరి తిరుపతిరావు, వైవీ సుబ్బారావు పాల్గొన్నారు.

LEAVE A RESPONSE