నేటి యువతకు రోల్ మోడల్ నారా లోకేష్

– టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి వర్ల రామయ్య
– దళితనేతల ఆధ్వర్యంలో ఘనంగా జన్మదిన వేడుకలు

అమరావతి: తెలుగుదేశం పార్టీ యువనేత నారా లోకేష్ అతి పిన్నవయసులో అద్భుత విజయాలు సాధించి నేటియువతకు రోల్ మోడల్ గా నిలిచారని టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి వర్ల రామయ్య పేర్కొన్నారు.

మంగళగిరిలో టిడిపి జాతీయ కార్యాలయం ఎన్టీఆర్ భవన్ లో దళితనేతల ఆధ్వర్యంలో నిర్వహించిన లోకేష్ జన్మదిన వేడుకలకు ఆయన ముఖ్యఅతిధిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా వర్ల రామయ్య మాట్లాడుతూ అతిచిన్న వయసులో కీలకమైన పంచాయితీరాజ్, గ్రామీణాభివృద్ధి, ఐటి శాఖల మంత్రిగా బాధ్యతలు చేపట్టి కేవలం మూడేళ్లలో ఆ శాఖల్లో ఇదివరకెన్నడూ సాధించలేని అభివృద్ధిని చేసి చూపారన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో 25వేల కిలోమీటర్ల సిమెంట్ రోడ్ల నిర్మాణం, పల్లెల్లో ఎల్ ఇడి విద్యుత్ దీపాలు, ఐటి, ఎలక్ట్రానిక్స్ రంగంలో సాధించిన పెట్టుబడులు, లక్షలాది యువతకు ఉపాథి అవకాశాలు లోకేష్ సమర్థతకు గీటురాయి అని అన్నారు.

ప్రతి కార్యకర్తకు రెండులక్షల రూపాయల బీమా సౌకర్యం కల్పించి పార్టీ కేడర్ కు కూడా భరోసా కల్పించారని తెలిపారు. అధికారంలో ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నా నిత్యం ప్రజల్లో మమేకమవుతూ ఎవరికి ఏ కష్టమొచ్చినా నేనున్నానని అంటూ ఆపన్నహస్తం అందించే ఉత్తమ సేవాగుణం లోకేష్ కు తాత ఎన్టీఆర్, తండ్రి చంద్రబాబునాయుడు ద్వారా సంక్రమించిందని చెప్పారు. అత్యుత్తమ నాయకత్వ లక్షణాలు కలిగిన లోకేష్ పోరాట పటిమ తెలుగుదేశం పార్టీలో యువతరానికి ఆదర్శంగా నిలుస్తూ పార్టీ పూర్వవైభవం సంతరించుకునే దిశగా ముందుకు సాగుతోందని వర్ల కొనియాడారు. ఈ కార్యక్రమంలో పార్టీనేతలు మైనర్ బాబు, చిన్ని తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply