జనవరి 27 నుంచి లోకేష్‌ పాదయాత్ర

– కుప్పం టు ఇచ్ఛాపురం వరకూ పాదయాత్ర
– ఏడాదిపాటు కొనసాగనున్న లోకేష్‌ పాదయాత్ర
– యువతను ఆకట్టుకోవడమే లక్ష్యం
– పాదయాత్రలో యువత, నిరుద్యోగులతో భేటీ
– పాదయాత్రకు యువచైతన్యయాత్ర, యువపథం పేరు పరిశీలన
– కసరత్తు చేస్తున్న లోకేష్‌ టీం
– రూట్‌మ్యాప్‌పై జిల్లా నేతల కసరత్తు
– తండ్రి బాటలో తనయుడు
( మార్తి సుబ్రహ్మణ్యం)

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, యువ నేత నారా లోకేష్‌ పాదయాత్రకు సిద్ధమవుతున్నారు. ఏపీలోని యువత, నిరుద్యోగులను ఆకట్టుకోవడమే లక్ష్యంగా సాగనున్న లోకేష్‌ పాదయాత్రకు, ఆయన బృందం కసరత్తు ప్రారంభించింది. అత్యంత విశ్వసనీయ సమాచారం ప్రకారం, జనవరి 27 నుంచి లోకేష్‌ పాదయాత్ర ప్రారంభం కావచ్చు. 23, 27 రెండు తేదీలు లోకేష్‌ జన్మనక్షత్రం ప్రకారం, మంచివని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఆ ప్రకారంగా 27 నుంచి పాదయాత్ర ప్రారంభించే అవకాశాలున్నట్లు తెలుస్తోంది.

తండ్రి చంద్రబాబు బాటలోనే తనయుడు లోకేష్‌ పయనిస్తున్నారు. గత ంలో పాదయాత్ర చేసిన చంద్రబాబు అధికారంలోకి వచ్చారు. ఇప్పుడు తనయుడు లోకేష్‌ కూడా, అదే దారిలో పాదయాత్ర చేసేందుకు సిద్ధమవుతున్నారు. గత ఎన్నికల ముందు పాదయాత్ర చేసిన.. వైసీపీ అధినేత జగన్మోహన్‌రెడ్డి కూడా, తర్వాత అధికారంలోకి వచ్చిన విషయం తెలిసిందే. తొలుత పాదయాత్ర చేసిన వైఎస్‌, తర్వాత చంద్రబాబు, ఆయన తర్వాత జగన్‌ ముగ్గురూ ముఖ్యమంత్రులవగా, మూడవ తరం నాయకుడయిన లోకేష్‌ కూడా పాదయాత్రకు సిద్ధమవుతుండటం విశేషం.

కాగా చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గం నుంచి ప్రారంభమై, శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురం వరకూ పాదయాత్ర కొనసాగనుంది. దాదాపు ఏడాది పాటు జరిగే పాదయాత్ర రూట్‌మ్యాప్‌పై, లోకేష్‌ బృందం కసరత్తు చేస్తోంది. ఆయా నియోజకవర్గాల ప్రాధాన్యం, ప్రధాన సమస్యలు, బస ఏర్పాట్లు తదితర అంశాలపై జిల్లా పార్టీ నాయకత్వాలతో చర్చిస్తున్నారు.

ప్రధానంగా రాష్ట్రంలో నిరాశ, నిస్తేజంగా ఉన్న యువత- నిరుద్యోగులలో..ప్రభుత్వానికి వ్యతిరేకంగా చైతన్యం కలిగించడమే, లోకేష్‌ పాదయాత్ర లక్ష్యంగా కనిపిస్తోంది. తన పాదయాత్రలో వారిని కలవడంతోపాటు, వారితోనే నిరుద్యోగ సమస్యను ప్రస్తావించేలా వ్యూహరచన చేస్తున్నారు. యువత-నిరుద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలను, వారితోనే ప్రస్తావించడం ద్వారా ఆయా వర్గాలను ఆకట్టుకోవచ్చన్నది టీడీపీ యోచన. కాగా లోకేష్‌ తన పాదయాత్రలో భాగంగా, కార్యకర్తల ఇళ్లలోనే బస చేసేలా ఏర్పాట్లు చేస్తున్నట్లు సమాచారం. దానివల్ల శ్రేణుల్లో ఆత్మస్థైర్యం వస్తుందని భావిస్తున్నారు.

ఏడాదిపాటు జరిగే లోకేష్‌ పాదయాత్రకు, పలు పేర్లు పరిశీలనలో ఉన్నాయి. యువచైతన్యయాత్ర, యువపథం, యువ బాట పేర్లు పరిశీలిస్తున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అయితే యువచైతన్యయాత్ర పేరు ఖరారు కావచ్చని పార్టీ వర్గాల సమాచారం.

Leave a Reply