Suryaa.co.in

Family

వివాహ వ్యవస్థపై సడలుతున్న నమ్మకం

– పెరుగుతున్న ‘లివ్ఇన్’ ట్రెండ్
(రాళ్లపల్లి)

‘‘పెళ్లంటె పందిళ్లు..
సందళ్లు తప్పెట్లు..
తాళాలు తలంబ్రాలూ..
మూడే ముళ్లు..
ఏడే అడుగులు..

మొత్తం కలిసీ నూరేళ్లు..’’ అంటూ త్రిశూలం అనే సినిమాలో సినీ కవి ఆత్రేయ రాసిన పాట హిందూ వివాహ వ్యవస్థ విశిష్టతను గొప్పగా చెప్తుంది. పెళ్లితో అమ్మాయి, అబ్బాయిని ఒక్కటి చేయడానికి చేసే తంతు.. అందులో పాల్గొనే ఇరు కుటుంబాల పెద్దలు, పిన్నలు అందరికీ ఒక్కో తరహా బాధ్యతలు మొత్తం కలిసి పెండ్లి అంటే ఇద్దరిని ఒక్కటి చేసే జాతరలా ఉంటుంది.

కానీ ఇప్పుడు ఇదంతా పాత చింతకాయ పచ్చడేనని అధికశాతం యువత బలంగా నమ్ముతున్నది. ట్రెండ్ మారింది. మూడు ముళ్లు.. ఏడు అడుగులతో పనేం లేదు.. రెండు హృదయాలు.. నాలుగు కళ్లు కలిస్తే చాలు.. కలిసి కాపురం చేయవచ్చు.. పిల్లలను కనవచ్చు.. వద్దనుకుంటే ఈజీగా విడిపోవచ్చు. దీనికి కోర్టులకు వెళ్లాల్సిన పనిలేదు. పెద్దల పర్మిషన్ అంతకన్నా లేదు.. కేవలం మేజర్లు అయితే చాలు.

ఇన్‌స్టంట్కాఫీలా ఇన్‌స్టంట్రిలేషన్‌షిప్. పెళ్లి కాకుండానే కలిసి ఉండటం అంత ఈజీయా? వివాహ బంధాన్ని బైపాస్చేస్తూ వెళ్లే ఈ లివ్‌ఇన్రిలేషన్‌షిప్‌పై సరైన అవగాహన లేకుండానే యువతీ యువకులు కలిసి జీవిస్తున్నారు. అసలు సహజీవనం అంటే ఏంటి..? చట్టం ఏం చెబుతుందో తెలుసుకుందాం.

విదేశాల నుంచి దిగుమతి

పాశ్చత్య సంస్కృతి అయిన లివ్ఇన్ రిలేషన్‌షిప్‌ క్రమేనా ఇండియాకి ఎంట్రీ ఇచ్చింది. పదేళ్ల వరకు నగరాలకే పరిమితం అయిన ఈ వ్యవస్థ ప్రస్తుతం పట్టణాలను దాటి గ్రామాలకు విస్తరించింది. కొందరు మాత్రం పెళ్లి కాకుండానే కాపురం ఏంటి ? ఇది చాలా తప్పు అని అంటున్నారు. కానీ, ఒకరి స్వేచ్ఛను అడ్డుకునే హక్కు ఎవరికీ లేదంటూ భారత అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు సైతం సహజీవనానికి ఆమోదం తెలిపింది. ఈ స్వేచ్ఛతోనే ప్రస్తుతం సహజీవనం చేసే వారి సంఖ్య విపరీతంగా పెరిగిపోతుంది.

సహజీవనం అంటే ఏమిటి..?

మూడు ముళ్ల బంధం అంటే నేటి యువతకు మోయలేని బరువు, నెరవేర్చలేని బాధ్యతగా భావిస్తున్నారు. దీంతో జీవితంలో మంచి ఉద్యోగం, ఆర్థికంగా సెటిల్‌ అయ్యాకే పెళ్లి చేసుకుంటామంటూ భీష్మించుకుంటున్నారు. ఉద్యోగాల కోసమని కుటుంబాలు, సొంత ఊళ్లకు దూరంగా ఉంటున్నారు. ఇదే సమయంలో తమ కళ్ల ముందే పెళ్లి చేసుకున్న జంటలు చిన్న చిన్న సమస్యలకే ఏడాదికి, రెండేళ్లకే విడిపోతుండటం వారిని కలవరానికి గురి చేస్తున్నది.

ఈ కారణంగా కొంతమంది వివాహ వ్యవస్థపై నమ్మకాన్ని కోల్పోతున్నారు. ఇలాంటివారే లివ్ఇన్ రిలేషన్‌షిప్‌ వైపు అడుగులు వేస్తున్నారు. వివాహాలపై నమ్మకం లేనివారు, లేదా ఇతర ఏ కారణాల చేతనైన పెళ్లి వద్దనుకుని, ఇద్దరు ఒక అవగాహనతో పెళ్లికాకుండానే ఒకే ఇంట్లో ఉంటూ భార్యాభర్తల్లా జీవిస్తూ సహజీవనం చేస్తున్నారు.

ఎవరు సహజీవనానికి అర్హులు..?

అమ్మాయికి 18, అబ్బాయికి 21 సంవత్సరాల వయసు నిండిన పెళ్లికాని యువతీ యువకులు సహజీవనానికి అర్హులు. వీరేకాకుండా భార్యను కోల్పోయిన భర్త, భర్త చనిపోయిన భార్య కూడా లివ్ఇన్ రిలేషన్‌షిప్‌ కొనసాగించవచ్చు. కానీ వివాహ బంధంలో ఉన్న ఏ స్త్రీ అయినా.. పురుషుడైనా మరొకరితో వివాహేతర సంబంధం పెట్టుకుంటే అది సహజీవనంగా పరిగణించబడదు. భార్య ఉండగా భర్త, భర్త ఉండగా భార్యగాని మరో వ్యక్తితో సహజీవనం చేయాలంటే కచ్చితంగా విడాకులు తీసుకుని ఉండాలి.

కోర్టులో నిరూపణ ఎలా?

పౌర హక్కుల పరిరక్షణ చట్టం-1955 ప్రతి ఒక్కరికి జీవించే హక్కు, స్వేచ్ఛ, భద్రతను ఇస్తుంది. సహజీవనం చేసేవారు ఇలాంటి చట్టాల ప్రకారం గౌరవంగా జీవించవచ్చు. వేధింపులు, హింసకు వ్యతిరేకంగా పోరాడవచ్చు. అయితే దీనికి కొన్ని ప్రామాణికాలు ఉన్నాయి. ఇద్దరు కలిసి ఉన్నట్టు అద్దె ఇంటి ఓనర్ లేదా ఇరుగుపొరుగు వాళ్లు, బాధితులు భార్యాభర్తల్లా కలిసి జీవించినట్టు అఫిడవిట్ ఇవ్వాలి. లేదా రేషన్, ఆధార్ కార్డుల్లో ఇద్దరి పేర్లు ఉండాలి. అప్పుడే కోర్టులో కేసు వేసేందుకు వీలవుతుంది.

మహిళలకు చట్టాలు వర్తిస్తాయా..?

సహజీవనంలో ఉన్న అవివాహిత జంటలకు గృహ హింస చట్టం కింద రక్షణ ఉంటుంది. మహిళలు న్యాయం పొందేందుకు, వేధింపులకు భయపడకుండా జీవించడానికి ఈ చట్టం సహాయపడుతుంది. అవివాహిత జంటలకు ఆర్థిక భద్రత అనేది భారతీయ చట్టంలోని మరొక కీలకమైన అంశం. క్రిమినల్ ప్రొసీజర్ కోడ్, 1973లోని సెక్షన్ 125(1)(a) ప్రకారం, లివ్‌-ఇన్ రిలేషన్స్‌లో భాగస్వాములు, వివాహంలో జీవిత భాగస్వాములకు సమానమైన మెయింటెనెన్స్‌కి అర్హులు. ఈ నిబంధన ఆర్థిక స్థిరత్వం, భాగస్వాముల మధ్య సంబంధాలను ప్రోత్సహిస్తుంది.

లివ్‌-ఇన్ రిలేషన్‌షిప్‌‌కూ రిజిస్ట్రేషన్

ఇటీవల కాలంలో శాసన, న్యాయ వ్యవస్థలు పెళ్లి చేసుకోకుండానే కలిసి జీవించేవారి హక్కులను గుర్తించాయి. ఉత్తరాఖండ్‌లో యూనిఫాం సివిల్ కోడ్ ప్రతిపాదన ఈ విషయంలో ఒక ముఖ్యమైన ముందడుగు వేసింది. చట్టం ప్రకారం లివ్‌-ఇన్ రిలేషన్‌షిప్‌లో ఉన్నవారు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. వీరికి చట్టపరమైన హక్కులు వర్తిస్తాయి. వీరి పిల్లలకు హక్కులు వర్తిస్తాయి. ఆస్తుల పంపకాలు సంక్రమిస్తాయి.

పిల్లలకూ లీగల్‌గా హక్కులు

అవివాహిత జంటలకు జన్మించిన పిల్లల లీగల్ స్టేటస్ వర్తి్స్తుంది. సహజీవనం చేసే జంటలకు పుట్టిన పిల్లలు వివక్షను ఎదుర్కోకూడదని కోర్టులు సైతం తీర్పు ఇచ్చాయి. హిందూ మైనారిటీ, గార్డియన్‌షిప్ చట్టం ప్రకారం ఈ పిల్లల హక్కులకు రక్షణ లభిస్తుంది. ముఖ్యంగా ఆస్తి హక్కులు, కస్టడీ విషయాలకు సంబంధించి నిర్దిష్ట నియమాలు ఉన్నాయి. అలానే పిల్లలకు లీగల్‌గా తండ్రి ఆస్తిలో వాటా ఉంటుంది. కానీ ఒకవేళ తన భాగస్వామి ఆ బిడ్డలు తనకు పుట్టలేదంటే, ఆ బిడ్డలు ఆమెకు ఆమె భాగస్వామికే పుట్టినట్టు నిరూపించుకోవాల్సి ఉంటుంది.

భవిష్యత్తు ఎలా ఉండబోతోంది?

అవివాహిత జంటలను సమాజం పూర్తిస్థాయిలో అంగీకరించకపోయినా.. వారికి చట్టపరమైన హక్కులు రక్షణ కల్పిస్తాయి. ఈ హక్కులు వేధింపులు, హింస, ఆర్థిక అస్థిరత నుంచి రక్షణ పొందడంలో సహాయపడతాయి. ఈ చట్టపరమైన నిబంధనలు అవివాహిత జంటలు సామాజిక పక్షపాతం లేకుండా గౌరవంగా జీవించేలా నిర్ధారిస్తాయి.

అవివాహిత జంటలు తమ సంబంధాలు నమ్మకంగా, సురక్షితంగా ఉంచుకోవడానికి ఈ హక్కులను అర్థం చేసుకోవడం, అమలు చేయడం చాలా కీలకం. సరైన లీగల్ నాలెడ్జ్ ఉంటే, వారు తమను తాము రక్షించుకోవచ్చు. బలమైన, గౌరవప్రదమైన రిలేషన్స్‌ నిర్మించుకోవచ్చు.

లాభాలు, నష్టాలు?

సహజీవనంతో లాభాలు, నష్టాలు రెండూ ఉన్నాయి. ఈ జంటల్లో స్వాతంత్ర్యం, స్వయంప్రతిపత్తి ఎక్కువ. కట్టుబాట్లు, ఆంక్షలు లేకుండా జీవించవచ్చు. ఆర్థికంగానూ మేలు జరగవచ్చు. ఇద్దరు కలిసి ఒకే ఇంట్లో ఉండటం వల్ల అద్దె, లివింగ్ ఖర్చులను పంచుకోవడం ద్వారా డబ్బు ఆదా చేసుకోవచ్చు. అలాగే వివాహిత జంటల కంటే వీళ్లు ఎక్కువ సంతోషంగానూ, ఆప్యాయంగానూ ఉంటారని పలు అధ్యయనాల్లోనూ తేలింది.

ఇంతవరకు మంచి పరిణామమే అయినా నష్టాలు అధికంగానే ఉన్నాయి. సహజీవన సంబంధాలు వివాహం కంటే తక్కువ స్థిరంగా ఉంటాయి. ఒక భాగస్వామి ఎప్పుడైనా సంబంధం నుంచి విడిపోవచ్చు. డబ్బు, ఆర్థిక బాధ్యతలు పంచుకోవడంతో విభేదాలు రావచ్చు. పిల్లలను కలిగి ఉండాలని ప్లాన్ చేయడంలో, పిల్లల పెంపకం గురించి భాగస్వాముల మధ్య గొడవలు కావచ్చు. ఏ విషయంలో ఏకాభిప్రాయం లేకున్నా ఆ జంట విచ్ఛిన్నం అయ్యే ప్రమాదం లేకపోలేదు.

LEAVE A RESPONSE