Suryaa.co.in

Political News

వర్గీకరణ ఉద్యమానికి ప్రాణ వాయువు మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి

అవిభాజ్య ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎస్సీ సామాజిక వర్గంలోని ఉప కులాల మధ్య ఏర్పడిన విద్యా, ఉద్యోగ, రాజకీయ, ఆర్థిక విషయాల్లోని అసమతుల్యత ఎస్సీ ఉప కులాల వర్గీకరణ ఉద్యమానికి ఊపిరిపోసింది. ఈ ఉద్యమానికి ప్రాణ వాయువుగా ‘మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి’ నిలిచింది.

1970 దశకం నాటికే అవిభాజ్య ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఎస్సీ సామాజిక వర్గంలో వివిధ ఉప కులాలు విద్యా ఉద్యోగ రాజకీయ రంగాల్లో రిజర్వేషన్ ఫలాలు పొందుతున్న తీరులో వైరుధ్యాలు కనిపించాయి. మిగతా ఉప కులాలను కాదని, మాల సామాజిక వర్గం మాత్రమే మెజారిటీగా రిజర్వేషన్ ఫలాలను పొందటంతో ఎస్సీలలోని ఉప కులాల మధ్య అంతరం స్పష్టంగా కనపడింది. ఈ వ్యత్యాసాన్ని తొలగించటానికి అప్పట్లోనే ప్రయత్నాలు మొదలయ్యాయి.

మాదిగ సామాజిక వర్గం ఈ అంతరాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్ళింది. కానీ శాసన సభలోని 39ఎస్సీ సీట్లలో 30 మంది ఎమ్మెల్యేలు మాల సామాజిక వర్గమే ఉండటంతో సరిదిద్దే సాహసం ప్రభుత్వం చేయలేకపోయింది. అప్పటి నుండి నలుగుతూ వస్తున్న ఈ సమస్య ఉద్యమ రూపం సంతరించుకునే దిశగా ‘మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి’ ఎస్సీ వర్గీకరణ లక్ష్యంగా ప్రకాశం జిల్లా ఈదుమూడి గ్రామంలో 1994 జులై 7న ఆవిర్భవించింది.

మందకృష్ణ మాదిగ నాయకత్వంలో, కృపాకర్ మాదిగ కార్యదర్శిగా పోరుబాట పట్టింది. అనతి కాలంలోనే ఎస్సీ ఉప కులాల మధ్యన జరుగుతున్న వివక్ష పూరిత పంపకాలను సమాజంలోకి తీసుకుపోయి సాధారణ ప్రజలు, మేధావి వర్గం మద్దతు కూడగట్టగలిగింది.

నిచ్చెన మెట్ల కుల వ్యవస్థలో ఆర్యుల కాలం నుండి అనుభవిస్తున్న అస్పృశ్యతను రూపుమాపి, షెడ్యూల్డ్ కులాల మీద ఉన్న వివక్షను తొలగించి ఆత్మ గౌరవంతో జీవించేలా డాక్టర్ బి. ఆర్ అంబేడ్కర్ కల్పించిన రిజర్వేషన్ ఫలాలను హేతుబద్ధంగా పంపిణీ చేసినప్పుడే రాజ్యాంగము కల్పించిన రిజర్వేషన్ల అసలు లక్ష్యం నెరవేరుతుందని ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా జస్టిస్ రామచంద్ర రాజు కమిషన్ సమర్పించిన నివేదిక ఆధారంగా, నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా తెలుగుదేశం ప్రభుత్వం ‘జీవో’ ద్వారా1997 జూన్ 6 న ఎస్సీలను ‘ఎ బి సి డి’ లుగా వర్గీకరించింది.

మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి ఎస్సీ వర్గీకరణయే లక్ష్యంగా ఏర్పడి ఎస్సీ ఉప కులాల ఉద్యమాన్ని విజయవంతంగా ప్రజల్లోకి తీసుకుపోగలిగింది. సమాజంలో అప్పటికే కొనసాగుతున్న బీసీ – ఎ బి సి డి రిజర్వేషన్ల మాదిరిగా ఎస్సీలను కూడా ఎ బి సి డి లుగా ఏర్పాటు చేయడమే సమంజసం, అప్పుడే జనాభా దామాషా ప్రకారం అన్ని ఉప కులాలకు సమ న్యాయం జరుగుతుంది అనే భావన ఆంధ్రప్రదేశ్ సమాజంలో నెలకొన్నది.

ఆ కోణంలోనే దాదాపు అన్ని వర్గాల మద్దతు ఎస్సీ వర్గీకరణకు లభించటంతో, నాటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్న నారా చంద్రబాబు నాయుడు ఎస్సీ వర్గీకరణ విషయంలో వెనకడుగు వేయకుండా ముందుకు పోయి 2000 సంవత్సరంలో ఎస్సీలను వర్గీకరిస్తూ రిజర్వేషన్ల హేతుబద్ధీకరణ ‘చట్టం’ తెచ్చారు.

అవిభాజ్య ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విద్యా ఉద్యోగ రాజకీయ ఆర్థిక రంగాల్లో ముందు వరసలో ఉన్న మాల సామాజిక వర్గం ‘అదనపు’ ప్రయోజనాలను కోల్పోవడం ఇష్టం లేక తనకున్న న్యాయవ్యవస్థలోని మేథో సంపత్తిని ఉపయోగించుకుని సుప్రీం కోర్టులో సవాలు చేయడంతో, ఎస్సీ ఉప కులాల మధ్య ఉన్న అంతరాన్ని, వివక్షను గుర్తిస్తూనే ఎస్సీ కులాల రిజర్వేషన్లను ఉప కులాల వారీగా వర్గీకరణ చేసే అధికారం రాష్ట్రాలకు లేదనే సాంకేతిక కారణాలతో 2004 నవంబర్ లో సుప్రీం కోర్టు ఎస్సీ వర్గీకరణ కొట్టివేసింది.

2004 వరకు రిజర్వేషన్ ఫలాలను జనాభా దామాషా ప్రకారం పొందుతున్న మాదిగ, మాదిగ ఉప కులాలకు ఆ తీర్పు ఆశనిపాతంగా పరిణమించింది. దానితో మళ్ళీ వర్గీకరణ ఉద్యమం తీవ్ర రూపం దాల్చింది. ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా మాదిగ, మాదిగ ఉప కులాలు, వ్యతిరేఖంగా మాల సామాజిక వర్గం చీలిపోయి ఎవరి ప్రయత్నాలు వారు చేయడం ప్రారంభించారు. కానీ మాదిగ సామాజిక వర్గం న్యాయమైన డిమాండ్ కు తలొగ్గి 2004లో ముఖ్యమంత్రిగా ఉన్న వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రభుత్వం రాజ్యాంగ సవరణ కోరుతూ శాసన సభలో తీర్మానం చేశారు.

ఆ తరవాత మాదిగ సామాజిక వర్గం నుండి తీవ్రమైన వత్తిళ్లు రావడంతో అప్పటి ప్రభుత్వం సామాజిక న్యాయ సాధికారత మంత్రిత్వ శాఖ జస్టిస్ ఉషా మెహ్రా నేతృత్వంలో 2004లో కమిషన్ ను ఏర్పాటు చేసింది. నాలుగు సంవత్సరాల సుదీర్ఘ అధ్యయనం తర్వాత 2008 మే నెలలో మంత్రి మీరాకుమార్‌కు కమిషన్ నివేదికను అందించింది.

రాజ్యాంగంలోని ఆర్టికల్ 341కు సవరణ చేయాలని, ఆ ఆర్టికల్‌లో 3వ క్లాజును చేర్చడం ద్వారా, రాష్ట్రాల శాసన సభలు ఏకగ్రీవ తీర్మానం చేసిన పక్షంలో ఉప కులాల వర్గీకరణను పార్లమెంటు ఆమోదించవచ్చని, రాజ్యాంగంలోని ఆర్టికల్ 16(4)ను ఉపయోగించి రాష్ట్ర ప్రభుత్వమే ఉప కులాల వర్గీకరణ నిర్ణయం తీసుకుని జనాభా దామాషా ప్రకారం వివిధ ఉప కులాలకు రిజర్వేషన్ కోటాను నిర్దేశించి రాజ్యాంగ స్ఫూర్తిని కాపడవచ్చని తెలియజేసింది.

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో అన్నీ రాజకీయపార్టీలు ఎస్సీ వర్గీకరణకు అనుకూల ప్రకటనలు చేస్తూ వచ్చారు. అదే సమయంలో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం మహోద్యమం కొనసాగుతుండటంతో రెండు తెలుగు ప్రాంతాలలో ఎస్సీ వర్గీకరణ అంశం కొంతకాలం కోల్డ్ స్టోరేజ్ లోకి నెట్టివేయబడింది.

ఐనా మాదిగలు తమ పోరాట పటిమను కోల్పోకుండా వర్గీకరణ ఉద్యమాన్ని కొనసాగిస్తూనే వచ్చారు. నాంపల్లిలోని గాంధీ భవన్ లో నేరుగా తమ నిరసనను తెలియజేసే క్రమంలో, వర్గీకరణ ఉద్యమ తీవ్రతను తెలియజేయాలనే తలంపుతో ఎమ్మార్పీఎస్ కార్యకర్తలు గాంధీ భవన్‌ను ముట్టడించి ఆత్మాహుతికి పాల్పడటం పౌర సమాజాన్ని తీవ్రంగా కలిచివేసింది. ఆ దురదృష్టకర సంఘటన అమరుల కుటుంబాలను కడుపుకోతకు గురిచేసింది.

భారతీయ జనతా పార్టీ తన 2014 ఎన్నికల మేనిఫెస్టోలో అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లో వర్గీకరణ అమలు అని హామీ ఇచ్చింది. అలాగే తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత అధికారంలోకి వచ్చిన తెరాస పార్టీ వర్గీకరణకు మద్దతుగా అసెంబ్లీలో 2014 నవంబర్ 29న ఏకగ్రీవ తీర్మానం ఆమోదించి, కేంద్ర ప్రభుత్వానికి పంపింది.

అప్పటి ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి ఢిల్లీ వెళ్లి కేంద్రమంత్రి వెంకయ్య నాయుడుని కలిసి వర్గీకరణకు చట్టబద్ధత కల్పించే ప్రక్రియను చెప్పట్టాల్సిందిగా కోరారు. తెలంగాణ ముఖ్యమంత్రిగా ఉన్న కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ప్రధాని నరేంద్ర మోడీకి వర్గీకరణ విషయమై పలుమార్లు విజ్ఞప్తి చేశారు. మందకృష్ణ మాదిగ బీజేపీతో సంప్రదింపులు జరుపుతూనే ఉన్నారు.

అదే కోవలో ఢిల్లీ వెళ్లి వెంకయ్య నాయుడిని కలిశారు. 2016 నవంబర్ 27న హైదరాబాద్ లో జరిగిన ఎమ్మార్పీఎస్ ధర్మ యుద్ధ బహిరంగ సభకు హాజరైన వెంకయ్య నాయుడు వర్గీకరణ చట్టబద్ధతకు కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉన్నదని ఢంకా బజాయించి మరీ చెప్పారు. ఇలా అన్ని పార్టీలు వర్గీకరణకు అనుకూలంగా తమ అభిప్రాయాన్ని తెలియజేశాయి.

2004లో సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం వర్గీకరణ సాధ్యం కాదని వ్యాఖ్యనించిన దానికి విరుద్ధంగా జస్టిస్ అరుణ్ మిశ్రా నేతృత్వంలోని ఐదుగురు జడ్జీల రాజ్యాంగ ధర్మాసనం 2020లో పంజాబ్ వర్సెస్ దేవీందర్ సింగ్ కేసులో వర్గీకరణకు అనుకూలంగా వ్యాఖ్యానించింది.

2023 నవంబర్ 11న సికింద్రాబాద్ లో జరిగిన అణగారిన వర్గాల విశ్వరూప మహాసభలో పాల్గొన్న భారత ప్రధాని నరేంద్ర మోదీ ‘దేశ వ్యాప్తంగా ఎస్సీ వర్గీకరణకు తాము కట్టుబడి ఉన్నామని, మాదిగలకు జరుగుతున్న అన్యాయానికి ముగింపు పలకడానికి త్వరలోనే కమిటీని వేసి న్యాయం చేస్తామనీ, అంబేడ్కర్ ఆశయాలకు అనుగుణంగా మాదిగల చిరకాల కోరికను భారత ప్రభుత్వం నెరవేరుస్తుందని అన్నారు. ముప్పై ఏళ్లుగా సాగుతున్న పోరాటంలో తాను తోడుగా ఉంటానని, మంద కృష్ణ నేతృత్వంలో తాను ఒక సహాయకుడిగా పని చేస్తానని చెప్పారు.

అలాగే ఇటీవల తెలంగాణలో జరిగిన 2023 శాసనసభ ఎన్నికల సందర్భంగా టీపీసీసీ తన ఎన్నికల మానిఫెస్టోలో ఎస్సీ వర్గీకరణకు కట్టుబడి ఉన్నామనే అంశాన్ని పొందుపర్చింది.
“డా. బాబాసాహెబ్ అంబేద్కర్ తన “స్టేట్స్ అండ్ మైనారిటీస్” పుస్తకంలో “షెడ్యూల్డ్ కులాల భద్రతలు” అనే శీర్షికతో ఎస్సీ రిజర్వేషన్ వర్గీకరణను స్పష్టంగా సమర్ధించారు.

2024 ఫిబ్రవరిలో సుప్రీం కోర్టు విస్తృత ధర్మాసనం వర్గీకరణ విషయంలో విచారణ చేపట్టింది. ఆ సందర్భంగా రాజ్యాంగంలో ఎస్సీ ఎస్టీ కులాలకు కల్పించిన రిజర్వేషన్లను వర్గీకరించాల్సిన అవసరం ఉందని కేంద్ర ప్రభుత్వం గుర్తించింది. శతాబ్దాలుగా అణచివేతకు గురైన కులాలకు సమ న్యాయం చేసేందుకే రాజ్యాంగంలో రిజర్వేషన్ల పరిరక్షణలు పొందుపరిచారని, దాన్ని అసలు లక్ష్యం నెరవేరాలంటే వర్గీకరణ సరైన చర్య అని స్పష్టం చేసింది.

సామాజిక విద్య ఉద్యోగ ఆర్థిక స్థాయిలను అనుసరించి ఎస్సీ, ఎస్టీ వర్గాలలోని అన్నీ కులాలు ఒకేస్థితిని కలిగి ఉన్నాయని భావించడం సరికాదని సిజేఐ జస్టిస్ చంద్రచూడ్ నేతృత్వంలోని ఏడుగురు సభ్యుల ధర్మాసనం అభిప్రాయపడింది.

2024 ఆగష్టు 1న సుప్రీంకోర్టు 7 జడ్జిల బెంచ్ 6:1 మెజారిటీతో షెడ్యూల్డ్ కులాల ఉప వర్గీకరణ అనుమతించబడుతుందనే చారిత్రాత్మక తీర్పును అత్యున్నత రాజ్యాంగ ధర్మాసనం వెలువరించింది.

-రామకృష్ణ మనిమద్దె
9494353828

LEAVE A RESPONSE