Suryaa.co.in

Telangana

విదేశీ బైక్ రైడర్లను ఆకట్టుకున్న మహబూబ్ నగర్

-9 రోజుల పాటు రాష్ట్రంలో బైక్ రైడింగ్ చేయనున్న విదేశీ బైక్ రైడర్లు
-విదేశీ మహిళా బైక్ రైడర్లతో కలిసి బైక్ రైడింగ్ చేసిన మంత్రి శ్రీనివాస్ గౌడ్

ఒకప్పుడు తాగునీటికి అవస్థలు పడిన మహబూబ్ నగర్… నేడు విదేశీ పర్యాటకులను సైతం విశేషంగా ఆకర్షిస్తున్నదని రాష్ట్ర ఎక్సైజ్, క్రీడలు, సాంస్కృతిక, పర్యాటక, పురావస్తు శాఖ మంత్రి డాక్టర్ వి. శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత సీఎం కేసీఆర్ సహకారంతో మహబూబ్ నగర్ ను అద్భుతంగా తీర్చిదిద్దడం వల్లే ఇది సాధ్యమైందని ఆయన పేర్కొన్నారు.

సమానత్వానికి సాక్షిగా ఫ్రెంచ్ మోటార్‌ సైక్లిస్ట్ అలిసన్ గ్రున్ ఆధ్వర్యంలోని ఫ్రీ డబ్ల్యూ (Free W) అనే వేదిక ద్వారా తెలంగాణలో… ఫ్రాన్స్, అమెరికా, యూరోప్, ఆస్ట్రేలియా, సింగపూర్ మరియు థాయ్‌లాండ్ కు చెందిన 8 మంది విదేశీ బైక్ రైడర్ల యాత్రను మంత్రి మహబూబ్ నగర్ లోని తమ క్యాంప్ కార్యాలయం నుంచి ప్రారంభించారు. అనంతరం వారితో పాటు కొద్దిసేపు బైక్ రైడింగ్ చేశారు. బైపాస్ రోడ్డు హ్యాండ్ ఫౌంటెన్ కూడలి వద్ద విదేశీ బైక్ రైడర్ లతో కలిసి ఫోటోలు దిగారు. అనంతరం మీడియాతో మాట్లాడారు…

మహిళలకు ఆర్థిక అవకాశాలను అందిస్తూ అసాధారణమైన మోటార్‌ సైక్లింగ్ అనుభవాలను కల్పించేందుకు, ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సంస్కృతి సంప్రదాయాలను తెలుసుకునేందుకు ఫ్రీ డబ్ల్యూ చేస్తున్న ప్రయత్నం చాలా గొప్పదని ఈ సందర్భంగా ఆయన తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా మహిళలు, పురుషులు అనే వివక్ష లేని సమాజం రావాలని ఆయన పిలుపునిచ్చారు.

ప్రస్తుతం తెలంగాణ, మహబూబ్ నగర్ విదేశీయులకు స్వర్గధామంగా మారిందన్నారు. మహబూబ్ నగర్ లో జంగిల్ సఫారీ, కేసిఆర్ అర్బన్ ఎకో పార్క్, మన్యంకొండ, శిల్పారామం, నెక్లెస్ రోడ్, ట్యాంక్ బండ్, సస్పెన్షన్ బ్రిడ్జి సహా అనేక పర్యాటక ప్రాంతాలు తమను ఎంతగానో ఆకర్షించాయని విదేశీ మహిళా బైక్ రైడర్లు పేర్కొంటున్నారని మంత్రి తెలిపారు. ఈ ప్రాంతాన్ని సందర్శించేందుకు విమానాశ్రయం నుంచి నేరుగా మహబూబ్ నగర్ కు వచ్చారని తెలిపారు.

ఫ్రాన్స్, అమెరికా, యూరోప్, ఆస్ట్రేలియా, సింగపూర్ మరియు థాయ్‌లాండ్ కు చెందిన అలిసన్ గ్రున్, సడ్రైన్, ఆష్లీ, జనెల్లి, జువేనా, స్టాసి, లారీ, సిగ్రిడ్, రచన ఈ పర్యటనలో బైక్ రైడింగ్ ద్వారా మహబూబ్‌నగర్, వికారాబాద్, నిర్మల్, వరంగల్ మరియు పోచంపల్లి మీదుగా హైదరాబాద్‌ చేరుకుంటారని మంత్రి తెలిపారు. వచ్చే ఏడాది నాటికి కరివెన, ఉదండాపూర్ రిజర్వాయర్ల వద్ద పర్యాటక అభివృద్ధితో పాటు మన్యంకొండ రోప్ వే ప్రారంభం అనంతరం మరోసారి ఇక్కడికి వస్తామని విదేశీ బైక్ రైడర్లు మంత్రికి తెలియజేశారు.

ఫ్రీ డబ్ల్యూ వేదిక ద్వారా తెలంగాణ పర్యటన…
మహిళలకు ఆర్థిక అవకాశాలను అందిస్తూ అసాధారణమైన మోటార్‌ సైక్లింగ్ అనుభవాలను కల్పించేందుకు, ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సంస్కృతి సంప్రదాయాలను తెలుసుకునేందుకు ఫ్రెంచ్ మోటార్‌ సైక్లిస్ట్ అలిసన్ గ్రున్ ఆధ్వర్యంలోని ఫ్రీ డబ్ల్యూ (Free W) అనే వేదిక ద్వారా ప్రపంచ వ్యాప్తంగా ఉన్న మహిళా మోటార్‌ సైక్లిస్టులు వివిధ దేశాలను పర్యటిస్తూ అక్కడి సంస్కృతి, సంప్రదాయాలను దగ్గర నుంచి చూసేందుకు బైక్ రైడింగ్ చేయడం గొప్ప విషయమని మంత్రి శ్రీనివాస్ గౌడ్ పేర్కొన్నారు.

తెలంగాణ వ్యాప్తంగా చారిత్రాత్మక ప్రదేశాలను సందర్శిస్తూ ప్రస్తుతం కొనసాగుతున్న బతుకమ్మ ఉత్సవాల్లో సైతం వీరు పాల్గొననున్నట్లు వెల్లడించారు. బైక్స్ పై తెలంగాణ మహిళలను కలవడంలో భాగంగా 8 మంది మహిళా బైక్ రైడర్లు నేటి నుంచి 9 రోజుల పాటు బతుకమ్మ సంబరాలు, పర్యాటక ప్రదేశాలను సందర్శించడం, కళాకారులు మరియు చేనేత కార్మికులను కలుస్తారని మంత్రి తెలిపారు. ఈ పర్యటనకు హైదరాబాద్ కు చెందిన మోవో సంస్థ ఫౌండర్ జై భారతి మార్గనిర్దేశం చేస్తున్నారు.

LEAVE A RESPONSE