బీఆర్ఎస్ అడుగుజాడల్లోనే కాంగ్రెస్

– రాష్ట్రానికి భారమయ్యే సలహాదారుల పదవులు, రాజకీయ నియామకాలు అవసరమా..?
– కాంగ్రెస్ సంస్కృతే బ్రీఫ్ కేసులు, ల్యాండ్ సెటిల్ మెంట్లు
– బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు డాక్టర్ ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్

తెలంగాణను అప్పుల పాలు చేసింది గత బీఆర్ఎస్ సర్కారు అయితే.. ఇప్పటికే ఎఫ్ఆర్బీఎం పరిమితులు మించి పోయినా .. కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం బడ్జెట్ లో కేవలం కొత్త అప్పుల ద్వారానే నిధులు సమకూర్చుకోవాలని భావిస్తోందని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు డాక్టర్ ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ అన్నారు. తెలంగాణ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ గాడి తప్పడమే కాకుండా.. ఖజానా ఖాళీ అయ్యిందని తెలంగాణ ప్రభుత్వానికి కొత్తగా అప్పులు పుట్టే పరిస్థితి లేదని తెలిపారు. అందుకే ఢిల్లీలో కేంద్రమంత్రులను కలుస్తూ కాంగ్రెస్ నేతలు వినతిపత్రాలు సమర్పిస్తున్నారని ఎద్దేవా చేశారు.

పాత బీఆర్ఎస్ ప్రభుత్వ అడుగుజాడల్లోనే ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం నడుస్తోందని ఆయన దుయ్యబట్టారు. నాంపల్లి బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో బుధవారం నిర్వహించిన మీడియా సమావేశంలో బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు డాక్టర్ ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ గారు మాట్లాడారు. ఈ సందర్భంగా… తెలంగాణ రాష్ట్రంలో ఉద్యోగులకు జీతాలివ్వలేని పరిస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇటువంటి క్లిష్ట పరిస్థితుల్లో రాష్ట్రానికి భారమయ్యే సలహాదారుల పదవులు, రాజకీయ నియామకాలు అవసరమా..? అంటూ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.

అడ్వర్టైస్మెంట్ల కోసం కోట్ల రూపాయల నిధులు ఖర్చు పెట్టడం సరికాదని,.. రాష్ట్ర ప్రభుత్వం అనవసర ఖర్చులు తగ్గించుకోవాలని సూచించారు. కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్ర ఖజానాకు మరింత భారంగా మారేలా సలహాదారుల నియామకాలు, కార్పొరేషన్ చైర్మన్లను నియమిస్తూ ఆర్థిక క్రమశిక్షణను గాలికి వదిలేస్తోందని ఆయన మండిపడ్డారు. ఇప్పటికైనా రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను దృష్టిలో పెట్టుకొని రాజకీయ నియామకాలు ఆపివేయాలని ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ సూచించారు.

కాంగ్రెస్ నేతలపై తాను చేసిన ఆరోపణలకు కట్టుబడి ఉన్నానని, కారు ఇచ్చిన వ్యక్తి లేదా తీసుకున్న వ్యక్తి స్పందిస్తే తప్పకుండా ఆధారాలు బయటపెడతానని ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ వ్యాఖ్యానించారు. మాణిక్యం ఠాగూర్, ఠాక్రే మీద ఆరోపణలు, వాస్తవాలను బయట పెట్టింది… అధిష్టానానికి ఫిర్యాదు చేసింది కాంగ్రెస్ నాయకులు కాదా?

ఆ తర్వాతే ఈ ఇద్దరు ఇంచార్జీలను మార్చింది వాస్తవం కాదా అనేదానిపై కాంగ్రెస్ అధిష్టానం సమాధానం చెప్పాలన్నారు. కాంగ్రెస్ సంస్కృతే బ్రీఫ్ కేసులు, ల్యాండ్ సెటిల్ మెంట్లు, కార్లు అంటూ ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ మండిపడ్డారు. ఈ విషయం దేశ ప్రజలందరికీ తెలుసన్నారు.

Leave a Reply