షర్మిలపై ‘ఆళ్ల’ కోవర్టు ఆపరేషన్ చేశారా?

– షర్మిల బలం కనిపెట్టేందుకే ఆమెతో వెళ్లారా?
– ఆమెతో టచ్ ఉన్న వైసీపీ నేతలను కనిపెట్టమేనా ఆళ్ల లక్ష్యం?
– నిధులపై ఆరా తీసేందుకే ఆమె వెంట వెళ్లారా ?
-ఆళ్లను షర్మిల అప్పుడే అనుమానించారా ?
– అందుకే ఆయనను పక్కనపెట్టారా?
– సోషల్ మీడియాలో చర్చ
(మార్తె సుబ్రహ్మణ్యం)

తన నియోజకవర్గంలో ఒక్క పని కూడా కావడం లేదని, చేసిన పనికి బిల్లులు కూడా ఇవ్వడం లేదంటూ వైసీపీకి బై చెప్పి, షర్మిలతో కాంగ్రెస్లో చేరిన మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి.. ఏపీసీసీ చీఫ్ షర్మిలపై కోవర్టు ఆపరేషన్ చేశారా ? షర్మిలకు ఆ విషయం తెలిసే ఆమె ఆళ్లను పక్కనపెట్టారా? అది బెడిసికొట్టడంతోనే ఆయన మళ్లీ వెనక్కివచ్చేశారా?.. ఇదీ సోషల్ మీడియాలో జరుగుతున్న చర్చ.

వైసీపీ ఎమ్మెల్యేలలో కొంచెం భిన్నంగా.. ఇప్పటివరకూ కొంతమేరకు వ్యక్తిత్వం ఉన్న నేతగా.. అవినీతి ఆరోపణలు లేవని భావించే మంగళగిరి వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి వంటి నాయకుడు, షర్మిలపై కోవర్టు ఆపరేషన్ చేశారన్న సోషల్ మీడియా వార్తలు ఆశ్చర్యం కలిగిస్తున్నాయి. జగన్ సూచనలతో చంద్రబాబు నాయుడుపై స్వంత ఖర్చులతో కోర్టులో కేసులు వేసిన ఆళ్ల, ఇప్పటిదాకా పార్టీ నుంచి దానికి సంబంధించిన డబ్బు అడగలేదన్న ప్రచారం పార్టీ వర్గాల్లో ఉంది.

మంగళగిరిలో తన సొంత ఖర్చుతో అభివృద్ధి పనులు చేసి, తర్వాత వచ్చే బిల్లులను కాంట్రాక్టరు నుంచి రికవరీ చేసుకోవాలన్న లక్ష్యంతో కోట్ల రూపాయలు వెచ్చించారట. అయితే ఆ బిల్లులు ఇవ్వకపోగా.. తనకు వ్యతిరేకంగా సలహాదారొకరు మరో రెడ్డి నేతను తీసుకువచ్చి, వారితో ఇసుక – మట్టి వ్యాపారం చేయించడాన్ని ఆళ్ల జీర్ణించుకోలేకపోయారట. ఆ వ్యాపారం చేసి కొంత తమకు పంపించాలని, సదరు సలహాదారు చేసిన సూచనను ఆళ్ల అంగీకరించలేదట. నేను అలాంటి వ్యాపారం చేయను. చేయనీయను అని స్పష్టం చేశారన్న ప్రచారం, చాలాకాలం క్రితమే జరిగింది.

పార్టీ నుంచి వెళ్లే నెలరోజుల ముందు.. జగన్తో భేటీ అయిన సందర్భంలో కూడా, ఆళ్లకు అయిన ఖర్చులను చిత్తూరు జిల్లాకు చెందిన ఓ మంత్రి కుమారుడు చెల్లిస్తారని జగన్ ఆఫర్ ఇచ్చారని, అయితే ఆళ్ల దానిని తిరస్కరించి వెళ్లిపోయారన్న ప్రచారం కూడా పార్టీ వర్గాల్లో జరిగింది. ఇంత నిజాయితీఉన్న నేతగా ప్రచారంలో ఉన్న ఆళ్ల.. పీసీసీ చీఫ్ షర్మిలపై కోవర్టు ఆపరేషన్ చేశారంటేనే ఆశ్చర్యంగా ఉందని, సోషల్ మీడియాలో ఆళ్లను ఫాలో అయ్యే వారు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. ఈ వార్తను తాము నమ్మలేకపోతున్నామని ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.

షర్మిలతో వెళ్లిన ఆళ్ల.. తాను కాంగ్రెస్ అభ్యర్థిగా మంగళగిరిలో పోటీ చేస్తానని ప్రకటించారు. ఆ తర్వాత షర్మిల ఇంట జరిగిన వివాహ కార్యక్రమంలోనూ ఆయన పాల్గొన్నారు. అయితే అసలు ఆళ్ల ఆమెతో వెళ్లిందే షర్మిలపై నిఘా వేయడానికేనని, ఆమెను వైసీపీ నేతలు ఎవరెవరు కలుస్తున్నారు? ఆమెకు ఎవరెవరు నిధుల సాయం చేస్తున్నారు ? షర్మిల ఎవరితో మాట్లాడుతున్నారన్న దానిపై నిఘా వేసేందుకే, ఆళ్లను జగన్ తన చెల్లి వద్దకు పంపించారంటూ సోషల్ మీడియాలో వచ్చిన కథనాలు విస్మయం కలిగిస్తున్నాయి.

అయితే జగన్-ఆళ్ల అనుబంధంపై పూర్తి అవగాహన ఉన్న షర్మిలారెడ్డి.. ఆళ్లను నమ్మలేదన్న ప్రచారం జరుగుతోంది. ఆయనను దూరం పెట్టారని, అందుకే ఆళ్ల తిరిగి జగన్ గూటికి చేరుకున్నారన్న కథనాలు, సోషల్ మీడియాలో చర్చనీయాంశమవుతున్నాయి. నిజానికి ఆళ్ల వైసీపీలో ఉన్నప్పటికీ హైదరాబాద్లో ఉండే విజయమ్మ నివాసానికి వెళ్లి షర్మిల-విజయమ్మతో చర్చిస్తుంటారు. ఆ కుటుంబంతో సన్నిహితంగానే ఉండేవారు.

షర్మిల తెలంగాణలో పాదయాత్ర చేస్తున్న సందర్భంలో.. నెల్లూరు వైసీపీ ఎంపి వేమిరెడ్డి ప్రభాకర్రెడ్డిని విజయమ్మ పిలిచి ఆర్థిక సాయం కోరారట. అందుకు అంగీకరించిన వేమిరెడ్డి వ్యవహారం జగన్ తెలిసిపోవడం.. జగన్ ఆయనను పిలిపించి షర్మిల పాదయాత్రకు ఎలాంటి సాయం చేయవద్దని చెప్పడం.. అదే విషయాన్ని విజయమ్మకు వేమరెడ్డి సమాచారం ఇచ్చి తన నిస్సహాయత ప్రకటించడం జరిగిపోయింది.

అంటే అప్పటినుంచే షర్మిల ఇంటి రహస్యాలపై జగన్ నిఘా వేసినట్లు స్పష్టమవుతోందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఏదేమైనా రామకృష్ణారెడ్డి ‘ఆళ్ల’ మనిషేనన్నది ఇప్పుడు మంగళగర్ ముచ్చట. నిజం ‘రామకృష్ణు’డికెరుక ?

Leave a Reply