Suryaa.co.in

Andhra Pradesh

వైకాపా ప్రభుత్వాన్ని బర్తరఫ్ చేసి గవర్నర్ పాలన విధించండి

నరసాపురం ఎంపీ రఘురామ కృష్ణం రాజు

రాష్ట్రంలోని వైకాపా ప్రభుత్వాన్ని బర్తరఫ్ చేసి, గవర్నర్ పాలనను విధించాలని నరసాపురం ఎంపీ, వైకాపా నాయకులు రఘురామకృష్ణంరాజు కోరారు. పాలకుల హింసాకాండ దిన దిన అభివృద్ధి కాదు. క్షణక్షణం అభివృద్ధి చెందుతోందన్నారు. రచ్చబండ కార్యక్రమంలో భాగంగా రఘురామ కృష్ణంరాజు మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ… రాష్ట్ర అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో అపధర్మ ప్రభుత్వంగా కొనసాగడానికి జగన్మోహన్ రెడ్డి సర్కార్ కు అర్హత ఉందా? అని ప్రశ్నించారు .

నిజాయితీగా, శాంతియుత వాతావరణం లో ఈ ప్రభుత్వం ఎన్నికలను నిర్వహించగలదా?? అంటూ నిలదీశారు. అనంతపురం జిల్లా రాప్తాడు లో వైకాపా నిర్వహించిన సిద్ధం బహిరంగ సభలో, సభా ప్రాంగణం నుంచి వెళ్ళిపోతున్న సభికుల ఫోటోలను తీసినందుకు ఒక ఫోటో జర్నలిస్టుపై దాడి చేసి, కొంతమంది అల్లరి మూక చితక బాదారు. కర్నూలులోని ఈనాడు దినపత్రిక కార్యాలయం పై ఎమ్మెల్యే అనుచరులు దాడి చేసి కంప్యూటర్లను ధ్వంసం చేసి, అద్దాలను బద్దలు కొట్టారు.

ప్రభుత్వం స్పాన్సర్లు చేయకపోతే ఇటువంటి దాడులు జరగవు . ఇప్పటికైనా ముఖ్యమంత్రిని పిచ్చిపిచ్చి మాటలు మాట్లాడవద్దని చెప్పాలి. ముఖ్యమంత్రి విచ్చలవిడిగా మాట్లాడుతుండడం వల్లే మీడియాపై దాడులు జరుగుతున్నాయి . ఒక ఎంపీ ని పోలీసులు అక్రమంగా నిర్బంధించి కొట్టారు. డాక్టర్ సుధాకర్ దారుణంగా చంపేశారు. రాష్ట్రంలో నిత్యం ఎన్నో దారుణాలు జరుగుతున్నాయి. జగన్మోహన్ రెడ్డి పై ఉన్న చార్జిషీట్లకు సంబంధించి రోజుకో నిజాన్ని ఈనాడు దినపత్రిక వెలుగులోకి తీసుకొని వస్తుంది.

ఒక్కొక్క కేసులో ఎన్నిసార్లు వాయిదాలు అడిగారనే దానిపై వివరాలను వెల్లడిస్తూ, ప్రజల దృష్టికి తీసుకువచ్చినందుకే ఏదో ఒక వంక పెట్టుకుని ఎమ్మెల్యే అనుచరులు ఈనాడు దినపత్రిక కార్యాలయం పై దాడి చేశారని రఘురామకృష్ణంరాజు అన్నారు. ఈనాడు దినపత్రిక కార్యాలయం పై ఎమ్మెల్యే అనుచరులు చేసిన దాడిని నీలి మీడియా ఛానళ్లు చూపెట్టడం లేదు. రేపు ఈ దాడి మీ దాకా రావచ్చు. మీడియా ఐక్యంగా ఉండి తప్పుడు విధానాలను ఎండగట్టాలి.

ఇటువంటి భయానక వాతావరణంలో సజావుగా ఎన్నికలు నిర్వహించాలంటే, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని బర్తరఫ్ చేయాల్సిందేనని రఘురామకృష్ణంరాజు డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆయన గవర్నర్ కు ఒక లేఖ రాయడంతో పాటు, మీడియాకు ప్రకటన విడుదల చేస్తానని చెప్పారు.

నిజాలను రాసే ఈనాడుపై దాడులు చేస్తే… అబద్దాలను రాసే సాక్షి దినపత్రికను ఏమి చేయాలి?

నిజాలను రాసే ఈనాడు పై దాడులు చేస్తే, నిత్యం అబద్దాలను రాస్తూ లేని పోనీ అబాండాలను వేసే సాక్షి దినపత్రిక ను ఏమి చేయాలని రఘురామకృష్ణం రాజు ప్రశ్నించారు. ఈనాడు అధినేత రామోజీరావును, ఆంధ్రజ్యోతి సంస్థ ఎండి రాధాకృష్ణను కొట్టాలని కొంతమంది అనుచితంగా మాట్లాడడం పరిశీలిస్తే మనం ఎక్కడ ఉన్నామనే ఆందోళన కలుగుతుంది. ఒక మీడియా సంస్థ పై దాడి చేయడం, జర్నలిస్టులను చచ్చే వరకు కొట్టడం పరిశీలిస్తే మనము ప్రజాస్వామ్య వ్యవస్థలోనే ఉన్నామా?, లేకపోతే రాచరిక పాలనలో ఉన్నామా? అనే అనుమానం కలుగుతోంది. ఈ విషయాలన్నింటి ప్రజల్లో ఒకడిగా, ఒక ప్రజా ప్రతినిధిగా గవర్నర్ దృష్టికి తీసుకు వెళ్లాను.

మన వంతు బాధ్యతను మనం నిర్వర్తిద్దాం. ఈ సంఘటనలు గవర్నర్ దృష్టికి కూడా వెళ్లి ఉంటాయి. తక్షణమే గవర్నర్ చర్యలు తీసుకోవాలి. ప్రజాస్వామ్య వ్యవస్థలో మీడియా స్వేచ్ఛను గుర్తరెగిన ప్రతి ఒక్కరూ, ఈ సంఘటనలో దోషులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతూ గవర్నర్ కు లేఖలు రాయాలన్నారు. ప్రజలు తమ మనోభావాలను తెలియజేయాలన్న రఘురామ కృష్ణంరాజు, ప్రజల మనోభావాలను తెలుసుకోవడానికి గవర్నర్ వ్యవస్థ ఉన్నదని పేర్కొన్నారు.

ప్రజాభిప్రాయం తెలుసుకున్న తర్వాత గవర్నర్, కనీసం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కి, ముఖ్యమంత్రికి, ఆయా జిల్లాల ఎస్పీలకు హెచ్చరికలు చేస్తారన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. జిల్లా ఎస్పీలను విధులను నిర్వహిస్తున్నారా?, లేకపోతే గంగిరెద్దులను కాస్తున్నారా అంటూ మందలించే అవకాశం ఉందన్నారు. ముఖ్యమంత్రిని కూడా నిలదీసే అధికారం గవర్నర్ కు ఉన్నదని, దాన్ని ఆయన ఉపయోగిస్తారన్న ఆశాభావాన్ని రఘురామకృష్ణం రాజు వ్యక్తం చేశారు.

ఎమ్మెల్యేల విలువ తెలుసుకుంటే జగన్మోహన్ రెడ్డి ప్రజాస్వామ్యాన్ని గౌరవించినట్లే

ఎమ్మెల్యేల విలువ తెలుసుకుంటే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రజాస్వామ్యాన్ని గౌరవించినట్లే నని రఘురామ కృష్ణంరాజు అన్నారు. ఎమ్మెల్యేగా ఎన్నికైన తర్వాతే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి పదవిని ఆదిష్టించారని ఆయన గుర్తు చేశారు. ఎమ్మెల్యేలను, ఎంపీలను అవమానించడమే కాకుండా, పోలీసుల చేత ఎంపీని కొట్టించడం దారుణం.

గతంలో ఎమ్మెల్యేలకు జగన్మోహన్ రెడ్డి అపాయింట్మెంట్ ఇచ్చేవారు కాదని, తన వ్యక్తిగత సహాయకులను కలిసి పొమ్మని చెప్పేవారు. కనీసం ఎమ్మెల్యేల ముఖం చూడడానికి కూడా ఇష్టపడని జగన్మోహన్ రెడ్డి వైఖరిని మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి తీవ్రంగా నిరసించారు. జగన్మోహన్ రెడ్డి తీరుపై గట్టిగానే మాట్లాడారు. ఇప్పుడు ఎందుకో మెత్తబడ్డారు. అయోధ్య రామిరెడ్డి, విజయ సాయి రెడ్డి, ఇంకో రెడ్డిలు వెంటపెట్టుకొని జగన్ మోహన్ రెడ్డి కు తీసుకు వెళ్లారట. ఆళ్ళ రామకృష్ణారెడ్డిని చూసిన జగన్మోహన్ రెడ్డి రెస్పాన్స్ టాప్… ఆయన్ని ఆలింగనం చేసుకొని జగన్మోహన్ రెడ్డి పులకించిపోయారు. వీరిద్దరి మధ్య ఇంకెప్పుడు కూడా మనస్పర్ధలు రావేమో తెలియదు.

ఇటీవల షర్మిల వెన్నంటి నడుస్తానన్న ఆళ్ళ రామకృష్ణారెడ్డి ఇప్పుడు నెల రోజులకే పీచే మూడ్ అని జగన్మోహన్ రెడ్డి పంచన చేరారు. ఆళ్ల రామకృష్ణారెడ్డి వైఖరిని తప్పు పట్టను కానీ పోతే పో అన్న జగన్మోహన్ రెడ్డి , ఆయన్ని కౌగిలించుకుని తీరు పరిశీలిస్తే అందులో ఆర్ద్రత, సాంద్రత ఎంతో తీవ్ర స్థాయిలో ఉందని ఎద్దేవా చేశారు. ఆ ఎమ్మెల్యే పేరు చివరన ఉన్న రెండు అక్షరాల మహత్యమా?, లేకపోతే ఎమ్మెల్యే అన్న మూడు అక్షరాల మహత్యమా? అన్నది ఇతమిద్దంగా తెలియదు.

రేపో,మాపో అలిగిన ఎమ్మెల్యేలకు టైం ఇచ్చి వారిని కూడా కౌగిలించుకుంటారేమో. మహిళా ఎమ్మెల్యేలు అయితే నెత్తిన చేయి పెట్టి ఆశీర్వదించి ఆత్మీయతను పంచుతారేమోనని అపహస్యం చేశారు. అలిగిన ఎమ్మెల్యేలను, ఎంపీలను పిలిచినప్పటికీ నేనైతే వెళ్ళను. నా ఫోటో పెట్టుకొని గెలిచారని చెప్పుకునే జగన్మోహన్ రెడ్డి కళ్ళల్లో ఇప్పుడు భయం కనిపిస్తుంది. జగన్ లో కనిపించిన భయం ఎప్పటికీ అలాగే ఉంటే మంచిది. అయినా, పెద్దగా ఉపయోగం లేదు… ఎందుకంటే ఎలాగైనా రానున్న ఎన్నికల్లో ఓడిపోనున్నారని రఘురామ కృష్ణంరాజు అన్నారు.

వైకాపా రాజ్యసభ పక్షం పూర్తిగా ఖాళీ అవుతుందేమో? … మీ వాడే అప్పగిస్తారేమో?

అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో వైకాపా ఓడిపోయిన తర్వాత వై వి సుబ్బారెడ్డి తో సహా ఎవరు ఆ పార్టీలో కొనసాగరని రఘురామ కృష్ణంరాజు అన్నారు. అసెంబ్లీలో రెండింట మూడవ వంతు మెజారిటీ వచ్చేస్తే చాలమ్మా వైవి… ఏడు ఎనిమిది మంది కచ్చితంగా బయటకు వచ్చేస్తారు. 11 మందిని మీ వాడే ఇచ్చేస్తారేమో తెలియదు. బిజెపి లోకి వెళ్తారా?, రాష్ట్రంలో అధికారంలోకి వచ్చే టిడిపిలోకి వెళ్తారా? అన్నది పక్కన పెడుదామని ఆయన అన్నారు.

త్వరలోనే వైకాపా రాజ్యసభ పక్షం పూర్తిగా ఖాళీ అవుతుందేమోనని నీ వెకిలి మాటలు చూస్తే అర్థమవుతుందని వై వి సుబ్బారెడ్డి పై రఘురామకృష్ణం రాజు మండిపడ్డారు. రాష్ట్రం నుంచి ముగ్గురు రాజ్యసభ సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నికైన తర్వాత వై వి సుబ్బారెడ్డి మాట్లాడుతూ… రాజ్యసభలో టిడిపిని ఖాళీ చేశామని పేర్కొనడం పట్ల రఘురామ కృష్ణంరాజు ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజ్యసభలో ఇప్పుడు టిడిపిని కొత్తగా ఖాళీ చేయడం ఏమిటని, అసెంబ్లీలో 151 స్థానాలు, పార్లమెంట్లో 23 స్థానాలు గెలిచినప్పుడే ఏదో ఒక దశలో రాజ్యసభలో టిడిపికి ప్రాతినిధ్యం లేకుండా పోతుందని తెలిసిపోయిందన్నారు .

అసెంబ్లీ తోపాటు లోక్ సభ ఎన్నికల్లోను క్లీన్ స్వీప్ చేస్తామన్న వై. వి సుబ్బారెడ్డి మాటలు వింటే నవ్వు వచ్చింది, జాలి కూడా వేసిందన్నారు. సుబ్బారెడ్డి ఇలా స్క్రాప్ మాట్లాడే వ్యక్తి కాదు. తాడేపల్లి ప్యాలెస్ నుంచి రాసిచ్చిన స్క్రిప్ట్ ప్రకారమే మాట్లాడి ఉంటారు. రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో వైకాపాకు నాలుగు స్థానాలు దక్కే అవకాశాలు కూడా లేవు. కూటమి తక్కువలో తక్కువగా 20 పార్లమెంట్ స్థానాలను గెలుచుకునే అవకాశం ఉంది.

చివరకు 22 స్థానాల వరకు దక్కించుకోవచ్చు. అసెంబ్లీ ఎన్నికల్లో వైకాపాకు చాలా దరిద్రం పట్టబోతుంది. రాజ్యసభలో 11మంది సభ్యులు ఉన్నామని చంకలు కొట్టుకుంటున్నారు… కానీ నాది, నాది అన్నది నాది కాదులే అన్నట్లు ఎన్నికల తర్వాత వైకాపాలో ఎవరు ఉండరన్నారు.

ఇండియా టుడే సర్వేలో అడ్రస్ లేని జగన్మోహన్ రెడ్డి

అత్యంత ప్రజాదరణ కలిగిన ముఖ్యమంత్రి ఎవరన్న దానిపై ఇండియా టుడే నిర్వహించిన సర్వేలో ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి అడ్రసే లేదని, అట్టర్ ఫ్లాప్ మార్కులు వచ్చాయని రఘురామ కృష్ణంరాజు తెలిపారు . డిస్టింక్షన్ లో, ఫస్ట్ క్లాస్ లో పాస్ అయినవాడి అడ్రస్ ఇండియా టుడే సర్వేలో మాత్రం కనిపించలేదన్నారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రజలతో సత్సంబంధాలను మెరుగుపరచుకోవాలని, వాచాలతను తగ్గించుకుంటే మంచిదన్నారు. చెత్త మాటలను మాట్లాడాల్సిన అవసరం లేదన్నారు. వాళ్లను వీళ్లను తిట్టేసి, పత్రికా ఆఫీసులపై దాడి చేసి, విలేకరులను కొట్టేయడం అవసరమా? అంటూ ప్రశ్నించారు.

రాజనీతి కోవిదుడు పాలినారీమన్

రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తూ సుప్రీంకోర్టులో నేను దాఖాలు చేసిన కేసును పాలినారీమన్ వాదించారని రఘురామకృష్ణం రాజు తెలిపారు. ఆయన మృతి వల్ల దేశం ఒక రాజనీతి కోవిదుడిని కోల్పోయిందన్నారు. రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తూ నేను దాఖలు చేసిన పిటిషన్ కు, ఆనాటి ప్రభుత్వాలు మద్దతును ఇవ్వలేదు. రాష్ట్ర విభజన జరిగితే చూద్దామన్నారు. విభజించిన తర్వాత ఏమీ చేయలేమన్నారు. ఇప్పటికీ ఆ కేసు అలాగే పెండింగ్ లో ఉంది. అప్పుడు నేను వేసిన కేసును ఉపసంహరించుకోవాలి ఈనాటి ప్రభుత్వ పెద్దలు సూచించారన్నారు.

దాంతో శోభనం గదిలోకి పాల గ్లాస్ తో వెళ్లిన వధువుకు తన మొగుడు మగాడు కాదని తెలిస్తే ఎంత షాక్ కు గురవుతుందో, నేను అంతే షాక్ కు గురయ్యాను. అమరావతి రైతుల తరఫున పాలినారీమన్ కేసును వాదించారన్నారు. అమరావతిని జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం విధ్వంసం చేస్తే , రానున్న ప్రభుత్వంలో ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు అమరావతి నగరాన్ని అనుకున్న దానికంటే అద్భుత నగరంగా తీర్చిదిద్దుతారని, అప్పుడు పాలినారీమన్ ఎక్కడ ఉన్నా సంతోషిస్తారన్నారు.

భాషా భక్షకున్ని తక్షణమే వదిలించుకుందాం

తెలుగు భాషాభక్షకున్ని తక్షణమే వదిలించుకోకపోతే మన భాషకు మనుగడ లేని పరిస్థితి తీసుకొచ్చే ప్రమాదం ఉందని, తల్లిని ప్రేమించే వారంతా తల్లి లాంటి తెలుగు భాషను కాపాడుకునేందుకు మాతృభాష హంతకులను తరిమి కొడదామని రఘురామ కృష్ణంరాజు పిలుపునిచ్చారు. ప్రపంచ మాతృభాషా దినోత్సవం సందర్భంగా తెలుగు వారందరికీ ఆయన శుభాకాంక్షలు తెలియజేశారు.

ఇటీవల ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ మెడకు పదును పెట్టండని పేర్కొనడం హాస్యాస్పదంగా ఉందన్నారు. మెదడుకు, మెడకు తేడా తెలియకుండా మాట్లాడారని, దీనితో ఆయన భాషా ప్రావీణ్యం గురించి ఎంత తక్కువగా చెప్పుకుంటే అంత మంచిదన్నారు. అమృతం లాంటి మన భాషను మృతం చేయాలనే ప్రయత్నాన్ని తీవ్రంగా నిరసించండి. తన తల్లిని పక్కన పెట్టి, పార్టీ అధ్యక్షురాలుగా తొలగించడం అనేది వారి అంతర్గత వ్యవహారం.

మాతృభాష అనేది అందరిదీ. ఒకరికి నోరు తిరగడం లేదని మాతృభాషను చంపేయాలనుకోవడం దుర్మార్గం. మాట్లాడితే చాలు ఇంగ్లీష్ అని చావ చితక్క కొడుతున్నారు. బ్రతుకుతెరువు కోసం ఇంగ్లీష్ అవసరమే. మనదైన సంస్కృతి, భాషా గొప్పతనాన్ని పది కాలాలపాటు సంరక్షించుకోవాలంటే, మన భాషను మనం కాపాడుకోవాలి. బ్రతుకుతెరువు కోసం పరాయి భాషను నేర్చుకోవాలి మన బ్రతుకైనా తల్లి లాంటి తెలుగు భాషను మర్చిపోవడం సరికాదు. అ, ఆలను నేర్పించక పోవడం చాలా దారుణం.

విద్యా వ్యవస్థను కూకటి వేళ్లతో పెకిలించడానికి ప్రయత్నం చేస్తున్న ఇటువంటి ఉన్మాద చర్యలను భాషా ప్రేమికులు నిరసించాలి. తెలుగు భాషను బ్రతికించుకోవడానికి ప్రయత్నం చేయాలని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు అనేక మార్లు పిలుపునిచ్చారు. ప్రతి విద్యార్థి ఐదవ తరగతి వరకు మాతృభాషలో చదివిన తర్వాత, ఆరవ తరగతి నుంచి ఇంగ్లీష్ భాష లో చదువుకోవచ్చు. భాష వేరు మీడియం వేరు. మనకు భాష పై పట్టు లేకుండా ఉండడం కోసం మనదైన విద్యను దూరం చేసే ప్రయత్నం చేస్తున్నారు.

ఐ బి సిలబస్ తీసుకొచ్చి తన మైండ్ లో ఉన్న ఒక ప్రత్యేక మత వ్యాప్తి కోసం, విద్యా విధానాన్ని ఆధారంగా చేసుకోవాలని ప్రయత్నాన్ని తిప్పి కొట్టాలి. మెకాలే ఈ విధంగానే మన సంస్కృతిని భగ్నం చేయాలని ప్లాన్ చేశారు. అభినవ మెకాలే కూడా అలాగే తయారయ్యారు. దేశభాషలందు తెలుగు లెస్స అని శ్రీకృష్ణదేవరాయలు అంటే, దేశభాషలందు తెలుగు లెస్ అని ప్రస్తుత పాలకులు అర్థం చేసుకున్నట్టున్నారు. అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం సందర్భంగా ఎవరి భాషా పరిరక్షణ కోసం వారు కృషి చేయాలి.

మాతృభాషతో పాటు మరో మూడు, నాలుగు భాషలను నేర్చుకుందాం. భారతరత్న, మాజీ ప్రధాని పీవీ నరసింహా రావు 14 భాషలలో అనర్గళంగా మాట్లాడుతూ, కవిత్వాలను కూడా రాశారు. వేయి పడగలు అనే నవలను ఆయన 14 భాషలలోకి అనువదించారు. పీవీ నరసింహారావు వంగరలో తెలుగు లోనే చదువుకొని, బహుభాషా కోవిదుడిగా ఎదిగారు. ప్రతి ఒక్కరూ తమ మూలాలను మర్చిపోకుండా భాషా పరిరక్షణకు కృషి చేయాలని రఘురామ కృష్ణంరాజు కోరారు.

 

LEAVE A RESPONSE