Suryaa.co.in

Editorial

క్యాంప్ ఆఫీసు క్లర్క్.. రెడ్‌హ్యాండెండ్‌గా బుక్

– సలహాదారు సజ్జలకు రెండు చోట్ల ఓట్లెలా వచ్చాయి?
– పొన్నూరులో ఒకటి.. మంగళగిరిలో మరొకటా?
– మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల ట్వీట్‌తో జమిలి ఓట్ల బాగోతం బట్టబయలు
-ఈసీ చర్యలు తీసుకోవాలని టీడీపీ డిమాండ్
– సలహాదారులే ఇలా చేస్తే ఎలా అన్న బీజేపీ అధికార ప్రతినిధి జయప్రకాష్
– ఓటును తొలగించుకునే బాధ్యత లేదా అని ప్రశ్న
– ధూళిపాళ్ల ట్వీట్‌తో రాజకీయ వర్గాల్లో రచ్చలాంటి చర్చ
– పొన్నూరులో తొలగించాలని దరఖాస్తు చేశానన్న సజ్జల
– ఈపాటికి తొలగించే ఉంటారని సజ్జల వివరణ
– తొలగింపు ధృవీకరణను బయటపెట్టని సజ్జలపై బీజేపీ విమర్శ
-జనవరి 31నే లేఖ రాస్తే ఇంకా ఎందుకు కొనసాగిస్తున్నారన్న ప్రశ్నలు
– ఈసీకి ఫిర్యాదు చేస్తామన్న బీజేపీ అధికార ప్రతినిధి జేపీ
– సజ్జల రెండు ఓట్ల వివాదం
( మార్తి సుబ్రహ్మణ్యం)

టీడీపీపై మాటల యుద్ధం చేస్తున్న ప్రభుత్వ సలహాదారు, వైసీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి ‘రెండు ఓట్ల’ చిక్కుల్లో పడటం వివాదానికి తీసింది. రెండు నియోజకవర్గాల్లో సజ్జల కుటుంబసభ్యులు, ఓటు నమోదు చేసుకోవడమే ఈ వివాదానికి అసలు కారణం. ఈ విషయాన్ని పొన్నూరు టీడీపీ మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర.. ట్వీట్ ద్వారా బట్టబయలు చేయడంతో, సజ్జల ఇరుకున పడాల్సి వచ్చింది. ఇప్పటికే రాష్ట్రంలోని అనేక నియోజకవర్గాల్లో.. దొంగ ఓటర్లపై జల్లెడ పడుతున్న టీడీపీ-బీజేపీ-జనసేనకు, సజ్జల రెండు ఓట్ల నమోదు వ్యవహారం.. అధికార వైసీపీకి సహజంగానే శిరోభారంగా మారింది.

వైసీపీ ప్రధాన కార్యదర్శి, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి కుటుంబానికి పొన్నూరు-మంగళగిరి నియోజకవర్గాల్లో, జమిలి ఓట్లు ఉండటం వివాదానికి దారితీసింది. ఈ విషయాన్ని పొన్నూరు టీడీపీ మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర, ట్వీట్ ద్వారా బట్టబయలు చేయడమే ఈ వివాదానికి కారణమయింది.

‘‘క్యాంప్ ఆఫీస్ క్లర్క్..రెడ్‌హ్యాండెడ్‌గా బుక్. రెండుచోట్ల దొంగ ఓట్లతో అడ్డంగా దొరికిన సలహాలరెడ్డి! పోన్నూరులో ఒక ఓటు.. మంగళగిరిలో మరో ఓటు’’ అంటూ ఓట్ల వివరాలతో ధూళిపాళ్ల ట్వీట్ చేశారు. ఆ ప్రకారంగా సజ్జల కుటుంబానికి పొన్నూరు నియోజకవర్గంలోని బూత్ నెంబర్ 31 నంబూరు, సీరియల్ నెంబర్ 799,800, 801, 802; మంగళగిరి నియోజకవర్గంలోని బూత్‌నెంబర్ 132 కాజాలో సీరియల్ నెంబర్ 1089, 1090, 1091, 1105తో సజ్జల కుటుంబానికి ఓట్లు ఉన్నట్లు నరేంద్ర వెల్లడించారు.

ధూళిపాళ్ల వెల్లడించిన ఈ వివరాలతో, సహజంగానే రాజకీయ వర్గాల్లో రచ్చ మొదలయింది. దీనిపై బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, గుంటూరు నియోజకవర్గ బీజేపీ ఇన్చార్జి వల్లూరు జయప్రకాష్ నారాయణ ఘాటుగా స్పందించారు.

‘ సాధారణ కార్యకర్త మాదిరిగా ప్రభుత్వ సలహాదారు సజ్జల వ్యవహరించడం స్థాయి తక్కువ వ్యవహారం. ప్రభుత్వ సలహాదారుతోపాటు బాధ్యతాయుతమైన పార్టీ ప్రధాన కార్యదర్శిహోదాలో ఉన్న సజ్జలకు, తన ఓటు ఏ నియోజకవర్గం పరిథిలోకి వస్తుందని తెలియకపోవడం ఈ దశాబ్దపు జోక్. తెలిసిన తర్వాత తొలగించమని దరఖాస్తు చేశామన్న సజ్జల, మరి అది పొన్నూరులో డిలెట్ అయిందా లేదో కూడా నిర్దిష్టంగా చెప్పలేదంటే, సహజంగానే అనుమానాలకు తావిస్తోంది. ప్రభుత్వ సలహాదారు స్థాయిలో ఉన్న సజ్జలకు తమ ఓట్లు ఉన్నాయో, తొలగించారో తెలుసుకోవడం పెద కష్టం కాదు కదా? అయినా జాబితా నుంచి తొలగించే ఉంటారని చెప్పడం బాధ్యతారాహిత్యమే’’ అని జయప్రకాష్ విమర్శించారు.

సజ్జల తరహాలో ఇంకా ఎంత మంది సలహాదారులు, వైసీపీ అగ్రనేతలు ఇలా రెండు చోట్ల ఓట్లు నమోదు చేయించుకున్నారో ఈసీ విచారణ జరపాలని డిమాండ్ చేశారు. ఈ అంశంపై తమ పార్టీ ఈసీకి ఫిర్యాదు చేస్తుందని వెల్లడించారు. రాష్ట్రంలో వైసీపీ ముఠాలు ఇదేవిధంగా ఓట్లు నమోదు చేయించుకుని, మళ్లీ అధికారంలోకి రావాలని చూస్తోందని ఆయన ఆరోపించారు. ‘‘వైసీపీ కుట్రలపై మా పార్టీ అధ్యక్షురాలు పురందేశ్వరి ఈపాటికే ఈసీకి ఫిర్యాదు చేశారు. మా పార్టీ ఫిర్యాదు మేరకే ఐఏఎస్, పోలీసు అధికారులపై చర్యలు తీసుకున్నార’’ని జెపి గుర్తు చేశారు.

అయితే దీనిపై సజ్జల రామకృష్ణారెడ్డి స్పందించి, వివరణ ఇచ్చారు. ‘‘ప్రస్తుతం నేను ఉంటున్న రెయిన్ ట్రీ కాలనీలో రోడ్డుకు ఒకవైపున ఉన్న రెయిన్‌ట్రీ అపార్టుమెంట్లు పొన్నూరు నియోజకవర్గంలో ఉన్నాయి. రెండోవైపున ఉన్న విల్లాలు మంగళగిరి నియోజకవర్గ పరిథిలో ఉన్నాయి. ఓట్ల చేరిక సమయంలో పొన్నూరు నియోజకవర్గంలోనూ, ఓట్ల నమోదు చేయడం జరిగింది. విషయం తెలిసిన తర్వాత మంగళగిరిలో ఓట్ల నమోదుకు దరఖాస్తు చేశాం. మొదట దరఖాస్తు చేసిన పొన్నూరు నుంచి, ఓట్లు తొలగించాలని జనవరి 31నే దరఖాస్తు చేశాం. ఇప్పటికే ఆ జాబితా నుంచి తమ పేర్లు తొలగించి ఉంటామని భావిస్తున్నా’’మని సజ్జల వెల్లడించారు.

కాగా ధూళిపాళ్ల నరేంద్ర విడుదల చేసిన ఓట్ల జాబితా ప్రకారం.. పొన్నూరు చేర్పుల జాబితా (27-10-2023 22-01-2024)లో సజ్జల కుటుంబసభ్యులైన నలుగురి పేర్లు-ఫొటోలున్నాయి. ఇక మంగళగిరి చేర్పుల జాబితా (27-10 -2023 22-01-2024) లోనూ అవే నలుగురి పేర్లు-ఫొటోలు కనిపిస్తున్నాయి. ఆ ప్రకారంగా సజ్జల కుటుంబానికి, రెండు నియోజకవర్లాల్లోనూ జమిలి ఓట్లు ఉన్నాయన్నది స్పష్టమవుతూనే ఉంది.

అయితే జమిలి ఓట్లపై వివరణ ఇచ్చిన సజ్జల.. తనకుటుంబానికి పొన్నూరులో జాబితా స్థానంలో, మంగళగిరిలో మాత్రమే ఓటు ఉందని చెప్పే ఆధారాన్ని విడుదల చేయకపోవడంతో పాటు.. పొన్నూరులో ఓట్లు తొలగించే ఉంటారని చెప్పడం, సహజంగానే విపక్షాల ఆరోపణకు బలం చేకూరుస్తోంది.

సహజంగా ఉన్నత స్థానాల్లో ఉన్న రాజకీయ ప్రముఖులు.. తమపై ఇలాంటి తీవ్రమైన ఆరోపణలు వచ్చినప్పుడు, వాటిని ఖండించేందుకు మీడియా ముందుకు ఆధారాలతో వస్తుంటారు. దానితో సదరు నేతలపై వచ్చిన ఆరోపణలు, నిజమా-అబద్ధమా అని బేరీజు వేసుకునేందుకు ప్రజలకు వెసులుబాటు ఉంటుంది.

అందుకే చాలామంది ప్రముఖులు.. తమపై ఆరోపణలు వచ్చిన సందర్భాల్లో తాము నిరపరాధులమని చెప్పేందుకు, వాటికి సంబంధించిన డాక్యుమెంట్లు విడుదల చేస్తుంటారు. అయితే తనపై వచ్చిన జమిలి ఓట్ల ఆరోపణకు సంబంధించి.. పొన్నూరులో ఓటు తొలగించారన్న ఆధారాన్ని, సజ్జల బయటపెట్టకపోవడం ప్రస్తావనార్హం. అది చేసి ఉంటే.. ఆ వివాదానికి అక్కడే తెరపడి ఉండేదన్నది రాజకీయ పరిశీలకుల విశ్లేషణ.

LEAVE A RESPONSE